యాత్రాగీతం
అమెరికా నించి ఆస్ట్రేలియా
(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)
-డా||కె.గీత
భాగం-2
వీసా
ప్యాకేజీ టూరుకి డబ్బులు కట్టిన తరువాత వీసా రాకపోతే, లేదా సరైన సమయానికి రాకపోతే కలిగే నష్టం కంటే వీసా వచ్చిన తరువాత ప్యాకేజీ టిక్కెట్లు కొనుక్కుంటే వచ్చే నష్టమే తక్కువ. కాబట్టి మేం వీసా వచ్చేవరకు టూరు బుక్ చేసుకోలేదు.
అసలు ఆస్ట్రేలియా వీసా బుక్ చేసుకోవడానికి ముందుగా ఆరు నెలల కనీస వ్యవధి తో ఎక్స్పైర్ కాని పాస్ పోర్టులు కావాలి. ముందుగా ఆస్ట్రేలియా వీసా సైటు (https://online.immi.gov.au/elp/app) లో ఎవరికి వారు ప్రత్యేకంగా అకౌంటు క్రియేట్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ విజిటర్ వీసాకి అప్లికేషను పెట్టుకోవాలి. కుటుంబం అంతా కలిసి వెళ్తున్నపుడు మొదటి వ్యక్తి క్రియేట్ చేసిన గ్రూపు నంబరునే మిగతా అందరూ కూడా అప్లికేషనులో రాయాలి. అంతేకాకుండా ఉద్యోగం చేస్తున్నట్లు, టూరుకి అవసరమైన డబ్బులు తగినన్ని ఉన్నట్లు చూపించే అత్యవసరమైన డాక్యుమెంట్లు, పాసుపోర్టు మొ.వి స్కాన్ డాక్యుమెంట్లుగా అప్లోడ్ చెయ్యాలి. అమెరికన్ సిటిజన్ అయిన మా చిన్నమ్మాయికి అప్లికేషన్ అప్లోడ్ చేసిన పది నిమిషాల్లో ఏక్సెప్టెన్సీ వచ్చేసింది. ఇక భారత పౌరులమైన మాకు వీసా ఎలా వస్తుందో తెలియదు. ఆన్లైనులో ఏక్సెప్టెన్సీ వస్తే సరిపోతుందా లేదా పాసుపోర్టులు వాళ్లకి పంపితే స్టాంపు కొట్టి తర్వాత పంపుతారో తెలియదు. ఇవన్నీ పూర్తి కావడానికి ఎన్నాళ్ళు పడుతుందో కూడా తెలియదు. ఆన్లైనులో ఎవరెవరివో అనుభవాలు చదివి చివరికి తెలుసుకున్నదేవిటంటే ఇదంతా పూర్తి కావడానికి మూడు నెలల వరకు పట్టొచ్చని. అంటే సెప్టెంబరు మొదటి వారంలో అప్లై చేసిన మాకు నవంబరు నెలాఖరు వరకు రాకపోవచ్చన్నమాట.
ఇక ప్రయాణమ్మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నాం. ఈ లోగా మేం ఆన్లైనులో కొటేషన్స్ అడిగిన రకరకాల వెబ్సైటుల వాళ్ళు టిక్కెట్లు త్వరగా బుక్ చేసుకోమని ఈమెయిల్స్ తో బుర్ర తినడం మొదలుపెట్టారు.
అయితే విచిత్రంగా సరిగ్గా పది రోజుల్లో మాకు ఆన్లైనులో ఏక్సెప్టెన్సీ మెసేజీ వచ్చింది. అంతేకాదు దాని ప్రింటవుట్ కాగితం పట్టుకెళ్తే చాలని సారాంశం. పాసుపోర్టులో వీసా స్టాంపు వగైరాలు ఉండవు. ఇక విజిటర్ వీసా నంబరు 600 ప్రకారం ఒక సంవత్సరం వీసా ఇచ్చారు. మూడునెలలకు మించకుండా ఏడాది వ్యవధిలో మూడు నాలుగు సార్లు వెళ్ళిరావొచ్చు. వీసా ఫీజు ఒక్కొక్కళ్ళకి వంద అమెరికన్ డాలర్లు.
అంత సులభంగా వీసా కార్యక్రమం పూర్తయినట్టు అనిపిస్తున్నా నాకు అమెరికన్ వీసా తలనొప్పితో ఇదంతా నమ్మాలనిపించలేదు. ఎక్కడో కాస్త భయం పట్టుకుంది. చివరికి ప్రయాణం చేసే రోజు వరకు, అక్కడ ఆస్ట్రేలియాలో దిగేక ఇమ్మిగ్రేషన్ కౌంటరు దగ్గిరకెళ్ళి బయట పడేవరకు నమ్మకం కలగలేదు. కానీ చాలా సులభంగా వీసాకార్యక్రమం పూర్తయ్యింది. ఎక్కడా మాకు ఎటువంటి బాధలు ఎదురుకాలేదు.
మేం ఎక్కిన శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టులో విమానాలకు బోర్డింగు పాసులు ఇచ్చే ముందు మా పాసుపోర్టులు, గ్రీన్ కార్డులు చెక్ చేసారు. “ఆస్ట్రేలియా వీసా ఉందా?” అని మాత్రమే అడిగారంతే. ఇక అక్కడ సిడ్నీలో దిగేక ఇమ్మిగ్రేషన్ కౌంటరులో “ఎన్నాళ్ళుంటారు? ఎందుకొచ్చారు?” లాంటి ప్రాథమిక ప్రశ్నలు మాత్రమే అడిగారంతే. అక్కడ కూడా వీసా కాగితాలు చూడలేదు. బహుశా: అంతా ఆన్లైనులో ఉన్నట్లుంది. అబ్బ, ఇంత సులభంగా అన్ని దేశాల వీసాలు ఉంటే ఎంత బావుణ్ణు! అనిపించింది. ఈ విధంగా చూస్తే అమెరికా నించి ఆస్ట్రేలియా వెళ్లి రావడం కరతలామలకమే.
ప్యాకేజీ టూరు
ముందు చెప్పినట్లు విడిగా ఫ్లయిట్ టిక్కెట్లు మనమే కొనుక్కుంటే రానూపోనూ ఒక్కొక్కళ్ళకి దాదాపు 2500 డాలర్లు అవుతున్నాయి. ఇక పదిరోజులకు గాను హోటళ్లు, అక్కడ చూడాల్సిన టూర్లు, ఆస్ట్రేలియాలో మూడు ప్రదేశాలకు మధ్య ఫ్లయిట్ టిక్కెట్లు, టాక్సీ ఛార్జీలు ఎలా లేదన్నా అయిదువేల డాలర్లు దాటిపోతూ ఉంది. పైగా అన్నిటికీ రీసెర్చి చెయ్యడం, సరైన సమయానికి పికప్లు వంటివి బుక్ చెయ్యడం మొ.వి చాలా శ్రమతో కూడుకున్నవి. ఆన్లైనులో చెయ్యలేని వాటికి ఫోన్లు చెయ్యడం అయ్యేపని కూడా కాదు. అయితే ప్యాకేజీ టూర్లో రానూపోనూ అమెరికా నించి ఫ్లయిట్ టిక్కెట్లు,ఆస్ట్రేలియాలో మూడు ప్రదేశాలకు మధ్య ఫ్లయిట్ టిక్కెట్లు, ఇక పదిరోజులకు గాను హోటళ్లు కలిపి ఒక్కొక్కళ్ళకి దాదాపు 2500 డాలర్లకి వస్తూ ఉండడంతో ఇదే మంచిదనిపించింది. ఇక అక్కడ చూడాల్సిన టూర్లు, టాక్సీ సర్వీసులు మనకి కావల్సినవి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అవన్నీ అప్పటికప్పుడు యాడ్ అవుతూ మనకి ప్రైస్ లిస్టులో కనిపిస్తూ ఉంటుంది. మేం హోటళ్ళని అప్ గ్రేడ్ చేసుకున్నాం. అంతే కాకుండా ప్రతిచోటా ఎయిర్పోర్టు నించి హోటలుకి రానూపోనూ టాక్సీ సర్వీసులు యాడ్ చేసుకున్నాం. ఇందువల్ల మేం ఎయిర్పోర్టు బయటికి వెళ్ళేసరికే మా పేరు ఉన్న బోర్డు పట్టుకుని మా కోసం టాక్సీ సిద్ధంగా ఉంది. ఒక్క సిడ్నీలో దిగినప్పుడు తప్ప మిగతా అన్ని సార్లూ చాలా మంచి సర్వీసులు సరైన సమయానికి అందించారు.
ఇక టూర్లకు హోటలు నించి పికప్, డ్రాప్ ఆఫ్ వివరాలు టూర్లు మాకు కన్ఫర్మ్ అయ్యేక సైటులో తెలిసాయి. కానీ కొన్నిచోట్ల కాలినడకన వెళ్లగలిగేంత దగ్గర్లో మరో హోటలు దగ్గిర పికప్/డ్రాప్ ఆఫ్ పాయింట్లు ఉంటే, మరికొన్ని టాక్సీ తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. మెల్ బోర్న్ లో ఒక టూరు నించి తిరిగి వచ్చినపుడు మా హోటలు దగ్గిర డ్రాపు చెయ్యకుండా అర్థరాత్రి 3 కి.మీ దూరంలో మమ్మల్ని రోడ్డు మీద దించేసినపుడు మాత్రం భలే కోపం వచ్చింది. ఒక పక్క నిద్రకి జోగుతున్న పిల్లలతో టాక్సీ కోసం భలే ఇబ్బంది పడ్డాం. కాబట్టి హోటళ్ల నించి పికప్, డ్రాప్ ఆఫ్ చెయ్యని లోకల్ టూర్లు ఇక మీదట ఒప్పుకోకూడదని పాఠం నేర్చుకున్నాం.
మొత్తం ప్రయాణం రోజులతో కలిపి పదకొండు రోజులవుతున్నా టైము డిఫరెన్సు వల్ల ఆస్ట్రేలియాలో మేం పూర్తిగా తొమ్మిదిరోజులు మాత్రమే ఉన్నాం. కాబట్టి మూడు రోజులు ఒక్కో ఊళ్ళో చొప్పున నిర్ణయించుకున్నాం. అందులో ఒక రోజు ఊరంతా తిప్పి చూపించే సిటీ టూరు, ఒక రోజు దగ్గర్లో ఏదైనా విశేషాన్ని చూపించే టూరు పోగా ప్రయాణపు రోజులు మా సొంతంగా తిరిగి చూడడం కోసం ఖాళీ పెట్టుకున్నాం.
ఆ తొమ్మిదిరోజుల్లో మొదటి రోజు నా పుట్టినరోజు, చివరి రోజు మా పెళ్లి రోజు కావడం యాదృచ్ఛికమైనప్పటికీ సంతోషంగా అనిపించింది.
ఇంతకీ మొత్తం ప్యాకేజీ టూరుకి ఒక్కొక్కళ్ళకి ట్రావెల్ ఇన్సూరెన్సు కూడా కలుపు కుని దాదాపు 4500 అమెరికన్ డాలర్లు అయ్యింది.
ఇక మా అంతట మేముగా మధ్యలో సమయం ఉన్నపుడు బుక్ చేసుకున్న టూర్లు, భోజనాదులు కలిపి తలకు మరొక వెయ్యి డాలర్లు అయ్యింది.
మొత్తంగా ఒక్కొక్కళ్ళకి అయిదారువేల అమెరికన్ డాలర్లు ఖర్చు అయ్యింది.
కొంచెం ఎకనామికల్ గా, తక్కువ ఖరీదు హోటళ్లతో, కొన్ని తక్కువ లోకల్ టూర్లతో వెళ్తే నాలుగువేల అమెరికన్ డాలర్లు అవుతుండొచ్చు.
ఇలా డిమాండ్ లేని సీజన్ లో వెళ్తే రేట్లు సగానికి సగం తగ్గుతాయని కూడా ఉవాచ.
*****
(సశేషం)