క్షమయా ధరిత్రి

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

-కైకాల వెంకట సుమలత

 

చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపర్ తీసుకుని కూర్చున్నాను…రాయాలన్న కోరిక బలంగా ఉంది కానీ ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియడం లేదు.గుండె నిండిన వ్యధ తీరాలంటే
పెన్ను కదలాలి. ఊహ తెలిసిన నాటి నుండి నా మనసు లోని కష్టం సుఖం తెల్లకాగితానికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదేమో!…
 
కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లలా అత్తగారింట్లో అడుగు పెట్టాను. అడుగడుగునా ఆడపడుచుల ఆంక్షలు అత్తమామల అధికారాలు… ఇవన్నీ చాలవన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన … భార్య అంటే భరించే బానిస అనే భావం అయన నరనరాల్లో జీర్ణించుకుపోయింది.
పనివాళ్ళ ముందు బంధువుల ముందు  బూతులతో  కించపరిచేలా మాట్లాడేవారు 
 
ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులున్నారా అని ఆశ్చర్యం కలిగేది. నా దురదృష్టానికి నన్ను నేనే నిందించుకొని కాల ప్రవాహంలో జీవనపయనం సాగించాను.
 
మనిషిగా నా కంటూ  ఒక వ్యక్తిత్వం ఉంది కాబట్టి అడుగడుగునా అది నన్ను  నిలదీస్తున్నా మౌనంగా నా విద్యుక్త ధర్మాన్ని  నెరవేర్చేదాన్ని. నేను మంచిపని చేసినా మా ఆయన దృష్టిలో చెడ్డగానే కనిపిస్తుంది.చులకనగానే   మాట్లాడేవారు.నాకంటూ తెలివి ఉండటం అన్న ఆలోచన ఆయన భరించలేరు.తెలివి తేటలు లేని దద్దమ్మగా కనిపిస్తుంటే పురుషాహాంకారం తో అయన ముఖం వెలిగేది.
 
నాకు మాత్రం ఆయన ముఖంలో అహంకారం చూస్తుంటే “మీరు ఊహిస్తుంది పచ్చి అబద్ధం” అని పెద్దగా అరవాలనిపించేది…కానీ దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం వహించేదాన్ని.
 
“నాకు మీరు ఊహించుకునేదాని కన్నా ఎక్కువే తెలుసు నాకంటూ కొంత తెలివి ఉంది. కోరికలూ ఉన్నాయి …కొన్ని ఆశయాలున్నాయి” అని నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు …రాలేదు అనేకన్నా వచ్చినా నేను ప్రయతించలేదు అనడం సబబుగా ఉంటుంది. ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే “చెప్పావులే…నువ్వు చెప్పేంత క్రింద స్థాయిలో నేను లేను… నేను చెప్పేది విను బాగుపడతావు…నీకు ఎప్పుడూ పుట్టింటి ధ్యాస తప్ప మొగుడు …మొగుడి తరపు వాళ్ళ మీద పట్టింపు ఉండదు” అని  అర్థంపర్థం లేని పెద్ద పెద్ద అరుపులు అరిచి మీద మీదకు వచ్చేవారు. 
 
వాస్తవానికి నా పుట్టినింటి వాళ్ళు ఆయనకి దడిసి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు.ఆయనతో మాట్లాడే సాహసం కూడా చేయరు.అయినా వాళ్ళని  ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడంలో పైశాచిక ఆనందాన్ని పొందుతారీయన..
 
భయంకరమైన గొంతుతో అరుస్తుంటే
పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కు వచ్చి దాక్కునే వారు.
 
మా వారికి కుటుంబ అవసరాలు తీర్చడంతో మగవాడిగా ఆయన బాధ్యత తీరిపోయినట్లే  అని ఫీలయ్యేవారు.
 
ఏనాడు పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోవడం నాకు తెలియదు. అలా చేస్తే వాళ్ళు గారాబంతో చెడిపోతారు అని ఆయన ధృఢవిశ్వాసం.
 
పాపం….పిల్లలిద్దరూ తోటి పిల్లలు వాళ్ళ తండ్రితో షికార్లకు వెళ్తుంటే బిక్కముఖంతో నన్ను చూసేవాళ్ళు….
 
నాకు నా బాధ్యత రెట్టింపయినట్లనిపించేది.
నేనే ఆదివారాలు పార్కులకి అపుడపుడు సినిమాలకి తీసుకెళ్ళేదాన్ని. అప్పుడు కూడా గొడవ అయ్యేది కానీ పిల్లల కోసం పట్టించుకునే దాన్ని కాదు.వాళ్ళే నా ప్రపంచంగా నాకంటూ వేరే వ్యాపకం లేదన్నంతగా బ్రతకడం మొదలుపెట్టాను. మా వారి నిరంకుశధోరణి ని కూడా మనసు మీదకి తీసుకోవడం మానేసాను. 
 
కాలం ఆయనకున్న దురలవాట్ల ప్రభావంతో అనారోగ్యాలను తెచ్చింది. వాటి వల్ల ఇంకాస్త కోపం అసహనం పెరిగాయి. అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధింపబడటం  కూడా మొదలయింది. 
 
అన్నీ పిల్లల కోసం భరించేదాన్ని.  దూరంగా ఉన్న పుట్టింటి వాళ్ళకి కూడా నా బాధ ఎప్పుడూ చెప్పుకునేదాన్ని కాదు.దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్ళను బాధకు గురి చేయడం నాకు నచ్చేది కాదు.
 
నా లాంటి దుస్థితి పగవాళ్ళకి కూడా రాకూడదని దేవుడిని నిత్యం ప్రార్థించేదాన్ని….
 
నా అదృష్టం జీవిత భాగస్వామి విషయం లో లేకపోయినా కన్నపిల్లల విషయం లో ఉంది. పిల్లలిద్దరూ నా పెంపకంలో చక్కటి విద్య నభ్యసించారు.నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు.
అవకాశాలు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చాయి. 
 
ఇద్దరు పిల్లలు నా కళ్ళు అనుకునేదాన్ని. చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తాను అంటే ఆయన ససేమిరా  వద్దు అన్నారు. అప్పటి వరకు  నా విషయం లో అన్నింటినీ మౌనంగా సహించే నేను పిల్లల భవిష్యత్తు విషయం లో ఊరుకోలేదు.నా బంగారం అంతా ఇచ్చేసాను. ఎడ్యుకేషన్ లోను తీసుకొని పంపమని వాళ్ళను నిరాశ పరచవద్దని గొడవ చేసాను.
 
పెద్దవాడు వెళ్ళిన రెండేళ్ళకు చిన్నవాడు వెళ్ళాడు.వెళ్ళినందుకు పిల్లలు కష్టపడ్డారు…చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలలో స్థిరపడ్డారు.
లోను కట్టేసారు.నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది.
 
ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లవారేది…పిల్లల మాటలతోనే రాత్రయేది.
 
పెద్ద వాడు వేరే కులం అమ్మాయిని చేసుకుంటాను అని మెల్లిగా నా చెవిన వేసాడు. గుండె గుభేలుమంది. ఆయనకి ఎలా చెప్పాలా అని భయపడ్డాను….
 
కానీ చెప్పక పోతే వాడితో బాధ
చెప్తే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకొని ఆయనకి చెప్పాను.
 
అనుకున్నట్లే ఇంతెత్తున ఎగిరిపడ్డారు.
సర్ది చెప్పాలనుకున్నా ఎంతమాత్రం వినలేదు.వద్దన్నా అమెరికా పంపించావు కదా ఈ పెళ్ళి కూడా నువ్వే కుదిర్చావా? అందుకే సర్ది చెప్తున్నావా అని  చెంప పగలగొట్టారు.
నాకేమీ తెలియదు అన్నా మూర్ఖంగా వాదించారు.
 
ఇవేమీ బాబుకి చెప్పకుండా అన్యకులస్థులను చేసుకోవడంలో ఉన్న  సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను. వాడు చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతాను అన్నాడు.
 
చేసేదేమీ లేక ఆయనని బ్రతిమిలాడాను….ఎన్నో రోజుల నా కన్నీటి ఫలితంగా వాడి పెళ్ళి జరిగింది. సంతోషంగా తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు.
 
వాళ్ళు వెళ్ళిపోయినా ఈయన ఆ పెళ్ళి నా కారణంగానే జరిగిందని గొడవ జరిగినప్పుడల్లా నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు.
 
ఒకోసారి ఆయనకి అందనంత దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది…కానీ అది పిరికివాళ్ళు చేసే పని అని నన్ను నేనే ఓదార్చుకుంటాను. బాధ్యతల బరువు నుండి తప్పుకోవడం తప్పు అని ఓర్పుతెచ్చుకుంటాను …
 
కొంతకాలానికి రెండవ వాడికి ఆయన బంధువుల తరపున సంబంధం కుదిరింది. మా వారి హడావిడికి అంతేలేకుండా పోయింది. పెద్దవాడి పెళ్ళిలో  తప్పిపోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించుకోవడం … అజమాయిషీ చేయడం చేసారు.ఆరోగ్యం సరిగా లేని మనిషి కావడం వల్ల నీరసమయ్యారు.
 
పెళ్ళిలో స్టేజి మీద పంతులు గారు అడిగిన కండువా వెతుకుతున్న నా మీద ” కండువా పెట్టావా ?మరచి పోయావా ? నీ లాంటి చవటని పెళ్ళిచేసుకోవడం నా దరిద్రం” అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు.
 
అప్పటికే బ్యాగు అడుగునుండి తీసిన కండువా నా చేతిలో ఉంది. పడిపోయిన ఆయన చుట్టూ అందరూ చుట్టుముట్టారు.
 
నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది.
అంతలో ఆయన పడిపోవడంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను. ఎవరో పంచదార నీళ్ళు తెచ్చి నోట్లో పోయడం వల్ల కళ్ళు తెరిచారు. పెళ్ళి ఆపకుండా తాళి కట్టించమని చెప్పి మేము హస్పిటల్ కి  ఆయనని తీసుకువెళ్ళాం.
 
డాక్టర్ రెండురోజులు ఉంచమన్నారు. అటు ఆయన బాధ్యత …ఇటు పెళ్ళి కి వచ్చిన బంధువుల బాధ్యత, పెళ్ళికూతురి తరపు  వారికి మర్యాదలు చూసుకోవడం నాకు తలకు  మించిన బరువయింది.
శారీరకంగా మానసికంగా నలిగిపోయాను. పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి కుటుంబాలకు మర్యాద లోపం లేకుండా చూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీదకు మళ్ళలేదు. కొత్త మురిపంలో ఉన్నారు అని సరిపెట్టుకున్నాను.
 
పిల్లలు కానీ ,పెళ్లికి వచ్చిన ఆడపడుచులు కానీ నా మీద ఆయన అలా అరవడం తప్పు అని ఆయన తో మాట మాత్రంగా కూడా చెప్పలేదు. నా మానసిక పరిస్థితి గురించిన అవసరం ఎవరికీ లేదని తెలిసింది.అంటే దాని అర్థం ఎప్పుడూ అరిచే లాగానే ఆయన అరిచారు ఎప్పుడూ సర్డుకున్నట్లే అమ్మ సర్దుకుంటుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు. అది నన్ను చాలా క్రుంగదీసింది.న్యాయంగా ఎవరూ ఆలోచించడం లేదు అనే విషయం నన్ను సూదులతో గుచ్చినట్లు అనిపించింది.
 
ఎందుకో ఎప్పటి లా నార్మల్ అవలేకపోయాను.
 
పెళ్లి సెలవులు అయిపోయాయి పిల్లలు వెళ్లిపోయే రోజు వచ్చేసింది.
 
ప్రయాణానికి ముందు నన్ను మా వారిని మాట్లాడాలని  పిల్లలు కూర్చోబెట్టారు.
 
ముందుగా పెద్దవాడు  “డాడ్, అమ్మా మీరిద్దరూ ఇలా గొడవ పడుతుంటే మేమక్కడ స్థిమితంగా ఉండలేము… వర్క్ పైన కాన్సెంట్రేషన్ చేయలేము. ఇన్ని రోజుల సెలవుల వల్ల వర్క్ ప్రెజర్ ఎక్కువుంటుంది కాబట్టి మీరిద్దరూ గొడవ పడుతుంటే మేము సర్ధి చెప్పడం కూడా కష్టమే! అర్థం చేసుకోండి” అన్నాడు.
 
నాకు కరెంట్ షాక్ తగిలినట్లయింది.నోరు తెరిచి వాడినే చూస్తున్నాను. 
 
అంతలో చిన్నవాడు “నిజమే అమ్మా,డాడీ మీరిద్దరూ మీకు  ఎదుటి వారిలో నచ్చనిది ఉంటే మాట్లాడకుండా సైలెంట్ అవండి.  నచ్చితే మాట్లాడుకోండి లేకపోతే మానేయండి. కొంతకాలం వేరు వేరు గా ఉంటాము అంటే మేము ఏర్పాటు చేస్తాం” అన్నాడు.
 
నాకు నోటి వెంట మాట రాలేదు  కళ్లల్లో నీళ్ళు కూడా రాలేదు. 
 
నా పిల్లలేనా వీళ్ళు?…వీళ్ళ కోసమేనా
నేను ఇంత కాలం అష్టకష్టాలు పడింది?…
నేను గొడవ పడతానా?…”నువ్వే ఎదురు తిరగకుండా ఆయనకి అరుపులు అలవాటు చేసావు అనేవాళ్ళు కదా” అవి మరచిపోయారా? లేకపోతే డాడ్ కి అనారోగ్యం ఉంది కాబట్టి అమ్మకి సర్దిచెప్తే సరిపోతుంది అనుకున్నారా?…
అలా గొడవ పడటం…నా స్వార్థం నేను చూసుకోవడం చేసి ఉంటే  వాళ్ళ జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్ళు మరచిపోకూడదు కదా? 
సంఘటన జరిగినప్పుడు నా తరపున ఎవరూ మాట్లాడలేదు అంటే సరిపెట్టుకున్నాను… అప్పుడు అయన ఆరోగ్య సమస్య వల్ల అనుకున్నాను.
 
తరువాత ఆయన తో అమ్మని అలా అందరి ముందు అవమానించడం తప్పు అని చెప్పలేదు. పెళ్లి సరదాలలో ఉన్నారు అని సరిపెట్టుకున్నాను.
 
అపుడపుడు నా బాధని పిల్లలు ఫోన్ చేసినపుడు చెప్పుకునేదాన్ని. నాకు  పరోక్షంగా అలాంటివి చెప్పి విసిగించొద్దు అని చెప్పినట్లుగా కూడా అనిపించింది…
 
అంటే వీళ్ళ కోసం ఇన్నాళ్లు నేను నా మనసు చంపుకొని బ్రతికిన బ్రతుకికి అర్థం లేదు అని స్పష్టం అయింది…’
 
అనారోగ్యంగా ఉన్న నాన్న తో తప్పు చేశారు అని చెప్పేంత సాహసం చేయలేదు. అన్నింటికీ సర్దుకునే అమ్మను…అమ్మ ప్రేమను చులకన భావంతో చూస్తున్నట్లు స్పష్టమైంది.
 
ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు….
 
‘కుటుంబ బాధ్యతలు అంటే నా సలహా,సంప్రదింపులు లేకుండా కావలసినవి …ఆయనకి నచ్చినవి చేసి మీకు లోటు లేకుండా అన్నింటినీ అమర్చాను…’ అని అయన నిర్వచనం ఇచ్చారు…
 
‘డబ్బులు కావాలంటే పంపుతాం. ఏటీఎం కార్డ్ ఇస్తాము వాడుకో…మంచి హాస్పిటల్ కి వెళ్లు… నిశబ్దంగా నీ రొటీన్ కష్టాలు నువ్వు పడు. అవి నీకు అలవాటే కదా ‘అని నా పిల్లలు నిర్వచనం ఇచ్చారు…
 
నాకంటూ ఒక వ్యక్తిత్వం  ఉంటుంది అన్న విషయం ఎప్పటికీ గ్రహించరు…నాకంటూ ఒక విలువ ఎప్పుడూ లేదు…ఉండదు అని పూర్తిగా అర్థమైంది.
 
పిల్లలతో ఎయిర్ పోర్టు వరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నాకు ఏడుపు రాలేదు. బహుశా అప్పటికే నేను మానసికంగా బ్రతికి లేనేమో!…ఏమో!…
 
అయ్యో…ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోతుంది.. ఏదో చీకటి కమ్ముతున్నట్లనిపిస్తుంది…రాయలేకపోతున్నా న్నా నా… ఊపిరి ఆడడం లేదు…ఇక నాకు ఈ బాధ నుండి విముక్తి వచ్చేస్తుందా?… అంతేనా… నా..నా… నా…నా?అంతే …తే…
 
ఏదో ఏడుపు లా వినిపిస్తుంది….నా చేతి మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తుంది…
ఏమిటిది?…నా కళ్ళు తెరవడానికి కష్టమనిపిస్తుంది…
 
“స్వామీ! నా శాంతిని బ్రతికించు…నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు “… అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆ గొంతు మా ఆయనది.
 
‘ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు’ అని బలవంతంగా కళ్ళు  తెరిచాను  మా వారు నా పక్కన కూర్చొని ఉన్నారు. ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు.
నాకు అది కొత్తగా.. వింతగా అనిపించింది.
 
“శాంతీ…నన్ను క్షమిస్తావా? “
 
“ఇదేమిటి? మీరు…నన్ను”…మాటలు రావడం లేదు.
 
“మంచినీళ్ళ కోసం చాలా సేపు పిలిచాను. నువ్వు పలకలేదు.  కోపంగా లేచి వచ్చేసరికి నువ్వు హల్ లో సోఫా మీద పడిపోయి ఉన్నావు.నిద్ర పోతున్నావేమో అనుకొని  తట్టి లేపా…స్పృహ లేదు. నీళ్ళు చల్లినా చలనం లేదు. చాలా కంగారు పడ్డాను.ఈ లోగా నువ్వు రాసుకున్న పేపర్స్ నీ పక్కన ఉండడంతో చదివా…ఇన్నాళ్లు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు…నువ్వు అనుభవించిన బాధ అన్నీ కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది. నువ్వు నాకు దూరం అయిపోయావు నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా ? ఒక్క అవకాశం నాకు ఇవ్వమని ఎప్పుడూ దేవుడిని తలవని నేను  ఆయనని వేడుకుంటున్నాను….” గొంతంతా దుఖంతో నిండి ఉంది.
 
ఆయనని ఏడవొద్దు అని వారించాను.
ఇన్నాళ్ల   నా క్షోభ అంతా ఏమైపోయిందో … ప్రశాంతంగా అయన చేతి మీద నా చెయ్యి వేసాను.

*****

Please follow and like us:

4 thoughts on “క్షమయా ధరిత్రి (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)”

  1. క్షమయా ధరిత్రీ రచయిత్రి కి మనసుపుర్టి అభినందనలు. కథలో తనపిల్లలు తన కష్ట అర్థం చేసుకుని చేయూతను ఇస్తారని ఆశించ నిరాశ చెందింది. కానీ ఎన్నడూ కలలో కూడా అను కొని విధంగా మారిన భర్త కథ కి మంచి మొలుగింపు ఇచ్చారు. రచయత్రి కి మనస్పూర్తగా అభినందనలు.
    Sincerely suguna (అక్షర)

  2. క్షమయా ధరిత్రి కథ చాలా చాలా బాగుంది. నిజంగా సుమలత గారి నిజ జీవితంలో ఇవన్నీ అనుభవించారా అన్నంతగా వ్రాసారు. వారికి అభినందనలు. ఇంకా ఇలాంటి వారున్నారా అని కథ మొదలుపెట్టారు రచయిత్రి. టెక్నాలజీ పెరుగుతున్నా, జనరేషన్ కి, జనరేషన్ కి పరిపక్వత వస్తున్నా మగాడు, మొగుడు అనే అహంకారం మాత్రం అలాగే ఉంది. ఆ పాయింట్ ని చాలా చక్కగా కథీకరించారు రచయిత్రి. కథ చాలా బాగుంది. అభినందనలు.

  3. క్షమయా ధరిత్రి కథలో ఒకతరానికి చెందిన స్త్రీల అంతరంగాన్ని కళ్ళకు కట్టినట్టు చూపారు. సాధికారతతో పరిస్థితులు మారుతున్నప్పటికీ, మన మూలాల్లో అలా నాటుకుపోయినందువల్ల ఆశించినంత మార్పు రాలేదు. మనసును హత్తుకుంది మీ కథ. ధన్యవాదాలు

  4. శీర్షికకు తగ్గ కథ ! బాగుంది

Leave a Reply

Your email address will not be published.