విజ్ఞానశాస్త్రంలో వనితలు-2
జీవశాస్త్ర పథంలో సాహసి- మరియా సిబిల్లామెరియన్ (1647-1717)
– బ్రిస్బేన్ శారద
మనిషికి జిజ్ఞాస ఎక్కువ. చుట్టూ వున్న ప్రపంచాన్ని తెలుసుకోవాలనీ, అర్థం చేసుకోవాలనీ, వీలైతే తన అధీనంలోకి తెచ్చుకోవాలన్న ఆశలు మనిషిని ప్రపంచాన్ని వీలైనంత దగ్గరగా చూడమని ప్రేరేపిస్తూ వుంటాయి. ఆ మాట కొస్తే, చూడగలిగే ప్రపంచాన్నే కాదు, కంటికి కనిపించని పరమాణు రూపాన్నీ, ఖగోళ రాసుల్నీ కూడా తెలుసుకోవాలని నిరంతరమూ ప్రయత్నిస్తూనే వుంటుంది మానవ మేధస్సు.
అలాటి ఒక శాస్త్రమే జీవ శాస్త్రం (Life Sciences). ఆధునికమైన లేబొరేటరీలూ, ఫోటొగ్రఫీ వసతులూ లేని రోజుల్లోనే జీవ శాస్త్రం ఎన్నో కొత్త విషయాలను కనుక్కొని ప్రపంచానికందించింది.
జీవ శాస్త్రంలో ఎన్నెన్నో విభాగాలున్నాయి. మానవ శరీర నిర్మాణమే కాక, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం ఇలా, ప్రాణమున్నదాని అధ్యయనం ఏదైనా, జీవశాస్త్రంలోకే వస్తుంది. మన కంటికి కనిపించేవీ, కనిపించనివీ క్రిమి కీటకాల జన్మ, జీవిత రహస్యాలని వెలికి తెచ్చే శాస్త్రానికి ఎంటొమొలోజీ (Entomology)అని పేరు. సహజంగా ఇది కూడ జీవ శాస్త్రంలోని ఒక విభాగం.
పురుగుల గురించీ, క్రిమి కీటకాల గురించీ తెలుసుకొని, పెద్ద చేసేదేముంది, అనిపించొచ్చు. కానీ, సృష్టిలో ప్రతీదీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి వున్నవే. ఏదీ విడిగా లేదు. పురుగుల జీవ రహస్యాలు ప్రకృతినీ, తద్వారా మిగతా జీవ రాశుల జీవితాల్నీ ప్రభావితం చేస్తాయి. ఎంటొమొలొజీలో సాధారణంగా పురుగుల వర్గీకరణ, జీవిత చక్రాలూ, పర్యావరణ పై వాటి ప్రభావాలూ అధ్యయనం చేస్తారు. ఈ శాస్త్ర పరిశోధన దాదాపు క్రీస్తు పూర్వం 23 వ శతాబ్దంలో మొదలై వుండొచ్చని అంచనా. ముందుగా ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు రైతులట. అయితే శాస్త్రీయ పధ్ధతుల్లో ఎంటెమోలొజీ అధ్యయనం మాత్రం దాదాపు పదహారో శతాబ్దిలో మొదలైంది.
అప్పట్లో ఎంటొమొలొజీలో పని చేసిన శాస్త్రజ్ఞులు మంచి చిత్రకారులు. తమ చిత్రాలతో పురుగుల జీవ వ్యవస్థ (లైఫ్ సైకిల్)ని వివరంగా బొమ్మలతో ప్రచురించేవారు. అటువంటి ఒక శాస్త్రజ్ఞురాలే జర్మనీకి చెందిన మరియా సిబిల్లామెరియన్ (Maria SybillaMerian). చిత్రలేఖనంలో శిక్షణ పొంది శాస్త్రజ్ఞురాలిగా మారిన మరియా సిబిల్లామెరియన్ ఎంటొమొలోజికి చేసిన సేవ ఆ శాస్త్రాన్ని ఎంతో ముందుకు తిసు కెళ్ళింది. ఆమెది చాలా వింతైన జీవిత చరిత్ర. ఆవిడ ఓపికగా గొంగళీ పురుగులనీ, సీతాకోకచిలుకలనీ గమనించి, బొమ్మలు గీసీ, చేసిన పరిశోధన ఎంటొమోలొజీలో ఎంతో ముఖ్యమైన మొదటి అడుగులు. తన జీవిత కాలంలో ఆమె పరిశోధనలనీ, ఫలితాలనీ కొంత మంది హేళన చేసి, కొట్టిపారేసారు. కానీ తరవాత కాలంలో అవన్నీ నిజాలనీ, ఆమె వెల్లడించిన ఫలితాలు సరైనవేననీ నిర్ధారణ జరిగింది.
మరియా మెరియన్ 1647లో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో జన్మించారు. మరియా మూడో యేట తండ్రి మరణించడంతో తల్లి జేకబ్మారెల్ అనే చిత్రకారుణ్ణి పునర్వివాహం చేసుకున్నారు. మరియా సవతి తండ్రి వద్దనే చిత్రలేఖనాన్ని అభ్యసించారు.
తన పదమూడోయేటి నుంచి మరియా రకరకాల పురుగులవీ, క్రిమికీటకాలవీ బొమ్మలు గీసేది. పట్టుపురుగులనూ, గొంగలిపురుగులనూ, కొవ్వొత్తి వెల్తురులో చాలా శ్రధ్ధగా గమనిస్తూ వాటి బొమ్మలు గీసేది. తన పద్దెనిమిదోయేట 1665 లో సవతి తండ్రి వద్ద అప్రెంటిస్‌గా పనిచేస్తున్న జాన్ ఆండ్రియాస్ గ్రాఫ్‌ని వివాహమాడింది. ఆ దంపతులకి ఇద్దరు కుమార్తెలు.
1670లో ఆ కుటుంబం న్యూరెంబర్గ్‌లో నివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడ ధనిక కుటుంబాల్లోని యువతులకు బొమ్మలు గీయడం నేర్పిస్తూ కుటుంబాన్ని పోషించారు మరియా. ఆ వృత్తివల్ల ఆమెకు ధనికుల ఇళ్ళల్లోకూ, తోటల్లోకూ ప్రవేశం లభించింది. దాని వల్ల ఆమె ఎన్నో రకాల పూలనూ, మొక్కలనూ, పురుగులనూ దగ్గరగా గమనిస్తూ లెక్కలేనన్ని బొమ్మలు గీసారు. ఈ బొమ్మలన్నీ వివరాలతో సహా 1679నించి 1680 వరకూ మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. ఆడవారు ఎంబ్రాయిడరీ చేయడానికని ఆవిడ తాను గీసిన పువ్వుల బొమ్మలని పుస్తకాల రూపంలో అమ్మేవారు.
న్యూరెంబర్గ్ వదిలి కొన్నాళ్ళపాటూ ఆ కుటుంబం నెదర్లాండ్స్ లో ఫ్రయిస్లాండ్ అనే చోట వున్నారు. అక్కడ చిత్తడి నేలల్లో ఆమె కప్పల జీవ వ్యవస్థని అధ్యయనం చేసి రికార్డు చేసారు. ఆ తరవాత ఆమ్‌స్టర్‌డాంలో కొన్నాళ్ళు వున్నారు. అక్కడ వున్నప్పుడే ఆమె భర్తతో విడిపోయి విడాకులు తీసుకున్నారు.
1699లో ఆమెకు డచ్చి ప్రభుత్వం దక్షిణ అమెరికాలో వున్న క్రిమి కీటకాల పై పరిశోధన జరపడానికి ఒక చిన్న గ్రాంట్ ఇచ్చింది. ఆ ఆర్ధిక సహాయంతో ఆమె తన చిన్న కూతురిని తీసుకొని తన యాభై రెండేళ్ళ వయసులో దక్షిణ అమెరికాలోని సురినామ్ (Suriname) అనే దేశం చేరుకున్నారు. రెండేళ్ళ పాటు ఆమె ఆ దేశమంతా తిరుగుతూ అక్కడ కనపడే మొక్కలవీ, క్రిమి కీటకాలవీ బొమ్మలు గీసారు. వాటి జీవ వ్యవస్థ పై ఎంతొ విలువైన పరిశోధనలు చేసి ఫలితాలు వెల్లడించారు. ఇప్పటికీ ఎంటోమోలోజీలో ఆమె పరిశోధనలూ, ఫలితాలూ ఎంతో కీలకంగా భావిస్తారు. సురినామ్లో వున్నప్పుడామె డచ్చి ప్రభుత్వపు వలస విధానాలనూ, స్థానికులను డచ్చి వ్యాపార సంస్థలు బానిసలను చేసుకోవడాన్నీ తీవ్రంగా నిరసించారు.
1705లో తీవ్రంగా అనారోగ్యం పాలు కావడంతో మరియ తిరిగి నెదర్లాండ్స్ చేరుకున్నారు. సురినామ్లో తాను గీసిన బొమ్మలూ, వివరాలతో మెటమార్ఫసిస్ అనే పుస్తకం ప్రచురించారు. 1715లో పక్షవాతం బారిన పడ్డ ఆవిడ 1717లో ఆమ్‌స్టర్‌డామ్‌లో మరణించారు.
మిగతా శాస్త్రజ్ఞుల్లామెరియన్ పరిశోధనకే తన సమయం మొత్తాన్ని వెచ్చించడానికి వీల్లేని పరిస్థితుల్లో వుండేది. భర్త పెద్దగా సంపాదనాపరుడు కాకపోవడంతో ఆమె తన పిల్లల పోషణా, కుటుంబాన్ని నడపడానికి డబ్బు సంపాదించడమూ వంటి వ్యాపకాలతో తలమునకలుగా వుండేది. అటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా అద్భుతమైన పరిశోధన సాగించి, ఫలితాలు వెల్లడించారు మెరియన్.
ఆమె ఫలితాల వల్ల అప్పటి వరకూ వున్న అపోహలు చాలా తొలగిపోయాయి. ఉదాహరణకి, అప్పటి వరకూ క్రిమికీటకాలన్నీ స్వయంభువులనుకునేవారు. అంటే, కుళ్ళిపోయిన మాంసం నుంచి ఈగలూ, వర్షపు చుక్కల్లోంచి కప్పలూ, భూమిలోంచి క్రిమికీటకాలూ ఉద్భవించేవి అనుకున్నారు. మెరియన్ ఓపికగా కొన్నేళ్ళ పాటు సీతాకోక చిలుక గుడ్లదశ నుంచీ, దశలన్నీ దాటి సీతాకోకచిలుకగా పరిణామం చెందడం వరకూ అన్ని దశలనీ చిత్రించింది. మెరియన్ పరిశోధనా ఫలితాల వల్ల ఇటువంటి అపోహలు తొలగిపోయాయి. గొంగళిపురుగుల గురించీ, సీతాకోక చిలుకల గురించీ ఆమె ప్రచురించిన పుస్తకాలు ఎంతో విలువైనవి.
సురినామ్లో పరిశోధనకి యాభై రెండేళ్ళ వయసులో వెళ్ళిన మెరియాన్కి స్థానిక డచ్చి అధికారులు ఏ మాత్రం సహకరించలేదు సరికదా, ఏదో పనీ పాటా లేని ఆడవాళ్ళ వ్యవహారం అని తోసిపారేసారు. మెరియన్ స్థానిక దక్షిణ అమెరికన్లతో స్నేహం చేసి అక్కడ వున్న క్రిమికీటకాలనీ, పువ్వులనీ సంపాదించి తన పరిశోధన సాగించారు.
తన సమకాలీనుల్లో మెరియాన్ చాలా పేరు ప్రఖ్యాతి సంపాదించారు. చార్లెస్ డార్విన్ తాతగారు ఇరాస్మస్ డార్విన్ తను వ్రాసిన “బొటానిక్ గార్డెన్” అనే పుస్తకంలో మెరియాన్ ఫలితాలను చాలా సార్లు ప్రస్తావించారు.
అయితే ఆమె మరణానంతరం ఆమె పుస్తకాల్లో తప్పులు చోటు చేసుకున్నాయి. ఆమె బొమ్మల పుస్తకాలు రీప్రింటు చేసినప్పుడు, ఆమె గీసిన బొమ్మలకి ఎక్కువగా రంగు లద్దడం, ఆమె గీయని బొమ్మలు ఊహించి జత చేయడం, లాటి మార్పులు జరిగాయి. పైగా, ఆమె మిగతా శాస్త్రజ్ఞుల్లా కాలేజీకో, యూనివర్సిటీకో వెళ్ళి డిగ్రీలు సంపాదించలేదు. అందువల్ల ఆమె పరిశోధనా ఫలితాలని ప్రశ్నిస్తూ, వెక్కిరించే వారు మొదలయ్యారు.
మరీ ముఖ్యంగా 1830లో లాన్స్డవున్గిల్డింగ్ అనే శాస్త్రవేత్త ఆమె పరిశోధనా ఫలితాలన్నీ అనుమానాస్పదమైనవేనని తీర్మానించేశాడు. ఇంతకి, అతను ఒక్కసారి కూడా సురినామ్వెళ్ళనేలేదు. ఆయన కేవలం మెరియాన్ ఫలితాలను విమర్శించడానికే ఒక పుస్తకం వ్రాసారు. అందులో ఆమెని “నిర్లక్ష్యం”, “పనికిమాలిన”, వంటి పదజాలం వాడి ఆమె పరిశోధనలని కించపరిచారు.
ఆయన విమర్శలో అతి ముఖ్యమైనది, “ఆమె దక్షిణ అమెరికాలోని నల్ల వారినీ, బానిసలనీ నమ్మడం.” దీనివల్ల ఆమె పరిశొధన ఏ మాత్రం నమ్మదగింది కాదని ఆయన వాదించారు. “చదువూ సంధ్యా లేని ముసలామె ఊహలు” అని ఆ కాలం శాస్త్రవేత్తలంతా ఆమెని ఈసడించారు. ఇంతా చేస్తే, నిజానికి ఆ కాలంలో యూనివర్సిటీలూ స్త్రీలకి సైన్సు చదవడానికి సీట్లుకూడా ఇచ్చేవి కాదు!
అయితే కాల క్రమేణా, ఆమె పరిశోధనా ఫలితాలన్నీ సరియైనవేననీ, వాటిని ఆధారం చేసుకోనే ఎంటొమోలొజీ శాస్త్రం నిలబడిందనీ ఒప్పుకున్నారు. ఆమె మరణానంతరం ఎన్నెన్నో క్రిమి కీటకాల శాఖలకూ, మూడు రకాల సీతాకోక చిలుకలకూ ఆమె పేరు పెట్టారు. ఆమె దక్షిణ అమెరికాలో కనుగొన్న మాంసాహార సాలెపురుగుకీ ఆమె పేరే పెట్టారు. కొన్ని రకాల పూవులకి కూడా ఆమె పేరే పెట్టారు. ఇరవయ్యో శతాబ్దపు ఆఖరి పాతికేళ్ళలో ఆమె పుస్తకాలనూ, పరిశోధనలనూ మళ్ళీ అధ్యయనం చేసి ఆమెకు పట్టం కట్టారు జీవ శాస్త్ర వేత్తలు. డ్యూష్ మార్క్ నోట్ల పైన కూడా ఆమె చిత్రాన్ని ముద్రించింది ప్రభుత్వం.
ఎన్నో రకాల వ్యయప్రయాసలకోర్చి, ఏ ప్రతిఫలమూ ఆశించకుండా, ఎంటొమొలొజీ శాస్త్రానికి ఎంతో జ్ఞానాన్ని సముపార్జించి పెట్టిన మరియా సిబిల్లామెరియాన్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కావడంలో ఆశ్చర్యం ఏ మాత్రమూ లేదు.
(1679లో జేకబ్మారెల్ గీసిన మరియా చిత్రం- మూలం వికీపీడియా)
*****
ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు వ్రాస్తూ వుంటారు. 1996 లో మొదలైన కథా రచనతో దాదాపు నలభై తెలుగు కథలు, ఇరవై అనువాద కథలూ ప్రచురించారు.
“నీలాంబరి”, “మలయ మారుతం” పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువరించారు.. “వీలునామా” అనే అనువాద నవలా, “తమసోమా జ్యోతిర్గమయా” అనే తెలుగు నవలా కినిగెలో ఉచితంగా లభ్యమవుతున్నాయి. “శంకరాభరణం” అనే అనువాద కథల సంపుటి ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో ఉచితంగా లభ్యమవుతుంది.
Love this series. Please continue writing them. The articles are informative, succinct and inspiring.
ధన్యవాదాలండీ. నిజమే, ఈ శీర్షిక వ్రాయడం నాక్కూడా చాలా ఆనందంగా, ఫుల్-ఫిలింగ్‌గా వుంది. ఈ వ్యాసాల కోసం చేసే రీసెర్చి వల్ల నేనెన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ, నా వృత్తిలో కూడ చాలా ఇన్స్పిరేషన్ పొందగలుగుతున్నాను.
శారద(బ్రిస్బేన్)