అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 3

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విశాల హార్టీకల్చర్ కోర్స్ చదువుతోంది. జూనియర్స్ కు విశాల మంచి రోల్ మోడల్. పరీక్షలలో హాస్టల్ లో ఉండి చదువుకుంది. తన రూమ్మేట్ యమున బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయలేదని డీలా పడితే, రేపు జరుగబోయే పరీక్ష మీద దృష్టి పెట్టమని హితబోధ చేసింది. విశాల హార్టికల్చర్ డిగ్రీ పట్టా తీసుకుని, తరువాత ఎమ్.బి.ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్లో చేరింది. సీనియర్స్ నిర్వహించిన పోటీలలో, చదరంగంలో గెలుపొందింది. ట్రోఫీతో ఇంటికి చేరుకోగానే తండ్రి తనకు రేపు పెళ్ళిచూపులని శుభవార్త చెవిన చేరేసాడు. ఇంట్లో అందరూ రేపు జరుగబోయే పెళ్ళిచూపులకు ఏర్పాట్లు చేయ సాగారు.

***

పెళ్ళిచూపులు

          విశాల నిశ్చల మనస్సుతో ఎక్కువ ఊహలకు తావివ్వకుండా, అమ్మ ఇచ్చిన చీర, సింపుల్ గా మెళ్ళో గొలుసు వేసుకుని తయారుకాసాగింది. మగువ అందాన్ని ద్విగుణీ కృతం చేసేవి ముఖం పై చెదరని చిరునవ్వు, నిష్కల్మష మైన మనస్సు. అవి ఉంటే,  నగా, నట్రా కూడా అవసరం లేదేమో! ఇవన్నీ పుష్కలంగా ఉన్న సుగుణాలరాశి విశాల.

          ఆ రోజు ఉదయం మితంగా రెండు ఇడ్లీలు అల్పాహారంగా తీసుకుంది. పెద్దనాన్న గారి అమ్మాయి చందన వచ్చి, పెళ్ళిచూపులకు అన్నీ అమరు స్తోంది. శ్రీనివాస్ గారు ఫోన్ రింగయితే, రిసీవర్ తీయగానే, అవతలివైపు నించి, పెళ్ళికొడుకు తండ్రీ, విశ్వనాథంగారు

          “అయ్యా! మేము బయలుదేరుతున్నాం! ఇంకో అరగంటలో అక్కడ ఉంటాం” అని చెప్పగానే,

          శ్రీనివాస్ గారు, “ శారదా! వాళ్ళు ఇంకో అరగంటలో ఇక్కడ ఉంటారు. ఫలహారాలు, కాఫీ, పూలు, పళ్ళు అన్నీ సిద్ధం చేసుకోండి. అమ్మాయిని సిద్ధం చేసి లోపలకూర్చోబెట్టు.” అని ఆయన ఇంటి గుమ్మం దగ్గర అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోసాగారు.

          మేడమీద గదిలో చందన, విశాలతో కూర్చుని మాట్లాడుతోంది. “విశాలా! నిన్ను చూస్తుంటే, నాకు నా పెళ్ళిచూపుల ఫ్లాష్ బ్యాక్ రీలు తిరుగుతోంది. నన్ను, పుస్తకం చదవ మన్నారు మా మామయ్యగారు, నా గొంతు వినాలని. మా అత్తగారు, పాట పాడమన్నారు. నేను, రాధకు, నీవేర ప్రాణం అని పాడగానే, అందరూ నన్ను మెచ్చేసుకుని,అక్కడికక్కడే మా ఇద్దరికీ వరుసలు కలిపేసి, సంబంధం ఖాయం చేసేసుకున్నారు.”

          అరగంట అయినా వస్తామన్న పెళ్ళివారు ఇంకా రాకపోవడంతో శ్రీనివాస్ గారు వాచి చూసుకున్నారు. ఏ కారు వచ్చినా గుమ్మం ముందుకు వెళ్ళి చూసి రావడం, మళ్ళీ వాళ్ళు కాదని తిరిగి సోఫాలో చతికిలబడటం ఇలా మూడు సార్లు జరిగింది. ఇంతలో ఫోన్ మ్రోగితే పెళ్ళివారేమోనని ఆదుర్దాతో ఫోన్ తీయ గానే,

          “నేను యమున మాట్లాడుతున్నాను, అంకుల్ ఒకసారి విశాలకు ఫోన్ ఇస్తారా?” గదిలో నుంచి విశాల వచ్చి ఫోన్ అందుకోగానే, “విశాలా! నేను యమున మాట్లాడు తున్నాను. ఇక్కడే దగ్గర్లో ఉన్నాను. ఒకసారి నిన్ను చూసి వెడదామని”

          విశాల ఇరకాటంలో పడింది, ఇప్పుడు ఒకప్రక్క పెళ్ళివారు వస్తున్నారు. ఏం చెప్పాలో తెలీక సతమతమవుతూ, “యమునా! నేను ప్రస్తుతం కాస్త బిజీగా ఉన్నాను. ఇంటికి గెస్ట్ వస్తున్నారు అంటూండగానే కారు ఆగిన చప్పుడవటం తో, ఫోన్ పెట్టేసి గదిలోకి వెళ్ళింది. గబుక్కున చందన, విశాలను లాక్కెళ్ళి, వెనుక గది ముందు కిటికీ లోంచి అప్పుడే కారు దిగుతున్న అబ్బాయిని చూపిస్తూ, పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు, చూడు. అనగానే, ఒక్కసారిగా అలా అరసెకను చూసి, మళ్ళీ సిగ్గుతో లోపలికి వచ్చేసింది.

          “విశాలా! నేను, పిన్నికి వెళ్ళి, సాయం చేస్తాను. మళ్ళీ వస్తాను. బిపాజిటివ్. ఆల్ ద బెస్ట్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చందన.

          “అనుకోకుండా రెప్పపాటు కాలంలో అబ్బాయికి తెలియకుండా, అరె, చందన వల్ల నేను అతనిని చూసాను. ఇన్నాళ్ళు మనస్సులో దాగి ఉన్న సస్పెన్స్ కి తెర పడనుందా అబ్బాయి రూపు రేఖలు, ఒడ్డు, పొడుగు బాగున్నాయి, అందగాడే, సుమా!” అని అనుకో కుండా ఉండలేక పోయింది విశాల. కారులోంచి అబ్బాయి తల్లిదండ్రులు దిగగానే, విశాల తండ్రి, తల్లి ఎదురెళ్ళి వాళ్ళని, పెళ్ళి కొడుకుని సాదరంగా లోపలికి ఆహ్వానించారు. అడ్రస్ కనుక్కోవడం కాస్త కష్టమయింది. బాగా లేటయ్యింది, అనుకున్న సమయానికి రాలేక పోయాము, ఏమి అనుకోవద్దు అని మధ్యవర్తి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. పెళ్ళి కొడుకు, అతని తల్లిదండ్రులు అన్నపూర్ణ, విశ్వనాథం గారు, మధ్యవర్తి వరుసకి పెళ్ళి కొడుకు బావ శంకరం, అక్క వైదేహి వచ్చారు. సంబంధం తీసుకువచ్చిన మధ్యవర్తి అందర్నీ పరిచయం చేసాడు.

          చందన అందరికీ మంచినీళ్ళు అందించింది. తరువాత అరటికాయ బజ్జీలు, కొబ్బరి పచ్చడి, మైసూర్ పాక్ గుంటల పళ్ళెంలో అందంగా అమర్చి “ఫలహారం తీసు కోండి” అని శారద టీపాయ్ మీద పెట్టింది.

          “మా అబ్బాయ్ అనుకోకుండా హైద్రాబాద్ వచ్చాడు. మళ్ళీ రేపు బెంగుళూర్ వెళ్ళి పోతాడు. ఇంక ఆలశ్యం చేయకుండా ముందు అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చూసు కుంటే ఈ వచ్చే శ్రావణమాసంలోనే పెళ్ళి చేసేయాలని చూస్తున్నాము.”అని విశ్వనాథ్ గారు మాటలు కలిపారు.

          అబ్బాయి తల్లి అన్నపూర్ణ నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో, కుంకుమ రంగు జరీ బూటా చీరలో నిండుగా కళగా నవ్వు ముఖంతో అందర్నీ పలుకరిం చింది. మెల్లిగా అందరూ కాఫీలు తీసుకుంటూండగా, విశ్వనాథంగారు “అమ్మాయిని తీసుకురండి బావ గారు మళ్ళీ వర్జ్యం రాకుండా” అనగానే శారద, చందన లోపలికి వెళ్లి విశాలను చేతులు పట్టుకుని మెల్లిగా హాలులోకి తీసుకు వచ్చి పెళ్ళికొడుకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చో బెట్టారు.

          ఒక్కసారిగా నిశ్శబ్దం. అక్కడ ఉన్న అందరి కళ్ళూ పెళ్ళికొడుకు, పెళ్ళి కూతురి పైనే.

          అమ్మాయి తరపువారు అబ్బాయి వైపు, అబ్బాయి తరపువారు అమ్మాయి వైపు చూపులు సారించారు. విశాలకు ఆ సమయంలో తనవైపు అందరూ చూస్తున్నారు అంటే తెలియకుండానే బిడియంతో నేల చూపులు చూడ సాగింది. విశాలను చూసిన క్షణంలో అబ్బాయి కన్నులలో మెరిసిన మెరుపును అన్నపూర్ణగారు గ్రహించారు.

          వెనకాల మంద్ర స్థాయిలో సితార వాయిద్యం స్టీరియోలో ప్లే అవుతూ ఆవాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఇరువురి జీవితాల్లో అపురూప ఘడియకు నాంది పలికే క్షణాలు అంటే ఇవేనా!!!

          అన్నపూర్ణగారు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ “రండి. అందరం అక్కడ తోటలో మొక్కలు, ఇల్లు చూసివద్దాం.” అంటూ అందరూ అక్కడి నుంచి వెనుక నున్న అందమైన పూల వనంలోకి దారి తీసారు. సమయానికి తగినట్లుగా అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకోవటానికి అన్నట్లుగా అన్నపూర్ణగారు కలుగచేసిన ఆ కలయికకు, ఆవిడ అఖండమైన తెలివితేటలకు అక్కడున్నఅందరూఅచ్చెరు వొందారు. ఇప్పుడు అక్కడ కేవలం పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మాత్రమే ఉన్నారు.

          “నా పేరు మీకు తెలుసు కదా” అని గొంతు సవరించుకుని విశాలను చూస్తూ చిరునవ్వుతో సంభాషణ మొదలుపెట్టాడు పెళ్ళికొడుకు. 

          విశాల అపుడే క్రీగంట అబ్బాయి వైపు చూసింది. తెలియదు అన్నట్లుగా తల ఆడించింది.

          “నా పేరు విష్ణుసాయి. నేను బయోమెడికల్ ఇంజనీరింగ్ జె.ఎన్.టి.యు
యూనివర్సిటీలో చేసాను. డిస్టింక్షన్ వచ్చింది.

          ఓ! మీ పేరు ఎపుడూ వినలేదు. ఒకేసారి ఇద్దరు దేముడి నామాలను తలుచుకునే పేరు అని చిరునవ్వుతో మొదటిసారి స్పష్టంగా అబ్బాయిని చూసింది. ఆ క్షణంలో ఇరువురి చూపులు ఒకేసారి కలుసుకున్నాయి. చూపులు కలిసిన శుభవేళ అంటే ఇదేనేమో!

          “అవును అమ్మ ఇష్టదైవం సద్గురు సాయి, నాన్నగారు ప్రతిరోజు వేళ తప్పకుండా స్మరించే విష్ణుసహస్రనామాలు ఇలా నాకీ పేరు వచ్చింది.”

          “మీ సబ్జెక్ట్స్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇంటెరెస్టింగ్. అందరూ తీసుకున్న రొటీన్ సాప్ట్ వేర్, కంప్యూటర్ సైన్స్ కాకుండా వెరైటీగా వేరే కోర్స్ చేసారు కదా!”

          “అవును, నాకు ఈ ఫీల్డ్ లోనే ఫర్థర్ గా కెరీర్ కొనసాగించాలను కుంటున్నాను. ఈ సబ్జెక్ట్ కి ఆస్ట్రేలియా దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఆస్ట్రేలియా వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాను.” ఆగి విశాల వైపు చూసాడు విష్ణుసాయి.

          ఆస్ట్రేలియా పేరు వినగానే, ఒక్కసారి విశాల ఆనందానికి గురైంది. తను అప్పట్లో కాలేజీ చదివే రోజుల్లో సిడ్నీ సుందరమైన నగరం, ఒక్క సారైనా చూడాలి అనుకున్న విషయం మనసులో అప్రయత్నంగా మెదిలింది. ఆసక్తి గా విష్ణుసాయి చెప్పే విషయాలు వినసాగింది. విశాల కన్నుల్లో భావాలను చదివే ప్రయత్నం చేస్తూ మళ్ళీ కొనసాగించాడు విష్ణుసాయి.

          మా కాలేజీలో ప్రొఫెసర్ తను సెమినార్ కి ఆస్ట్రేలియా వెళ్ళినపుడు అక్కడ ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి చెపుతూ నన్ను కూడా రమ్మని ప్రోత్సహించారు. ఆయన అక్కడే స్థిరపడిపోయారు. నాకు అలా ఆస్ట్రేలియా వెళ్ళాలని ఆలోచన కలిగింది. స్కిల్డ్ మైగ్రేషన్ వీసా కోసం అప్లై చేసాను. ప్రస్తుతం బెంగుళూర్ లో ఉద్యోగం చేస్తున్నాను.”వారి ఇద్దరూ ఇపుడు ఒక సమావేశానికి హాజరైన సబ్జెక్ట్ మేటర్ స్పెషలిష్ట్స్ లాగా ఎన్నో  విషయాలు కాసేపు మాట్లాడుకున్నారు. ఎక్కడా పెళ్ళి చూపుల తతంగం అన్న ప్రసక్తి లేకుండా, భయం, బిడియం కాసేపు వారిరువురి నుంచి దూరంగా జరిగి పోయాయి.

          విష్ణుసాయి మాటలలో “నేను అమ్మకు మంచి సెక్రెటరీగా అన్ని పనులు చేసి పెట్టడం నాకు చాలా ఇష్టం. క్లీన్లీనెస్ ఈస్ గాడ్ లీనెస్ అనుకుంటాను. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తాను. విశాలా, నా గురించి మీకు అన్ని విషయాలు తెలియ చేస్తున్నాను. భవిష్యత్తులో మీరు నా చేయి అందుకుని, ఆస్ట్రేలియా రాగలరని నేను నమ్ముతున్నాను.” అలా చివర విష్ణుసాయి అన్న మాటలు వినగానే విశాల తన చెవులను తానే నమ్మలేక పోయింది.

          తను కలలుగన్న ఆస్ట్రేలియా దేశానికి విష్ణుసాయి జతగా తనను తీసుకు వెడతాను, తను నచ్చిన విషయం ఈ విధంగా వెంటనే తెలియ చేసేసాడా!” విస్మయం చెందిన కళ్ళతో ఏదో మాట్లాడేలోపుగా అక్కడకి తోటలోంచి తల్లి, దండ్రి, విశ్వనాథ్ గారు,అన్నపూర్ణ గారు లోపలికి వచ్చేసారు.

          “ఏమర్రా! మీరు మాట్లాడు కోవటం అయిందా? ఏమ్మా! మా అబ్బాయి నీకు నచ్చేడా?” అని విశ్వనాథ్ గారు అనగానే ఊహించని ఆ ప్రశ్నకు విశాల సిగ్గు పడిపోయింది. అందరి ముందు ధైర్యంగా నచ్చాడుఅని చెప్పడానికి, వినయం, బిడియం ఆమెకు అడ్డు వచ్చాయి.

          ఇంతలో అన్నపూర్ణగారు ప్లాస్టిక్ వైర్ బాగ్ లోంచి ఆపిల్ పళ్ళు, కనకాంబరం, మల్లె పూలమాల తీసి, బొట్టు పెట్టి ఆమె చేతిలో పెట్టారు.ఇంతలో మధ్యవర్తి శంకరం గారు అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళండి అన్నారు. శారద అందరికీ బొట్టు పెట్టి, చేతిలో రవికుల గుడ్డ, పూలు, పళ్ళు ఇచ్చారు. ‘బావగారు, చాలా సంతోషం. మమ్మల్ని పిలిచి, చక్కగా ఆదరించారు.జాతకాలు ముందుగానే చూపించాము కాబట్టి, అబ్బాయి ఇష్టం తెలియగానే, మేము ఇంటికి వెళ్ళాక మళ్ళీ కబురు చేస్తాము. మీరు కూడా అమ్మాయి ఇష్టం తెలుసు కోండి” అని కరచాలనం చేసుకుని అందరూ వెనుదిరిగారు.

          అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోగానే అందరూ విశాల చుట్టూ మూగారు. చందన విశాల దగ్గరికి వచ్చి, “పెళ్ళికళ వచ్చేసిందే బాలా” అంటూ బుగ్గన చిటికేసింది. విశాల అందరి ప్రశ్నలు తప్పించు కుంటూ గదిలోకి వెళ్ళి మెడలో నగ, చీర మార్చుకుని, తనకిష్టమైన గ్రీన్ చుడీదార్ వేసుకుని బయటకు వచ్చింది. అందరికీ భోజనానికి రమ్మంటూ తల్లి శారద పిలిచింది. మెల్లిగా భోజనాలు అయ్యాక పెళ్ళిచూపలకు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళి పోయాక, తల్లి, తండ్రి విశాల దగ్గరకు వచ్చారు.

          “అమ్మా విశాల! చెప్పు నీ అభిప్రాయం ఏమిటి? అబ్బాయి నీకు నచ్చాడా?” అని శ్రీనివాస్ గారు అడిగారు. 

          తల్లి శారద అబ్బాయి చాలాబాగున్నాడు, ఆవిడ అన్నపూర్ణగారు కూడా మంచి పద్ధతిగా ఉన్నారు. కుటుంబం మొత్తం సంప్రదాయంగా, మనకు సరిపోయేటట్లుగా అన్ని విధాలా తగిన సంబంధం అనుకుంటున్నాను.

          విశాల నెమ్మదిగా వారి మాటలు విన్నాక, “అవును నాన్నగారు అబ్బాయి మాట్లాడిన విధానం, మాటతీరు నాకు నచ్చాయి. అయితే ఒక విషయం. తనకు ఆస్ట్రేలియా వెళ్ళే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. నేను మిమ్మల్ని అందర్నీ వదిలి ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలా మరి?”

          వెంటనే శ్రీనివాస్ గారు, “విశాలా! ఇపుడు భారతదేశంలో ఉన్నా, ఇక్కడే హైద్రాబాద్ లో మా దగ్గిరే ఉంటావని లేదుగా! వేరే రాష్ట్రంలో ఉన్నా ఏదైనా గాని, తప్పదు ఈ దూరా భారాలు. అయినా ఫ్ల్లైట్ లో రావడం ఎంతసేపు. నీ చదువుకు తగిన అవకాశాలు అక్కడే ఉన్నాయేమో! అబ్బాయి నీకునచ్చాడుగా, జాతకాలు కూడా బాగా కలిసాయి.” అలా అంటూడగానే ఫోన్ మ్రోగింది. అవతలి కంఠం, “బావగారు, నేను విశ్వనాథం! నోరు తీపి చేసుకోండి. శుభవార్త! మా అబ్బాయికి మీ అమ్మాయి అన్నివిధాలా నచ్చింది. మీరు తాంబూలాలు పుచ్చుకుని, వెంటనే నెల రోజులలో పెళ్ళి జరిపించ గలరా?”అని అడిగారు.

          “ఆహా! చాలా సంతోషం, బావగారు! మేముకూడా సిద్ధంగానే ఉన్నాము. త్వరలోనే బ్రహ్మగారిని సంప్రదించి, నిశ్చితార్థానికి, పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాను”

          “శుభం, తేదీలు ఖరారైతే మా అబ్బాయి సెలవు తీసుకుంటాడు.” అక్కడే ఉన్న శారదగారు ఆనందంతో విశాలను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నా రు. విశాల గదిలోకి వెళ్ళి ఆలోచించుకోసాగింది.

          “నేను వేయబోతున్న అడుగు సరైనదేనా, కాదా? ఇంకా నేను ఎమ్.బి.ఏ ఆఖరి సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉంది. ఉద్యోగం చేయాలని ఎన్నో కలలు కన్నాను. నేను ప్రేమించే నా దేశాన్ని, నా భాషను వదిలి, వేరే దేశం వెళ్ళిపోవాలి. అమ్మ, నాన్నకి నా అభిప్రాయం నచ్చాడు అని చెప్పాను. ఇంత లోనే ఫోన్, నేను నచ్చాను, తాంబూలాలు అంటూ…. అసలు వ్యవధి కూడా లేదాయె. కల్యాణ ఘడియ రావడం అంటే ఇంత తొందరగా వచ్చేస్తుందా? “మరుసటి రోజు చందన వచ్చింది. చందన తనకు అక్కగానే గాక, ఒక మంచి స్నేహితురాలు, మెంటర్ గా తనకు కొన్ని విషయాలలో మంచి గైడెన్స్ ఇస్తుంది. తనలో జరుగుతున్న మానసిక సంఘర్షణ, తను, విష్ణుసాయిమాట్లాడు కున్న విషయాలు చెప్పింది.

          “విశాలా! నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. సరైన వయసులో నీకు అమ్మా, నాన్న చక్కగా మంచి అబ్బాయిని చూసి వాళ్ళ సమక్షంలో పెళ్ళి నిశ్చయ మవుతోంది. పైగా అబ్బాయి క్వాలిఫికేషన్, తరువాత ఆస్ట్రేలియాలో వెళ్ళే ఆలోచన. నీకు చదువు విషయంలో అభ్యంతరాలు కూడా ఏమి ఉన్నాయని చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే స్కిల్డ్ మైగ్రేషన్ అంటే నీ క్వాలిఫికేషన్ కూడా తోడై ఇద్దరూ ఒకేసారి ఆస్ట్రేలియా వెళ్ళవచ్చు. నీకు కూడా అక్కడ బంగారు భవిష్యత్తు ఉందేమో. ప్రతి నాణం వెనుక బొమ్మా, బొరుసు ఉన్నట్లే ఏ దారి వైపు మళ్ళాలి అనేది నిజంగా సందిగ్ధంగా ఉంటుంది. కానీ ఆశావాద దృక్పధంతో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా ఒక్కోసారి నిర్ణయం తీసుకోవాలి. పెళ్ళి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. పెళ్ళికి ముందే నీకు జాబ్ వచ్చి, స్థిరపడితే ఇటు ఉద్యోగం వదిలి వేరే చోటికి వెళ్ళలేవు. నీ గ్రోత్ కూడా అక్కడే ఆగిపోతుంది. నువ్వు చేయవలసిందల్లా, ఆస్ట్రేలియాలో నీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగ అవకాశాలు, ఆస్ట్రేలియా దేశం గురించి అన్ని విషయాలు అధ్యయనం చెయ్యి. నీ పైనల్ ఇయర్ ఎగ్జామ్స్, ప్రోజెక్ట్ వర్క్ పూర్తి చేసేయ్. ఎంగేజ్ మెంట్, పెళ్ళి పనులు వాటితో డిస్టర్బ్ కానవసరం లేదు. బ్రెయిన్ లో ఏ కంపార్ట్ మెంట్ కు ఆ కంపార్ట్ మెంట్ కేటాయించుకో”

          “చందనా! నా మనసులో భయాలన్నీ దూదిపింజంలా పక్కకు జారు కున్నాయి. అబ్బా! నువ్వు ఇచ్చిన ఈ బూస్టింగ్ నేను ఎప్పటికీ మరిచిపోలేను.” అంటూ చెయ్యిని మెత్తగా నొక్కింది.

          మనసులో విష్ణుసాయి, పేరు తలుచు కుంటూ తనకు కాబోయే జీవిత భాగస్వామి రూపం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది.

          “అలా కలలో రాకుమారుడిలా వచ్చి, తీయగా మాట్లాడి ఇలా వెళ్లిపోయారు. కనీసం ఫోటో కూడా లేదు చూడటానికి. నా గురించి వివరాలు కూడా ఎక్కువ అడగలేదు. కాబోయే అత్తగారైతే ఎంత లౌక్యంగా తోట చూద్దా మంటూ, అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి,మా ఇద్దరికీ మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు. ఎంత హుందా ఐన మనిషి.” ఆ రోజు తేలికైన మనస్సుతో రేపు తను వెళ్ళబోయే ప్రాజెక్ట్ వర్క్ గురించి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేం చేయాలో ఆలోచిస్తూ నోట్స్ రెడీ చేసుకుంది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

One thought on “అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-3”

  1. చక్కని కథనం విజయ గొళ్లమూడి గారు ….. ఆసక్తికరంగా సాగుతుంది రచన ..అభినందనలు

Leave a Reply

Your email address will not be published.