నీకు నాకు మధ్యన
-సుభాషిణి ప్రత్తిపాటి
అప్పుడెప్పుడో…
దశాబ్దాల క్రితం
ఏడేడు జన్మల బంధం
నీది నాది అనుకుంటూ…
అడుగులో అడుగు వేసినప్పుడు
మన మధ్యన ఏముంది??
మహా గొప్పగా చెప్పడానికి!
తొలి వలపుల
తహతహల చెర వీడిన మలి అడుగుల్లో …
మది తలుపులేవో మెల్లగా తెరిచాక కదా
అగాధాల లోతులు తెలిసింది
కర్కశపు జాడలు చూసింది
కన్నీటి వ్యథ ఎదురైంది
అప్పుడు మన నడుమ
దట్టమైన గాజు తెరలు
మన నీడలే మనకు శత్రువులై
అనిశ్చితంగా కదలాడేవి!
గదిలోపలి గోడలు
బీటలు వారిన ఇన్నేళ్ళకు,
నాకర్థమయింది,
కాలంతో పాటు మంచులా కరిగింది
మన మధ్యన ఇన్నాళ్లూ పేరుకున్న *నిశ్శబ్దమని*!
శాబ్దికమయినాకే తెలిసింది
హృదయం రవళిస్తుందని,
అదేమిటోఁ….
ముసురుకున్న హృదయాకాశం
కరుణావృష్టిని ధారపోస్తే తప్ప… నువ్వేంటో…
నేనేంటో…
మన మధ్యన ఉన్నదేమిటోఁ
అర్థం కాలేదు సుమీ!
హమ్మయ్య!
సమయమేం మించి పోలేదు
ఆకుపచ్చని శ్వాస
నాలో పచ్చిగానే ఉంది,
వెచ్చని నీ శ్వాసతో కలిసి,
నీ హృది సెల అల పాటను వింటూ… పంచభూతాలలో కలిసే దాకా
మన మధ్యన ఉన్నదేంటో
కనుక్కోమని
ప్రపంచానికి సవాలు విసురుతూ…
నవ్వులను విరబూస్తూ
సాగుదాం ప్రియతమా!!
*****