పౌరాణిక గాథలు -3

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

అష్టావక్రుడు కథ

         ఈ కథ కూడా పాండవులకి రోమశ మహర్షి చెప్పిన కథే! ధర్మరాజు కౌరవులతో జూదమాడి ఓడిపోయాడు. తరువాత వాళ్ళు అనుకున్న ప్రకారం పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు.

         ఆ కాలంలో ఎవరూ అన్నమాట తప్పేవాళ్లు కాదు. ఒక మాట అన్నారు అంటే దాన్ని తప్పకుండా పాటించేవాళ్లు. అందుకే మాట అనే ముందు బాగా ఆలోచించి అనేవాళ్లు.

         ధర్మరాజు జూదం ఆడడానికి కారణం ధృతరాష్ట్ర మహారాజు. ఆయన పాండవుల తండ్రికి అన్నగారు.. ఆయన పిలిచినప్పుడు వెళ్లకుండా ఉండడం మర్యాద కాదని ధర్మరాజు జూదం ఆడడానికి వెళ్లాడు. కాని, శకుని మోసం చేసి ధర్మరాజుని ఓడించాడు. ఒప్పందం ప్రకారం పాండవులు అరణ్యాలకి వెళ్లారు.

         తెలివైన వాళ్ళు కష్టాలు కలిగినప్పుడు బాధపడరు. అక్కడ కూడా సంతోషాన్ని వెతుక్కుంటారు. ధర్మరాజు వంటివాళ్ళు జ్ఞానం పెంచుకుంటారు. ధర్మరాజు తన తమ్ముళ్ళతో కలిసి అరణ్యంలో తనకి కనపడిన మహర్షుల నుంచి ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందాడు.

         ఆ సమయంలో పాండవుల్ని చూడాలని గొప్ప తపస్వి రోమశ మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయన చెప్పిన కథే ఈ అష్టావక్రుడి కథ! ఇప్పుడు మనం అష్టావక్రుడి గురించి తెలుసుకుందాం…

         రోమశ మహర్షి  కథ చెప్పడం మొదలుపెట్టాడు. “ధర్మరాజా! పూర్వం ఏకపాదుడు అనే గొప్ప మహర్షి ఉండేవాడు. శిష్యులతో వేదాధ్యయనం, విధ్యాభ్యాసం ఆపకుండా చేయించేవాడు. ఆ మహర్షి భార్య సుజాత గర్భవతి. ఒకరోజు సుజాత గర్భంలో ఉన్న శిశువు అక్కడి నుంచే తన తండ్రి ఏకపాదుడిని ఒక ప్రశ్న అడిగాడు.

         ఆశ్చర్యపోకండి భాషనేది శిశువుగా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నేర్చేసుకుంటారు. అందుకే దాన్ని ‘అమ్మభాష’ అన్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇటు వంటి కథలు ఎన్నో ఉన్నాయి.

         సరే, ఇప్పుడు సుజాత కడుపులో ఉన్న శిశువు తన తండ్రిని ఏమని ప్రశ్నించాడు. “తండ్రీ! నువ్వు నీ శిష్యులకి ఆపకుండా పాఠాలు చెప్తున్నావు. నీ శిష్యులు కూడా నువ్వు చెప్పినట్లే పగలు రాత్రి అని లేకుండా చదువుతున్నారు. అందువల్ల వాళ్లు  మంద బుద్ధులుగా తయారవుతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల వేదపాఠాల్ని తప్పుగా చదువు తున్నారు. ఆ తప్పుల్నే పిల్లలు నేర్చుకుంటున్నారు. ఇలా తప్పులు చదివించడ మెందుకు?” అన్నాడు.

         ఆ శిశువు చెప్పింది విని తండ్రికి కోపం వచ్చింది. తననే నిందిస్తాడా అనే కోపంతో  “నువ్వు వేదాధ్యయనాన్ని వక్రంగా విమర్శించావు కనుక, ‘అష్టావక్రుడవై’ పుట్టు” అని శపించాడు.

         ఎంత గొప్ప పండితులైనా, తపస్సు చేసుకున్నవాళ్లైనా కోపం విడిచిపెట్టాలని పెద్దలు చెప్తుంటారు కదా! అయినా తనని తండ్రి అనే గౌరవం లేకుండా విమర్శించాడని కోపగించి ఇంకా బయటి ప్రపంచమే చూడని శిశువుని శపించాడు ఏకపాదుడు.

         సుజాత కడుపులో అగ్నిహోత్రంతో సమానమైన కొడుకు పెరుగుతున్నాడు. ప్రసవ సమయం దగ్గర పడిందని, ధనం అవసరమని ఆమె భర్తతో చెప్పింది. ఆమె చెప్పింది విని ఏకపాదుడు ధనం కోసం జనకమహారాజు ఆస్థానానికి వెళ్లాడు. అక్కడ వరుణుడి కొడుకు ‘వంది’తో వాదించి ఓడిపోయి నీళ్లల్లో బందీగా ఉండి పోయాడు. ఆ సమయంలో సుజాతకి అష్టావక్రుడు, ఉద్దాలకుడి భార్యకి శ్వేతకేతుడు పుట్టారు.

         అష్టవక్రుడు, శ్వేతకేతుడు మామ, మేనల్లుళ్లు. వాళ్లిద్దరూ ఒకే వయస్సువాళ్లు. కలిసి మెలిసి పెరిగారు. పన్నెండేళ్లు దీక్షతో చదువుకుని గొప్ప పండితులయ్యారు. అష్టావక్రుడు ఉద్దాలకుణ్ని తండ్రి అని, శ్వేతకేతుణ్ని సోదరుడు అని అనుకుంటూ జీవిస్తున్నాడు.

         ఒకరోజు అష్టావక్రుడు ఉద్దాలకుడి ఒళ్లో కూర్చుని ఆడుకుంటున్నాడు. అది చూసి శ్వేతకేతుడు అసూయతో “నువ్వు నా తండ్రి ఒళ్లో కూర్చుని ఆడుకోకు, వెళ్లి నీ తండ్రి ఒళ్లో కూర్చుని ఆడుకో” అన్నాడు.

         ఆష్టావక్రుడు ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్లి  “నా తండ్రి ఎవరు? ఎక్కడికి వెళ్లాడు?” అని అడిగాడు.

         తన తల్లి చెప్పింది విని అష్టావక్రుడు మేనమామ ఉద్దాలకుణ్ని, శ్వేతకేతుణ్ని వెంటబెట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్లాడు. జనకమహారాజు చేస్తున్న యజ్ఞం జరుగుతోందని వాళ్లని ద్వారపాలకుడు అడ్డుకున్నాడు.

         వాళ్లు ద్వారపాలకుణ్ని “ఈ వాకిలి నుంచి, మూగవాళ్లు, గుడ్డివాళ్లు, చెవిటివాళ్లు, స్త్రీలు, బ్రాహ్మణులు అందరూ లోపలికి వెడుతున్నారు కదా…మేము బ్రాహ్మణులం, పండితులం. మమ్మల్ని ఎందుకు అడ్డగిస్తున్నావు?” అని అడిగారు.

         ద్వారపాలకుడు “మహానుభావులైన వృద్ధ విద్వాంసులు, అనుభవం కలిగిన ఋత్విజులు మాత్రమే ఈ యజ్ఞవాటికలోకి వెళ్లాలి. మీరు చిన్నవాళ్లు కనుక మీరు వెళ్లకూడదు” అని చెప్పాడు.

         “ చక్కగా చదువుకుని ఆ చదువు నిత్యజీవితంలో ప్రతిఫలించేట్టు తన ప్రవర్తన తీర్చిదిద్దుకునేవాడు చిన్నవాడే అయినా ప్రజల గౌరవానికి అర్హుడే. మమ్మల్ని చిన్న వాళ్లంటూ అవమానించవద్దు. మేము జనకమహారాజు సభలో గర్వంతో విర్రవీగుతున్న వేదాల గురించి వాదనలు చేసేవాళ్లతో సిద్ధాంత రాద్ధాంతాలు చేసి వాదించడానికి వచ్చాం!” అని ధీమాగా చెప్పారు.

         ద్వారపాలకుడు రాజుగారి అనుమతి తీసుకుని అష్టావక్రుడు, శ్వేతకేతుల్ని లోపలికి పంపించాడు. అష్టావక్రుడు జనకమహారాజు అడిగిన చిక్కు  ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు. అతడి కొలువులో బ్రాహ్మణులతో వాదిస్తున్న వరుణుడి కుమారుడు వందితో వాదించి, అతణ్ని ఓడించాడు.

         అంతకు ముందు అతడితో వాదించి ఓడిపోడం వల్ల బంధింపబడిన  బ్రాహ్మణులందర్ని విడిపించాడు. అన్ని లోకాలతో పూజింపబడిన జనకమహారాజుతో  సత్కారం పొందాడు. పండితుల ప్రశంసలు అందుకున్నాడు.

         తన తండ్రి ఏకపాదుణ్ని వెంటబెట్టుకుని గొప్ప తేజస్సుతో వెలుగుతూ తన ఆశ్రమానికి చేరుకున్నాడు” అని చెప్పాడు.

         తన తండ్రి ఇచ్చిన శాపం వల్ల ఎనిమిది వంకర్లతో పుట్టి అష్టావక్రుడు అని పిలవ బడ్డాడు. తన తండ్రి శిష్యులకి నేర్పించిన వేదాలన్నీ అమ్మ కడుపులో ఉండగానేనేర్చేసు కున్నాడు.

         ‘తల్లితండ్రులు మంచి మార్గంలో నడుస్తూ మంచి మంచి పుస్తకాలు పైకి చదువుతూ వివరంగా చెప్తుంటే..  కడుపులో ఉండగానే నేర్చుకోవచ్చు’ అని నిరూపించాడు అష్టావక్రుడు!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.