
నారి సారించిన నవల-41
కె. రామలక్ష్మి – 1
-కాత్యాయనీ విద్మహే
ఈ శీర్షిక కింద ఈ నెల నుండి కె. రామలక్ష్మి గారి నవలల మీద వ్రాయాలి. సేకరించుకొన్న నవలలు అన్నీ టేబుల్ మీద పెట్టుకొంటుండగానే మార్చ్ 3 శుక్రవారం (2023) ఆమె మరణవార్త వినవలసివచ్చింది. 92 సంవత్సరాల సంపూర్ణ సాధికార సాహిత్య జీవితం అనుభవించి నిష్క్రమించిన రామలక్ష్మి గారికి నివాళి ఆమె నవలల గురించిన ఈ వ్యాసం.
1968 లో ఆంధ్రపత్రికలో సీరియల్ గా వచ్చిన ‘ప్రేమించు ప్రేమకై’ నవల చదువుతూ పన్నెండు పదమూడేళ్ల వయసులో తొలిసారి రామలక్ష్మి గారిని తెలుసు కొన్నాను. ఆ తరువాత పద్దెనిమిది ఏళ్లకు 1986 లో అనుకొంటా మద్రాసులో మా చెల్లెలు శ్రీగౌరి ఇంటికి వెళ్ళాం. అప్పుడు నేను ‘ప్రాచీన సాహిత్యంలో స్త్రీ’ గురించి మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కు పని చేస్తున్నాను. ఆరుద్రతో సంభాషణ నీ పరిశోధనకు మార్గదర్శకంగా ఉంటుంది పోదాం పద అని మా నాన్న రామకోటిశాస్త్రి నన్ను ఆరుద్రగారి ఇంటికి తీసుకు వెళ్లారు. పరిశోధనలో పరిశీలన, విచారణ , దృష్టి ఎలా ఉండాలో సమాచారసేకరణ ఎలా చేసుకోవాలో చెప్పి ఆరుద్ర తన లైబ్రరీ తలుపులు తెరిచారు నా కోసం. అప్పుడే రామలక్ష్మిగారితో నాకు ముఖాముఖీ పరిచయం. రెండు మూడుసార్లు సభా సమావేశాలలో ఆవిడ తటస్థపడ్డారు. నవ్వటం, నమస్కరించటం తప్ప ఆవిడతో సంభాషణలు ఏవీ గుర్తులేవు. మళ్ళీ ముప్ఫయేళ్లకు హైద్రాబాదులో తెలుగుయూనివర్సిటీ ఆడిటోరియం వేదిక మీద ఆవిడను కలవటం నాకొక మంచి జ్ఞాపకం. అది 2016 ఆగస్టు 21. చైన్నైకి చెందిన పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ వారు ప్రతిఏటా ఒక రచయిత్రికి ఇచ్చే పురస్కారం ఆ సంవత్సరం రామలక్ష్మిగారికి ఇచ్చారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేను కూడా ఒక వక్తను కావటం రామలక్ష్మిగారితో వేదిక పంచుకొనటం నాకు చాలా ఆనందాన్నిచ్చాయి.
అప్పటికి నేను రిటైర్ అయి ఎమిరటస్ ఫెలోషిప్ తో స్త్రీల నవలల పై ప్రాజెక్ట్ పనిలో ఉన్నాను. అందులో భాగంగా నవలా రచయితలను వీలైనంత వరకు కలిసి మాట్లాడాలి అనుకొన్నా. అలా 2017 లో ఒక రోజు రామలక్ష్మి గారి కోసం వాళ్ళ ఇంటికి వెళ్లాను. రెండు మూడు గంటలపాటు తన జీవితానికి, సాహిత్యానికి, సినిమారంగానికి సంబంధించిన విషయాలు ఎన్నెన్నో తవ్విపోశారు. ఆ తరువాత మళ్ళీ మేము కలవలేదు. ఆమె లేక పోయినా ఆమె సాహిత్యం ఉంది. ఆమె తన గురించి చెప్పుకొన్నది కొంతా, ఇతరులు వ్రాసినది మరికొంతా ఉంది. వీటి ద్వారా రామలక్ష్మి జీవిత దృక్పథం తెలుసుకోవచ్చు.
రామలక్ష్మీ ఆరుద్రగా ఆమెను పేర్కొంటారు కానీ స్వతంత్ర సాహిత్య వ్యక్తిత్వంతో నిలబడిన మనిషి ఆమె. ఆరుద్రను పెళ్లాడటానికి ముందు నుండే వికసించటం ప్రారంభించిన వ్యక్తిత్వం అది. రామలక్ష్మి ఇంటిపేరు కూచి. ఆమె తల్లి త్రివేణి. సోమావఝల నరసింహం గారి అయిదుగురు ఆడపిల్లల్లో పెద్దది. సోమావఝల నరసింహం గారిది తుని దగ్గర కోటనందూరు. ఆడపిల్లలు లేరని కావడేసుకొని కాలి నడకన కాశీకి వెళ్లి అన్నపూర్ణా విశ్వేశ్వరుల విగ్రహాలు తెచ్చి గుడి కట్టించారట. ఆ తరువాతే త్రివేణితో మొదలుపెట్టి వరుసగా అయిదుగురు ఆడపిల్లలు పుట్టారట.
రామలక్ష్మి తల్లి పుట్టిల్లు కోటనందూరులో 1930 డిసెంబర్ 31 న పుట్టింది. తండ్రి కూచి అచ్యుతరామయ్య. ఆయన తండ్రి భాగప్ప తుని దివాన్. అచ్యుతరామయ్యకు కాకినాడ కలెక్టరేట్ లో ఉద్యోగం. రామలక్ష్మి అక్క కామేశ్వరి. అన్న భాగేశ్వర శర్మ. బాల వితంతువైన మేనత్త ప్రేమగా పెంచింది. రామలక్ష్మికి పదేళ్లు వచ్చే వరకు అక్షరాలు సరిగా రాలేదు. స్కూల్లో చదువురావటం లేదని ఇంట్లో మాష్టారిని పెట్టి చెప్పించారు. గాత్రం, వీణ శిక్షణ కూడా ఇప్పించారు. కాకినాడ చదువుల కాలంలో సూర్యకాంతం రామలక్ష్మికి క్లాస్ మెట్.
రామలక్ష్మి తండ్రి పై బ్రహ్మసమాజ ప్రభావం ఉంది. పూజా పునస్కారాలు , తద్దినాలు ఆయనకు లేవు. కలెక్టరేట్ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాక మద్రాస్ చేరాడు. ప్రెసిడెన్సీ బాలికల పాఠశాలలో ప్రవేశ పరీక్ష వ్రాయించి రామలక్ష్మిని ఆరవ తరగతిలో చేర్చారు. స్టెల్లా మేరీస్ కాలేజీ లో ఇంటర్, బిఎ పూర్తి చేసింది. మద్రాస్ చదువుల కాలంలో కోమ్మూరి పద్మావతి కూతురు ఉషారాణి భాటియా, ఏచూరి సీతారాం తల్లి కల్పకం రామలక్ష్మికి సహాధ్యాయులు. వింజమూరి అనసూయ సంగీత టీచర్ కాగా ఆమె తండ్రి తెలుగు అధ్యాపకుడు. బిఎ చదువుతుండగా ఒక సారి కాలేజీలో జరిగిన మాక్ పార్లమెంట్ లో ఆమెది స్పీకర్ పాత్ర. స్పీకర్ గా వ్యవహరించిన తీరు ఖాసా సుబ్బారావు మెప్పును పొందింది. పరీక్షలు అయ్యాక వచ్చి కలవమన్న ఆయన మాట రామలక్ష్మిని పత్రికా రంగం వైపు మరలించింది. పరీక్షలు కాగానే డా. పి. యన్. శర్మ దంపతులు నడిపే పిల్లల బడిలో సాయంత్రం పూట సంగీతం నేర్పింది. కథలు చెప్పింది. పెయింటింగ్స్ వేయించింది. బిఎ ఫలితాలు వచ్చాక ఖాసా సుబ్బారావు గారి ఇంగ్లిష్ స్వతంత్ర పత్రికలో చేరి రెండేళ్లు పనిచేసింది. తరువాత గోరా ప్రోద్బలంతో తెలుగు స్వతంత్రకు మారింది. కవిత్వం పేజీ చూస్తుండేది. ఆరుద్ర, బైరాగి, శ్రీశ్రీ, సినారె వంటివాళ్ళు రచనలు పంపించే వాళ్ళు. అప్పుడపుడు ఆఫీసుకు వస్తుండేవాళ్లు. సాయంత్రం అయ్యేసరికి, కవులు, రచయితలు, స్నేహితులు విదేశీ విద్యార్థి బృందాలతో రామలక్ష్మి ముచ్చట్లు చేసే ఆ దృశ్యాన్ని గోరా ‘రామలక్ష్మి దర్బార్’ అని అంటుండే వాడట గోరా. స్వతంత్రలో పనిచేయటం వల్ల క్రమశిక్షణ అలవడిందని అంటుంది రామలక్ష్మి. అలా స్వతంత్ర ఆఫీసులో ఆరుద్రతో ఏర్పడిన పరిచయమే 1955 లో పెళ్ళికి దారితీసింది.
అప్పుడే రేడియో ప్రసంగాలతో ఆమె రచనా వ్యాసంగం మొదలైంది. తెలుగు స్వతంత్రలో వ్యాసాల వంటి కథనాలు సమకాలీన విషయాల మీద, మానవ స్వభావాల మీద వ్రాస్తుండేది. 1957 నాటికి ఆత్మగౌరవం గల స్త్రీ సాధికార ప్రవర్తన కుటుంబాలలో ఆశించదగినదిగా స్థాపిస్తూ పార్వతీ కృష్ణమూర్తి పాత్రలను సృష్టించి వినూత్నమైన కథలు వ్రాసింది. తెలుగు స్వతంత్రలో నారీ జగత్తు శీర్షికను పెట్టి మహిళల గురించి వ్రాయటం మొదలు పెట్టింది. తెలుగు స్వతంత్ర వేదికగా రచయితలతో విభేదిస్తూ చేసిన రచనలు కూడా ఉన్నాయి. కుటుంబ బడ్జెట్ గురించి మాలతీ చందూర్ వ్రాసినదాన్ని విమర్శకు పెడుతూ వ్రాసిన ‘చిలుక పలుకులు – పొదుపు ప్రణాళికలు’ అలాంటి వాటిల్లో ఒకటి. అదే సమయంలో ఆంధ్రపత్రికకు కూడా వ్రాసింది. ప్రశ్నలు- జవాబులు శీర్షికను నిర్వహిం చింది. దక్షిణ భారత సంస్థకు, అమెరికన్ సెంటర్ కు తెలుగు అనువాదాలు చేస్తుండేది. ఈ విధంగా 50 వ దశకంలోనే సామాజిక సాహిత్య సృజన విమర్శన రచన ప్రారంభించి అతిత్వరలోనే వేగంగా దూసుకువెళ్లిన రామలక్ష్మి నవలా రచన కాస్త ఆలస్యంగానే మొదలైంది.
తన మొదటి నవల ‘ఆడది’ అని, అది 1955 కు ముందే వచ్చింది అని రామలక్ష్మి ముఖాముఖీ సంభాషణ(2017) లో చెప్పింది. కానీ ప్రచురణ వివరాలు ఏమీ చెప్పలేదు. 1955 నాటికి ఆమె తెలుగు స్వతంత్రకు, ఆంధ్రపత్రికకు వ్రాస్తున్నది కనుక వాటిలో ఏమైనా ప్రచురించబడి ఉంటుందా అని వెతకగా ఆంధ్రపత్రికలో దొరికింది. అయితే 1955 లోపల మాత్రం కాదు. నవలల పోటీలో మూడవ బహుమతి పొంది 1967 నవంబర్ 3 సంచిక నుండి 1968 జనవరి 5 సంచిక వరకు సీరియల్ గా ప్రచురించబడింది. అందు వల్ల 1955 కు ముందే వచ్చింది అని చెప్పటం ఎనభై ఏడేళ్ల వయసుకు సహజమైన మరుపు వల్ల అనుకోవాలి. అదే మొదటి నవల అన్నది కూడా ఆలోచించవలసిన విషయమే. ఎందుకంటే రామలక్ష్మి వ్రాసిన చిన్న నవలలు రెండు చీకటిదారి , చిన్నవదిన 1968 డిసెంబర్ లో ఎమెస్కో ప్రచురణగా ఒక పుస్తకం వచ్చింది. అందులో ఆమె అప్పటికే ‘అవతలిగట్టు, మెరుపుతీగ, తొణికిన స్వర్గం, మానని గాయం, ఆణిముత్యం మొదలైన నవలలు’ వ్రాసినట్లు సమాచారం ఉంది. 1967 చివర వచ్చిన నవల ఆడది అనుకొంటే ఈ అయిదు నవలలు 1968 జనవరి నుండి డిసెంబర్ మధ్య కాలంలో వచ్చినవి అనుకోవాల్సి వస్తుంది. ఒక ఏడాదిలో అయిదు నవలలు అసాధ్యం అనుకొంటే వాటిలో ఏవైనా ఆడది నవలకు ముందే వచ్చి కూడా ఉండవచ్చు. వీటిలో తొణికిన స్వర్గం 1961 లో ప్రచురించబడినట్లు కూడా సత్యవతి చెప్తున్నారు. వీటిలో తొణికిన స్వర్గం 1961 లో ప్రచురించబడినట్లు వికీపీడియా(తెలుగు)లో ఉంది. పి. సత్యవతి బ్లాగ్ రాగం భూపాలం ( 2 మార్చ్ , 2011) దానినే ధృవీకరిస్తున్నది. దానిని బట్టి అది రామలక్ష్మి మొదటి నవల కావాలి. అయితే ఆ నవలలు ఇప్పటికి అలభ్యాలు కనుక మొదటి నవల ‘ఆడది’ అనుకోవలసిందే.
1968 డిసెంబర్ నాటికి రామలక్ష్మి ఇదీ నా హృదయం మొదలైన కథాసంకలనాలు, అనేక అనువాదాలు’ ప్రచురించినట్లు తెలుస్తున్నది. ఆణిముత్యం నవల పర్ల్స్ బక్ నవలకు అనువాదమని రామలక్ష్మి ముఖాముఖీలో చెప్పింది. ఏ నవలకు అనువాదమో అది లభిస్తే కానీ చెప్పలేం. చీకటిదారి, చిన్నవదిన నవలల ప్రచురణ సమయానికి రామలక్ష్మి గృహలక్ష్మి స్వర్ణకంకణం కూడా పొందింది.
ఆడది నవల తరువాత రామలక్ష్మి వ్రాసిన ‘హృదయం చిగిర్చింది’ ( 12-4-68 నుండి 21-5-1968 ) ప్రేమించు ప్రేమకై (29-11-68 నుండి 21-1-69) ఆశకు సంకెళ్లు ( 1973 నుండి 11-1-74),వరుసగా ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. మూడోమనిషి నవల 1973 నాటికే జ్యోతి మాసపత్రికలో సీరియల్ గా వచ్చి 1974 జనవరిలో పుస్తక రూపంలో వచ్చింది. కోటిగాడు( 16-2- 79 నుండి 20-4-79) ఆ తరువాతి నవల. శిలా పుష్పం (1986), నన్ను వెళ్ళిపోనీరా(1992) కస్తూరి(2001) హేమ (2001)శత్రువుతో ప్రయాణం (2006)వెలిసిపోయిన దాంపత్యాలు(2009)పెళ్లి (2013) (13) అన్నలారా నా తప్పేమిటి(?) మొత్తం పద్నాలుగు నవలలు అందుబాటులో ఉన్నాయి. ఓ తండ్రి కథ, నా కూతురు ఫెమినిస్ట్, ధర్మ సూత్రం, కొత్తకోరిక, ఈతరం పిల్ల, తరాలు, కరుణకథ, లవంగి, ఆంధ్రనాయకుడు, పండరంగని ప్రతిజ్ఞ మొదలైన మరొక పది నవలలు ఉన్నట్లు తెలుస్తున్నది. స్టూవర్టుపురం నేపథ్యంలో గురుదక్షిణ అనే నవల వ్రాసినట్లు పి. సత్యవతి బ్లాగ్ రాగం భూపాలం ( 2 మార్చి, 2011) వల్ల తెలుస్తున్నది. ఆ పది, ఇదొకటి కలిసి పదకొండు. వీటికి ‘అవతలిగట్టు, మెరుపుతీగ, తొణికిన స్వర్గం(స్వప్నం? ), మానని గాయం, ఆణిముత్యం నవలలు కలుపుకొంటే అలభ్య నవలలు పదహారు(16). అయితే వాటికోసం అన్వేషిస్తూనే లభిస్తున్న నవలలు ఆధారంగా రామలక్ష్మి నవలా సాహిత్య వస్తు దృక్పథాలను పరామర్శించవచ్చు.
ఆడది నవల ఆంధ్రపత్రికలో పదివారాలు ధారావాహికగా ప్రచురించబడింది. పిల్లవాణ్ణి చంపింది అన్న ఆరోపణమీద ఒక పిచ్చిదాన్ని అరెస్ట్ చేసి తెస్తే ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించటానికి వచ్చిన మహిళా వైద్యురాలు ఆమె అమాయకత్వాన్ని, అసహాయ దైన్యాన్ని చూసి ఆమె ఒక పిల్లవాడిని చంపిందంటే నమ్మలేక పోయింది. ఆమె నేరస్థురాలు కాదు అని వాదించి గెలవాలని తన లాయర్ స్నేహితురాలిని అడిగి ఒప్పిస్తుంది. ఇద్దరూ కలిసి ఆమెతో స్నేహంగా మాట్లాడుతూ వాస్తవాలను తెలుకొనటానికి చేసిన శోధన , సాధించిన విజయం ఈ నవలకు వస్తువు. ఒక అపరాధ పరిశోధక నవల వలె ఉత్కంఠను నిలుపుతూ కథనం సాగుతుంది.
ఆడది అనే మాటకు లోకంలో న్యూనార్ధ ప్రయోగమే ఎక్కువ. ఆడది ఏమీ చేయలేని నిస్సహాయురాలు.. అణిగి మణిగి బతుకు కొనసాగించుకోవలసిన జీవి. ఆమె జీవితం అంతా ‘ఆడ’ కు అంటే అత్తింటికి సంబంధించిందే కానీ ‘ఈడ’కు అంటే పుట్టింటికి చెందినది ఎంత మాత్రమూ కాదు అని తరచు గుర్తు చేయబడుతుంటుంది. అలాంటి ఆడవాళ్ళ జీవితం ప్రాయోపవేశం లాంటిది. పుట్టినప్పటి నుండి మరణానికి సిద్ధమైన బ్రతుకులు అవి. అలాంటి ఆడవాళ్లకు ప్రతినిధి ఈ నవలలో సరళ. అనుమానంతో భర్త అనుక్షణం పెట్టే హింసను పడలేక బావిలో పడి మరణించిన తల్లికి బిడ్డ, తండ్రి నిర్లక్ష్యానికి గురై తాతగారింట చాకిరి చేస్తూ బతికిన పిల్ల సరళ. వాళ్ళు చూసే ఏ చౌకరకం సంబందానికైనా ఒప్పుకొని అత్తింటి కాపురానికి తనను తాను సిద్ధం చేసుకొన్న ఆడది. ఇష్టపడిన యువకుడిని పెళ్లాడక తనకు జీవితమే లేదని మనసు చెప్తూనే ఉన్నా ఆ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లాడదామని యువకుడు అంటున్నా అతనిని సరళ ఎందుకు వారించింది? ఆడపిల్లలకు హృదయం ఉంటుందని, వాళ్ళసలు మనుషులే అనే జ్ఞాన సంస్కారాలే లేని ఇళ్ళల్లో తమ ఇష్టాలను చెప్పుకొని భంగ పడటం తప్ప మరొక అవకాశం లేదని తెలిసిన ఆడది కనుక. తన ఎంపికను గురించిన నిరసనలు, నిషేధాలు, తీర్పులు వినటానికి ఇష్టపడని ఆత్మగౌరవ స్పృహ వలన. ఇష్టాన్ని మనసులో సమాధి చేసి, ఇష్టంలేకపోయినా అవకాశాన్ని, అవసరాలను, అధికారాన్ని బట్టి కుటుంబం నిర్దేశించే వరుడితో జీవించటానికి సిద్ధం కావటం అంటే స్వచ్ఛంద మరణమే. ఆత్మహత్యను నిరసన జెండాగా ఎగరేసిన తల్లి మార్గం ఎన్నుకోక పోయినా కుటుంబ అధికారానికి తెలిసీ తలవొగ్గటం అంటే అది ఆత్మహత్యా సదృశమైన చర్యే. యాభయి ఏళ్లుదాటిన రెండో పెళ్లి వరుడు దొరకటమే అదృష్టం అనుకొనే తనను వదిలించుకొనటానికి తొందరపడే తాతగారి ప్రవర్తన పట్ల కోపం తనను తాను హింసించు కొనే స్థాయికి తీసుకువెళ్ళింది సరళను అనుకోవాలి. వరుడి ఆత్రం ఇంట్లో ఒక ఆడదిక్కు కావాలని. వండి పెట్టటానికే కాదు హింసించటానికి కూడా ఒక భార్యకావలసిన స్థితిలో ఉన్న భర్తను భరించటమే , నిర్లిప్తతను అలవరచుకొనటమే లక్ష్యం అన్నట్లుగా కఠిన సాధనలో కాలం గడపటం కన్నా మరొక మార్గం లేని స్త్రీలకు ప్రతినిధి సరళ. ఆకలి , కామం, మాతృత్వం సహజ ప్రవృత్తులు కాగా ఆ మూడింటినీ సజావుగా, సంపూర్ణమైన ఇష్టంతో, సంతృప్తితో అనుభవించే అవకాశాలు స్త్రీలకు ఈ సమాజం, సంప్రదాయం, ఆధిపత్య సంస్కృతి మిగల్చలేదు. సరళ జీవిత విధ్వంసానికి కారణమైనవి అవే. ఆర్ధిక అస్వతంత్రత, పగవాడివలె ప్రవర్తించే, అనుమానంతో దెప్పి పొడుస్తూ అవమానించే భర్త కామానికి వస్తువు కావటం శరీరాన్ని అప్పగించటం తప్ప మరి ఏ చైతన్యమూ కనబరచని సరళ తల్లి కావటం తనకు సంబంధించిన, తాను మాత్రమే నిర్వహించ గల గొప్ప క్రియగా, కర్తవ్యంగా గుర్తించటం వల్ల పొందిన ఆనందానికి భంగపాటు కలగటం వల్ల పడిన దుఃఖానికి పరిహారంగా పిచ్చిని ఆశ్రయించింది. పిల్లల కోసం బడుల దగ్గర, ఆటస్థలాల దగ్గర ఆశగా, కుతూహలంగా నిలబడి చూస్తూ ఉండే ఆమెను, పిల్లలను ఎత్తుకొని లాలించే ఆమెను పిల్లలను ఎత్తుకుపోయే పిచ్చిది అని లోకం అనుకొన్నది. కొట్టింది. తరిమింది.
ఒక ఆడది ఇలాంటి దైన్యంలో, హైన్యంలో ఉంటే చదువుకొని మంచి జీవన వృత్తులలో ఉన్నఆడవాళ్లు మరొక ఇద్దరు ఈ నవలలో ఉన్నారు. ఒకరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ కల్యాణి , మరొకరు లాయర్ వృత్తిలో ఉన్న ఆమె స్నేహితురాలు శాంత. వృత్తులను అంకితభావంతో, సమర్ధవంతంగా చెయ్యటమే కాదు మానవీయంగా ప్రవర్తించగల సంస్కారం అభివృద్ధి చేసుకో గలిగారు. వాళ్ళు ఆర్ధికంగా స్వతంత్రులు. ఇంకా పెళ్లిళ్లు చేసుకోలేదు కనుక ఎవరి పెత్తనము లేని స్వేఛ్ఛా జీవులు. ఆధునిక యువతులు. సరళ దైన్యం పట్ల స్పందించినా, ఆమె పక్షాన నిలబడి ఆమె హంతకురాలు కాదు అని నిరూపించే పర్యంతం వాళ్ళు చేసిన ప్రయత్నం అంతా వాళ్ళ ఇష్టంతో చేసినది. చదువులు, ఉద్యోగాలు స్త్రీలకు స్వతంత్ర జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఇస్తాయని, సామాజిక జీవిత ఆదర్శాలను చూపుతాయని సూచించటమే కాక అలాంటి స్త్రీలు తోటి స్త్రీలను సానుభూతితో అర్ధంచేసుకొని అండగా నిలబడే సహోదరీత్వ సంస్కృతికి పాదులు తీస్తారని చెప్పినట్లయింది.
పితృస్వామిక అధికారం పురుషుల చేతి దండమై సమాజంలో ఆడదాని జీవితాన్ని దుర్భరం చేస్తున్న మాట నిజమే అయినా పురుషులందరూ ఒకటే కాదు. చిందరవందర అయిన స్త్రీ జీవితాన్ని ప్రేమతో, సాంప్రదాయ నీతి చట్రాలకు అతీతంగా చక్కదిద్దటానికి అవసరమైన సంస్కారాలు అభివృద్ధి చేసుకొంటున్న పురుషులు కూడా ఉన్నారని పంతులు పాత్రద్వారా ఒక ఆశను వాగ్దానం చేసింది రచయిత్రి. సరళ సంసారం సరిగా లేదని, ఆమె భర్త మరణించాడని తెలిసి ఆమెకు సహాయపడాలని ఆమె ఇంటికి వెళ్లి సరళ నిరాకరించటంతో ఏమీ చెయ్యలేక వెనక్కు వచ్చిన పంతులు కొడుకును కూడా కోల్పోయి ఇంటి నుండి వెళ్లగొట్టబడి దిక్కులేనిదై తిరుగుతున్న ఆమెను అనుక్షణం కనిపెడుతూ అనుసరిస్తూనే ఉన్నాడు. ఆమె కనబడకుండా పోయాక ఆమె కోసం వెతికాడు. సరళ నోటి వెంబడి వచ్చిన పంతులుకు అన్నీ తెలుసు అన్న మాటను పట్టుకొని వెతుక్కుంటూ వెళ్లిన కల్యాణి, శాంతల వల్ల మళ్ళీ సరళను కలుసుకో గలిగాడు. కోర్టులో అతనిచ్చిన సాక్ష్యం రూపంలో సరళ జీవితం ఫ్లాష్ బ్యాక్ లో చెప్పబడింది. సరళ హత్య చెయ్యదు, చెయ్యలేదు అన్న నమ్మకంతో హతుడు అని చెప్పబడుతున్న పిల్లవాడు ఎమయ్యాడు అన్న ప్రశ్నతో స్వతంత్రంగా అతను చేసిన శోధనలో ఒక పోలీసు స్టేషన్ లో ఆ పిల్లవాడు కనబడటం, శాంత పోలీసులతో మాట్లాడి ఆ పిల్లవాడిని కోర్టులో ప్రవేశ పెట్టటం ద్వారా సరళ మీద హత్యానేరం మోపిన వాడి తల్లిదండ్రులు బిడ్డ కనబడటంతో కేసు ఉపసంహరించుకొనటం నవలకు ముగింపు. సరళ ఇక ఒంటరిగా తిరగటానికి వీలులేదని ఆమె తనతో పాటు జీవించవలసిందేనని ఒప్పించి తనవెంట వూరికి తీసుకుపోయిన పంతులు ఉదాత్త వ్యక్తిత్వం నవలను సుఖాంతం చేసింది.
‘ఒక్కరికోసం అందరు కలిసి సహకారమే వైఖరిగా, ఉపకారమే ఊపిరిగా బతక గలిగితే వివక్షలు లేని సమాజం వాస్తవం అవుతుంద’న్నఆ కాలపు నమ్మకాన్ని( 1964 నాటి రాముడు భీముడు సినిమాలోని ఉందిలే మంచికాలం ముందుముందూనా అనే పాట) నొక్కి చెప్తున్నట్లుగా ఉంది సరళ కోసం కల్యాణి, శాంత, పంతులు నిలబడి పనిచేసిన తీరు.
రామలక్ష్మి తనతల్లి తాతగారు ఆడపిల్లల కోసం కాశీకి వెళ్లి అన్నపూర్ణా విశ్వేశ్వరుల ప్రతిమలు తెచ్చి వూళ్ళో గుడికట్టి ప్రతిష్టించిన విషయాన్ని ఆడది నవలలో తాతగారికి ఆపాదించి పేర్కొన్నది. ఆడపిల్లల కోసం అంత ఆశపడిన ఆయన మనుమరాలు సరళ విషయంలో ఎందుకంత కఠినంగా వ్యవహరించాడన్నది ప్రశ్న. మనుమళ్లు వారసత్వ హక్కులతో ఆస్తికోసం కోర్టుకు ఎక్కి ఆయనను ఆగం చేసినట్లు నవలలో చెప్పబడింది. అంత ఆస్తులు ఉన్నవాడు మనుమరాలి విషయంలో ఈడూ జోడైన సంబంధం తెచ్చి పెళ్ళిచేయటానికి డబ్బు ఖర్చు పెట్టలేనని యాభై ఏళ్ళు దాటిన రెండవ పెళ్ళివాడికి ఇచ్చి చేయటానికి ఎందుకు సిద్ధమయ్యాడు? మనుమరాలు పంతులును ఇష్టపడుతున్న దని తెలిసి అతనితో పెళ్ళికి ఎందుకు ఆలోచించలేకపోయాడు? సరళ పెళ్లి కుదిరిందని బాధతో అక్కడ ఉండలేక వెళ్ళిపోయిన పంతులు ఆ తాతగారిని కనిపెట్టుకొని ఉండటం కోసమని మళ్ళీ ఆ వూరికి తిరిగిరావటం కొంత చిత్రంగానే కనబడుతుంది.
ఆడది నవలను అభిమానవతి అనే పేరుతొ వాణిశ్రీ నాయికగా సినిమాగా తీసారని కూడా రామలక్ష్మి ముఖాముఖీ లో చెప్పింది. అభిమానవతి సినిమా 1975 లో వచ్చింది. రచన కె. రామలక్ష్మి అని టైటిల్స్ లో ఉంది కానీ ‘ఆడది’ నవల ఆధారం అన్న విషయం లేదు. సినిమా మొత్తం చూస్తే ఈ నవల కథకు,దానికీ ఏమాత్రం సంబంధం కనిపించదు.
*****
(ఇంకా వుంది)

డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.