యాదోంకి బారాత్-6
-వారాల ఆనంద్
నాటి నుంచి నేటి దాకా “జాతర” సామాన్యుని ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్ధిక వ్యక్తీకరణ వేదిక. ఇవ్వాల్టి సాంకేతికత, అభివృద్ది వెలుగు చూడని దశాబ్దాల క్రితం నుండి జాతర అనగానే సామాన్య ప్రజలు వందలు వేలుగా గుమిగూడేవారు. అదొక గొప్ప సామూహిక వ్యక్తీకరణ. తమ ఇష్ట దైవాలకు మొక్కులు తీర్చుకునే సందర్భమది. తర్వాత అంతా సమిష్టిగా వినోదమూ, వ్యవహారమూ, వ్యాపారమూ నిర్వహించుకునే ఒక అద్భుత వేదిక జాతర. ఎంత పల్లెటూరి వాళ్ళయినా, ఆర్థికంగా ఎంత లేని వాళ్ళయినా జాతర వచ్చిందంటే పిల్లా పాపలతో బండ్లమీదో, నడిచో, బస్సేక్కో వచ్చి జాతరలో పాల్గొనడం తప్పనిసరి కార్యంగా నిర్వహించే వారు.
అట్లాంటి జాతరలు మా కరీంనగర్ ప్రాంతంలో అనేకం. వేములవాడ, కొత్తకొండ, నల్లగొండ ఇట్లా పలు ప్రాంతాల్లో వేర్వేరు పండగలప్పుడు జాతరలు జరుగుతాయి. అందులో ముఖ్యమయినదీ ప్రాచుర్యం పొందిందీ వేములవాడ రాజేషుని జాతర. ప్రతి శివరాత్రికి జరిగే ఈ జాతర గొప్ప ఉత్సవం. వేములవాడలో శివరాత్రి జాతరతో పాటు శ్రీ రామనవమికి జరిగే దేవుని పెళ్లి, దసరా ఉత్సవాలూ గొప్పగా జరుగుతాయి. శ్రీరామనవమి కి శివపార్వతుల పెళ్లి విశేషమయింది. దానిపైన నేనో డాక్యుమెంటరీ కూడా తీశాను. ఆ వివరాలు మరోసారి రాస్తాను.
***
శివరాత్రి జాతర నా జీవితంలో గొప్ప ప్రభావాన్నీ చూపించింది. నిజానికి వేములవాడ గతంలో జైన క్షేత్రమని కాకతీయ రాజుల కాలంలో అది శైవ కేంద్రంగా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు. మా ఎరుకలో కూడా అంటే దాదాపు 1970ల వరకు ఆలయంలో జైన విగ్రహాలు ఉండడం నేను చూసాను. తర్వాత వాటిని భీమేశ్వరాలయం పక్కన వున్న తోటలోకి చేర్చారు. ఆ విషయాలు ఎట్లున్నప్పటికీ రాజన్న జాతర విషయానికి వస్తే ఏడాదికోసారి వేలాదిమంది గ్రామీణులకు అదో గొప్ప ఉత్సవం. పిల్లలుగా మాకూ మహా ఉత్సాహంగా వుండేది. కేవలం కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచీ మహారాష్త్ర నుంచీ లేక్కలేనంత మంది జాతరకు తరలి వచ్చేవారు. జాతరకు ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక జాతర బస్సులు నడిచేవి. కరీంనగర్ బస్ స్టాండులో ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. కరీంనగర్లో ఇప్పుడు ప్రతిమ మల్టీ ప్లెక్స్ వున్న స్థానంలో గుండ్రంగా కళాత్మకంగా నిర్మించబడిన బస్ స్టాండ్ వుండేది. అందులో ఓ పక్క వేములవాడ జాతర కోసం చలువ పందిళ్ళు వేసేవారు. యాత్రికుల కోసం చలివేంద్రాలు పెట్టి తాగు నీటి వసతి కల్పించే వాళ్ళు. జాతర వారం ముందు నుంచే ఈ ఏర్పాట్లు మొదలయ్యేవి. మిగతా రూట్లకు బస్సులు తగ్గింఛి జాతర బస్సులు నడిపేవారు. టికెట్లు బస్ స్టాండులోనే తీసుకుని ఎక్కాలి. కండక్టర్ ఉండేవాడు కాదు. నాన్ స్టాప్ గా వేములవాడ చేరేవి. ఆ వారం కరీంనగర్ బస్టాండుతో సహా అనేక ప్రాంతాల్లో బస్ స్టాండుల స్థితి ఇట్లాగే వుండేది. క్రిక్కిరిసిన జనంతో ఆ ప్రాంతమంతా కిట కిట లాడేది. ఇక వేములవాడలోనయితే అందరి ఇళ్ళల్లో జాతర వాతావరణం వెళ్లి విరియాల్సిందే. చుట్టాలూ, స్నేహితుల రాకతో ఇండ్లన్నీ నిండుకుండలే. మా అమ్మమ్మ ఇల్లు కూడా పెద్దమ్మలు చిన్నమ్మలూ వారి శ్రీవార్లూ, మిత్రులతో కళ కళ లాడేది. అనేక సంవత్సరాలు నా మిత్రులు దామోదర్, వెంకటేష్లు కూడా జాతరకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వచ్చే వాళ్ళు. ఇల్లంతా సందడి సందడి. అక్కడి మిత్రుల విషయానికి వస్తే మంగారి రాజెందర్, మంగారి శివప్రసాద్, పి.ఎస్.రవీంద్ర, బాపురెడ్డి, ఎడ్ల రాజేందర్, ఎడ్ల రవి, రఫీక్, యుగేందర్ రావు తొలి రోజల్లో వుండేవాళ్ళు తర్వాత సాంబశివుడు,రమేష్ చంద్ర, పి.రమేష్, కే.రాజేందర్, వజ్జల శివకుమార్ ఇట్లా అనేక మంది కలిసారు.
జాతరలో ఎన్నో విశేషమయిన అంశాలు. నా మట్టుకు నేనయితే సర్కస్ చూడడం అక్కడే మొదలు. జోకర్లను చూసి అరవడం జంతువులను చూసి బెదరడం ఇంకా గుర్తే. అంతే కాదు జైంట్ వీల్, ఎయిర్ గన్ తో బెలూన్లని కాల్చడం, రింగులు వేసి సబ్బు పెట్టెలు ప్లాస్టిక్ డబ్బాలు గెల్చుకోవడం జాతర్లోనే. మరో వైపు బుంగలు అని పిలిచే బెలూన్లను, లైలప్పలు అమ్మే వాళ్ళు, పుంగీలు అమ్మే వాళ్ళు, ఆడవాళ్ళ కాలి మట్టెలు, కుంకుమ బుక్క గులాలు అమ్మేవాళ్ళు ఒకటేమిటి సామాన్య జీవుల సమస్త వస్తువుల అమ్మకాలకు జాతర పెద్ద వేదిక. మిఠాయీల విషయానికి వస్తే చిలుకలు, బత్తీసలు, బెండ్లు, శక్కరి పుట్నాలు అనేక రకాలు అందంగా పేర్చి అమ్మకానికి పెట్టె వాళ్ళు.
మా చిన్నప్పుడు ఫోటోల విషయానికి వస్తే జాతరలో తాత్కాలిక స్టూడియోలు వేలిసేవి. అరగంటలో ‘కాపీ’ అనే వాళ్ళు. వీటికి తోడు వేములవాడలో అప్పుడు మూడు ప్రధాన ఫోటో స్టూడియోలు ఉండేవి. రాజ్ స్టూడియో, బాబా స్టూడియో, వాణీ స్టూడియో. రాజ్ ఫోటో స్టూడియో అధినేత వెంగయ్య మాకు అత్యంత ఆత్మీయుడయిన స్నేహితుడు. జాతరా అప్పుడు తప్ప వెంగయ్యతో కలిసి అంతా రాజు ఉడిపి హోటల్లోనో, నటరాజ్ హోటల్లోనో టీ తాగడం అందరికీ అలవాటు. జాతర అప్పుడు “జాతరా టీ ” అనే వాళ్ళు. నీళ్ళ పాలతో చేసిన టీ రుచీ సుచీ వుండేది కాదు. పాపం యాత్రికులకు మాత్రం అది తప్పేది కాదు.
ఇక జాతరకు వచ్చే వాళ్ళను తమ తమ ఇండ్లల్లో దింపుకుని గుండంలో స్నానాలూ, దేవదర్శనాలు చేయించే బ్రాహ్మలు ఒక వైపు, మరో వైపు ఎవరికీ వాళ్ళు జాతరకొచ్చి చెరువు కట్టమీదో, జాతర గ్రౌండులో ఇక్కడ అక్కడ అనేమిటి ఎక్కడ చూసినా జనమే. దేవుని గుండంలో స్నానాలు చేసి తడి బట్టలతో క్యూలో నిలబడి దైవదర్శనం చేసుకుని వసతి దొరకకుంటే ఎక్కడ చోటు దొరికితే అక్కడ పరదాలు కట్టుకుని దీపాలు పెట్ట్టుకుని రాత్రంతా జాగారం చేయడం అక్కడ ఆనవాయితీ. తర్వాతి రోజు జరిగే పోచమ్మ బోనాలు తప్పకుండా చూడాల్సిన వేడుక. పోచమ్మకు ‘శాఖ’ పోసి కాగితపు ఉయ్యాలలు కట్టి పెద్ద డప్పుల మోతతో చేసే నృత్యాలు పెద్ద ఊపు.
ఇక మరో వైపు జాతర కొచ్చిన వాళ్ళు పిల్లలకు ఎదో ఒకటి కొనిపెట్టడం పిల్లల కోర్కెలు తీర్చడం మామూలే. ఆ విషయంలో జాతర వ్యాపారులు అడ్డీకి పావుసేరు( అంతులేని ధరలకు) అమ్మేవాళ్ళు. ఎవరయినా యాత్రికులు బేరం చేస్తే ఎన్నడయినా కొన్న ముఖమేనా… జాతర కొచ్చి తక్కువకు అడుగుతావు అని కూడా గద్దించే వాళ్ళు. అమాయక పల్లె ప్రజలు జాతర వ్యవహారాల్లో మోసపోవడం అక్కడ చాలా మామూలయిన విషయం. విశ్వాసంతో వచ్చే యాత్రికుల్ని ఆర్థికంగా మోసం చేయడం దాదాపు అన్ని జాతరలలో మామూలే. జాతరలో పాల్గొనడం అంటే దైవభక్తి తో మొక్కులు తీర్చుకోవడం, జాగారం(జాగరణ) చేయడం ఒక ఎత్తయితే, మరో వైపు పెద్ద ఎత్తున జనం చేరిన చోట జరిగే అవలక్షణాలూ జాతరల్లో సాధారణమే. జాతర చూడ్డానికి వచ్చిన వాళ్ళు, సరదా రాయుల్లూ అక్రమార్కులూ, సెక్స్ మార్కులూ అనేక మంది కనిపించేవాళ్ళు. అంతా వూర్లోనూ, జాతర గ్రౌండులోనూ గుంపులుగా తిరగడమే. ఆడా మగా వందలాది మంది ఒకర్ని ఒకరు తోసుకు వెళ్ళడమే. అందులో వయసులో వున్న పోరగాల్లు అమ్మాయిల్ని గుంపులో గోవిందా అన్నట్టు తోయడం ఎక్కడెక్కడో తడమడం, నానా రబస గొడవ. మగవాళ్ళే కాదు అలాంటి అమ్మాయిలూ వుండేవాళ్ళు. జాతర అంటే ఇంకేమి వుంటుంది భై అనే వాళ్ళూ కనిపించే వాళ్ళు. ఆ పోకిరీ గాళ్ళను ఓ కన్నేసి చూసే పోలీసు మరో వైపు.
అట్లా మొత్తం మీద జాతర అంటే ఒక సామూహిక సంబరం. స్వామి కార్యాలూ స్వ కార్యాలూ అన్నిటికీ అనుకూలమయిన మహా సంఘమస్థలి అది.
అట్లా వేములవాడ జాతర ఇంకా ఎన్నో అనుభావాల్ని జ్ఞాపకాల్ని మిగిల్చింది.
***
ఇక ‘పిక్నక్’ ల విషయానికి వస్తే వేములవాడ దోస్తులం వెళ్ళిన నాలుగు పిక్నిక్ లు మదిలో నిలిచిపోయాయి.
“బాసర యాత్ర’ : వేముల వాడ నుండి ఆదిలాబాద్ జిల్లా బాసరకు వెళ్ళడం ఒక అనుభూతి. సరస్వతీ ఆలయ కేంద్రమయిన అక్కడికి వేములవాడ నుండి గునక్క, రాజేందర్, శివ ప్రసాద్, ఎడ్ల రవి ఎడ్ల రాజేందర్ పి.ఎస్.రవీంద్ర తదితరులం కామారేడ్డి దాకా బస్సులోనూ తర్వాత రైల్లోనూ ప్రయాణం. కొందరికి టికెట్ తీసుకుని కొందరికి లేకా వెళ్తున్నాం. మధ్యలో టీ సి వచ్చాడు. అప్పటికి అంతా బాగానే వుంది. బెర్త్ పై నుంచి రవి దాబల్న కిందికి దూకాడు. దాంతో టీ సీ పట్టుకుని పెద్ద వాడేనని ఫైన్ తో కలిపి డబ్బు వసూలు చేసాడు. గునక్క రవిని తిట్టన తిట్లు ఇప్పటికీ జ్ఞాపకమే.
అగ్రహారం: వేములవాడ పక్కనే వున్న అగ్రహారంలో ఒక రోజంతా పిక్నిక్ చేయడం ఒక సారి జరిగంది. పి.రమేష్ కు మెడిసిన్ లో సీట్ వచ్చిన సందర్బమది. ఆలయం వెనకాల ఆటా పాట.
ఎలగందుల: మా టీం లోకి వెంగయ్య, బాపురెడ్డి చేరారు. మొట్టమొదటిసారిగా 1905కి ముందు జిల్లా కేంద్రంగా వున్న ఎలగందుల ఖిలా ఎక్కడం, కొండ దోమినార్ అంతా మజా మజా.
హైదరాబాద్: అప్పటికి చిన్న వాళ్ళమే హైదరాబాద్కు వెళ్లాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, గండిపేట్ చెరువు ఇట్లా అనేక ప్రాంతాల పిక్నిక్ అది. ఆ టీంలో రాఘవేందర్ రెడ్డి కూడా వున్నాడు.
ఇట్లా ఈ పికినిక్ లను గుర్తు చేసుకోవడంలో ఒక సంతోషం వుంది. చిన్ననాటి మిత్రులతో గడిపిన రోజుల్ని నెమరు వేసుకోవడంలో ఎంతో ఆనందం వుంది. అంతే కాదు మా తరం కలిసికట్టుగా ఒక టీంగా గడిపిన సమయాన్ని ఇప్పటి తరానికి తెలియచేయడం బాధ్యత అనుకున్నాను. సెల్ ఫోన్ చాటింగ్ లో కంటే షేక్ హాండ్ ఇచ్చి బుజాల మీద చెయ్యేసి తిరిగిన అనుభావాలు ఎంతో మధురమయినవని చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇవాల్టి తరంలో సమిష్టి తనం కొరవడుతున్న స్థితి బాధనిప్పిస్తున్నది. కలిసి వుండడంలోని ఆనందం వారికి తెలియజేయాలన్నలక్ష్యం కూడా ఇందులో ఇమిడి వుంది.
***
మనిషి బతుకు దారిలో ఎత్తు పల్లాలూ, తిన్నని దారులూ, మలుపులూ మూల మలుపులూ అత్యంత సహజం. అన్నింటినీ దాటుకుంటూ పడుతూ లేస్తూ సాగే ప్రయాణంలో గెలుపోటముల ఉద్విగ్నత ఉన్నప్పటికీ బతికామనే భావన వుంటుంది. BORN WITH SILVER SPOON లో మజా ఏముంటుంది.
అందరిలాగే నా జీవితపు గతుకుల రోడ్డులోనూ అనేక మలుపులున్నాయి. అందులో 1974 ప్రధాన మూల మలుపు. అప్పటిదాక వున్న మిఠాయి దుకాణపు ఇంట్లోనూ,చదువులో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ కాలేజీలో చేరడమూ రెండూ పెద్ద కుదుపులే.
మా నాన్న పుట్టిందీ పెరిగిందీ ఆయన పెళ్ళీ, పిల్లలూ, అప్పటిదాకా గడిపిన జీవితం అంతా మిఠాయి దుకాణపు ఇంట్లోనే. ఆయనెప్పుడూ అది తన ఇల్లు కాకుండా పోతుందని తాను పరాయి వాడిని అవుతానని ఊహించను కూడా లేదు. నేను కూడా పుట్టిందీ ఇంటర్ దాకా సాగిందీ అక్కడే. ప్రేమలూ అవమానాలూ అనుభవించిందీ ఆ ఇంట్లోనే. మా పెద్ద నానమ్మ ఆ ఇంటి మూలస్థంభం మిఠాయి సత్యమ్మ మరణం తర్వాత అక్కడ అనేక కొత్త పరిణామాలు జరగడం మొదలెట్టాయి. మా పెద్దనాన్న ఒకరు నాన్నను మమ్మల్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తిట్టడం మొదలెట్టాడు. మా నాన్నను ఎప్పుడో చిన్నప్పడు వేములవాడ వాళ్ళ చిన్నాయన స్వామి పెంపకం తీసుకున్నాడని ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఆయన వాదన. విపరీతంగా తాగి అంతకు మించి విపరీతంగా గొడవ చేసాడు. మాటల్ని తిట్లనీ ఇక భరించరాని స్థితిలో మా అమ్మనూ అయిదుగురు పిల్లల్నీ తీసుకుని నాన్న మిఠాయి దుకాణపు ఇల్లు ఖాళీ చేసాడు. దశాబ్దాల పాటు అల్లుకున్న గూడును వదిలేసి పెట్టె బేడా సర్దుకుని వెళ్ళడంలో ఆయన పడ్డ వేదన నేనెరుగుదును. శ్రీనివాస్ జీపులోనూ రిక్షాలోనూ సామానంతా సర్ది ఆగస్ట్ 1974లో మంకమ్మ తోటలోని ఓ మూల నున్న ఇంట్లోకి కిరాయికి మారిపోయాం. ఇంటి ఓనర్ సాయన్న కుటుంబం మమ్మల్ని సాదరంగా ఆహ్వానించింది. మెయిన్ రోడ్డు మీద ఇంద్రభవన్ ముందు ఓ సలూన్ షాప్ వాళ్ళది.
ప్రతి రోజూ బావి లోంచి నీళ్ళు తోడుకుంటూ సాయన్న పాడే ‘నాస్తిక్’ సినిమాలో పాట “ దేఖ్ తేరి సంసార్ కి హాలత్ క్యా హోగయి భగవాన్…. కిత్నా బాదల్ గయా ఇన్సాన్’ నా కిప్పటికీ గుర్తే.
***
కిరాయి ఇంట్లోకి మారిం తర్వాత ‘మామూలుగా వెళ్ళమని చెబితే పోయేదానికి తిట్లూ శాపనార్తాలూ అని’ మా అమ్మ పడ్డ బాధ నా కిప్పటికీ యాది కొస్తే కోపం తారస్థాయికి చేరుతుంది. అప్పటి నుంచి తీవ్రమయిన కోపంతో నేను 10-15 సంవత్సరాల పాటు మిఠాయి దుకాణము కాదు కదా క్లాక్ టవర్ చుట్టూ తిరిగాను కాని తూర్పు వైపు దారి కూడా తొక్కలేదు.
మంకమ్మ తోటలో మూడు గదుల కొత్త ఇల్లు. ముందు రెండు గదులు నడుమ ఖాళీ స్థలం తర్వాత వంటిల్లు. వంటింట్లో ఫ్లోరింగ్ లేక అలుక్కోవడం. బావి నుంచి నీళ్ళు తోడుకొని రావడం అంతా కొత్త అనుభవం.. నౌకర్లూ చాకర్లూ వున్న పెద్ద ఇంట్లోంచి వచ్చిన అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. మేము అయిదుగురం పిల్లలం, చదువు కోవడానికి అక్క దగ్గరికి వచ్చిన మా మేనమామ మంగారి రాజేందర్ అమ్మా నాన్న అందరమూ ఆ చిన్న ఇంట్లోనే.. ఎట్లా సర్డుకున్నామో ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మా అమ్మకు తన పిల్లలకంటే తమ్ముడి మీదే ప్రేమ ఎక్కువగా వుండేది. వసతి ఆహార పానీయాల విషయంలో మొగ్గు ఎక్కువగా వుండేది. తర్వాత కొద్ది రోజులే అయినా మా పెద్ద మేనమామ కొడుకు శివ ప్రసాద్ కూడా అమ్మ దగ్గరే వుండి చదువు కున్నాడు. ఇక తర్వాతి కాలంలో మా కిష్టాపూర్ సుమిత్ర పెద్దమ్మ కొడుకు నోముల రాజ్ కుమార్ ఆతని చెల్లెలు రాజ్యలక్ష్మి కూడా తమ తమ చదువుల్ని మా అమ్మ దగ్గరే వుండి పూర్తి చేసుకున్నారు. అందరినీ మా అమ్మ ‘అమ్మ’ లాగే చూస్కుంది. పెద్దమ్మ ఇంటి నుంచి బియ్యమో పప్పులో, వడియాలో వచ్చేవి.
***
కుటుంబ వాతావరణంలో మలుపులు ఇట్లా వుంటే చదువు విషయంలో మరో మలుపు డిగ్రీలో చేరడం. ఇంటర్ చదువు ఖార్ఖాన గడ్డ కాలేజీలో పూర్తి అయింది. దాదాపు అంతా పాసయ్యాం రకరకాల క్లాసుల్లో నాకు సెకండ్ క్లాస్ వచ్చింది. నెక్స్ట్ అందరి దృష్టీ మెడిసిన్ పైనే. అప్పటికి డి.బోస్ గైడ్ ఒక్కటే దిక్కు. దామోదర్ నేనూ వెంకట్, రాధాకృష్ణ అందరమూ దరఖాస్తు చేసాం. నాకు 16 ఏళ్ళు పూర్తిగా నిండలేదని వయసు సరిపోదని రిజెక్ట్ చేసారు. డీలా పడిపోయాను. తర్వాత ఎవరో మహానుభావుడు కోర్టును ఆశ్రయిస్తే పరీక్ష చివరి క్షణాల్లో కోర్టు అనుమతినిచ్చింది. ఏముంది ఆఘమేఘాల మీద హైదరాబాద్ వెళ్లి అప్పటికే ఈసామియాబాజార్ లో ‘రాతిభవన్’లో టిఖానా ఉంటున్న వేములవాడ మిత్రులు ఎడ్ల రాజేందర్ రవి ల గదికి వెళ్లి మర్నాడు పరీక్షకు వెళ్లాను. కోటీలో కిషోర్ కేఫ్ లో చాయ్ తాగి చాంతాడు పొడవున్న లైన్ లో నిలబడి పరీక్ష రాసాను. గొప్పగా కాదు గాని బాగానే రాసాను అనిపించింది. కానీ ఫలితం చూస్తె ప్రభుత్వ కాలేజీలో అంటే ఒస్మానియా, గాంధిలలో సీటు రాలేదు. మాలో ఒక్క రాధాకృష్ణ మాత్రం సాధించాడు. వరంగల్ లో వున్నా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. కానీ అప్పుడు ఏడు వేల అయిదువందలు డొనేషన్ కట్టాలి. ఆర్ధిక స్థితి అంత లేదు. వేములవాడ మేనమామ డాక్టర్ రఘుపతి రావు కడదామని ముందుకు వచ్చాడు. అప్పుగా నయినా సరే నన్నాడు కానీ నాన్న అంగీకరించలేదు. మళ్ళీ ఏడూ రాస్తాడు మెరిట్ లో వస్తుందిలే అన్నాడు. దాంతో మెడిసిన్ తప్పి పోయింది. తర్వాతఏడు రాసినా రాలేదు. ఎస్.ఆర్ ఆర్. లో డిగ్రీ లో సెటిల్ అయిపోయాను.
ఎస్.ఆర్ ఆర్. డిగ్రీ కాలేజీలో చెరేనాటికే కొంత సాహిత్య స్పృహ చదవడం పెరిగింది. అప్పటికి కేవలం వ్యాపార నవలలు,డిటెక్టివ్ నవలలే పరిచయం ఉండేది. కాని క్రమంగా చదివే తీరు మారింది. చదివే పుస్తకాలూ మారాయి. ఆ సమయంలోనే మాతోనే వుండే మా అమ్మ తమ్ముడు మంగారి రాజేందర్ సహచర్యం, వేములవాడ నటరాజ కళానికేతన్ కార్యక్రమాలూ నా సాహిత్య జీవితంపై ప్రభావం చూపసాగాయి. క్రమంగా శ్రీ శ్రీ కవిత్వం, నవలల్లో అల్పజీవి, అసమర్థుడి జీవయాత్ర, చివరకు మిగిలేది, కాలాతీత వ్యక్తులు, అంపశయ్య, చలం సాహిత్యం చదవడం ఒక పెద్ద మలుపు. కాలేజీలోనే ఎకనామిక్స్ విభాగంలో అంపశయ్య నవీన్ లెక్చరర్ గా వుండడం, మాకో ప్రేరణ. ఆయన ఇల్లు కూడా మంకమ్మ తోటలోనే వుండడంతో అప్పుడప్పుడూ ఆయన ఇంటికి వెళ్ళే వాళ్ళం రాజేందర్ అప్పటికి స్వాతి పేరుతో కథలు రాయడం ఆరంభించాడు. దాంతో నవీన్ ఆయన్ని ఏం స్వాతి అని పిలిచేవాడు. నాకున్న స్టామర్ సమస్య వల్ల ఎక్కువ వినడమే తప్ప మాట్లేది తక్కువగా వుండేది. ఇంట్లో సైన్స్ పుస్తకాల తో పాటు సాహిత్యం కూడా కనిపించడం ఆరంభించింది. అయితే నాన్న కానీ అమ్మ కానీ ఎపుడూ అభ్యంతర పెట్టలేదు.
అట్లని డిగ్రీ చదువు మీద అలక్ష్యం కూడా ఎప్పుడూ లేదు. అయితే ఆ కాలంలో డిగ్రీలో ప్రతి ఏటా పరీక్షలు కాకుండా ద్వితీయ సంవత్సరం తర్వాత పార్ట్ 1 అని ఇంగ్లీష్, హిందీ/తెలుగు పరీక్షలు ఉండేవి. తృతీయ సంవత్సరం చివర మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు. దాంతో పారీక్షలు అనే భయమే వుండేది కాదు. ఎస్.ఆర్.ఆర్. కాలేజీ అటు చదువు విషయంలోనే కాదు మిగతా అన్ని సామాజిక సాంస్కృతిక విషయాల్లో నాకో ఐ ఓపెనర్.
అంతకు ముందు మా కాలేజీ ప్రిన్సిపాల్లుగా విశ్వనాధ సత్యనారాయణ, ఐ.వీ.చలపతి రావు లాంటి అనేక మంది గొప్పవాళ్ళు పనిచేసారు. ఇక నేను ఆ కాలేజీలో చేరేనాటికి సాహితీ వేత్తలు శ్రీ వెల్చాల కొండల రావు ప్రిన్సిపాల్గా వున్నారు. తర్వాత కే.వై.ఎల్.నరసింహా రావు వచ్చారు. మంచి వాతావరణం వుండేది.
ఇంటర్ తెలుగులో సరయిన మార్కులు రాలేదని డిగ్రీ తెలుగు మీడియంలో చేరాను. మిగతా ఇంటర్ మిత్రులు అనేక మంది ఇంగ్లిష్ మీడియంలో చేరారు. దామోదర్ హైదరాబాద్ కు వెళ్ళాడు. ఖాజా లాంటి మిత్రులు సైన్స్ వదిలేసి బి.కాం, లో చేరాడు. బి.ఎస్సీ.లో మాది బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులు. సబ్జెక్టులు బోధించే లెక్చరర్లు కూడా బాగా చేప్పేవాళ్ళు.
బాటనీ వరకు వచ్చేసరికి బాగా గుర్తున్న మేడం రఫియా సుల్తానా. చాలా అందంగా చలాకీగా వుండేది. బాగా చెప్పేది. హిందీ పాటలన్నా సినిమాలన్న తనకిష్టం. మనకది కామన్ ఇంటరెస్ట్ కదా అందుకే తను బాగా కనెక్ట్ అయింది. ఒకటి రెండు సార్లు ఆది వారాలలో తన ఇంట్లో మా చెన్న రెడ్డి ప్రసాద్ లాంటి వాళ్ళ గాన కచేరీ వుండేది. ఇక మరొకరు జనార్ధన చారి బ్లాక్ బోర్డ్ పై ఆయన వేసే బొమ్మలు అద్భుతంగా ఉండేవి. పోతే జువాలజీలో ముగ్గురు సార్లు బాగా చెప్పారు. ఒకరు మా క్లాస్మేట్ రవీందర్ వాళ్ళ నాన్న మధుసూదన్ రావు గారు, మరొకరు జోసెఫ్ భాస్కర్, ఇంకొకరు నాంపెల్లి మధుబాబు. మంచి టీచర్ కావడంతో పాటు మంచి స్టేజీ నటుడు. వేములవాడకు చెందిన ఫోటోగ్రాఫర్ కుటుంబం నుంచి వచ్చారాయన. త్యాగారాయ లలిత కళా పరిషత్ తదితర సంస్థలతో ఆయన కరీంనగర్ కళాభారతిలో మంచె సత్యనారాయణ, రంగాచారి తదితరులతో కల్సి ఎన్నో నాటకాలు వేసారాయన.
ఇక కెమిస్ట్రీ విషయానికి వస్తే ఎం.వీ.నరసింగ రావు, జీవీజీ, కృష్ణమోహన్, ఆనందం, ఖురేషీ తదితరులు బాగా చెప్పేవాళ్ళు. ద్వితీయ భాష హిందీలో బంకట్ లాల్ అగర్వాల్ గుర్తున్నారు తర్వాత ఆయన ప్రిన్సిపాల్ కూడా అయ్యారు.
అట్లా ఎస్.ఆర్.ఆర్. కాలేజీ సబ్జెక్టుల విషయంలో ఎంతగా ప్రభావం చూపిందో ఆ ‘కాలం’ సాహిత్య రంగం విషయంలో కూడా అంతే ప్రభావం కలిగించింది…
***
1974 లో ఎస్.ఆర్.ఆర్.కాలేజీ లో డిగ్రీ లో చేరిం తర్వాత చదువులో ఓ స్తబ్దత సృజనలో కొత్త దారులు ఏర్పడ్డాయి. చదువు విషయంలో ఓకే లక్ష్యం ఒక ధ్యేయం లేని కాలమది. ఆ కాలంలో డిగ్రీలో చేరిన తర్వాత రెండేళ్ళకి ‘పార్ట్ వన్’ అని First language ఇంగ్లీషు, Second language తెలుగో హిందీనో ఏదయితే అది రెండో భాషలకు పరీక్షలు ఉండేవి, తర్వాత మూడేళ్ళకి ‘పార్ట్ టూ’ అని అసలు డిగ్రీ ఫైనల్ పరీక్షలు. పార్ట్ 2 లో అన్ని సబ్జేక్టులకూ ఒక్కో దానికి మూడేసి పేపర్ల చొప్పున పరీక్షలు నిర్వహించేవారు. అది ఏమి ప్రయోగమో కానీ డిగ్రీ చదువంటే మూడేళ్ళూ ఆడుతూ పాడుతూ సాగడమే.. పరీక్షల భయం లేదు.. పాస్ ఫెయిల్ లేదు. అంతా బలాదూర్. క్లాసులు ఉండేవి కాని ఒక చాప్టర్ తర్వాత మరొకటి అట్లా ముగుస్తూ ఉండేవి. Assessment or Assignments అనేవే లేవు . కనీసం వెనక్కి చూడకుండా చదువులు కాలం కూడా సాగి పోయేవి. నా లాంటి వాడికి మెడికల్ కల ముగిసిన తర్వాత మరింత ఉదాసీనత అలుముకునేది. నా మట్టుకు నాకయితే తెలుగు మీడియంలో బీఎస్సీ కావడంతో ‘ అకసేరుకాలు ’, ‘ సకశేరుకాలు ’, కర్బన రసాయన శాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రం లాంటి మాటలతో ఏమీ తోచేది కాదు. మీది తెలుగు మీడియం తప్పదు తెలుగులోనే రాయాల్సి వుంటుంది అనేవాళ్ళు సార్లు. మూడేళ్ళ తర్వాత పరీక్షల నాటికి చూద్దాం అన్నట్టు సాగేది చదువు. జువాలజీ లాబ్ లో ‘స్కొలియోడాన్’, కెమిస్ట్రీ లాబ్ లో అమ్మోనియా కంపు చిత్రంగా వుండేది. అయినా ఎప్పుడూ క్లాసులు ఎగ్గొట్టడం కానీ నిర్లక్ష్యంగా కానీ లేక పోవడంతో అన్ని అకాడెమిక్ పరీక్షల్లో ఎక్సెలెంట్ ఫలితాలు కాకున్నా ఫెయిల్ అన్నది లేదు.. కొంత మెరుగయిన ఫలితాలే వచ్చాయి. అట్లా జరగడానికి ప్రధాన కారణం నా చేతి రాత మాటలాగే బాగా లేకపోవడం. మరో కారణం వృక్ష, జంతు శాస్త్రాల్లో బొమ్మలు సరిగ్గా వేయలేక పోవడం. చిన్నప్పుడు నాన్న నా చేతి రాత పై చాల దృష్టి పెట్టారు. చూచి రాతలు రాయించారు. తెలుగుకు రెండు లైన్ల కాపీలూ, ఇంగ్లీషుకు నాలుగు లైన్ల కాపీలు తెచ్చి రాయించే వారు. రాయక పోతే చేతి మట్టలు పగులగొట్టారు. సున్నా చుట్టడడం, సరళ రేఖ గీయడం చేయరా రాత మెరుగవుతుందని చెప్పీ చెప్పీ విసుగొచ్చి వదిలేసాడు. దాని ఫలితమే వంకర రాత. ఆలోచనలు, సబ్జెక్ట్ లు సరిగ్గానే వున్నా ఆకట్టుకునే చేతి రాత లేకపోవడం పెద్ద ఆటంకమే అయింది, మా మిత్రుడు దామోదర్ రాతా అంతంత మాత్రంగానే ఉండేది. ‘ఆ ఏముంది భయి చాలా మంది డాక్టర్ల రాతే బాగుండదు.. వాళ్ళు పెళ్ళానికి ఉత్తరం రాస్తే మెడికల్ షాప్ కెళ్ళి చదివించు కోవాలని’ జోకులు వేసేవాడు. మా వెంకటేష్ గాడి రాత చాలా అందంగా వుండేది. స్కూలు కాలం నుంచి నోట్స్ రికార్డ్స్ కూడా బాగా రాసేవాడు. కాని ఏమి లాభం వార్షిక పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చేవి. స్కూల్లో తెలుగు సార్ అనేవాడు.. “చేతి రాత దేముందిరా తల రాత బాగుండాలి అని”.
ఇక బొమ్మల విషయానికి వస్తే రికార్డ్స్ లో వెంకటేష్ డ్రాయింగ్స్ బాగా వేసేవాడు. మనమే అంతంత మాత్రం. ఒక్కోసారి రెండు వైపులా పుస్తకాలు పెట్టి అడ్డంగా అమర్చి వెంకట్ గాడి రికార్డ్ షీట్స్ కాపీ కొట్టిన సందర్భం కూడా వుంది. ఏమిటో హై స్కూల్ సైన్సు నుండి డిగ్రీ సైన్సు దాకా అట్లా గడిచింది. గుండ్రటి అక్షరాలూ అందమయిన డ్రాయింగ్స్ లేకుండానే Graduation ఘనంగా ముగిసింది.
***
స్కూలు కాలం నుంచి సిలబస్ చదువులే కాకుండా కథలకు చందమామ, బాలమిత్ర లు, కొంచెం పెద్దయ్యాక డిటేక్టివ్ నవలలకు క్లాక్ టవర్ దగ్గరలో వున్న శ్రీ కృష్ణ బుక్ స్టాల్ మీద ఆధార పడేవాళ్ళం. రొజువారీ కిరాయకు (రెంట్)కు ఇచ్చేవారు. ఇక దిన పత్రికలు స్కూలు దాటే వరకు అంతగా పరిచయం లేదు. ఎందుకంటే కరీంనగర్ కు దిన పత్రికలు రోజూ ఏ పగటీలికో వచ్చేవి. విజయవాడ నుంచి రైలులో వరంగల్ కు చేరి బస్సులో మా వూరుకు వచ్చేసరికి మధ్యాహ్నం దాటేది. ఇక 1972లో మా పదవ తరగతి పరీక్షల ఫలితాలు ప్రకటించిన రోజు బస్ స్టాండులో ఉదయం నుంచి వేచి వున్న రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది. ఓ పక్క ఫలితం ఏమవుతుందో నన్న భయం మరో పక్క పేపర్ ఆలస్యం గొప్ప ఉత్కంఠ. ఆ రోజుల్లో కరీంనగర్ లో ఇద్దరు పేపర్ ఏజెంట్లు వుండే వాళ్ళు. ఒకరు MOIZ గా ప్రసిద్దుడయిన మొయినొద్దిన్ కాగా రెండవ వారు అనంతస్వామి. మోయిజ్ కు బస్ స్టాండ్ లో బుక్ స్టాల్ వుండడంతో పాటు దాదాపు అన్ని తెలుగు దిన వార పత్రికలకు, మాస పత్రికలకు ఆయనే ఏజెంట్ కావడంతో పత్రికలు చదవాలనుకునే వాళ్లకు ఆయనే దిక్కు. అంతే కాకుండా ఆయన ఆజన్మాంతం ‘సియాసత్’ ఉర్దూ పత్రికకు విలేఖరిగా వున్నాడు. ఇక అనంత స్వామి హిందూ ఆంగ్ల పత్రికకు ఏజెంట్ కం రిపోర్టర్ గా పనిచేసారు. కరీంనగర్ బస్ స్టాండ్ ఇప్పుడు ప్రతిమ మల్టిప్లెక్స్ వున్న జాగాలో వుండేది. ఒక క్లాసికల్ స్థాయిలో రౌండ్ గా అందంగా ఆకర్షనీయంగా కనిపించేది. అందులో ఒక స్టాల్ మోయిజ్ ది. దాని ముందు మా టెంత్ ఇంటర్ పరీక్షా ఫలితాల కోసం చూసిన ఎదురుచూపులు ఇంకా నా మదిలో ఫ్రెష్ గానే వున్నాయి. ముఖ్యంగా మొయిజ్ కోపంగా కేర్ లెస్ గా మాట్లాడేవాడు. ఆయనది పత్రికల వ్యాపారంలో మొనోపలీ కనుక పత్రికల్ని ముట్టనిచ్చే వాడు కాదు. జావో జావో అంటూ ఉండేవాడు. కొనడానికి తప్ప చూడ్డానికి ఆ బుక్ స్టాల్ కి వెళ్ళే వాళ్ళం కాదు.(తర్వాత ఆయనతో నాకు మంచి స్నేహం కుదిరిందనుకోండి.. అది మరో సారి). అట్లా దిన పత్రికలతో మా అనుబంధం సాగేది. డిగ్రీలో చేరింతర్వాత మార్కెట్ లో వున్న జిల్లా గ్రంధాలయానికి వెళ్ళడం మొదలయ్యింది. అక్కడే పత్రికలు చూడడంతో పాటు కార్వాన్, బ్లిట్జ్, Illustrated weekly లాంటి పత్రికల పరిచయం ఏర్పడింది. ఇక కాలేజీ లైబ్రరీ లో అంత సీన్ వుండేది కాదు. విద్యార్థులు అధికంగా వుండడంతో వసతి అంతంత మాత్రమె. సో అప్పుడు మాకు జిల్లా గ్రంధాలయమే దిక్కు. కొంచెం రద్దీగా వున్నా అక్కడే దాదాపు అన్ని పత్రికల పరిచయం అయింది. ఆ పరిచయమే నన్ను రచయితను చేసిందేమోననిపిస్తుంది.
***
ఎస్.ఆర్.ఆర్. లో చదువుతూ ఉండగానే అంటే 1974లోనే హైదరాబాద్ నుండి ‘ఈనాడు’ దిన పత్రిక ప్రారంభమయింది. దాంతో కరీంనగర్ లో దినపత్రికల దృశ్యమే మారి పోయింది. ఉదయాన్నే వచ్చేది. బిన్నమయిన శీర్షికలతో బాగా ఆకట్టుకుంది. ఇక నా జీవితంలో మొట్టమొదటిసారి రచనకు పారితోషికం అందుకుంది ఈనాడు నుంచే. అప్పుడు ఈనాడు లో ‘గొప్ప అత్యల్ప విషయాలు’ అనే శీర్షిక నిర్వహించేవారు. అది చూసి నేను నాకు కార్వాన్ లాంటి పత్రికల పరిచయంతో కొన్ని అత్యల్పంగా కనిపించే గొప్ప విషయాల లిస్టు రాసి పంపాను. రెండు వారాల్లో ప్రచురించారు. ఈనాడు లో ‘వారాల ఆనంద్’ అన్న పేరు చూసుకోవడం మజానే కాదు అదో పెద్ద థ్రిల్. అంతే కాదు వెంటనే అమౌంట్ సరిగ్గా గుర్హ్టు లేదు కాని పదో ఇరవయ్యో మనీ ఆర్డర్ పంపారు. ఆనాడు నా సంతోషానికి అవధుల్లేవు. అట్లా పత్రికలు-నా రచనలు ఆరంభమయ్యాయి.
***
దాదాపుగా అదే సమయంలో నా సృజనాత్మక రచనలు కూడా మొదలయ్యాయి. నేను మొట్టమొదట రాసింది ఓ చిన్న కాలం కథ. అది కథనొ గల్పికనో తెలీదు. కాని నేను రాసిన దాన్ని కరీంనగర్ నుంచి అప్పుడు వెలువడిన ‘చిత్రిక’ వార పత్రికలో వేసారు. కథ పేరు ‘ఆమె’ అని జ్ఞాపకం. ఒక యువకుడు కరీంనగర్ లోని మంకమ్మ తోట నుంచినడుస్తూ బయలుదేరతాడు. ముందు ఒక అందమయిన అమ్మాయి వెళ్తూ వుంటుంది. ఆ అమ్మాయిని చూసిన ఆనందంలో ఆ అబ్బాయి మనసులో ‘పగలే వెన్నెలా జగమే ఊయల’ పాట గన్ గునాయిస్తూ ఉంటాడు… అట్లా నడక సాగీ సాగీ కరీంనగర్ బస్ స్టాండ్ దాటుతుంది. ఆ అమ్మాయి వెనక్కి ఒక్క సారి చూసి ఆ పక్క సందులోకి మరలుతుంది. అప్పుడు తోస్తుంది ఆ అబ్బాయికి ఆ సందు వేశ్యా గృహాలు ఉండేది. అబ్బాయి హతాశుడవుతాడు మనస్సు చివుక్కు మంటుంది. ఇట్లా సాగుతుందా కథ. దాన్ని చిత్రిక సంపాదకుడు శ్రీ పురాణం రామచంద్ర బాగా ప్రెజెంట్ చేసారు. అంతే కాదు నన్ను పిలిచి బాగా ప్రోత్సహించారు. కథలు రాస్తూ వుండు. మంచి కథన లక్షణం వుంది నీ రాతలో అన్నాడు. పొంగిపోయాను. అప్పుడప్పుడూ శాస్త్రీ రోడ్డులో వున్న చిత్రిక ఆఫీసుకు వెళ్ళడం ఆరంభించాను. పత్రిక కూర్పు ప్రింటింగ్ తదితరాలతో అప్పుడే నాకు పరిచయం కలిగింది. తర్వాత ఏవో కొన్ని కథలు రాసాను తప్ప ఎందుకో కథల మీదే దృష్టి పెట్టి కృషిచేస్తే ఎట్లా ఉండేదో అని ఇవ్వాళ అనిపిస్తుంది. అట్లా నాలో మొట్టమొదటి సారి కథకుణ్ణి గుర్తించిన పురాణం రామచంద్ర ఒక చేత కవిత్వాన్నీ మరో చేత జర్నలిజాన్నీ పట్టుకుని సమాజాన్ని భిన్న కోణాల్లోంచి పరికించి రచనలు చేసిన వాడు. ఆయన 1974 లోనే ’27 వసంతాలు’ కవితా సంపుటిని వెలువరించారు. “ఎదలోని చీకటిని/ చిదిమి వేయాలి/ మానవతా దీపాలు/ మదిని నిలవాలి అంటూ వెలుగుని చైతన్యాన్ని నింపిన వాడాయన. పాత్రికేయుల్లో పురాణం గా ప్రసిద్దులయిన ఆయన 1945 మే 28 న వేములవాడలో ఆర్థికంగా మంచి స్థితి వంతమయిన కుటుంబంలో జన్మించారు. పై చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళిన పురాణంకు కాలేజీ పత్రిక ‘సంధ్య’ కు సంపాదకత్వం వహించే అవకాశం రావడంతో జర్నలిజం వైపు ఆయన దృష్టి మరలింది. తర్వాత ‘ఆంద్ర జనత’ లో జర్నలిస్టు గా తన కారీర్ ఆరంభించారు. వేటూరి సుందర రామమూర్తి సంపాదకుడిగా వున్న కాలంలోనే పురాణంగారికి పత్రిక అన్ని విభాగాల్ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. 1968లో పురాణం రామ చంద్ర ‘ప్రతిధ్వని’ పక్ష పత్రికను ప్రారంభించారు. తర్వాత కరీంనగర్ ఈనాడుకు జిల్లా విలేఖరిగా కూడా పనిచేసారు. 1974 తర్వాత ఆయన ‘చిత్రిక’ వార పత్రికను ఆరంభించి జిల్లా కేంద్రంలో విలక్షణ జర్నలిస్టుగా పేరు గాంచారు. ఉన్నత ఆశయాలతో ఉత్తమ రచనా శైలితో జర్నలిస్టుల్లో మాడల్ గా నిలిచారు.
అట్లా నా రచనా యాత్ర చిత్రికతో మొదలయ్యింది. పురాణం రామచంద్ర ఇవ్వాళ లేక పోయినా ఆయన కృషి స్మరణీయమయింది. ఆయనకు నా హృదయ పూర్వక నివాళి.
*****
(సశేషం)
వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా సభ్యుడిగా వున్నారు.
రచనలు-
లయ (కవిత్వం), మానేరు తీరం (కవిత్వం), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మనిషి లోపల (కవిత్వం), మెరుపు ( సాహిత్య కారుల ఇంటర్వూలు), అక్షరాల చెలిమె (కవిత్వం), ఆకుపచ్చ కవితలు (గుల్జార్ కవిత్వానువాదం), ముక్తకాలు(చిన్న కవితలు)
అర్థవంతమయిన ‘సినిమా’ల పై పుస్తకాలు- నవ్య చిత్ర వైతాళికులు,
బాలల చిత్రాలు, సినీ సుమాలు , 24 ఫ్రేమ్స్, బంగారు తెలంగాణాలో చలన చిత్రం,
తెలంగాణ సినిమా దశ దిశ, Signature of Love(poetry), Children’s Cinema, Documentary films made-
తెలంగాణా సాహితీ మూర్తులు: ముద్దసాని రాంరెడ్డి, యాది సదాశివ,
శివపార్వతులు, Long Battle with short messages,
A Ray of Hope, KAFISO a saga of film lovers.