మిట్ట మధ్యాహ్నపు మరణం- 18
– గౌరీ కృపానందన్
రాకేష్ క్రాఫ్ గాలికి ఎగురుతోంది. జీన్స్, లేత నీలం రంగు టీ షర్ట్ లో అతని ఛాయ మరింత మెరుగ్గా కనబడింది. అతని చేతి వేళ్ళు నాజూకుగా…..
‘“ఛీ ఛీ! అతని ముఖాన్ని తనెందుకు నిశితంగా చూడాలి?’ మనస్సు ఆమెని హెచ్చరించింది.
“ఇలా ఇవ్వండి. నేను పట్టుకొస్తాను.” కూరగాయల సంచీని ఆమె చెయ్యి తగల కుండా అందుకున్నాడు.
“ఏదో విషయం తెలిసిందన్నారు?”
“మాయ అన్నది ఎవరో నాకు తెలిసింది.”
“అలాగా.”
“కాని ఆమెను ఇంకా నేను చూడలేదు. పోలీసులకి చెప్పడానికి సరైన సాక్ష్యాధారాలు లేవు. కాని మాయ అన్న స్త్రీ మీ భర్తకి పాత స్నేహితురాలు.”
మళ్ళీ, “అలాగా” అని అన్నది.
“ఆమెను చూడాలని మీకు అనిపిస్తోందా? అలాగైతే ఇంకాస్త ముందుకు వెళ్లి వివరాలను తెలుసుకుంటాను.”
“ఆమెను చూడడానికి ముందు, ఈ విషయాన్ని మీరు ఎలా తెలుసుకున్నారు? ఆ సంగతి చెప్పండి.”
“చెబుతాను. కానీ ఆమే మీ భర్త హత్యకి కారణమని రూఢీగా చెప్పలేం.”
“మరి ఏమని తెలిసింది?”
“మాయ అన్న స్త్రీ మీ భర్త జీవితంలో ఉంది. అది నిజం.”
“ఆమె ఎవరు? ఎక్కడ ఉంటుంది?”
“చెబుతాను. అన్నీ చెప్పాలంటే … మీకు ఇప్పుడు టైం ఉందా?”
“ఇప్పుడు కుదరదు.”
“మరి ఎప్పుడు కలుద్దాం? మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను.”
ఉమ ఆలోచించింది. ఇతనితో పరిచయం కొనసాగించడం సరియేనా? ఈ స్నేహం మరింత ముందుకు వెళితే తనను తాను కోల్పోయే ప్రమాదం ఉందని మనసు హెచ్చరిస్తోంది. అతని రూపమా? మాటకారితనమా? ఏది తనని ఇలా ఆకర్షిస్తోంది? దీనిని కొనసాగ నివ్వకూడదు.
“నేను ఎక్కడికీ ఒంటరిగా వచ్చే స్థితిలో లేను మిస్టర్ రాకేష్.”
“మిస్టర్ రాకేష్ అనకండి. రాకేష్ అంటే చాలు.”
ఉమ మౌనంగా ఉండి పోయింది.
“మీరు తప్పుగా అనుకోకుంటే నేను మిమ్మల్ని నా రూముకు తీసుకువెళ్ళనా?” అన్నాడు.
“ఎప్పుడు?” అన్నది. వద్దు అని చెప్పాలనుకున్నా ఆమెకి తెలియకుండానే ఆ మాట వచ్చేసింది.
“ఎప్పుడైనా సరే.”
“ఆనంద్ వస్తే, అతన్నీ పిలుచుకుని రానా?”
“తప్పకుండా.”
ఆ జవాబుతో ఆమెకి తృప్తిని కలిగించింది. ఇతని ఉద్దేశ్యం నిశ్చయంగా తనని ఒంటరిగా కలవడం కాదు. ఏదో చెప్పాలను కుంటున్నాడు. ఆనంద్ కూడా వస్తే వెళ్ళడానికి భయమెందుకు?
భయం ఇతరుల గురించి కాదు. తనని చూసి తనకే భయం వేస్తోంది.
“కూరగాయల సంచీతో మీతో నడిచి రావడానికి అభ్యంతరం ఉండదు కదా?”
“వద్దు. నేనే వెళ్లి పోగలను. బరువు కూడా ఎక్కువగా లేదు.”
“మీ తటపటాయింపు నాకు అర్థం అయ్యింది. రోడ్డు మీద మనిద్దరం కలిసి వెళ్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారని భయం. అంతేనా?”
“అది మాత్రమే కాదు.”
“వేరే కారణం ఏమిటి?”
ఉమ ఆలోచించింది. “వేరే కారణమూ లేదు. నేను రానా మరి” అన్నది.
“కాస్త ఆగండి. ఎప్పుడు వస్తానని చెప్పకుండా వెళ్తున్నారు.”
“ఫోన్ నంబరు ఇచ్చారుగా. ఫోన్ చేస్తాను.”
“ఎప్పుడు?’
“ఆనంద్ ఎప్పుడు ఫ్రీ గా ఉంటాడో తెలుసుకున్న తరువాత ఫొన్ చేస్తాను.”
“ఒకవేళ నేను లేకున్నా మెసేజ్ ఇవ్వండి. నాకు కబురు తెలుస్తుంది. రోజూ మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. ఉమా! నేను మీ దగ్గర చెప్పాలని అనుకుని, చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి.”
ఉమ బయలు దేరబోయింది.
వెళ్ళడానికి ముందు అతను తన జేబు నించి ఒక ఉత్తరం తీసి ఇస్తూ, “మీ ఆసక్తిని అనవసరంగా కెలుకుతున్నానని అనుకోకండి. ఈ ఉత్తరం చదివి చూడండి” అని అన్నాడు.
ఆమె ఆ ఉత్తరాన్ని తీసుకో బోతుండగా అతని వేళ్ళ కొసలు ఆమె చేతికి తగిలాయి.
***
ఆనంద్ కాలేజ్ కు బయలుదేరుతున్నాడు.
“ఆనంద్!”
“ఏమిటి ఉమా? కాస్త తొందరలో ఉన్నాను.”
“ఒక రోజు నువ్వు నన్ను ఒక చోటికి తీసుకు వెళ్ళాలి.”
“శుక్రవారం! శుక్రవారం అమ్మ నైట్ క్లబ్ కి వెళ్తుంది. అప్పుడు వెళదాం.”
“నైట్ క్లబ్బా?”
“అవును. గుడిలో పురాణ కాలక్షేపం. ఇప్పుడు మనం ఇద్దరమూ ఇలా మాట్లాడు కోవడం చూస్తే అమ్మకి కోపం వస్తుంది. చురక తగిలేటట్లు ఏదైనా ఒక మాట అనేస్తుంది. శుక్రవారం తప్పకుండా తీసుకుని వెళ్తాను. వెధవ కట్టుబాట్లు! ఫ్రీగా మాట్లాడుకోనివ్వ కుండా.”
“ఆనంద్! ఎవరితో మాట్లాడుతున్నావు?” లోపల్నించి అత్తగారి కేక వినిపించింది.
“ఏమీ లేదమ్మా. బయలు దేరుతున్నాను. వస్తాను ఉమా.”
ఆనంద్ సైకిల్ ఎక్కి వెళ్లి పోయాడు. ఉన్నట్టుండి ఉమకి ప్రతీకార వాంఛ పొంగుకు వచ్చింది. తనకి జరిగిన అన్యాయానికి ఎవరినైనా, ఏదైనా చేయాలని అనిపించింది. స్టైల్ గా జీన్స్, టీషర్ట్ వేసుకుని అత్తగారి ముందు నిలబడితే! ఎలా ఉంటుంది?
ఇన్ని రోజుల తరువాత కూడా తమ సంతాపాన్ని తెలియ పరచడానికి వచ్చేవాళ్ళని, “నిజంగా మీకు దుఃఖంగా అనిపిస్తోందా? నన్ను రెండో పెళ్లి చేసుకోమంటారా?” అని అడిగితే ఎలా ఉంటుంది? తనకి ఏర్పడిన షాక్ లో కొంచమైనా వాళ్ళూ అనుభవించాలి.
ఛ… ఛ.. ఎందుకుకిలా ఆలోచిస్తున్నాను. ఇలాంటి ఆలోచనలు అదుపులో ఉంచక పోతే మతి చలించే ప్రమాదం ఉంది. పిచ్చిదాన్ని అయిపోతానేమో.
“ఏమిటి ఉమా! మళ్ళీ బీన్స్, బెండకాయలు తెచ్చావు. ఫ్రిజ్ తెరిచి చూడు. నిన్న కూడా అవే తెచ్చావు.”
“వేరే లేవత్తయ్యా అక్కడ.”
“లేకపోతే వట్టి చేతులతో రాకూడదా? ఉన్న కూరగాయాలనే మళ్ళీ తెస్తారా ఎవరైనా?”
“ఏం చెయ్యను అత్తయ్యా? మీ అబ్బాయి జ్ఞాపకం వచ్చింది,”
అత్తగారి మనసు కరిగి పోయింది. “పోనీలే. లోపల పెట్టు.”
ఉమ కూరగాయలను లోపల పెట్టి మేడ మీద మూర్తి గదిలోకి వెళ్ళింది. మంచం మీద పడుకుని ఆ ఉత్తరాన్ని చదవడానికి ముందు మూర్తి ఫోటోను చూసింది. ఎన్లార్జ్ చేసిన ఫోటో. నవ్వుతూ ఎదురుగా నిలబడి ఉన్నట్లు అనిపించింది. జననం మరణం అని క్రింద తారీఖులు వ్రాసి ఉన్నాయి.
‘నా వరకు నీ జీవిత కాలం రెండు రోజులేగా కదా బాబ్జీ.’ ఉమ మనసు బాధగా మూల్గింది.
ఉత్తరాన్ని తీసి చూసి ఉలిక్కి పడింది.
అవే అక్షరాలు! అదే ఆకుపచ్చ రంగు సిరా!
అంతకు ముందు వచ్చిన ఉత్తరాన్ని జ్ఞప్తికి తెచ్చింది.
“డియర్ మూర్తీ,
ఆ రోజు రాత్రి గడిచిన సంఘటనకి నేనే బాధ్యురాలిని. నువ్వు చెప్పినట్లు విని ఉంటే ఆ రాత్రి వేరేలాగా గడిచి ఉండేదేమో. ఇలా బరి తెగించి వ్రాస్తున్నానని అనుకోవు కదూ. మూర్తీ! ఈ ఉత్తరం నువ్వు చేసిన… సారీ.. మనం చేసిన నేరాన్ని ఆరోపించడానికి మాత్రం కాదు. మళ్ళీ ఎప్పుడు అని అడగడానికే.
ముద్దులతో నీ మాయ
***
రాత్రి పదిన్నర గంటలకి మంచం మీద పడుకుంటూ, పక్కనే ఉన్న పాల గ్లాసును కూడా గమనించకుండా, మాధవరావు ఆ లిస్టును మరోసారి చూశారు.
“పోలీసు వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి మాధవరావ్! ఒక్కొక్కరినీ ఎంక్వయిరీ చెయ్యండి. నెవర్ టేక్ ఎనీ ధింగ్ ఫర్ గ్రాంటెడ్. పుస్తకాలలో, సినిమాలలో లాగా అంత సులభం కాదు. పర్సివరెన్స్… అది ముఖ్యం.” డి.ఎస్.పి. మాటలు గుర్తుకు వచ్చాయి.
“మిస్టర్ చారి. ఐ యాం ఇనస్పెక్టర్ మాధవరావు.”
“కం ఇన్. నేను స్కూటర్ లో వెళ్ళేటప్పుడు కూడా హెల్మెట్ వేసుకుంటాను. రోడ్ టాక్స్, ఇన్ కంటాక్స్ అన్నీ సరిగ్గానే కడతాను.”
“నో.. నో.. నేను దాని కోసం రాలేదు.”
“మరి? నాకూ పోలీసులకు సంబంధం ఉండడానికి ఆస్కారం లేదే.”
“మీరు క్రికెట్ ఎక్కడ ఆడతారు.”
“ముందు ఆడేవాణ్ని. ఇప్పుడు చంటిపిల్లను ఎత్తుకుని ఆడించడమే నా హాబీ అయిపొయింది.”
“పోయిన నెల 17వ తారీఖున ఎక్కడ ఉన్నారో చెప్పగలరా?”
“మార్చ్ 17! కాస్త ఆగండి.” ఆలోచించాడు. “చెన్నైకి వెళ్లాను.”
“దానికి ఆధారం ఏమైనా ఉందా?”
“ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారో చెప్పగలరా?”
“ఒక హత్య కేసు విషయంగా పరిశోధిస్తున్నాను.”
“ఓ మై గాడ్! ఉండండి వస్తాను.” భయపడుతూ లోపలి వెళ్ళాడు.
అప్పటికే మాధవరావు చారి పేరుని లిస్టులో కొట్టేసాడు. ఎత్తు. ఐదు నాలుగు. షూ సైజు చిన్నది.
“ఇదిగో చూడండి. చెన్నై నుంచి నేను నా భార్యకి వ్రాసిన ఉత్తరం. తారిఖు చూసుకోండి. నేను స్టే చేసిన హోటల్ బిల్ ఇదిగో.”
“ఇక చాలు.”
“సార్ నేను చార్టర్డ్ అక్కౌంటెంటుని. అన్నింటిలోనూ పద్దతిని పాటిస్తాను. బి.కాం. చదువుతున్నప్పుడు హోటల్ కి వెళ్ళి తిన్న రవ్వ ఇడ్లీకి కూడా బిల్ ఉంది నా దగ్గిర.”
తన భార్య వైపు తిరిగి చూసి అన్నాడు చారి. “చూశావా. ప్రతీ దానికీ లెక్కలు రాస్తున్నారు అని విసుక్కుంటావు నన్ను. ఇప్పుడు చూడు ఎలా ఉపయోగపడుతోందో. ఈమె నా భార్య సార్. టీచరుగా జాబ్ చేస్తోంది.”
“మిస్టర్ చారి! నేను మిమ్మల్ని అనుమానించడం లేదు. చిన్న చిన్న విషయాలు కూడా క్లియర్ గా గుర్తు పెట్టుకున్న మీ జ్ఞాపక శక్తిని ప్రశంసిస్తున్నాను. మీరు పోలీసు డిపార్ట్ మెంట్ లో ఉండాల్సిన మనిషి.”
చూశావా అన్నట్టు తన భార్య వైపు చూసి తలను ఎగరేశాడు.
“ఈ ఫోటోను చూడండి. చెట్టు పక్కన ఒక ముఖం కనబడుతోందా?”
“జోక్ చేస్తున్నారా? చెట్టు మాత్రమేగా ఉంది?”
“సరిగ్గా చూడండి.”
“చెట్టు మాత్రమే ఉంది సార్.”
“ఆయనకి కాస్త చూపు మందగించింది. కళ్ళ డాక్టర్ దగ్గిరికి వెళ్ళ మంటే వినిపించు కుంటేగా?”
“ఉండవే. ఆ … కనబడింది. ఒక మనిషి తొంగి చూస్తున్నట్టుగా. వీళ్లిద్దరూ ఎవరు?”
“తొంగి చూస్తున్న మనిషిని ఎక్కడైనా చూసిన జ్ఞాపకం ఉందా?”
పెదవి విరిచాడు. “సారీ సార్. ఫోటో క్లియర్ గా లేదు. కేసు ఏమిటి?”
“ఈ ఫోటోలో ఉన్న భర్త హత్య చేయబడ్డాడు.”
“అయ్యో దేవుడా! ఏమండీ! మీరు లోపలికి వచ్చెయ్యండి. రాత్రిళ్ళలో బయట తిరగవద్దని ఎన్నిసార్లు మీకు చెప్పాను. ఏదన్నా అయితే?”
“నోరు ముయ్యవే దేభ్యం ముఖమా! లోపల చంటిది ఏడుస్తోంది. పాలు కలిపి ఇవ్వు.” భార్యను లోపలికి తరిమాడు.
మాధవరావు ఇంటి నుంచి బైటికి వస్తూ అడిగాడు. “ఇంకో చిన్న విషయం చారి! మీరు హెయిర్ డై వాడతారా?”
“దాని ఖరీదు ఎంతో కూడా నాకు తెలియదు సార్.”
“మీరు మల్లీశ్వరం క్రికెట్ క్లబ్బులో ఆడినప్పుడు. మీ క్రికెట్ టీం మెంబర్స్ ఎవరైనా హెయిర్ డై ఉపయోగిస్తున్నట్లు తెలుసా?”
“లేదు సార్.”
మాధవరావు లిస్టులో మొదటి పేరు కొట్టేశారు.
*****
(ఇంకా ఉంది)
1956లో దిండిగల్, తమిళనాడులో జననం. మాతృభాష తమిళం. తండ్రిగారి ఉద్యోగరీత్యా తెలంగాణాలో తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసించారు. బి.కాం. పూర్తి అవుతుండగానే వివాహానంతరం చెన్నైకి వెళ్ళవలసి వచ్చింది. ఆ తరువాతే తమిళ సాహిత్యం చదవడానికి అవకాశం లభించింది. సాహిత్యం అంటే మక్కువ. తెలుగులో తనకి నచ్చిన నవలలు, కధలు తమిళ పాఠకులకు, అలాగే తమిళంలో మనసుకు దగ్గరగా ఉన్న సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలనే కోరికతో, ఆశయంతో అనువాద ప్రక్రియను ఎంచుకున్నారు. 1995లో మొదటి అనువాద కధ యండమూరి వీరేంద్రనాథ్ గారి “ది బెట్’ తమిళంలో ప్రచురం అయ్యింది. దాదాపు ఎనబై తెలుగు నవలలు తమిళంలో వెలువడి ఉన్నాయి. (యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి, D. కామేశ్వరి, ఓల్గా) తెలుగులో పెరుమాళ్ మురుగన్ గారి “పూనాచ్చి ఒక మేకపిల్ల కధ” ఈ మధ్యే వెలువడింది. 2015లో ఓల్గాగారు “విముక్త” కధా సంకలనానికి సాహిత్య అకాడమి అవార్దు అందుకున్న అదే ఏడాది, విముక్త తమిళ అనువాదం “Meetchi”కి గౌరీ కృపానందన్ సాహితి అకాడమి అనువాద పురస్కారం అందుకున్నారు. మూలానికీ, అనువాదానికీ ఒకే ఏడాది సాహిత్య అకాడమి అవార్డులు రావడం ఇదే తొలిసారి.