కొత్త అడుగులు – 39
విలక్షణ కవయిత్రి ప్రగతి
– శిలాలోలిత
కవిత్వం కవిని ఆవహించే ఒక ప్రత్యేక సందర్భం. రాయకుండా ఉండలేని స్థితిలో మనోచిత్రాలకు అక్షరపు తొడుగుల్ని తొడుగుతుంది. భావావేశం, భావ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కవిత్వంలో.
ప్రగతి కథా రచయిత్రిగా పరిచయం. తనలోని విషయ మగ్నత కథల్లో కనిపిస్తే, ఒక పరిపాలన దక్షత సభ నిర్వహణలో కనిపించాయి. మంచి స్నేహశీలి. మృదుభాషిణి. తొలిసారే చూసినా అనంతపురంలో ఆత్మీయురాలిగా అనిపించింది. కవిత్వంతో రచన ప్రారంభమైనప్పటికీ తాను చెప్పదలుచుకున్న విషయాలని వివరంగా తెలిపేందుకు కథా ప్రక్రియను ఎన్నుకొందనిపించింది. తన కథాసంపుటి కోయిలచెట్టుకాగా, అనంతపురం జిల్లా మహిళా కథకుల కథలు సేకరించి పుస్తకం వేయడంలో ప్రగతి నిబద్ధతను ఉత్సాహాన్ని గమనించొచ్చు. జి. నిర్మలా రాణి, బి. హేమమాలిని, ప్రగతి ల సంపాదకత్వంలో ‘ముంగారు మొలకలు’ కథాసంకలనం వచ్చింది. ఇదే తొలి మహిళా కథకుల పుస్తకం. 25 మంది రచయితలతో వచ్చిన ఈ సంకలనం ఎంతో విలువైన పుస్తకం.
సాహిత్య ప్రపంచంలో రచననొక బాధ్యతగా, తక్షణ అవసరంగా సీరియస్ గా ఆలోచించే గుణం ప్రగతిలో కనిపించింది. కవిత్వాన్ని నాకు పంపి, మీరు రాయాలి అన్నప్పుడు, కొంచెం ఆలోచించాను. ప్రస్తుతం ఉన్న అనారోగ్య పరిస్థితిలో రాయగలనా అని ప్రశ్నించుకున్నాను. కానీ ప్రగతి కవిత్వంలోకి ప్రవేశించాక నా ప్రమేయం లేకుండా కవిత్వంలోకి వెళ్ళిపోయాను.
డాక్టర్ ప్రగతి వృత్తిరీత్యా రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేసి, ఇటీవలే పదోన్నతి పై హిందూపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నది. సాహిత్యంతో తన ప్రయాణం చిన్ననాటి నుంచే మొదలైందని పుస్తకాలు చదివేఅలవాటు ఎక్కువగా ఉండటం వల్ల చుట్టూ జరిగే సంఘటనలకు స్పందించే గుణం రాయడానికి దోహదపడ్డాయని ఆమె అభిప్రాయం.
తనూ, సాహిత్యమూ ఒకే తీరులో ప్రయాణించటం వల్ల తనలో అంతర్భాగమై పోయింది. పుస్తకం మొదట్లో పఠితుల్ని ఆపడం కోసం ‘మిణుగుర్లకు తోడుగా’ అంటూ…
“కాస్త ఆగండి!
దోసిళ్ళలో కాసిని అక్షరాల నక్షత్రాలు
నింపుకొని నేనూ వస్తున్నా!
కవితాకాశంలో నా ఊసులకు
గుర్తుగా చల్లనివ్వండి.
…..
చిన్ని మిణుగుర్లకు తోడుగా నేనూ
చిక్కటి చీకట్లతో పోరాడతా.
ప్రభాతవేళకు వెలుతురు వాకిలి తీసి నిలబడతా.”
ప్రగతి కవిత్వ వనంలోకి అడుగులువేస్తూ అన్నమాటలివి. ఆమె నిర్మలత్వానికి నిదర్శనమిది. 2015 నుంచి 2023 వరకు రాసిన కవితలున్నాయిందులో. అన్నీ ఒకటికి మించి మరొకటి. యే కవయిత్రి రాసిన కొత్త పుస్తకమైనా నాకు అపురూపమే. కులవివక్ష స్పష్టంగాను అస్పష్టంగాను ఎలా పాతుకుపోయిందో ధిక్కార స్వరంతో వినిపించింది.
‘మనోళ్లేనా’ అనే ఈ కవితలో కొన్ని చురకలు
“ఎవరికి వాళ్ళకు వర్గాలవారీ సెపరేటు.
మనసులు కూడా గదుల్లాగే మహా ఇరుకు.
మీ వాళ్ళు….. మా వాళ్ళు….. వేరే వాళ్ళు……
జీవులను అర్థం చేసుకోవడానికి అప్పుడెప్పుడో లిన్నేయస్ రెండు పదాలుండే ద్వినామీ కరణాన్ని కనిపెట్టాడంట. మనిషి పేరులోనూ రెండు పదాలు నింపుకుంటున్నాం.
ఒకటి తనది. మరొకటి మానవ సమూహం నుండి విడదీసేది.
ఈ తోకలూ – కొమ్ములూ ఇంకా అవసరమా?
మన పిల్లలకయినా లేకుండా చేద్దాం.
అంతా మన వాళ్ళేనని నేర్పిద్దాం.”
– నేర్పించండి అనకుండా, నేర్పిద్దాం అనడంలోనే ‘ప్రగతి’ ఉంది. పిల్లల పెంపకా లలో తల్లిదండ్రుల బాధ్యతను, అవగాహనను స్పష్టంగా వివరించింది. విషయచర్చతో పాటు మూలాల నుంచి మార్పు రావాల్సిన అవసరాన్ని కవితాత్మకంగా చెప్పింది. తను చెప్పదలుచుకున్న అంశం పై అవగాహన బాగావున్న కవయిత్రి.
‘మున్నూరడుగుల కలుపు మొక్కలు’ – లో రైతు బొమ్మను చిత్రించి కన్నీటి పర్యంతమయ్యేటట్లుగా రాసింది. ‘రాజంటి రాజు తన పొలం రాజ్యంలోనే కూలీ శిలయినాడు’ – అనే వాస్తవాన్ని చెబుతుంది. ఇంకొక చోట ‘కవిత్వం కోసం బెంగపెట్టు కుంది కాగితం’ – అని చిత్రంగా అంటుంది.
కరువు కోరల్లో పడి, కుటుంబాన్ని బతికించడానికి శరీరమే పెట్టుబడైన చీకటి బతుకు లను గురించి ఆవేదన పడుతూ ఆలోచించమంది. పసి పిల్లల్ని దేవాలయాల్లో సైతం చేరుస్తున్న కాలాన్ని చూసి ఏహ్యభావాన్ని ప్రకటించింది. చాలా వ్యంగ్యంగా ‘డిస్టర్బ్ చేయకండి!’ అంటుంది. “అందరి ఆకలినీ తీర్చిన వో ఇల్లాలు తన ఆకలిని తీర్చుకునే తీరిక లేక, ఆకలిని డబ్బాలో పెట్టి మూత పెట్టేసినట్లుంది.” ఉద్యోగినుల జీవితాలు, ఉదయం సాయంత్రాల మధ్య కరిగిపోయే ప్రయాణాలు అలసిన శరీరాలను తిరిగి సమకూర్చుకుంటున్న తీరు సహజంగా చెప్పింది. తన కవిత్వ ఉద్దేశాన్ని చెబుతూ ‘యేవొక్క మనసులో స్పందన కలిగించినా, యేవొక్క గుండెలో నిప్పురవ్వ రగిలించినా, అదే సార్థకత అక్షరాలై జన్మెత్తినందుకు.’ చాలు నాకా తృప్తి అనుకుందామె.
కుల దురహంకారానికి బలైపోయిన ప్రేమ పక్షుల గురించి కలత పొంది, తండ్రిని ప్రశ్నించిన కూతురి గొంతుతో కవిత నడిపింది. అమృతా ప్రణయ్ జీవితాల గురించి ఎన్నెన్నో ప్రశ్నల్ని సంధించింది. పుట్టినరోజుల పై, ఉద్యోగవిరమణల పై, స్నేహితుల పై కవిత్వాన్ని కలవరించింది. కవిత్వాన్ని గురించి తన ఒపీనియన్ యిలా చెప్పింది.
“కవిత్వమంటే అక్షరం కాదు అనుభూతి
భాషను మించిన భావం.
దృశ్యం కంటికెమెరాలో నిక్షిప్తమైనప్పట్నుంచీ
కాగితపుతెరమీద కవిత్వపుబొమ్మై వెలిసేదాకా
మెదడులో ఎంత మధనం జరగాలి?
…..
కొన్ని బంధాల అనుభవాలను తెంచుకొని
కొత్తబంధాల అనుభూతులను పేర్చుకొని
సరికొత్తగా తయారయ్యే రసోత్పన్నం కదా కవిత్వం
ఉద్యమ విద్యుత్తో, వికిరణ విద్వత్తో ఎగదోయాలి.
…..
భావవారధి కావాలి కవిత్వం
కడుపులో వికారం కాదు
మెదడులో సంఘర్షణ పుట్టించాలి కవిత్వం!”
అంటూ తన అనుకుంటున్న కవిత్వ సృష్టిని వివరించింది. పుస్తకాలను పూలతోటలో ఒదిగిన కవిత మరొకటి. ‘నువ్వూ నేను’ కవితలో
“నేను నీలో సగాన్ని కాదు
నువ్వూ నా సగానివి కాదు
అది నువ్వు – ఇది నేనుగా గుర్తించలేనంతగా వొక్కటి మనం”
అంటూ లోతైన అర్ధాన్ని వివరించింది. పదాలకిప్పుడు తీసుకోవాల్సిన భావాన్ని చెప్పింది. స్త్రీ పురుషులు పెంచుకోవాల్సిన అవగాహనను విడమర్చి చెప్పింది. ఒక పేద విద్యార్థిని, ‘అతనో ఖాళీ రంగు డబ్బా’ అంటూ ఆర్ద్రతను నింపిన భావోద్వేగంతో రాసింది. ఆలోచనాత్మకమైన బతుకు వ్యథ. కొన్ని స్మృతి గీతాలు కూడా రాసింది.
మరోచోట అంటుందిలా…
“సావు బయం లేదుగానీ
బతికేదే బయంగా వుండాది
జరంత మా కడుపుల్లోకి
జూమ్సేసి సూడుసారూ…
ఆకలిరోగం ఆగిపోయే
దోవేమన్నా కనిపిస్తాదేమో!”
ఇక్కడ పట్టేసిన మన గుండె చుట్టూ ఎన్ని ముసుర్లు చుట్టుముడ్తాయో చెప్పలేం. తనతో పాటు పాఠకుల్ని లాక్కెళ్లిపోయే శిల్పనైపుణ్యం ఈమెది. ‘స్తబ్దత నిండిన శూన్యపు చెట్టుపై మెరుపు దారులు పూయించాలి.’ కలలుకంది, సీతాకోక కాయంలో పరకాయ ప్రవేశ మంత్రమెవరైనా ఉపదేశిస్తే బాగుండు అని ఎదురుచూసింది.
ఫేస్ బుక్ ల పైన వ్యంగ్యంతో ఇది లైకుల కాలం అంటూ కొత్తకాలం రాకను గమనించింది. బతుకంటే ఎలా వుండాలంటూ – ‘అచ్చు నీలాగే నీ యాటిట్యూడ్ తో ‘ధీర’గా బతికెయ్ జీవితాంతం’ అంటుంది. ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకో గలిగే స్వేచ్ఛను పొందాలన్నదే ఆమె తపన. అనుసృజనలు కూడా స్వీయరచనేమో అన్నంతగా వున్నాయి. ‘స్వీయ నియంత్రణలోనే మనుగడ సాధ్యం, సమన్వయంతో సాగుదాం – కలిసిముందుకు నడుద్దాం’. చుట్టూ వున్న ప్రకృతిలోని చెట్టూచేమానే మనకెన్నో నేర్పిస్తాయని భావించింది.
“ఎదగడానికి చిన్నారి మొక్క
తనను తాను ఎంతగా మార్చుకుంది
ఎన్నెన్ని వదిలించుకుంది
అప్పుడే అనిపించింది
పనికిరాని పాతను పాతరేసి
సరికొత్తగా పుట్టాలని!”
ఇంకొక చోట వానకు వన్నెలేదా అని ప్రశ్నిస్తుంది.
“ఒక్కోసారి దిగులు రంగును
పులుముకున్నట్లు ఉంటుంది
యింకోసారి చినుకుల్లో చిందులేయించి
వుత్సాహపు రంగులు పూయిస్తుంది
అవును వాన క్రిస్టల్ క్లియర్!”
అమ్మ మీద రాసిన కవిత ‘బొగ్గుల పొయ్యి’, విలువైన కవిత – అమ్మ శ్రమను, విలువను, చాకిరీనీ, ప్రేమను గుర్తించని స్థితిని కళ్ళకు కట్టినట్లుగా చెబుతూనే చివరికిలా అంటుంది కదా!
“బొగ్గులు బూడిదగా మారినట్లు
అమ్మ కూడా మట్టిలో కలిసిపోయింది
అయినా అమ్మ జ్ఞాపకం బొగ్గుల పొయ్యిలా
హృదయాన్ని వెచ్చగా వుంచుతూనే వుంది.”
మిణుగుర్లను తోడుగా తెచ్చుకుని, సమాజపు రీతుల్ని, నీతుల్నీ, అవినీతుల్నీ, అసమానతలను, అసహజాలను ఎండగట్టింది. బతుకు ప్రయాణంలో ఎన్నో సంగతులను తమకు కూడా వున్నాయనే సామూహిక వేదనను ఆలోచనాత్మకంగా వెల్లడించింది. రాయలసీమ కన్న మేలైన రత్నం ప్రగతి. ఈ విధంగా తన కవిత్వాన్ని నాతో చదివించినందుకు, అనుభూతింపజేసినందుకు సంతోషం.
ఇక పై, ప్రగతి మరెన్నో కవితలతో మన ముందుకు తప్పక వస్తుంది. మంచి కవిత్వమిది, జీవన ప్రతిబింబమిది.
*****
1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి. వీరు కవియాకూబ్ గారి సహచరి.
పుట్టింది, పెరిగింది హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్. తండ్రిగారు కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి హిందీ పండిట్ గా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల బాల్యమంతా ఇసామియా బజార్,నింబోలిఅడ్డ, మలక్ పేటలలో గడిచింది.
తెలుగుసాహిత్యంలో ఎం ఏ, ఎం ఫిల్, పిహెచ్ డి లు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలలో పూర్తిచేసి తెలుగు అధ్యాపకత్వంలో స్థిరపడి ఇటీవలే రిటైరయ్యారు.
కవితా సంపుటులు :
పంజరాన్నీ నేనే, పక్షినీ నేనే(1999), ఎంతెంత దూరం(2005), గాజునది(2013), The Inner Courtyard (Prof. Suneetha Rani Translation ; Published Web version in Amazon Books Series)2017