నిజాయితీ

-ఆదూరి హైమావతి 

         నడమానూరు అనే గ్రామంలో రాములయ్య, సీతమ్మ అనే రైతుకూలీ దంపతులకు సోము అనే కుమారుడు ఉండేవాడు. వాడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నా డు. గత ఏడాదీ పాఠశాల ఉపాధ్యా యులు ఐదోతరగతి పిల్లలను బస్ లో ఎక్కంచుకుని నగరంలోని జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్ళి అక్కడి జంతువులనంతా చూపుతూ వాటి అలవాట్లు, పద్దతులు ఇంకా వాటి గురంచిన అనేక విషయాలు చెప్పే వారు.

         ఆ ఏడాది నగరానికి వెళ్ళను యాభై రూపాయలు కట్టమని ఒక వారం సమయం ఇచ్చారు పంతుళ్ళు. ఆ ఏడాది పంటలు సరిగా పండక సోమూ తల్లితండ్రులకు సరిగా కూలి దొరక్క తిండికే తంటాలు పడసాగారు. అలాంటి సమయంలో తాను యాభై రూపాయ్లు ఇమ్మని నాయన్ని అడగలేక సోమూ ఎల యాభైరూపాయాలు సంపదించాలా అని ఆలోచించసాగాడు.

         ఇంతలో నగరం నుండీ వాడి మేనమామ మాధవయ్య వచ్చాడు అక్కను చూడాలని. ఆ రోజు రాత్రి సోమూ మామవద్ద పడుకుని తన సమస్య వివరిం చాడు. దానికి వాడిమామ మాధవయ్య “బాధపడకు సోమూ! ఇది గాలిపటాల సమయం. మనం రేపు పొద్దున్నే నగరం వెళ్ళి కొన్ని రంగు కాయితాలూ వగైరా కొని తెద్దాం. వాటితో మనం రంగు రంగుల గాలిపటాలు తయారు చేసి అమ్మేద్దాం. మనం కొన్నా సరుకుల వెలకు మనశ్రమ కలుపు కుని మనం వాటి ధర నిర్ణయిద్దాం. నీకు కావలసిన యాభై రూపాయ్లకంటే ఎక్కువే వస్తుంది చూస్తుండు, నీవు అమ్మకు నాన్నకు కూడా కొంత సొమ్ము ఇయ్యగలవు.” అని ధైర్యం చెప్పాడు.

         మర్నాడు ఉదయాన్నే లేచి మామ మాధవయ్య సైకిలెక్కి ఇద్దరూ నగర మెళ్ళి సరంజామా అంతా కొని తెచ్చా రు. మాధవయ్య వాటికి కావలసిన సొమ్ము ఇచ్చి కొన్నాడు. ఆ రోజు ఆదివారం కావటాన సోమూకు బడిలేదు. ఇద్దరూ పగలంతా శ్రమించి రంగు రంగుల అందమైన గాలిపటాలు తయారు చేశారు.

         మధ్యాహ్నానికి వాటినంతా ఒక పెడ్డకట్టగా కట్టి ఇద్దరూ నగరం వెళ్ళి అక్కడ సంతలో గాలిపటాలన్నీ ఒక్క గంటలో అమ్మేసుకుని రాత్రికి ఇంటి కొచ్చేశారు.

         యాభైరూపాయ్లు మాత్రం తాను తీసుకుని మిగతా సొమ్ము మేనమామనే తీసుకో మన్నాడు సోము. “అదేంట్రా! మొత్తం ఉంచుకో” అన్నా మేనమామతో  “మామా! కష్టం నీది. ఆలోచన నీది. సోమ్మూ నీదే. లాభం నాకు. అయినా నాకు కావలసినది మాత్రం యాభైరూపాయ్లే. మిగతాది నీదే మామా! నాకు మాత్రం ఈ యాభై రూపాయలూ సంపా దించుకునే మార్గం చూపావు ధన్యవాదాలు. ఇహ నుంచీ సొమ్ము అవసరమైనప్పుడల్లా నీకు ఉత్తరం వ్రాస్తాను. నాకు ఉపాయం చెపుదువుగాని.” అని మామ ఇస్తానన్న సొమ్ము వదన్నాడు.

         ఆ రోజు పాఠశాలకెళ్ళిన సోమూకు పంతుళ్ళు ఈ మారు జంతు ప్రదర్శన శాలకెళ్ళే టూరు ప్రస్తుతం క్యాన్సల్ అయ్యిందని, మళ్ళా చెపుతామని ఎవరి సొమ్ము వారికి ఇచ్చేశారు.

         సోమూ పరుగు పరుగున ఇంటికొచ్చి నగరానికి బయల్దేరుతున్న మామకు ఆ యాభై రూపాయ్లూ తిరగి ఇచ్చేసి విషయం చెప్పాడు.

         మామ ” సోమూ ఈ  సొమ్ము నీ దగ్గరే ఉంచు ఈ మారు నగరం వెళ్ళవలసి వచ్చి నప్పుడు ఉపయోగించు” అని చెప్పగా. సోము ” మామా ! సొమ్ము చాలా చెడ్డది.నా దగ్గర ఉంటే నాకు ఏవైనా కొనాలని, తినాలనే ఆలోచన వచ్చి , నేను సొమ్మును వృధాగా దండగ ఖర్చు చేస్తానేమో, అది అలవాటై , డబ్బివ్వమని అమ్మానాన్నలను వేధిస్థా నేమో! వద్దు మామా పిల్లల దగ్గర డబ్బులు ఉండ కూడదుట మా పంతులుగారు చెప్పేరు. నాకు కావలసినపుడు నిన్నే అడుగుతా!” అంటూ ఇచ్చేశాడు.

         చిన్నవాడైనా వాడి మంచి బుద్ధికి మామతోపాటూగా అమ్మా నాయనా కూడా సంతోషించారు.

         నీతి నిజాయితీలే మానవునికి రెండుకళ్ళు.

***** 

Please follow and like us:

One thought on “అనగనగా-నిజాయితీ”

  1. ఇది సోము అనే ఐదవ తరగతి విద్యార్థి కథ. ఆర్థిక ఇబ్బందులున్న తలిదండ్రుల్ని వేధించకూడదనుకునే సోముకి- బడి ఏర్పాటు చేసే విహారయాత్రకోసం యాబై రూపాయలు కావాల్సొచ్చింది. అందుకు స్వయంకృషిపైన ఆధారపడాలనుకుంటాడు. ఎదుటివారు తనపట్ల వితరణ చూపినా, అవసరానికి మించి ప్రతిఫలం ఆశించడు. విహారయాత్ర రద్దయితే- ఆయాచితంగా వచ్చిన డబ్బు తనవద్దనుంటే వృథా ఔతుందని, సద్వినియోగం చేసే పెద్దలకు ఇస్తాడు. ‘నిజాయితీ’ పేరిట పిల్లలకోసం ఆదూరి హైమావతి వ్రాసిన ఈ చిన్న కథ నేటి సమాజంలో పిన్నలకూ, పెద్దలకూ ఆదర్శం. రచయిత్రికి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.