నా జీవన యానంలో- రెండవభాగం- 29

-కె.వరలక్ష్మి

          మోహన్ హెడ్మాస్టరుగా పనిచేస్తున్న ఏలేశ్వరం స్కూల్ టీచర్ ఒకావిడ నాకు ఫోన్ చేసింది. “మాస్టారు GPF లోన్ 30వేలకి పెట్టేస్తున్నాడు. నా వైఫ్ ని అందరూ ఎన్నికల్లో నిలబెడతాం అంటున్నారు. ఎక్కడలేని డబ్బూ కావాలిప్పుడు. ఇలా నా డబ్బు నేను తీసేసుకుంటేనే గానీ నన్ను ఇరికించేస్తారు అంటున్నారు” అని. అదీ సంగతి. నా వెనుక దన్నుగా నిలబడాల్సిన నా భర్త గారి తీరు అది. ఆ తాగుబోతు భర్త గారి భార్యగా నేను ఎన్నికల్లో నిలబడడం. ఒకవేళ అంతా కలిసి యునానిమస్ గా ఎన్నిక చేసినా నేనేనాడూ తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండదు.

          ఇంకో రోజు ఆవిడ మళ్లీ ఫోన్ చేసి “ఈయన ఎన్ని రకాల లోన్స్ దొరుకుతాయో అన్నిటికీ అప్లై చేస్తున్నాడు. అసలే ఆయన శాలరీ మొత్తం అనపర్తి రెడ్లకు వడ్డీ కింద ఇచ్చేస్తున్నాడని మాకందరికీ తెలుసు. ఎలాగోలా జాగ్రత్త పడండి” అంది. ఎలా జాగ్రత్త పడను? డబ్బు మాటెత్తితే పిచ్చి లేచి పెద్ద రగడ చేసే వాడితో నేనేం చేయగలను! ఆవిడ చేసే ఫోన్లతో నాకు మరి కాస్త మనస్తాపం కలుగుతుంది. ఏనాడు అతడు నన్నూ పిల్లల్ని పోషించాలి అనే బాధ్యత వహించాడు గనక నేనిప్పుడు ఈ విషయానికి బాధపడాలి? తెలీని నిస్పృహ ఏదో ఆవహించగా నాకు నేనే ధైర్యం చెప్పుకొన్నాను. ఏమైతే అది కానీ.  ఏం జరిగితే అది జరగనీ, అని.

          గొప్ప తమాషా ఏంటంటే నా మొహం చూసిన వాళ్ళెవరికీ నా సమస్యలు తెలిసేవి కావు.

          ఒకరోజు హఠాత్తుగా మా పెద్ద తమ్ముడు దిగేడు హైదరాబాద్ నుంచి. మళ్లీ రాజకీయాల జనం అంతా రావడం మొదలు పెట్టేరు. తను నిజమైన రాజకీయ నాయకుడి లాగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయేను-“మీకెందుకు, మా అక్క ను నిలబెట్టే పూచి నాది. ఈ ఖర్చులు నాకొక లెక్క కాదు” అంటూ, నాలుగు రోజులు తర్వాత వెళ్ళబోతూ “ఐదు లక్షల వరకూ ఖర్చు కావచ్చు అంటున్నారు. అంత డబ్బు ఉందా ఇల్లు తాకట్టు పెడతావా?” అన్నాడు. మా అబ్బాయికి ఫోన్ చేసి “ముందొక లక్ష పట్టుకుని జగ్గంపేటకు రా. ఇక్కడ మీ అమ్మను సర్పంచిగా నిలబెడుతున్నాం. మరో ఐదు లక్షలు రెడీ చేసుకో” అన్నాడట.“ఒక నెల రోజులు సెలవు పెట్టి జగ్గంపేటలో ఉండు” అని కూడా చెప్పేడట. మా అబ్బాయి హడలిపోతూ ‘అవునా?’ అని నాకు ఫోన్ చేశాడు.

          ఆ ఎన్నికల గోల నా ప్రమేయం లేకుండానే నన్ను చాలా భయపెట్టింది. ఓ రోజు తీరిగ్గా కూర్చుని నేనేనాడైనా నిర్భయంగా బతికేనా అని ఆలోచించుకున్నాను. లేదనే సమాధానం వచ్చింది. బాల్యంలో అంతా దయ్యాలు, భూతాల భయం; బ్రహ్మంగారి కాల జ్ఞానం విని ఆ రాత్రికే ఏం జరగబోతుందో, ఏ ప్రళయం రాబోతుందో అనే భయం; పన్నెండేళ్లు దాటినప్పటి నుంచీ పెద్దవాళ్ల భయం. నీతి నియమాల భయం; పదహారేళ్ళకే కట్టుకున్న వాడి భయం, అతను పీడించే విధానాల భయం, అత్తగార్ల అసూయ పెద్దరికాల భయం; మామగారి తాగుబోతు రూపం చూస్తే భయం; ఇక బతుకంతా వదలని అనారోగ్యపు భయం, మగవాళ్ళ చూపుల భయం, ఆడవాళ్ళ అసూయ ప్రేలాపనల భయం; అన్నింటినీ మించిన నా శాడిస్ట్ భర్త గారి భయం.

          నడుస్తూ పడిపోయే స్టేజీలో ఉండి కూడా గొప్ప విషాన్ని కక్కుతూ ఉండేవాడు.నన్ను ఏడిపించి ఏడిపించి కుళ్ళికుళ్ళి చచ్చేలా చేయడం అతని జీవితానికి ముఖ్యమైన యాంబిషనట. “నేను భరించలేను, నాకు డైవొర్సు ఇమ్మని అడిగితే “నిన్నింత తేలికగా వదలను” అనేవాడు.

          చలం ఇలా అంటాడు- “జీవించడంలో గొప్ప ఆనందముంది. దీన్ని జనం ఎందుకు పాడు చేసుకుంటారు? ఇంత కౌటిల్యం, క్రౌర్యం, నిర్దయా తమ చుట్టూ ఎందుకు సృష్టించు కుంటారు? ఒకరి స్వేచ్ఛ నొకరు అడ్డుకుని, ఒకరి మీద ఒకరు అధికారం చెలాయించి జీవితాలెందుకు దుఃఖభాజనాలు చేసుకుంటారు? సూర్యోదయాన్ని చూసి నవ్వే మనోవ్యవధి, సంతోషం, ఉత్సాహం ఎప్పుడు కలుగుతుంది మానవులకి?”

          2000 అక్టోబర్ 6 న ప్రముఖ మార్క్సిస్ట్ రచయిత శ్రీ మహీధర రామ మోహనరావు గారు కాలం చేశారు.

          నవంబర్ 18, 19 తేదీల్లో హైదరాబాద్ సత్యసాహితీ వారి ‘బాలవాదం’ సభలో ‘మాతృత్వం శాపంకారాదు’ అనే టాపిక్ మీద ఉస్మానియా కేంపస్ రోడ్డులో ఉన్న సాక్షరతా భవన్లో గీత, నేను పాల్గొని మాట్లాడేం.

          ‘మనసును ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపండి. అది జీవితాన్ని సుఖమయం చేస్తుంది’ అంటాడు విల్ కిన్స్ నా లాంటి వాళ్లకు అది ఎలా సాధ్యమవుతుంది?

ఆ సంవత్సరంలో:-

          -ఉప్పాడ చేనేత కార్మికుల మీద రాసిన ‘ఆగమనం’ కథ ఫిబ్రవరి 2000 స్వాతి మంత్లీలో ప్రచురింపబడింది. కథ పెద్దదైందని నాకు చెప్పకుండా చాలా కథను ఎడిట్ చేయడం నాకు నచ్చలేదు.

          ఆటా (ATA) (అమెరికా తెలుగు అసోసియేషన్) బహుమతి పొందిన ‘మట్టి-బంగారం’ కథ మా ఊరి పెంకుల మిల్ నేపథ్యంలో రాయడం- ఆ సబ్జెక్టు మీద అదే మొదటి కథ కావడం వల్ల 99 నవంబర్ ఇంటర్నెట్ తో బాటు నవంబర్-డిసెంబర్ అమెరికా తెలుగు భారతి మ్యాగజైన్ లోను; తెలుగు యూనివర్సిటీ ‘కథ99’ లోను; కదా సాహితి వారి ‘కథ 99’ లోను వచ్చింది. కాలక్రమంలో ఇంకా వేటిలో వచ్చిందో చెప్తాను.

          నాకు మేనత్త వరసయ్యే ఒకావిడ డబ్బు పుష్కలంగా ఉన్నప్పుడు, అదంతా కోల్పోయినప్పుడు ఎలా ప్రవర్తించిందో చెప్పిన కథ ‘మానవత్వం’ మార్చి 2000 స్వాతి మంత్లీలో వచ్చింది.

          మన్యం ప్రాంతం నుంచి పెంకుల మిల్లు కార్మికులుగా మా ఊరు వచ్చిన ఒక వెనుక బడిన కులానికి చెందిన కుటుంబం కథ ‘బలం’2000 ఏప్రిల్ 5 ఉగాదినాడు ఆవిష్కరింప బడిన నూరేళ్ల తెలుగు పంట సంకలనంలో వచ్చింది.

-14. 7.2000 నాడు ఆవిష్కరింపబడిన తెలుగు యూనివర్సిటీ కథ 98లో ‘పక్షులు’ కథ

-2000, 13 ఆగష్టు వార్త ఆదివారం స్పెషల్ లో “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ కథ

-సెప్టెంబర్-డిసెంబర్ 2000 భూమికి మంత్లీ లో ‘రేపటి చిత్రం’ కథ వచ్చాయి.

          2001 జనవరి 4 నుంచి 7 వరకు భీమవరంలో జరిగిన అజో విభో సభల్లో పాల్గొన్నాను. 5 వ  తేదీన ‘నాటక రచన – వివిధ పోకడలు‘ సెషన్ జరిగింది. వక్తలంతా అద్భుతంగా మాట్లాడేరు. తిరుమల రామచంద్ర – మరపురాని మనిషి; అప్సర్ –వలస; భరాగో 116 సినిమా పాటల పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.

          6వ తేదీన ‘నాటక ప్రదర్శన-వివిధ అంశాలు’ పై సెషన్ జరిగింది. ఏ కళ గురించి గానీ, సాహిత్యంలోని ఏ అంశం మీద గాని ఎవరేం చెప్పినా వినాలని గొప్ప ఆసక్తి నాకు. చాలా మంది ఊరు చూడటానికి వెళ్లిపోయినా నేను మాత్రం ఉపన్యాసాలేవీ మిస్ అవ్వలేదు. ఆ రోజు ఉపన్యాసాల్లో కలకత్తా నుంచి వచ్చిన నిరంజన్ గోస్వామి అనే మైమ్ ఆర్టిస్ట్ ఉపన్యాసం సోదాహరణంగా ఎంతో బావుంది. ఆయన తర్వాత రెండు రోజులు నన్ను ఎంతో ప్రత్యేకంగా చూశాడు. వెళ్లే ముందు తన కార్డు ఇచ్చి కలకత్తా వస్తే తన ఇంటికి తప్పక రమ్మని ఆహ్వానించేడు. అలా సాహితీ మూర్తులూ, కళాకారులూ నా పైన కురిపించే ఆప్యాయత నాకెప్పుడూ కొత్త శక్తిని ప్రసాదించేది. మర్నాడు లలిత సంగీత వికాసం సెషన్ లో పాలగుమ్మి విశ్వనాథం, చిత్తరంజన్, జానకీబాల గార్లు పాడుతూ సోదాహరణంగా ఎంతో బాగా మాట్లాడేరు. ఆ రాత్రి రజనీకాంత రావు గారికి జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చారు. మధ్యాహ్నం అందరితో గ్రూప్ ఫోటో తర్వాత రజనీ గారు, ఆయన భార్య సుభద్ర గారు; శ్రీమతి భరాగో; శ్రీ & శ్రీమతి భరత శర్మ; అప్పజోస్యుల, నేను మృణాళిని, శ్రీ &శ్రీమతి కవన శర్మ తదితరులం ఆడిటోరియంలో రౌండ్ గా వేసిన కుర్చీల్లో కూర్చున్నాం. రజని, సుభద్ర, జానకీబాల, భరాగో పాడారు. మూడు రోజులూ అద్భుతమైన కథా నాటికలు చూసి దిగులు దిగులుగా బై బై చెప్పుకొని విడిపోయాం.

          తల్లీ పిల్లల అనుబంధాలు సినిమాల్లో చూసినా కరిగి కన్నీరై పోతాను, అలాంటిది ఆ జూన్ మూడో తేదీన పేపర్లో వచ్చిన వార్త చూసి చలించి పోయాను. నా టీనేజ్ నుంచి ఫోటోల్లో చూస్తున్న నేపాల్ రాజు వీరేంద్ర, రాణి ఐశ్వర్యలతో పాటు మరో పది మంది కుటుంబ సభ్యుల్ని వారి పెద్ద కొడుకు దీపేంద్ర తాగిన మైకంలో కాల్చి చంపేసాడు. చాన్నాళ్లు ఆ షాక్ నుంచి తేరుకో లేక పోయాను.

          నా తాగుబోతు సహచరుడు నాకో షరతు విధించాడు. నేను ఏమీ రాయకుండా, ఏ సమావేశాలకి వెళ్లకుండా ఉంటే తను తాగడం మానేస్తానని. ఆ హింసను భరించే కన్నా రాయడం మానేయడమే ఉత్తమం అనిపించింది నా మూర్ఖపు మనసుకి. మా కుక్క తోక వంకర పోయేది కాదని మూడు నెలల్లోనే అర్థమై పోయింది. నేను మాత్రం ఆ సంవత్సరం అంతా ఏమీ రాయకుండా ఉండిపోయాను. అసలెలాంటి గుర్తింపు నాకు రావడం అతనికి కిట్టడం లేదెందుకో. మా ఊరి మహిళా మండలి వాళ్ళు పిలిచి మరీ అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. అంతకు ముందు జనవరి 26న వచ్చిన గుజరాత్ రాష్ట్రాన్ని పట్టి కుదిపేసిన భూకంప బాధితుల కోసం అందరం చందాలు వేసుకొని కొంత మొత్తాన్ని పంపించాం.

          అంతకు ముందు సంవత్సరంలో యాక్సిడెంట్ వల్ల వెన్నుదెబ్బ తిని మంచం పట్టిన మా గురుదేవులు నూజిళ్ళ లక్ష్మీనరసింహం గార్ని మహిళా మండలి సభకు వెళ్ళినప్పుడల్లా నెలకొకసారి చూసి వచ్చేదాన్ని.

          రంగనాయకమ్మ గారు తన 20వ ఏట జరిగిన పెళ్లితో జీవితం అస్తవ్యస్తమై పోయింది అంటారు ఒక ఇంటర్వ్యూలో. అది నాకు 15 ఏళ్లకే సంభవించింది. “అది ఒక చీకటి అంటూ, నిజానికి చీకటి ఎంతో సహజంగా, చల్లగా, ప్రశాంతంగా నిశ్శబ్దంగా, హాయిగా ఉంటుంది. కానీ, జీవితంలో చీకటి అలాంటిది కాదు” అన్నారు. అలాంటి జీవితం నుంచి బయటపడే ధైర్యం చేయలేకపోయిన పిరికిదాన్ని నేను.

          ఆంధ్రప్రదేశ్ పత్రిక వాళ్ళు అడిగితే పంపిన ‘మా ఊరి వరద’ (జూన్ 2001 లో వచ్చింది) ఒక్కటే ఆ సంవత్సరం ప్రచురింపబడిన నా రచన-

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.