జీవితం అంచున -4 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

Every great dream begins with a dreamer..

ఎప్పుడో ఎక్కడో చదివిన కోట్.

అవును. చిరకాల కల.

నిశిరాతిరి నిద్దట్లో కల…

వేకువజాము కల…

పట్టపగటి కల…

వేళ ఏదయినా కల ఒకటే.

         మనది కాని విదేశీయుల విశ్వవిద్యాలయంలో ఎప్పుడెప్పుడు అడుగు మోపుతానా అని మనసు ఒకటే ఉవ్విళ్లూరుతోంది. నర్సింగ్ విద్యార్థి ఊహే నా వయసును అమాంతం రెండింతలు తగ్గించేసింది. మనలో శక్తి, ఓపిక, కోరిక వుండాలే కాని ఆకాశంలో తారల నందుకుని మన ప్రపంచాన్నే వెలిగించుకోమూ….

         ఇంట్లో పనులు రెట్టించిన ఉత్సాహంతో చకచకా చేసేస్తున్నాను. అమాంతం OCD ఆవహించేసి అతి శుభ్రత పాటిస్తున్నాను. కోవిడ్ ఆగడాలు సమసిపోతున్నా నేను చీటికి మాటికి చేతులు శ్యానిటైజ్ చేసుకుంటున్నాను. ఒక పునీతమైన వృత్తిని చేపట్టేప్పుడు ఆ మాత్రం శుచిని పాటించొద్దూ మరి !

         అమ్మ పదే పదే చెప్పే పాత కబుర్లను రెట్టించిన ఉత్సాహంతో వింటున్నాను. రేపు ముసలి, ముక్కా రోగులతో డీల్ చేయటానికి కావాల్సిన ఓర్పు, సహనాలను బలపర్చు కోవాలిగా.

         అమ్మ సపర్యలు, సేవలు వరకూ ఓకే. కాని వేరే రోగగ్రస్తులను అసహ్య పడకుండా సపర్యలు చేయగలనా…?

         నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన అల్లుడు అల్పాహారం తిని పడుకోకుండా స్టడీ రూములో కూర్చుని కంప్యూటర్ లో బిజీగా మునిగిపోయాడు.

         నా అడ్మిషన్ ఏమయ్యిందో తెలుసుకోవాలని ఉద్విగ్నంగా వున్నా నాకు నేనుగా అడగలేక ఊరుకున్నాను. అంతలో అతనే “మమ్మీజీ ఇలా రండి ఒకసారి” అని పిలిచాడు.

         ఈ ప్రపంచంలో అత్తగారిని ‘ఆంటీ’ అని కాకుండా ‘మమ్మీ’ అని పిలిచే ఏకైక అల్లుడు అతనే. నాకు కొడుకులు లేని కొరత తీర్చిన బిడ్డడు.

         గదిలోకి వెళ్ళాను. ఓ పేపర్ల దొంతర ప్రింట్ ఔట్స్ తీసి నా ముందుంచాడు.

         ఆశ్చర్యoగా ఏమిటన్నట్టుగా అతని వంక చూసాను.

         “అడ్మిషన్ రిక్వైర్మెంట్స్” అని బద్దకంగా కళ్ళు నులుముకుంటూ “పదింటికి డాక్టర్ అప్పాయింట్మెంట్ తీసుకున్నాను మీకు కొన్ని పరీక్షల కోసం. పాపకి పదిలోపు అల్పాహారం ముగించేయండి. ఈ పేపర్స్ అన్నీ చదివి సంతకాలు చేయండి” అన్నాడు.

         “చంటిదానితో డాక్టర్ దగ్గరికి ఎందుకయ్యా. అమ్మాయి ఇంట్లో వున్నప్పుడు అప్పాయింట్మెంట్ తీసుకోవల్సింది” అన్నాను ఏడాది పాపను హాస్పిటల్ వాతావరణానికి బహిర్గతం చేయటం ఇష్టం లేక.

         “లేదు మమ్మీజీ. అడ్మిషన్ కన్ఫర్మేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ త్వరగా పంపాలి. లేకపోతే ఈ సంవత్సరం కోర్సు మిస్ అయిపోతారు.” అంటూ పైకి తన బెడ్ రూములోకి వెళ్ళిపోయాడు.

         రాత్రంతా నిద్రలేక ఎర్రబారిన కళ్ళతో అలసటగా వున్న అతని వంక ఆప్యాయంగా చూస్తూండిపోయాను.

         యూనివర్సిటీ అడిగిన డాక్యుమెంట్స్ ఏమిటాని పేపర్లన్నీ టేబుల్ పైన పెట్టి ఒక్కొక్కటిగా చూడసాగాను.

  1. నా వెనుక ఏ క్రిమినల్ చరిత్ర లేదని ధృవీకరిస్తూ ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసు నుండి ధృవపత్రం.
  2. నేషనల్ డిసేబిలిటి ఇన్సూరెన్స్ స్కీం (NDIS) నుండి క్లియరెన్స్ కార్డు.
  3. పిల్లల దగ్గర పనిచేయటానికి అంగీకారం కోరుతూ బ్లూ కార్డు.
  4. కోడ్ ఆఫ్ కండక్ట్ సర్టిఫికేట్.
  5. కోవిడ్ రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు తీసుకున్న నిర్ధారణ పత్రము.
  6. హిపాటైటిస్, మంప్స్, మీసల్స్, రుబెల్లా, వరిసెల్లా, ఇన్ఫ్లుఎన్జాలు తీసుకున్నట్లుగా పాజిటివ్ ఇమ్యునైజేషన్ సర్టిఫికేట్.
  7. TB స్క్రీనింగ్ సర్టిఫికేట్ విత్ నెగెటివ్ రిపోర్ట్.
  8. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్.

ఆ లిస్టు చూసేసరికి నా గుండె బేజారై పోయింది. నర్సింగ్ కోరిక నీరుగారి పోతోంది.

అసలు ఈ కోర్సు చేసే యోగం నాకుందా అని అపనమ్మకం కలగ సాగింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.