పదబంధం

పుస్తకాలమ్’ – 17

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

పదబంధాలతో మానవ సమూహాల అనుబంధం!

        చిరకాల కవిమిత్రుడు, ఆత్మీయుడు నారాయణస్వామి కొంతకాలంగా కవిసంగమంలో రాస్తున్న కవి పరిచయాలతో, కవిత్వానువాదాలతో ‘పదబంధం’ అనే పుస్తకం తెచ్చాడు. ‘దేశదేశాల కవిత్వ కరచాలనం’ అనేది దాని ఉపశీర్షిక. మనుషుల మధ్య, సమూహాల మధ్య, దేశాల మధ్య అనుబంధాలను తుంచేసే, విద్వేషాలను పెంచే, మారణకాండల్ని పెచ్చరిల్లజేసే పాలకవర్గాల దుర్వర్తమానంలో ఈ దేశదేశాల కవిత్వ కరచాలనం ఒక ఊరట, ఒక అత్యవసరమైన ఉపశమనం. ఇది ఏకకాలంలో అనేకం – దేశదేశాల కవిత్వానికి ఇంగ్లీష్ సహాయంతో చేసిన అనువాదం. కవిత్వ పరిచయం. కవుల పరిచయం. అన్నిటి కన్నా మిన్నగా ప్రపంచమంతా వేదన మధ్య, దుఃఖం మధ్య, యుద్ధం మధ్య, ప్రవాస బీభత్సం మధ్య వాటిని ధిక్కరిస్తూ సున్నితమైన భావుకులు వ్యక్తీకరించిన ఆర్ద్ర ఉద్వేగాల సంపుటి.

        ఒక్కచోట 48 మంది కవుల 128 కవితల, మరి కొన్ని కవితా భాగాల అనువాదాలు ఇచ్చిన పుస్తకంగా దీనికి మొదటి ప్రాధాన్యత దక్కుతుంది. బహుశా అనువాదానికి మన సమాజం వంటి సమాజాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాని పట్ల భయమూ, ఆశ్చర్యమూ, ఆరాధనా వంటి భావాల వల్ల అనువాదాన్ని ప్రత్యేకంగా చూస్తున్నాం. కొందరినే అనువాదకులుగా చూస్తున్నాం. మూల భాష, లక్ష్య భాష ఎంతో కొంత తెలిసి ఉంటే మరొకరి అనువాదాన్ని అనుమానిస్తున్నాం.

        కాని ఒక రకంగా చెప్పాలంటే ప్రతి మనిషీ అనువాదకులే. పంచేంద్రియాలు పంపిన సూచనలను భౌతిక ప్రపంచం నుంచి భావనా ప్రపంచంలోకి అనుక్షణం అనువదించుకోకుండా మనకు భౌతిక ప్రపంచం అర్థం కావడమే సాధ్యం కాదు. అలాగే మన భావనా ప్రపంచంలోని స్పందనలను, ఊహలను, కలలను, ఆలోచనలను, ప్రణాళికలను  భౌతిక ప్రపంచంలోకి అనుక్షణం అనువదిస్తూనే ఉండకపోతే మనిషిగా మనగలగడమే అసాధ్యం. అలా నిత్య నిరంతర అనువాదకులమై ఉండి కూడా ఒకానొక మానవ సమాజపు వ్యక్తీకరణను మరొక మానవ సమాజపు వ్యక్తీకరణగా అనువదించడాన్ని అబ్బురంగా చూస్తాం. బహుశా ఇక్కడ భాషా మాధ్యమం అనే అవరోధం, దాన్ని అధిగ మించే అద్భుత నైపుణ్యంగా అనువాదం కనబడడం కారణం కావచ్చు. కాని ఒకే భాషా వ్యవహర్తల మధ్య కూడ మన రోజువారీ జీవితంలోనే ఒకరు మాట్లాడుతున్నది మరొకరు తమకు తెలిసిన భావనలలోకి అనువదించుకోకుండా అర్థం చేసుకోవడం కష్టం. అటువంటప్పుడు ఒక భాష నుంచి మరొక భాషలోకి అనువాదానికి ప్రత్యేక స్థానం ఉండడానికి ప్రతి సమూహపు వ్యక్తీకరణా దానికే ప్రత్యేకమైన భాషలో ఉండడం, దాన్ని తమ భాషలోకి ప్రవేశపెట్టడం కారణం కావచ్చు. అందుకే దుబాసీలు, బహుబాసీలు అన్నీ సమాజాల్లోనూ విశిష్టమైన గౌరవాన్ని పొందారు, పొందుతున్నారు.

        ఈ పుస్తకంలోని కవులు కనీసం ఇరవై ఐదు భాషలకు చెందినవాళ్లు. అందరికందరూ ఇంగ్లిష్ లోకి వచ్చారు. ఇప్పుడు తెలుగులోకి వస్తున్నారు. ఈ 48 మంది కవుల్లో కనీసం ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన వాళ్లందరూ ఇప్పుడే మొదటిసారి తెలుగులోకి వస్తున్నారు. ఆ మేరకు ఈ పుస్తకం ద్వారా తెలుగు కవిత్వం కొత్తగా అనేక భాషల, అనేక మంది కవుల, అనేక వ్యక్తీకరణల పరిచయంతో సంపద్వంతమవుతున్నది. అది ఒక ఉత్సవ సందర్భం. ఇదివరకు వచ్చిన పరభాషా అనువాద కవిత్వ సంకలనాల కన్న ఇక్కడ అదనపు విశిష్టత ఆ కవిత్వానువాదాలతో పాటు ఆయా కవుల, వారి కవిత్వ సందర్భాల, నేపథ్యాల పరిచయం.

        ఈ సాధారణ అంశాలు ఒక ఎత్తయితే, కవిత్వానువాద కళను అద్భుతంగా నిర్వహించడంలో, ఆ కవిత్వాన్ని ఒక నిర్దిష్ట సందర్భంలో చూపడంలో ఈ పుస్తకం ప్రాధాన్యత గురించి చెప్పుకోవలసిన విషయాలున్నాయి.

        మొట్టమొదటిది, ఈ పుస్తక శీర్షిక విశిష్టత. పదబంధం అనే మాట తెలుగు భాష తెలిసినవారికి కొత్తది కాదు. రెండు పదాలను కలిపి ఏర్పరిచే కొత్త పదం. సమాసం. పదాల మధ్య బంధం. కాని ఇక్కడ నారాయణస్వామి దాన్ని ఆ సాంప్రదాయక అర్థం నుంచి ఉన్నతీకరించి పదాల ద్వారా బంధం అనే స్థాయికి చేరుస్తున్నాడు. పదాల ద్వారా మనుషుల మధ్య, మానవ సమూహాల మధ్య, భాషల మధ్య, కవిత్వ అభివ్యక్తుల మధ్య, పాఠకులకూ సుదూర, అపరిచిత కవులకూ మధ్య బంధాన్ని కుదురుస్తున్నాడు. ఇది ఒకరకంగా సార్త్ర్ ఆత్మకథ ‘వర్డ్స్’ ను తెలుగు అనువాదంలో ‘శబ్దాలు’ అనో ‘పదాలు’ అనో కాకుండా ‘శబ్దమయ ప్రపంచం’ అని అనువదించిన అనుభవానికి సమానం.

        ఇక్కడ అనువాదానికి ఎంచుకున్న కవులకు భిన్నమైన నేపథ్యాలున్నాయి. ఆ కవులు భిన్నమైన కవితా వస్తువులు తీసుకుని భిన్నమైన కవితా శైలీ శిల్పాలలో వ్యక్తీకరించారు. ఇంగ్లిష్ లోకి వచ్చేసరికే ఎంతో మారిపోయే అవకాశం ఉన్నప్పటికీ వారి నేపథ్యాలను బట్టి, ఆ భాషా సాహిత్య సంప్రదాయాలను బట్టి భిన్నమైన డిక్షన్ ఉండి ఉంటుంది. వీలైనంత వరకు ఆ భిన్నత్వాన్ని తెలుగు పాఠకులకు అందుబాటులోకి తేవడం, భిన్నమైన కవులను ఒకే కవి అనువదిస్తున్న ఏకసూత్రత కనిపించకుండా జాగ్రత్త పడడం కత్తి మీద సామే. ఆ సాములో స్వామి చాలా వరకు విజయవంతం అయ్యాడనే చెప్పాలి.

        కవుల భిన్నత్వం వల్ల మాత్రమే కాదు, వారానికొకసారి రాసిన శీర్షిక గనుక కూడా కావచ్చు, స్వామి శైలిలోనూ భిన్నత్వం కనబడుతుంది. కొన్ని వ్యాసాలు గంభీరమైన తార్కిక వివరణల్లా ఉంటాయి, కొన్ని వ్యాసాలు పాఠకులతో ఆత్మీయ సంభాషణల్లా ఉంటాయి. కొన్ని వ్యాసాలు ఉత్తమ పురుష ఎక్కడా కనబడకుండా వస్తుగత పద్ధతిలో మాత్రమే ఉంటాయి, కొన్ని వ్యాసాలు తన సొంత అనుభవాన్ని రంగరించి ఆత్మీయంగా ప్రకటిస్తాయి.

        ఇంతకూ స్వామి ఈ పనికి ఎందుకు పూనుకున్నట్టు?

        “అనేకానేక నిర్బంధ బలాత్కారాల మధ్య తమ గురించి తాము చెప్పుకోవడానికి వచనం రాయలేని పరిస్థితిలో, వచనం సరిపోని పరిస్థితిలో కవిత్వం పెల్లుబుకుతుంది. జ్ఞాపకాలని కేవలం భద్రపరిచేవాళ్లమే కాకుండా కవిత్వం మనల్ని క్రియాశీల సాక్షుల్ని చేస్తుంది. ఒకరి జీవిత రక్తసారమంతా, రాజకీయమైనది, ఉద్వేగభరితమైనది, బ్రతికి అనుభవించినది, అవశేషాలుగా మిగిలినది, మరిచిపోయింది – అంతా కవిత్వంగా ఘనీభవిస్తుంది.

        చరిత్రలో అన్ని విముక్తి పోరాటాల్లో కవిత్వం అత్యంత కీలకమైన పాత్ర నిర్వహించింది. కవిత్వంలోని అద్భుతమైన మౌఖికత ఆక్రమణలకు, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల సామూహిక స్పందనను సమీకరిస్తుంది. కవిత్వం ప్రజల సామూహిక జ్ఞాపకాలను, చైతన్యాన్ని ప్రతిఫలించి భద్రపరుస్తుంది. ఇతరులు వాళ్ల గురించి రాయడం, చెప్పడంతో పాటు, ఆధిపత్యాలకు గురైన అసంఖ్యాక ప్రజా సమూహాలు, తమ గురించి తామే, తమ ఆకాంక్షలను తామే శక్తిమంతంగా ప్రకటించుకునే అద్భుత వాహిక కవిత్వం” అంటాడు స్వామి కశ్మీర్ ప్రజల జ్ఞాపకాలను, అనుభవాలను, ఆకాంక్షలను ప్రతిఫలించే కవిత్వం గురించి రాస్తూ.

        నిజానికి ఇది ఆ ఒక్క వ్యాసానికే, ఆ ఒక్క కవిత్వానికే వర్తించే విషయం కాదు. మొత్తం పుస్తకమే “ఆధిపత్యాలకు గురైన అసంఖ్యాక ప్రజా సమూహాల” జ్ఞాపకం, అనుభవం, ఆకాంక్ష, ఆక్రోశం, ఆర్తారావం, ప్రతిఘటనా నినాదం. ఈ కవుల్లో ప్రతి ఒక్కరూ తమ ఒంటరి వేదనకు మాత్రమే కాదు, తమ సమూహాల వేదనామయ చరిత్రకు అక్షరాలు తొడిగారు. అందువల్ల ఇది కవిత్వ పరిచయ పుస్తకంగా ఉంటూనే సమకాలీన ప్రపంచ చరిత్ర పుస్తకంగా, ఆ రకంగా ప్రపంచంలో పీడనకు గురవుతున్న ప్రజల మధ్య పదబంధంగా మారుతుంది.

        ఇక్కడ చోటు దొరికిన వ్యక్తీకరణలు పాలస్తీనా, లెబనాన్, వియత్నాం, పోలండ్, రష్యా, చిలే, సియర్రా లియోన్, ఇరాక్, క్యూబా, గ్వాటెమాలా, టర్కీ, దక్షిణ కొరియా, ఇరాన్, కశ్మీర్, నేటివ్ అమెరికన్, పాకిస్తాన్, చైనా, అర్జెంటీనా వంటి స్థలాలవో, నెగ్రిట్యూడ్, వియత్నాం యుద్ధం, ట్రంప్ విధానాలు వంటి సామాజిక-రాజకీయ అంశాలవో కావచ్చు. అందులో పాలస్తీనాకు ఎక్కువ స్థలం దొరికి ఉండవచ్చు. కాని, అవి ప్రపంచంలో ఎక్కడైనా దోపిడీకీ, పీడనకూ, పరాయి పాలనకూ, యుద్ధానికీ, ప్రవాసానికీ గురైన ప్రతి మనిషిలోనూ ప్రతిధ్వనించేవే.

“చనిపోయిన వాళ్లు

మన ఉదాసీనతను

గుర్తు చేస్తారు

చనిపోయినవాళ్లు

మన నిశ్శబ్దాన్ని

గుర్తు చేస్తారు

……

చనిపోయినవాళ్లు

బతికున్నవాళ్లను లెక్కపెడుతున్నారు

చనిపోయినవాళ్లు మనను విముక్తి చెయ్యరు”

        అంటున్నప్పుడు పోలిష్ కవి తదేవుష్ రోజేవిచ్ కేవలం తన కాలపు, తన అనుభవపు పోలిష్ వర్తమాన జీవన సత్యాన్ని మాత్రమే పలకడం లేదు. తరతరాల చనిపోయిన వాళ్లకూ, బతికున్న వాళ్లకూ వర్తించే సత్యం ప్రకటిస్తున్నాడు.

అలాగే పాలస్తీనియన్ తమీమ్ అల్ బర్ఘౌతి,

“జెరూసలెంలో

యే పెద్దాయనతో చేయి కలిపినా

యే భవనాన్ని ముట్టుకున్నా

నీ అరచేతిలో ఒకటి రెండు

కవితా పాదాలు రాయబడతాయి

జెరూసలెంలో

వరుస విపత్తులెన్నో సంభవించినా

ఒక అమాయకత్వపు చిరుగాలి వీస్తూ ఉంటుంది

గాలిలో బాల్యం నిండిపోతుంది”

        అన్నప్పుడు ఆ జెరూసలేం ఒకానొక అరబ్ నగర నామవాచకమే కానక్కరలేదు, ప్రపంచవ్యాప్తంగా దుఃఖాన్ని అనుభవిస్తున్న ఏ నగరపు సర్వనామమైనా కావచ్చు.

        “యే నిశ్శబ్దమూ ఒంటరి కాదు. ప్రతి నిశ్శబ్దమూ కనీసం రెండు – ఒకటి చెప్పగలిగేది, వాచ్యం చెయ్యగలిగేది. మరొకటి అనిర్వచనీయమైనది, వాచ్యానికి లొంగనిది. ఒకటి నాలుకకు సంబంధించిన నిశ్శబ్దం. మరొకటి హృదయానికి సంబంధించిన నిశ్శబ్దం. మొదటిదే బయటికి చెప్పగలం. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా బయటికి పలికినా నువ్వు మాట్లాడుతావు. మాట్లాడడం తప్పనిసరి. మాటకూ నిశ్శబ్దానికీ మధ్య మనసు సమాధి ఉంటుంది. అన్నింటి సమాధీ ఉంటుంది” అని పాలస్తీనియన్ ఘస్సన్ జఖ్తాన్ అన్న మాట గుట్టలుగా మేటలు వేసిన అనంత నిశ్శబ్దపు విస్తృతినీ, శక్తినీ చెపుతుంది. అటు వంటి నిశ్శబ్దం ఒక్క పాలస్తీనాది మాత్రమే కాదు, బహుశా వర్గ సమాజం ఏర్పడిన నాటి నుంచి, దోపిడీ పీడనా ఆధిపత్యమూ మొదలైన నాటి నుంచి అత్యధిక సంఖ్యాకుల నిశ్శబ్దం అది. మనసు సమాధి అది, అన్నింటి సమాధీ అది.  దాన్ని ఎరుకపరిచేదీ, ఎదిరించడానికి శక్తినిచ్చేదీ కవిత్వమే.

“పూలు తెంపుకోవాలని

వొంగిన వాళ్లని

బుల్లెట్లు మింగేసినయి”

అని లెబనాన్ కవి వది సాదెహ్ చిత్రించిన దృశ్యం ఎంత హృదయ విదారకమైనది!

        మొదటి గల్ఫ్ యుద్ధ బీభత్సాన్ని అనుభవించిన ఇరాక్ కవి సినాన్ ఆంటూన్ ‘నన్ను యుద్ధం ఛిద్రం చేసినప్పుడు’ అని అత్యంత బీభత్స దృశ్యాన్నీ, అత్యంత లలితమైన దృశ్యాన్నీ కవిత్వీకరించాడు.

“మృత్యువులో

బ్రష్ ను ముంచి

యుద్ధం గోడ మీద

ఒక కిటికీని గీశాను

దేని కోసమో వెతుకుతూ

ఆ కిటికీని తెరిచాను

కాని నాకు

మరో యుద్ధం కనబడింది

ఇంకా తన గర్భంలోనే ఉన్న,

చనిపోయిన కొడుకు మీద కప్పడానికి

కఫన్ అల్లుతున్న

ఒక తల్లి

కనబడింది.”

        ఈ కవుల్లో ఎక్కువ మంది తమ స్వస్థలాల నుంచి నిర్వాసితులైనవాళ్లు. పరాయి దేశంలో ప్రవాసంలో బతకక తప్పనివాళ్లు. అది ఒక అనుక్షణ, నిరంతర వేదన. ఇంత వేదన లోంచి కవిత్వం ఎందుకు ఎట్లా పెల్లుబుకుతుంది? నెగ్రిట్యూడ్ కవుల ప్రకటనలో ఒక జవాబు దొరుకుతుంది: “కవిత్వం రాయండి. అదొక్కటే మనం వ్యక్తీకరించుకునే పద్ధతి. అదొక్కటే మనం జీవించగలిగే జీవితం”.

        వ్యక్తులుగా ఆ కవులు మాత్రమే కాదు, వారి కుటుంబాలు, బంధువులు, మిత్రులు, సమూహాలు, దేశాలు జీవితాలను పోగొట్టుకున్నాయి. వాళ్ల జీవితాలను మరెవరో కొల్ల గొట్టారు. అప్పుడిక వాళ్లు జీవించగలిగిన జీవితం కవిత్వం మాత్రమే. లేదా ప్రతిఘటన మాత్రమే. అందువల్లనే ఈ పుస్తకంలో అత్యధిక భాగం ప్రతిఘటనా కవిత్వం.

        ప్రతిఘటన అనగానే వీళ్లందరూ విప్లవకారులో, మార్క్సిస్టులో అనుకోనక్కరలేదు. ఉదాహరణకు బే దావో లాంటి కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడ ఉన్నారు. “బే దావో రాజకీయ విశ్వాసాలు, మావో పట్ల, సాంస్కృతిక విప్లవం పట్ల, చైనా కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆయనకున్న అభిప్రాయాలూ సరైనవా కావా అనే చర్చ ఇక్కడ చెయ్యడం లేదు. వాటి పట్ల మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కాని ఒక కవిగా బే దావో కు కవిత్వం రాసే, కవిత్వంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేసే మౌలికమైన ప్రజాస్వామిక హక్కు అతనికున్నది. దాన్ని అణచివేసి, అతని కవిత్వాన్ని, పత్రికను నిషేధించి, అతనిని దేశంలోకే రానీయకుండా ఆంక్షలు విధించడం యెట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. నిస్సందేహంగా అది అప్రజాస్వామిక, నియంతృత్వ చర్యనే. అది కమ్యూనిస్టు పార్టీ చేసినా మరొకటి చేసినా దాన్ని వ్యతిరేకించాల్సిందే” అని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తాడు స్వామి.

        ప్రపంచంలోకెల్లా ఎక్కువ వజ్రాలు దొరికే దేశం అయి కూడ, నిరుపేద దేశంగా ఉన్న, సామ్రాజ్యవాద, వజ్రవ్యాపార బహుళజాతి సంస్థల యుద్ధ క్రీడల బీభత్సానికి లక్ష్యంగా ఉన్న సియెరా లియోన్ కవి, సిల్ చినీ కోకర్ అన్న మాటలు ఈ పుస్తకానికీ, స్వామి అనువాదాలకూ తలమానికాలు. ఆ మాటలు ప్రత్యేకంగానూ, ఈ పుస్తకం మొత్తంగానూ తెలుగు పాఠకులకూ, కవిత్వాభిమానులకూ విలువైన కానుకలు.

        “ప్రస్తుత పరిస్థితుల్లో రాయాలంటే రచయితలకు, ముఖ్యంగా సామాజిక బాధ్యతకు కట్టుబడిన రచయితలకు చాలా ఓపిక, ప్రశాంతత, కష్టకాలంలోనూ చెక్కుచెదరని మనో నిబ్బరం ఉండాలి. అది ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు, సమాజంలోని అన్యాయాల పట్ల నిరసన తెలిపే రచయితలను, వ్యవస్థీకృత దౌష్ట్యాలకు ధిక్కారం ప్రకటించే రచయితలను, ప్రభుత్వాలు, అధికార వర్గాలు భరిస్తాయని, స్వేచ్ఛగా రాసుకోనిస్తాయని అనుకోవడం ఒక భ్రమ. ప్రతి క్షణం అణచివేయడానికే ప్రయత్నిస్తాయి. గొంతు నొక్కడానికే ప్రయత్నిస్తాయి. తాము ప్రత్యక్షంగా గొంతు నొక్కలేని పరిస్థితుల్లో, కార్పొరేట్ శక్తులతో నోరు మూయిస్తాయి. రచయితల పుస్తకాలకు ఎటువంటి ఆదరణ లేకుండా చెయ్యడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాయి. ‘సాహిత్యం చచ్చిపోయింది, ప్రజలకు సాహిత్యాన్ని, సీరియస్ సాహిత్యాన్ని చదవడానికి అసలు సమయమే లేదు. పడిపోతున్న స్టాక్ మార్కెట్, పెరిగిపోతున్న నెలసరి ఇఎంఐ లు అప్పుల భారాలు, ఊపిరి పీల్చనియ్యని దైనందిన జీవన వేగం – ఇవన్నీ ప్రజల్ని సాహిత్యాన్ని చదవకుండా చేస్తున్నాయ’ని వాళ్ల ప్రచారం. అందుకే ఈ కష్టకాలంలో, ఆధునిక జీవన బీభత్సంలో చావుదెబ్బ తింటున్న మానవత్వ దీపాన్ని నిలపడానికి సాహిత్యకారులు పూనుకోవాలి.“

        “ఆధునిక జీవన బీభత్సంలో చావుదెబ్బ తింటున్న మానవత్వ దీపాన్ని నిలపడానికి” అనేకానేక పనులు చేయవలసి ఉంది. ఆ పనుల్లో ఒకటి ఈ ‘పదబంధం’.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.