వెనుతిరగని వెన్నెల(భాగం-44)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసయ్యి, జే.ఆర్.ఎఫ్ సాధిస్తుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు.  ఎన్నో రోజులు పోరాడి, తన్మయి చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది.  హైదరాబాదు కు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా మళ్లీ ఎదురవుతాడు.

 ***

         “మీ అబ్బాయి భలే ముచ్చటైన వాడు! ఆడుకోవడానికి బయటికెళ్ళినట్లున్నాడు. బయటి నించి రాగానే నాకునమస్తేఅని చెప్పేడు. బుద్ధిగా కాళ్లూ చేతులు కడుక్కుని, బట్టలు మార్చుకుని పుస్తకాలు ముందేసుకుని చదువుతున్నాడు.” అన్నాడు ప్రభు తన్మయితో.

         కరివేపాకు మర్చిపోయిన పాపానికి రెండో సారి మార్కెట్ వరకూ నడిచెళ్లొచ్చిన తన్మయి ముఖానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ చిరునవ్వుతో బాబు వెన్నుమీద నిమిరి 

         “ఏం నాన్నా! బాగా ఆడుకున్నావా?” అంది.

         సీరియస్ గా చదువుకుంటున్నట్లు ముఖం పెట్టి తలూపేడు వాడు.

         “ఒకటో తరగతిలోనే ఇంత సీరియస్ చదువా? మేమెప్పుడూ ఇంత భయభక్తులతో చదవలేదు!”  నవ్వుతూ అంటూ వంట గట్టు దగ్గిరకి వచ్చి నిలబడ్డాడు ప్రభు.

         తన్మయి ఉల్లిపాయలు కోస్తూ ఉంటే, “నేనూ సాయం చెయ్యనా?” అన్నాడు.

         తన్మయికి ఇదంతా కొత్తగా, ఆశ్చర్యంగా ఉంది. ఇంత వరకూ తనెరిగిన మగ వాళ్లెవరూ వంట ఇంటిలోకి తొంగి చూసిన వాళ్లు కాదు మరి!

         తల్లి మంచి నీళ్లు కూడా తెచ్చి ఇస్తేనే తాగుతాడు తండ్రి.

         ఇక అత్తవారింట్లో సరేసరి. మగవాళ్ళతో కలిసి భోజనం చెయ్యడం కూడా తప్పే నన్నట్లు ముందు ఇంట్లోని మగవాళ్ళంతా తిని లేచేకే, చివరలో ఆడవాళ్లకి వడ్డించేది శేఖర్ తల్లి.

         శేఖర్ ఎప్పుడూ వంటింట్లోకి వచ్చి తాను వంట చేస్తుండగా కబుర్లు చెప్పడం కూడా చెయ్యలేదు.

         తను వంట చేస్తున్నంత సేపూ అతను నిద్రపోవడమో, బయటికి ఫ్రెండ్స్ తో తిరగడం కోసం వెళ్లిపోవడమో చేస్తుండేవాడు.

         వంట చెయ్యడమూ, వడ్డించడమూ కేవలం ఆడవాళ్ల బాధ్యత మాత్రమే అని తనకి అర్థమవుతూ వచ్చింది.

అదే చెప్పింది ప్రభుతో.

         “మీ ఆడవాళ్లు మమ్మల్ని వంటింట్లోకి  రానిస్తే కదా!” అని చిరునవ్వుతోతప్పుకోండి, ఇవేళ చీఫ్ కుక్ ని నేను. మీరు సహాయం చేయండి చాలుఅన్నాడు.

         స్టవ్వు పక్కనే చిన్న స్టాండులో అందంగా సర్ది ఉన్న సరుకులు, మసాలా దినుసుల సీసాల్ని , వాటి మీద పేర్లని చూస్తూ , “అమ్మో! వంటింటిని కూడా ఇంత ఆర్గనైజ్డ్ గా నడపడం మీ వల్లే అవుతుందిఅన్నాడు.

         అతనడిగే వరకూ తన దగ్గిర గ్రైండర్ కాదుకదా మిక్సీ కూడా లేదన్న విషయం స్ఫురించలేదు తన్మయికి.

         ఎప్పుడైనా అవసరమైతే వాకిట్లో ఉన్న ఇంటి వాళ్ల సన్నికల్లు మీద నూరడం, కొంచెం ఎక్కువ రుబ్బాల్సి వస్తే  రుబ్బురోట్లో రుబ్బడం అలవాటు చేసుకుంది తన్మయి.

         “ఏవిటేవిటీ ! మిక్సీలు వచ్చి ఇన్నాళ్లవుతున్నా మీరు వీటితో అడ్జస్ట్ అవుతున్నారా!” అని , “పొరబాటున నాతో పప్పు రుబ్బించరు గదాఅన్నాడు భయాన్ని నటిస్తూ.

         తన్మయికి అతని ముఖం చూసి నవ్వొచ్చింది.

         చప్పుననెలకొక వస్తువు సమకూర్సుకో మేడంఅన్న తాయిబా మాటలు జ్ఞాపకం వచ్చేయి.

         అదే అంది పరధ్యానంగా

         “నెలకొక వస్తువు ఎందుకు?”  అని, వెంటనే అర్ధమైనట్లు ఆగేడు.

         అటు తిరిగి సన్నికల్లు మీద నూరుతున్న తన్మయికి వెనక నుండితన్మయీ !” అని గద్గదంగా వినిపించింది.

         అతని కళ్ళల్లో సన్నటి నీటి పొర, ఏమీ  చెయ్యలేని అశక్తత గొంతులో అడ్డం పడ్డట్లు స్పష్టంగా తెలుస్తోంది తన్మయికి.

         “నా మీద జాలిపడొద్దు ప్రభూఅంది.

         “ఛా. జాలికాదు తన్మయీ, ఏదో చెప్పలేని బాధ. నాకే తెలీకుండా నన్ను చుట్టుముట్టి మెలితిప్పుతున్న బాధపక్కనే కూచుని కళ్లనీళ్లు పెట్టుకుంటున్న అతన్ని చూస్తూ 

         “అయ్యో, ఇంత జాలి గుండె కలవాడా ఇతనుఅని అనుకోకుండా ఉండలేక పోయింది.

***

         భోజనాల తర్వాత మరో గంటసేపు ఉండి, “వెళ్ళొస్తానూఅన్నాడు ప్రభు.

         తన్మయి నిశ్శబ్దంగా తలూపింది.

         అతను భారమైన హృదయంతో వెళ్తున్నట్టు తెలుస్తోంది.

         కానీ తన గురించి అతను అంత బాధపడ్తున్నందుకు సంతోషించాలో, బాధ పడాలో అర్థంకాక అయోమయంగా గుమ్మం దగ్గరే మోకాళ్లలో తలపెట్టి ఎంతో సేపు కూచుండి పోయింది.

         తన గురించి శ్రద్ధాసక్తులు చూపిస్తున్న ఇతను తనకి ఏమవుతాడు?

         ఎందుకు హఠాత్తుగా తన జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించాడు?

         తన జీవితం ఒకప్పుడు దయనీయ స్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు మెరుగయింది.

         ఇప్పుడు తనకి కావాల్సిందల్లా నిబ్బరం. ఒంటరిగా, ధైర్యంగా బతకగలగడం. బాబుని లోటూ లేకుండా పెంచుకురావడం.

         ఇందులో ఎవరైనా జాలి పడాల్సింది ఏమైనా ఉందా?

         “రతనాల మేడలోన నిన్నొక రాణిగ చూడాలని, నీ అడుగులు కందకుండా నా అర చేతులుంచాలని, ఎంతగా అనుకున్నాను, ఏవిటి చూస్తున్నాను….” ఎదురింటి టీవీలో నుంచి పాట వినిపించసాగింది.

         ప్రభు తనని చిన్నతనంలో ఆరాధించాడన్న విషయం తనకి బొత్తిగా ఎప్పుడూ తెలియనేలేదు.

         సరిగ్గా అదే వయసు నుంచి శేఖర్ తన చుట్టూ తిరగడం వల్లనో ఏమో తనెప్పుడూ తన చుట్టూ ఉన్న మరే మగ పిల్లవాడి వైపూ ప్రత్యేకించి చూసిన జ్ఞాపకం కూడా లేదు.

         తనంటే ఇష్టపడి వచ్చానన్న శేఖర్ తన జీవితాన్ని సమూలంగా నాశనం చేసేడు.

         స్నేహంగా ఉంటూ, తన పట్ల ఇష్టం చూపించిన కరుణ చివరికి స్వార్ధపూరితంగా ఆలోచించేడు.

         ఇక ఇప్పుడు తన పట్ల చిన్నప్పటి ఆరాధనతో, జాలితో దగ్గరవుదామని ప్రయత్నిస్తున్న ప్రభుని తన జీవితంలోకి స్నేహితుడిగానైనా అసలు రానివ్వొచ్చా?

         ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తన జీవితంలో లేనిపోని సమస్యలు కావాలని కొని తెచ్చుకుంటున్నానా? అని మథనపడసాగింది తన్మయి

         నిస్త్రాణగా పడుకున్న తల్లినిఅమ్మా!” అంటూ ఆందోళనగా కుదిపేడు మృదుల్.

         “ఏం లేదు నాన్నా, కాస్త తలపోటుగా ఉంది, అంతేఅంటూ లేచి బాబుని ఒళ్ళోకి తీసుకుని, “కాస్సేపు బజ్జోఅంది జోకొడుతూ.

***

         మర్నాడు ఉదయం లేస్తూనే బాబు ఒళ్లు జ్వరంతో కాగిపోసాగింది.

         తాయిబాతో కాలేజీకి సెలవు చీటీ పంపించింది.

         బస్టాండ్ దగ్గరలో పిల్లల డాక్టరు ఉన్నాడని తాయిబా చెప్పింది.

         సరిగ్గా డాక్టరు దగ్గిరికి వెళదామని బయలుదేరబోయేసరికి చినుకులు పడసాగేయి.

         రోడ్డు పక్కన ఎంతసేపు నిలబడ్డా ఒక్క రిక్షా కూడా రావడం లేదు.

         ఇక బాబుని ఎత్తుకుని నడవడం మొదలుపెట్టింది. నాలుగడుగులు వేసేసరికి ఆయాసం రాసాగింది

         దించి, నడిపిద్దామా అంటే, వాడు నడిచే పరిస్థితిలో లేడు.

         ఇంతలో కుండపోతగా వాన ప్రారంభమయింది.

         చేతి సంచిలో ఉన్న తువ్వాలు భుజమ్మీదున్న బాబు మీద కప్పి ఊపిరి బిగబట్టి వేగంగా అడుగులెయ్యడానికి ప్రయత్నించసాగింది.

         ఎంత వేగంగా నడవాలనుకుంటే అంత నెమ్మదిగా పడసాగేయి అడుగులు. ఎత్తుకున్న భుజం, పట్టుకున్న చేతులూ పట్టు ఇవ్వకపోగా, కాళ్లు పీకెయ్యసాగేయి.

         తన్మయికి దుఃఖం ముంచుకొచ్చింది.

         దగ్గరలో కనబడ్డ దుకాణం ముందుకు వడిగా నడిచి చూరు కింద నిలబడింది.

         దుకాణం మూసి ఉండడంతో నిలబడేందుకు అంతగా జాగాలేదు.

         కాస్త కూచునే చోటేమైనా ఉంటుందేమోనని చుట్టూ చూసింది.

         అంతా మట్టి తప్ప ఏవీ లేదు

         భుజమ్మీద జ్వరంతో మూలుగుతున్న పిల్లాణ్ణి ఒడిసి అలాగే పట్టుకునిభయంలేదు నాన్నా! అమ్మ ఉందిఅని తనలో తను గొణుక్కుంటున్నట్టు అనసాగింది.

         అసలే జ్వరంలో ఉండి తడవడం వల్ల ఇంకేదైనా అయితే? సమయానికి వైద్యం అందకపోతే? – ఆలోచనకే భయంతో కాళ్లు ఒణక సాగేయి తన్మయికి.

         కాస్సేపట్లో వాన తగ్గు ముఖం పట్టినా రిక్షాలు అటుగా రావడం లేదు.

         అసహాయంగా రోడ్డు కేసి చూస్తూ భారంగా అడుగులేయసాగింది.

         హాస్పిటల్ కు చేరుకునే సరికి  బాగా నీరసం వచ్చేసింది. పేషంట్లతో కిటకిటలాడు తున్న వరండాలో బల్లమీద కాస్త జాగాలో కూలబడింది.

         మరో అరగంట తర్వాత డాక్టరు ఇంజక్షను చేసి, “ఏం ఫర్వాలేదుఅని చెప్పేవరకూ మనసు కుదుటపడలేదు తన్మయికి.

         తన బాధని పంచుకోవడానికి, కనీస సహాయం చెయ్యడానికి తోడు ఒకరుంటే బావుణ్ణని మొదటిసారి అనిపించింది.

***

         రెండ్రోజుల్లో బాబుకి తగ్గుముఖం పట్టింది.

         బండి గురించి వెతకడం ముమ్మరం చేసింది తన్మయి.

         కాలేజీకి వెళ్లే దారిలో ఉన్న మెకానిక్ షాపు అబ్బాయి వెనక నుంచిమేడమ్అంటూ కేక వేసేడు.

         తన్మయి వెనక్కి రెండడుగులు వేయగానే, “మీరు సెకండ్ హాండ్ బండి గురించి అడిగిన్రు కదా! పన్నెండు వేలకి బండొచ్చింది కొంటరా?” అనడిగేడు.

         తన్మయి తటపటాయింపు చూసి, “పాత బండి అని పరేషాన్ గాకు మేడం, సంవత్సరం వరికి రిపేరొచ్చినా నాది జిమ్మెదారీఅన్నాడు.

         తన్మయి ఆలోచిస్తున్నది అది కాదు, “ఇప్పటికిపుడు పన్నెండు వేలంటే ఎక్కడి నుంచి వస్తాయి?” 

         అదే చెప్పింది అతనితో.

         “చివరి మాట పదకొండున్నర వేలకి ఇప్పిస్తా, తర్వాత నీ ఇష్టంఅన్నాడు

         కాలేజీకి వెళ్లి సంతకం పెడ్తుండగా, “రిజిస్టర్ పార్సిల్ వచ్చింది మేడమ్అని క్లర్కు ఇచ్చేడు.

         “అంత పెద్ద పార్సిల్ ఎక్కడి నుంచయ్యుంటుందబ్బా!” సాలోచనగా పార్సిల్ వెనక్కి తిప్పి ఫ్రమ్ అడ్రసు చూసింది.

         కొక్కిరిబిక్కిరి దస్తూరితోప్రభుఅన్న పేరు, అడ్రసు కనబడేసరికి ఇంకాస్త ఆశ్చర్య పోయింది.

         ఏం పంపించి ఉంటాడు?

         తన డెస్క్ దగ్గిర కూచుని ఆదరాబాదరా చింపింది.

         “కంప్యూటర్ బేసిక్స్అనే టైటిల్ తో స్క్విర్రల్ బైండుతో ఉన్న దాదాపు వంద పేజీల టైపు చేసిన కాగితాలు అవి.

         చిన్న చాప్టర్ లతో , ప్రతీ చాప్టర్ కు బొమ్మలతో, సింపుల్ ఇంగ్లీషులో ఇలా చదవ గానే ఇట్టే అర్థమయ్యేలా ఉన్న నోట్సు చూసి తనలో తను ప్రభుని అభినందించ కుండా ఉండలేక పోయింది.

         పుస్తకం మధ్యలో అన్నిటికంటే విభిన్నంగా పైకి కనిపిస్తున్న కాగితాన్ని బయటికి లాగింది.

         ఉత్తరం. కష్టపడి రాసినట్లున్న దస్తూరీ. 

తనూ!

ఉభయకుశలోపరి.

         మిమ్మల్ని ఇలా పిలవాలని ఎన్నాళ్ల కాంక్షో ఇప్పటికి నెరవేరింది.

         ఎలాగైతేనేం రాత్రీపగలూ కూచుని మీ కోసం గబగబా మెటీరియల్ తయారు చేసేను.

         కంప్యూటర్స్ కు సంబంధించిన విషయాలు మీకు త్వరితంగా అర్థం కావడానికీ , మీ కాలేజీలో విద్యార్థులకు మీరు బోధించడానికీ ఇది మీకు బాగా ఉపయోగపడుతుందను కుంటున్నాను.

         ఎక్కడేసందేహం వచ్చినా నిర్మొహమాటంగా అడగండి. (అలాగైనా మీ నించి ఉత్తరం అందుకోవచ్చని చిన్న ఆశ సుమా!)

         అవునూ, నన్ను అసలెప్పుడైనా గుర్తు తెచ్చుకుంటారా?

         మీ అబ్బాయితో ఆడుకుంటూ నన్నెప్పుడో మర్చిపోయానని మాత్రం చెప్పకండి.

         అన్నట్లు ఎలా ఉన్నాడు వాడు? మీలాగే చాలా హుందాతనం ఉన్న కుర్రాడు. మొన్న మీ ఇంటికి వచ్చినపుడు మాట వరసకిమీ నాన్న ఎక్కడుంటారు?” అనడిగేను.

         “ఏమో, నాకు తెలియదుఅని చాలా సీరియస్ గా అని, తల దించుకుని తన హోమ్ వర్కు చేసుకోసాగేడు.

         వయసు కంటే ఎంతో ఎత్తుకి ఎదిగినట్లున్న పసివాణ్ణి చూస్తే ముచ్చట వేసింది. మీ పెంపకానికి జోహార్లు.

         ఇప్పటికే రాత్రి పన్నెండు కావచ్చింది. నా చుట్టూ ప్రపంచమంతా నిద్రపోతూ ఉంది. నేను మీకు ఇలా రాస్తూ ఉంటే మీరు ఎదురుగా ఉండి, మీతో మాట్లాడుతున్నట్టే ఉంది.

         “తెల్లారి కాస్త ఒండుకుని, ఉద్యోగానికి టైము కెళ్ళడం కోసం బస్సుల వెంట పరుగులు పెట్టాలి.” అని ఒక పక్క గడిచిపోతున్న సమయం హెచ్చరిస్తూ ఉన్నా ఇలాగే రాత్రంతా మెలకువగా ఉండి మీతో కబుర్లాడాలని ఉంది.

         మీరిక్కడే ఉన్నారు కదూ!

         కళ్లు మూతలు పడకపోయినా కాలం హెచ్చరిక వినకతప్పదు.

ఇప్పటికి ఉండనా మరి

మీ 

ప్రభు 

         ఉత్తరం మడతపెట్టి గుండెలకు హత్తుకుంది.

         “తనూ!” – సంబోధన కోసం తను ఎప్పుడూ అర్రులు చాస్తుందో అలా తనని పిలవాలని ఇతనికి ఎందుకు అనిపించింది!?

         దస్తూరీ బాగా లేకపోయినా మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా ఎంత బాగా రాసేడు! శేఖర్ కి తను ఇలాగే అందమైన ఉత్తరాలు రాసేది. అటునించి అతనూ అలా రాస్తే బావుణ్ణని ఎంతో ఎదురుచూసేది

         ఆ కోరిక ఎప్పుడూ తీరలేదు. అసలు అతనికి తన భావాలు అసలెప్పుడైనా అర్థం అయి ఉండి ఉంటాయా?. ఒకసారి తనని అడిగేడు.

         నువ్వు ఉత్తరాల్లోకదూ!” అని రాస్తావు ఎప్పుడూ. అంటే అర్థం ఏవిటి? “ కదాఅనా? “కాదుఅనా?” అని

         ఇప్పుడు తల్చుకుంటే అతని అజ్ఞానానికి నవ్వు వస్తోంది గానీ, అప్పుడు అయోమయంగా అనిపించింది. ఇతనికి అర్థమవుతున్నాయనుకుని తనేదేదో రాసింది ఇన్నాళ్లూ. ఇతనికికదూ!” అనే పదానికే అర్థం తెలీదన్నమాట!

         ప్రభు రాసిన వాక్యాలు మళ్లీ మళ్లీ  జ్ఞాపకం వస్తున్నాయి. “మీరిక్కడే ఉన్నారు కదూ!” 

         ఆ రోజంతా కాలేజీలో క్లాసుల మధ్యలో ఎప్పుడు ఖాళీ దొరికినా మెటీరియల్ తీసి చదవసాగింది. ప్రతిసారీ ఉత్తరం ముందుగా చదవవాలని అనిపిస్తోంది ఎందుకో!

         కాలేజీ విడిచిపెట్టే ముందుఇవేళ మొదటి విడత చీటీ పాట ఉంది. మీకు అవసరం ఉందని తాయిబా చెప్పింది. మీరు పాడుకుంటారా?” అన్నాడు టైపిస్టు.

         అన్యమనస్కంగా తలూపింది. అసలు చీటీ పాట అంటే ఏవిటో తెలియదు తన్మయికి.

         అదే చెప్పింది అతనితో.

         “మీరేం ఫికర్ చెయ్యకురి. గట్ల వచ్చి నిలబడిన సాలు. నేను నడిపిస్త గదఅన్నాడతను.

         “దేవుని పాట అయిదువందలుఅని మొదలయింది పాట.

         “వెయ్యి

         “పదిహేను వందలు

         మూడు వేలు

         గబగబా వినవస్తున్న సంఖ్యలు తన్మయికి గాభరాని పుట్టిస్తున్నాయెందుకో

         పాట చివరికి ఆరువేల అయిదువందల దగ్గిర ఆగింది

         టైపిస్టు తన్మయికి చెవిలో చెప్పేడు. “మరొక అయిదు వందలు కలుపురి. మీదే అయితది” 

         తన్మయిఏడు వేలుఅనడంతో అంతా నిజంగానే నిశ్శబ్దంగా అయిపోయేరు.

         ఒకటోసారి, రెండో సారి, మూడో సారి….అన్నాడు టైపిస్టు

         తన్మయి ఏదో గెల్చినట్లుకంగ్రాట్స్ మేడమ్అనసాగేరు అంతా

         ఇరవై వేల చీటీలో ఏడువేలు పోగా పదమూడు వేలు తీసి తన్మయి చేతిలో పెట్టేడు టైపిస్టు 

         అంతా చప్పట్లు కొట్టేరు. కానీ ఇంకా తన్మయికెందుకో లోపల గాభరాగా అనిపించ సాగింది

         దీని వలన తన జీతంలో నుంచి ఇరవై నెలల పాటు నెలకి వెయ్యి రూపాయల చొప్పున దీనికి పోతుంది. అసలేఏదైనా తెలీని కష్టమొస్తేఅని దాస్తున్న మార్గదర్శి చీటీకి ఇది తోడయ్యింది.

         బండి కొనడం వల్ల పెరిగే పెట్రోలు, రిపేర్లు వంటి ఇతరత్రా ఖర్చులు తోడైతే, తన నెల జీతం బాబుకి, తనకి  బొటాబొటీగా సరిపోతుంది. గబగబా లెక్కేసింది. ఇక తల్లి దండ్రుల్ని చూడడానికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్లగలదు

         “బండి త్వరగా కొనాలనే తపనతో అనవసరంగా ఇటు వంటి పనులు చేస్తోందా తను!” ఇంటికి నడుస్తూ దీర్ఘమైన  ఆలోచనలో పడింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.