జ్ఞాపకాల సందడి-45

-డి.కామేశ్వరి 

కావమ్మ కబుర్లు – 22 

         ఆ రోజుల్లో పెళ్లి అంటే రెండు నెలలు ముందే పనులు మొదలుపెట్టే వారు. మంచి రోజు చూసి విఘ్నేశ్వర పూజచేసి పసుపు దంచి, మీదు కట్టేవారు. మీదు అంటే పసుపు గుడ్డలో, పూజ బియ్యం, దంచిన పసుపు వేసి మూటకట్టి దాచి పెళ్లినాడు అవి తలంబ్రాల  బియ్యంలో కలిపేవారు. అంటే పెళ్లి పనులకి శ్రీకారం చుట్టడం అన్నమాట. ముందు అప్పడాలతో మొదలు పెట్టేవారు. 

         ఆ రోజుల్లో ఏది చేసుకున్నా ఇంట్లో చేసుకోవాలి గానీ ఇప్పట్లాగా బజారులో దొరికేవి కావు. పెళ్ళిలో ప్రతీ పూటా అప్పడం, వడియం వడ్డించాల్సిందే. ఇప్పటిలా ఒక రోజు పెళ్లిళ్ళా! ఐదు రోజులు – రెండుపూటలా అంటే కనీసం రెండు వందలు రోజుకి అంటే ఐదు రోజులకి కనీసం వెయ్యి పదిహేనువంద లన్నా ఉండాలి. 

         తిరగలిలో, పనివారు పిండిని విసిరిపెడితే, సీతమ్మ గారని ఒకవిధవరాలు మడిగా  ఇలాటి పనులు అప్పడాలు, వడియాాలు కందిపొడి, పిండి వంటలు అన్నీ చేస్తుంది. పాపం సీతమ్మ గారికి చిన్నతనంలోనే మొగుడు పొతే, చూసే వారెవరు లేక అందరిళ్ళలో ఎవరు పిలిస్తే వాళ్ళింటికి వెళ్లి తద్దినం, బారసాల లాంటి చిన్నవంటలు చేసి వాళ్ళిచ్చిన రూపాయ, ఊరగాయ, కూర నారా పాత బట్టలు తెచ్చుకుని కొడుకుని చదివించుకునేది. మా అన్నయ్య కంటే ఒక క్లాస్ తక్కువ కనుక పాత పుస్తకాలు జాగ్రత్తగా దాచి, వాడి బట్టలు అత్తయ్య పాత పంచలు ఇస్తుండేది. ఆవిడ ఇంత పని చేస్తే ఇచ్చేది రూపాయ ఆ రోజుల్లో.

         సరే, సీతమ్మగారొచ్చి అప్పడాల పిండి పెద్ద పెద్ద పళ్ళాలలో వేసి కలిపి పెద్ద పెద్ద  ఉండలు చేసి పెద్ద గిన్నెలో ఉంచి, మూతపెట్టి వెళ్ళేది. ఆ మర్నాడు ఇరుగు పొరుగు, తెలిసినవారు అందరూ భోజనాలు ఇంటి పనులు తొందరగా ముగించుకుని వచ్చి, అందరు కలిసి కబుర్లు చెప్పు కుంటూ అప్పడాలు ఒత్తేవారు. రోట్లో నూనె వేసి దంచే వారొకరు. పిండి మర్దన చేసి ఉండలు చేసేవారొకరు, ఒత్తినవి ఎండలో వేసేవారొకరు.ఇలా సావిట్లో కూర్చుని కబుర్లాడు కుంటూ రోజుకి వెయ్యి అప్పడాలు ఒత్తేసేవారు. పెళ్లంటే రెండు రోజులు అంతా సాయానికి వచ్చేవారు.

         తరువాత వడియాలు. ముందు రోజు సాయంత్రం సీతమ్మగారొచ్చి గుమ్మడి కాయలు తరుక్కునేది. రెండో మూడో తరిగిన కాయల ముక్కలు దుప్పట్లో మూట కట్టి పైన రోలు బరువు పెట్టేవారు, నీరంతా పోవడానికి. మర్నాడు రెండో మూడో శేర్లు పప్పు రాత్రి నాన పెట్టి ఉంచేది. పొట్టు కడుక్కుని రుబ్బడానికి ఇంకో ఆవిడ్ని సాయానికి తెచ్చుకునేది. ఇద్దరూ కలిసి రుబ్బాక, అమ్మ వాళ్ళు ముగ్గురు కలిసి, పెరట్లో మంచాల మీద దుప్పట్లు పరిచి, వడియా లు పెట్టేవారు. పెట్టినపుడు కాస్త ముద్ద విడిగా తీసిపెట్టేది. పచ్చి వడియాలు వేయించడానికి. ఆ పిండితో వడియాలు ఎంత రుచిగా ఉంటాయో! ఎప్పుడైనా తిన్నారా?

         సగ్గుబియ్యం వడియాలు, పేలాల వడియాలు రాత్రి అప్పడంతో, మధ్యాహ్నాలు గుమ్మడి వడియం, అప్పడం వడ్డించటం అది పద్ధతి. ప్రతిదీ పద్ధతి  ప్రకారం జరగాలి. 

         ఇప్పుడు ఓ ముప్ఫయి రకాలు పెడుతున్నారు. అన్నిరకాలుంటే ఏమి తింటాం, ఎన్ని తింటాం? అలంకారానికి, గొప్పకీ పెట్టడం… అపుడు పూట విస్తరి వేసి నాలుగు రకాలు పెడితే సుష్టుగా తినేవారు.

         వడియాల తరువాత కందిపొడి. మధ్యాన్నం పూట నీళ్ళ పొయ్యిమీద పెద్ద మూకుడు పెట్టి కందిపప్పు, మిగతావి వేసి వేయించి పెడితే మర్నాడు సీతమ్మ గారు వచ్చి విసిరేది.   చారుపొడి, కూరపొడి, ఒక్కోరోజు ఒక్కోటి చేసేవారు. ఈ పనులు పనివారి చేత చేయించే వారు కాదు. ఓ రెండు రోజులు మినపసున్ని విసిరేవారు. 

         పెళ్ళికి ఓ రోజు ముందు వచ్చి, పెళ్ళివారికి ఇవ్వాల్సినా సరే అంటే లడ్డూ లు, మినప సున్ని, అరిసెలు, చక్కిలాలు… రోజూ మధ్యాన్నం చిరుతిళ్ళు పంపడానికి కాజాలు, మైసూర్ పాక్, మిక్చర్, జిలేబి లాంటివి రాత్రంతా కూర్చుని చేసేవారు. బజారు నెయ్యి బాగుండదని, వెన్న తెప్పించి డబ్బాడు నెయ్యి తయారుచేసేవారు. పచ్చళ్ళయితే, అత్తయ్య గుంటూరు వెళ్లి గోంగూర, పండుమిరప, చింతకాయ అక్కడ చేసి పట్టుకొచ్చేది. నా పెళ్ళికయితే. పండు మిరప పళ్ళ పచ్చడి మొదటిసారి తినడంట, అన్నీ లాగించారు పెళ్ళివారు. గోంగూర, పండుమిరకాయ వేసిన చింతకాయ పచ్చళ్ళు బాగున్నాయంటూ ఒకటే లాగించారు. ఎంతయినా గుంటూరు పచ్చళ్ళకి ప్రసిద్ధిగదా… 

         పప్పులన్నీ బాగు చేయించి, డబ్బాలో పోసి బియ్యం చెరిగించి డబ్బాల్లో పోయించి అన్నిటికి లేబుల్స్ రాయించేది అమ్మ. ఎందుకంటే స్టోర్ రూమ్ పెత్తనం ఒకళ్ళకప్ప గించాలి గదా! అమ్మ పీటల మీద కూర్చోవాలి. పెళ్లి పర్యవేక్షణ ఉంటుందిగా. ఇప్పటిలా ఒక రోజా ఒకపూట అయ్యే తంతు కాదు గదా. 

         సావకాశంగా ఓరోజు స్నాతకం, ఒకరోజు పెళ్లి, ఇంకోరోజు సదస్యం, ఇంకో రోజు స్థాళీపాకం అన్నీ ఐదు రోజులులాగి చేసేవారు. ఇప్పుడు మళ్ళీ ఐదు రోజులకి దిగారు. మెహెందీ, సంగీత్, పెళ్ళికూతుర్ని చేయడం, పెళ్లి, రిసెప్షనూ … ఒకటే తేడా! ఇప్పుడంతా షో! అప్పుడు చేసేవి సంప్రదాయబద్ధం.

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.