జీవితం అంచున -3 (యదార్థ గాథ)
(…Secondinnings never started)
-ఝాన్సీ కొప్పిశెట్టి
Future is always a mystery…
మనిషి టెక్నాలజీ పరంగా ఎంత పురోగతి సాధించినా రేపు ఏమి జరుగుతుందో తెలుసుకోలేడు కదా.
రాత్రి కమ్మిన దిగులు మేఘాలకు ఎప్పుడో అపరాత్రికి పడుకున్నానేమో చాలా ఆలస్యంగా లేచాను. ఆ రోజు శనివారం సెలవు కావటం వలన అందరూ ఇంట్లోనే వున్నారు.
అల్లుడు స్టడీ రూములో కూర్చుని కంప్యూటర్ నుండి ఏవో ప్రింట్ ఔట్స్ తీస్తున్నాడు.
“మమ్మీ, వీ నీడ్ యు… కాఫీ తాగేసి రా…” అమ్మాయి ఉత్సాహంగా పిలిచింది.
ఏవో చిన్న ఆశల మొలకలు మెడలు బయటకు సారిస్తున్నా నిరాశక్త ఎరువులతో నొక్కేస్తూ కాఫీ కప్పుతో స్టడీ రూములోకి వెళ్ళాను.
“మమ్మీ, ఫర్ నర్సింగ్ యు నీడ్ టు పాస్ IELTS విత్ మినిమం స్కోర్ ఆఫ్ సెవెన్.. ఆస్ట్రేలియాలో నువ్వు IELTS పాస్ అవ్వటం చాలా కష్టం. నువ్వు ఆస్ట్రేలియన్ స్లాంగ్ సరిగ్గా అర్ధం కావటం లేదంటావు. లిసెనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అని నాలుగు భాగాలుగా రెండు విడతలుగా జరిగే మూడు గంటల IELTS పరీక్ష గట్టెక్కటం మాటలు కాదు. నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే సాధారణంగా అందరూ IELTS అవసరం లేని అసిస్టెంట్ నర్సింగ్ కోర్సు చేసి తరువాత డైరెక్ట్ గా రెండో సంవత్సరం నర్సింగ్ లో చేరతారట. పైగా అసిస్టెంట్ నర్సింగ్ సర్టిఫికేట్ కి ఎంప్లాయిమెంట్ స్కోప్ ఎక్కువగా వుందట. పబ్లిక్ హాస్పిటల్స్, ప్రైవేట్ సర్జరీస్, నర్సింగ్ హోమ్స్, హెల్త్ సెంటర్స్, ఏజెడ్ కేర్, చైల్డ్ కేర్..ఇలా ఎక్కడైనా జాబ్ మొదలు పెట్టవచ్చునట. చేయాలనుకుంటే ఓ పక్క ఉద్యోగం చేస్తూ నర్సింగ్ కోర్సు చేసుకోవచ్చు. ఏమంటావు…?” అడిగింది అమ్మాయి.
ఇంతలో ఎంత విషయ సేకరణ చేసింది..
ఆరు నూరయినా అమ్మ కోరిక తీర్చేవరకూ కునుకు తీయని పుత్రికా కలికితురాయి.
ఒక్క క్షణం నిజంగా ఇదంతా నాకు అవసరమా అనిపించింది.
అరుదుగా దొరికే కొద్దిపాటి తీరిక వేళల్లో కులాసాగా ప్రకృతిని, పుస్తకాలను ఆస్వాదిస్తూ ఏ కదిలించే కథలో, కవ్వించే కవితలో రాసుకుంటే సరిపోదా…
ముప్పై ఏళ్ళకు పైగా ఇండియాలో ఇన్డైరెక్ట్ దేశ సేవ చేసానుగా. ఇప్పుడు రోగుల సేవ ఇంకా మిగిలి వుందా.
అసలు నాకేం కావాలి.. ఎందుకు నర్సింగ్ చేయాలనుకుంటున్నాను..?
రోగులకు సేవ చేయటానికేనా… ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెట్టి నా వయసును లెక్క చేయకుండా నిస్వార్ధంగా సేవ చేసేద్దామనేనా…
ఎందుకో కాదేమోననిపించింది.
మరి విదేశంలో కూడా ఆర్ధిక స్వాతంత్య్రం కోసం డాలర్లలో సంపాదన కోసమా..?
ఛ.. ఛ.. కానేకాదు. నాకు డబ్బుకేమీ కొదువ లేదు.
మరి నాలుగు గోడల మధ్య నలిగిపోకుండా ఇక్కడి సమాజం, మనుషులు, సంస్కృతి, అలవాట్లు అన్నీ ఎక్స్ప్లోర్ చేయటానికా..
ఏమో…
ఏమయినా కొత్త కథలకు, నవలకు విషయ సేకరణకా…
కావచ్చేమో..
మరేవయినా కొత్త పరిచయాలు, కొత్త ప్రపంచం ఆశించా…
తెలీదు.
అసలు నాకేం కావాలి ?
“ఏమీ చెప్పవేమిటమ్మా…” రెట్టించింది అమ్మాయి.
“ఏమో, నాకేం తెలుసు. నీకు ఏది సబబు అనిపిస్తే అదే చేయి…” అన్నాను.
“నాకు అనిపించటం కాదమ్మా. నీ ఇంట్రెస్ట్.. నీ ఓపిక. నీ గోల్ నర్సింగ్ కాబట్టి అసిస్టెంట్ నర్సింగ్ తో మొదలెడితే IELTS గొడవ వుండదు. ఒకే సంవత్సరం కోర్సు కనుక తరువాత ఉద్యోగం చేస్తావో, సెకండ్ year నర్సింగ్ లో చేరతావో అప్పుడు ఆలోచించుకోవచ్చు.”
అమ్మాయి ఎప్పుడూ తెలివిగానే ఆలోచిస్తుంది.
నిజమే. ఏకంగా మూడేళ్ల నర్సింగ్ కోర్సు కన్నా ఈ ఏడాది షార్ట్ కట్ బావుంది. ఉద్యోగం వెలగపెట్టటం మాటెలా వున్నా మున్ముందు తొంభయ్యో పడిలోకెళుతున్న అమ్మకు ఏ అవసరం వచ్చినా ఒక ప్రొఫెషనల్ గా బేసిక్ నర్సింగ్ తెలిసి వుండటం చాలా అవసరం కదా…
సంతోషంగా ‘యస్’ అన్నాను.
అల్లుడు అప్పటికే యూనివర్సిటీ వెబ్ సైట్ నుండి తీసి వుంచిన అప్లికేషను ఫారం నింపి సంతకం చేయమని నా చేతికిచ్చాడు.
ఫారం నింపి సంతృప్తిగా సంతకం చేసాను. అతను స్కాన్ చేసి యూనివర్సిటీ మెయిల్ కి పంపాడు. తేలికయిన మనసుతో ఆ రోజంతా గాలిలో తేలుతున్నట్టుగా వుంది.
ఒక్క సంతకం పెట్టి అలవి కాని సంతోషంలో ఏదో సాధించేసానన్న గర్వంతో ఆ రాత్రి తృప్తిగా నిద్రపోయాను.
*****
(సశేషం)