వ్యాధితో పోరాటం-14
–కనకదుర్గ
పిల్లలకు ఎవ్వరికైనా జ్వరం వస్తే నాన్న ఒకోసారి సెలవు పెట్టి దగ్గరుండి చూసుకునేవారు.
జ్వరం వల్ల నాలిక చేదుగా వుంటే డ్రై ప్లమ్స్ తెచ్చేవారు, అది నోట్లో పెట్టుకుంటే పుల్లపుల్లగా, తియ్యతియ్యగా వుండేది.
జ్వరం వస్తే అన్నం తినకూడదని, బ్రెడ్, పాలల్లో వేసి తినిపించేవారు.
నాన్న ఆఫీసుకెళ్తే అమ్మని మా దగ్గరే కూర్చోమని గోల చేసేవాళ్ళం. అమ్మ త్వరగా పని చేసుకుని వచ్చి మా దగ్గరే వుండేది.
అమ్మ చేయి పట్టుకునే వుండేదాన్ని. అక్కా, తమ్ముడు స్కూల్ నుండి వస్తే వాళ్ళకి తిండి పెట్టడానికి వెళ్తే గోల చేసే దాన్ని.
నాకు అన్నం పెట్టమని, టిఫిన్ పెట్టమని గొడవ చేసేదాన్ని.
***
“ఇంకా ఎంతసేపుంటాయి ఈ మంటలు? నేను తట్టుకోలేక పోతున్నాను. లోపల పాప ఎట్లా తట్టుకుంటుంది? చిన్ని ప్రాణాన్ని ఎంత అవస్థ పెడుతున్నానో?” ఏడ్చేసాను.
శ్రీని రూమ్ లోనే కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. లాప్ టాప్ పక్కన పెట్టి మంచం దగ్గరకు వచ్చాడు.
“చాలా మంటగా వుందా?” అదేం ప్రశ్న! పిచ్చి కోపం వచ్చింది నాకు.
“కనిపించడం లేదా! ఇంతగా అవస్థ పడుతుంటే అంత నెమ్మదిగా అడుగుతా వేంటి? ఆపేయమని చెప్పు… నా వల్ల కావటం లేదు..” ఏడుస్తూనే అన్నాను.
అటు నుండి వెళ్తున్న డాక్టర్ కారా లోపలికి వచ్చింది, ట్రీట్మెంట్ మొదలుపెట్టారా లేదా చూడడానికి.
నా ఏడుపు చూసి దగ్గరకు వచ్చి నా చేతులు తన చేతుల్లోకి తీసుకొని,”యు డోంట్ నో హౌ బ్యాడ్ ఐ యామ్ఫీలింగ్ మై డియర్. నా నిర్లక్ష్యం వల్లే నువ్వు బాధ పడ్తున్నావు…ఐ యామ్ సో సారీ. నాకు తెల్సు ఈ ట్రీట్మెంట్ చాలా టఫ్ గా ఉంటుంది. ఈ రోజే ఎక్కువగా అనిపిస్తుంది. రేపట్నుండి ఇంత ఎక్కువగా వుండదు. ఎల్లుండి పొద్దున తీసేస్తాము.
ఈ ట్రీట్మెంట్ వల్ల లోపల బేబీకి ఎటువంటి ఆపద కలగదు. నువ్వనుకుంటున్నట్టు గా పాప పుట్టాక కూడా ఎటువంటి ప్రాబ్లెమ్స్ రావు. జస్ట్హావ్పేషంన్స్… ఐ నో ఇట్స్ హార్డ్ బట్ థిస్ ట్రీట్మెంట్ ఈజ్ గోయింగ్ టు వర్క్ డియర్,” అని నా కళ్ళు తుడిచి నర్స్ కి అన్నీ సరిగ్గా చేయమని చెప్పి వెళ్ళిపోయింది.
ఇంకేం చేయగలను? ఓర్చుకోకపోతే ఇంకేం చేస్తాను?
ఇప్పటి వరకు నేను చేస్తున్న పని అదే కదా!
“చైతుని సుజాత బస్ స్టాప్ నుండి తీసుకొస్తానందా?”
“ఆ.. తను బస్ స్టాప్ కి వెళ్ళి తీసుకొచ్చి చూసుకుంటానంది.”
అటువైపు తిరిగి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు భగ్గుమన్నాయి.
మూడు రోజులు ఇలా వుండాలంటున్నారు. ఇది నా వల్ల అయ్యే పనేనా?
శ్రీని పని చేసుకోవడం చూసి నర్స్, “యూ కెన్ గో టు వేయిటింగ్ రూం అండ్ వర్క్ దేర్. వియ్ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్, డోంట్ వర్రీ,” అన్నది.
ఈ పరిస్థితిలో నాకు మాట్లాడే ఓపిక లేదు. కాసేపు నిద్ర పడితే బాగుండునని పించింది.
అమ్మ, నాన్న, దగ్గరుంటే బాగుండు…కొంచెం ధైర్యంగా అనిపించేది. వీళ్ళంతా ధైర్యం చెబుతున్నా భయంగానే వుంది.
ఈ గండం గడిచి గట్టెక్కుతామా? మళ్ళీ అందర్నిచుస్తానా?
ఏంటి ఇలా డీలా పడుతున్నాను? ఇంత మంది డాక్టర్లు, నర్సులు అంతా బాగవు తుందని చెబుతున్నారు కదా! ఆ డాక్టర్ చెప్పినట్టు ఈ మూడు రోజులు ఓపిక పడితే అంతా చక్కబడి నార్మల్ డెలివరీ అయ్యి పాప పుడుతుంది. కామ్ డౌన్, కామ్ డౌన్…
నర్స్ వచ్చి నా చెయ్యి తన చేతిలోకి తీసుకుంది.
“మిస్ దుర్గా, షుగర్ లెవల్స్ చెక్ చేయాలి, చిన్న నీడల్ తో మెల్లిగా ఒక వేలిని గుచ్చి బ్లడ్ తీసుకుంటాను. ఏ వేలికిచేయనూ?”
“ఏదైనా పర్వాలేదు.”
రక్తం బొట్లు తీసుకుని అక్కడే చెక్ చేసింది. షుగర్ లెవెల్స్ పెరిగాయి అని చెప్పి, బాత్రూమ్ లోకి వెళ్ళి చెయ్యి కడుక్కొని వచ్చి చిన్న సిరంజ్ లోకి ఇన్సులిన్ తీసుకొని నా కుడి చేతికి ఇంజెక్షన్ ఇచ్చింది.
శ్రీని వెయిటింగ్ రూంలోకి వెళ్ళి ఆఫీస్ వాళ్ళతో మీటింగ్ వుంది అది అటెండ్ అయ్యి కాసేపు పని చేసి వస్తానని చెప్పి వెళ్తుంటే ఇందాక అరిచినందుకు బాధగా అనిపించింది. పాపం తనేం చేస్తాడు. “కిందకి వెళ్ళి క్యాఫెటీరియా లో ఏదైనా తిను,” అని చెప్పాను.
“నేను తింటాలే నువ్వు జాగ్రత్త. ఎక్కువగా ఆలోచించకు. అంతా చక్కబడుతుందని చెబుతున్నారు కదా! నువ్వింకేమి ఆలోచించకు. కాసేపు పడుకోవడానికి ట్రై చెయ్యి.” అని చెప్పి వెళ్ళాడు. తనూ చాలా కంగారు పడ్తుంటాడు, కానీ పైకి కనిపించనీయడు. ఏదీ మనసు విప్పి చెప్పే అలవాటు కూడా లేదు.
ఈ విషయమే కాదు ఏ విషయంలోనైనా అంతగా మనసు విప్పి మాట్లాడడు. తనే అపుడపుడు అలా అన్నీ మనసులో దాచుకుంటే మంచిది కాదని, కనీసం తనతోనైనా పంచుకోకపోతే ఎలా అని అంటూ వుంటుంది.
బయట స్నో పడుతుంది. టైం చూస్తే నాలుగవుతుంది. చైతు స్కూల్ నుండి వచ్చి వుంటాడు.
వాడెప్పుడూ సుజాత వాళ్ళింట్లో వుండలేదు. వాళ్ళకి రెండేళ్ళ పాప వుంది.
మిగతా ఇండియన్ ఫ్రెండ్స్ పిల్లల్లో వాడి వయసు వాళ్ళు, కొంచెం పెద్ద వాళ్ళుండే వాళ్ళు, వాళ్ళందరితో ఆడుకునేవాడు. సుజాత వాళ్ళు తెల్సు కానీ వాళ్ళతో అంత చనువు కూడా లేదు. పాపం ఎలా వున్నాడో?
సుజాత ఈ స్నోలో పాపని తీసుకొని బస్ స్టాప్ కి వెళ్ళి చైతుని ఎలా తీసుకొచ్చిందో?
వాడికి మొహమాటం ఎక్కువ, ఏదన్నా తిన్నాడో లేదో అని కాసేపు వాడి గురించే ఆలోచన సాగింది.
రేపు సెలవు వాడిని తీసుకు రమ్మనాలి. వాడు దగ్గరుంటే కాస్త బావుంటుంది మనసుకి.
బాత్రూమ్ కి వెళ్ళాలన్నా బెడ్ పాన్ పెట్టారు, ఫుల్ బెడ్ రెస్ట్ అన్నారు.
ఈ మంటలు తగ్గితే బావుండు, షుగర్ లెవెల్స్ పెరగడం, ఇన్సులిన్ ఇచ్చినా చాలా రెస్ట్ లెస్ గా వుంది.
శ్రీని ఒక గంట పని చేసుకుని వచ్చాడు.
తను ఇక్కడ ఉండడం కంటే చీకటికాక ముందు ఇంటికెళ్తే మంచిది. స్నో పడుతున్నపుడు రాత్రిపూట డ్రైవ్ చేయడం కష్టమవుతుంది.
అదీకాక చైతు ఎదురుచూస్తూ వుంటాడు. పాపం వాడెంత కంగారు పడుతున్నాడో?
శ్రీని నర్స్ ని అడిగాడు, తన అవసరం వుందా? రాత్రి ఇక్కడ వుండాలా అని?
నర్స్ అవసరం లేదని, తను ఇంటికెళ్ళొచ్చని మర్నాడు తనకి వీలైనపుడు రావొచ్చని చెప్పింది.
మళ్ళీ నన్ను ఎక్కువగా ఆలోచించొద్దని, ఇంటికెళ్ళాక చైతుతో మాట్లాడిస్తానని చెప్పి వెళ్ళాడు.
నా శరీరం, మనసు అన్నీ విపరీతంగా అలసిపోయి వున్నాయి. ఏడ్చే ఓపిక కూడా పోయింది, ఒక రకంగా మెదడంతా మొద్దుబారినట్టయ్యింది.
మంటలెక్కువగా వున్నపుడు టెక్ లు వచ్చి చల్లటి టవల్స్ తలపైన కాళ్ళపైన, చేతులపైన పెడుతున్నారు.
కొన్ని గంటలకోసారి ఇన్సులిన్ ఇస్తున్నారు. నొప్పులు రావడం మెల్లిగా మెరుగవు తున్నట్టుగా అనిపించసాగింది.
ఆ రాత్రి అలసటకి కలత నిద్రలోకి జారుకున్నాను. కాళ్ళకి రక్తప్రసరణకి పెట్టినవి బరువుగా ఉన్నాయి. అటు ఇటు కదలడానికి లేదు, దానికి తోడు వొంట్లో మంటలు.
మర్నాటికల్లా నొప్పుల మధ్య సమయం మెల్లి మెల్లిగా పెరగడం మొదలు పెట్టింది. నేనింకా మంచానికే అతుక్కుపోయి వున్నాను.
నర్సులే బ్రష్ చేయించారు. లిక్విడ్ డైట్ ఇచ్చారు. మామూలుగా అయితే నార్మల్ డైట్ ఇస్తారు, కానీ నాకు నిన్న పెద్ద పాన్ క్రియాటైటిస్ అటాక్ వచ్చింది కాబట్టి నాకు లిక్విడ్ డైట్ ఇచ్చారు. రేపటి నుండి మామూలు డైట్ ఇస్తామన్నారు.
డాక్టర్లు వచ్చారు. ప్రోగ్రెస్ చూసారు.
“ఎవ్విరీథింగ్ ఈజ్ ఫైన్, జస్ట్హావ్పేషంన్స్ ఒన్ మోర్ డే,” అని చెప్పి వెళ్ళి పోయారు.
చైతుకి నాలుగు రోజులు సెలవులొచ్చాయి, థ్యాంక్స్గివింగ్ పండగ వల్ల.
వాళ్ళిద్దరూ కలిసి పదకొండు గంటలకల్లా వచ్చారు. నాకు చైతుని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది.
వాడొచ్చి మంచం చివర కూర్చున్నాడు. వాడి చెయ్యి నా చేతిలోకి తీసుకుంటే ఎక్కడలేని ధైర్యం వచ్చినట్టయ్యింది.
వాడు మెల్లిగా స్కూల్ కబుర్లు, వాడి ఫ్రెండ్స్ గురించి చెబుతుంటే వింటూ వుండి పోయాను.
*****
(సశేషం)
నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.