వెంకటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం   

పుస్తకాలమ్’ – 18

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

“కాస్త సాహిత్యం ఇప్పించండి”

(కాళిదాసు పురుషోత్తంగారి ‘వెంకటగిరి సంస్థాన చరిత్ర – సాహిత్యం’ రెండో కూర్పు వచ్చిందని పురుషోత్తంగారు తన ఫేస్ బుక్ వాల్ మీద రాసినది చూసి, ఆ పుస్తకం మొదటి కూర్పు వచ్చిన సందర్భంగా, సారంగ వెబ్ సాహిత్య పత్రిక 2015 మార్చ్ 5 న నేను రాసిన వ్యాసం పంచుకుందామనిపించింది. తీరిక దొరకక వారం వారం పుస్త’కాలం’ రెండు మూడు వారాలుగా నాగా పెట్టాను గనుక ఈ పాత రచన!!)

         గౌరవనీయ మిత్రులు కాళిదాసు పురుషోత్తం దాదాపు నాలుగు దశాబ్దాల వెనుక పి. ఎచ్. డి. కోసం చేసిన విస్తారమైన పరిశోధన ఫలితమైన సిద్ధాంతవ్యాసాన్ని ‘వెంకటగిరి సంస్థాన చరిత్ర – సాహిత్యం’ పేరుతో ఇప్పుడు ప్రచురించారు. అలా పరిశోధనకూ ప్రచురణకూ మధ్య సుదీర్ఘకాలం గడిచి ఈ పుస్తకమే గత వర్తమానాల వారధిగా నిలుస్తుందంటే, అందులోని వస్తువు వెంకటగిరి ఆస్థానంలో సాహిత్యం గురించి మాట్లాడుతూ ఇంకా వెనక్కి గతంలోకి వెళ్తుంది. గతం గురించి అద్భుతమైన, ఆలోచనా స్ఫోరకమైన, విస్తృత సమాచారం నింపుకున్న ఈ సిద్ధాంత వ్యాసం చదువుతున్న సమయాన్నే వర్తమానం కూడ అటు వంటి సూచనలిస్తున్నదని అనిపిస్తున్నది. వర్తమానంలో కూడ కొత్త సంస్థానాలు తలెత్తుతున్నాయనీ, సాధారణంగా నిర్బంధాన్ని సహించబోమని చెప్పే, తమను తాము స్వేచ్ఛా జీవులుగా భావించుకునే, నిత్య ప్రతిపక్ష మని చెప్పుకునే సాహిత్యకారులు, కళాకారులు కొత్త సంస్థానాల కడగంటి చూపుకైనా సరేనని పరుగెత్తుతున్నారనీ కనబడుతున్నది. గతవర్తమానాల మధ్య సారూప్యమూ విభేదమూ మరింత కొట్టవచ్చినట్టు కనబడి, తెలుగు సమాజపు ప్రతిష్టంభన మరొకసారి కళ్లకు కడుతున్నది.

         వెయ్యి సంవత్సరాల అధికారిక తెలుగు సాహిత్య చరిత్రలో అత్యధికభాగం, బహుశా ఎనిమిది వందల సంవత్సరాల పైన, ఆస్థాన సాహిత్యమే రాజ్యమేలింది.ఆ రాజాస్థానాలు కాకతీయ, విజయనగర రాజ్యాల వంటి సువిశాలమైనవా, రాజమహేంద్రవరం, కొండవీడు, నెల్లూరు, రాచకొండల నుంచి జటప్రోలు, గద్వాల, వెంకటగిరి, దోమకొండ వంటి చిన్న రాజ్యాలవా అనేది కేవలం వివరణ కోసం తెలుసుకోవలసిందే తప్ప, అధికారిక తెలుగు సాహిత్య చరిత్రలో రాజాస్థానాలలో వెలువడిన సాహిత్యానికే ఎక్కువ ప్రాధాన్యత దొరికింది. ఆస్థానాలకు బైటనే ఎంతో సాహిత్యం వచ్చినప్పటికీ దానికి సాహిత్యంగా గుర్తింపు దొరకలేదు. అటు వంటి గుర్తింపు దొరికి ప్రధానస్రవంతి సాహిత్యచరిత్రలో నమోదైన సాహిత్యకారులు అతి తక్కువమంది.

         ప్రతి మానవమేధకూ సహజంగా సృజనశక్తి ఉంటుంది. సామాజిక సంపర్కంతో అది వికసించే అవకాశం ఉంటుంది. అన్ని రూపాల సృజనాత్మక కార్యకలాపాలూ శ్రమతోనే వికసిస్తాయి. అందువల్ల బహుశా శ్రమజీవుల మౌఖిక సృజన కార్యకలాపాలే ఏ సమాజంలోనైనా రాశిలో అధికంగా ఉంటాయి. జీవితానుభవం వల్ల వాటి వాసి కూడ మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాని రాజాస్థాన సాహిత్య చరిత్ర రచనా సంప్రదాయం మౌఖిక సాహిత్యాన్నంతా విస్మరించి, లిఖిత సాహిత్యాన్ని మాత్రమే సాహిత్యంగా గుర్తించడం ప్రారంభించింది. ఆ లిఖిత సాహిత్యంలో కూడ రాజాస్థానానికి బైట స్వతంత్రంగా ఉండిన సాహిత్యకారులను చిన్నచూపు చూసింది.

         స్వభావసిద్ధంగానే లిఖిత సాహిత్య సృష్టికి అదనపు వనరులు అవసరమవుతాయి. లేఖన సంప్రదాయం ఏర్పడి ఉండాలి. లేఖన పరికరాలు అభివృద్ధి అయి ఉండాలి. ఉత్పత్తిలో మిగులు ఏర్పడి, కొన్ని వర్గాలు తమ ఉత్పత్తి తాము చేసుకోనక్కరలేని విశ్రాంతి వర్గంగా మారిన తర్వాతనే లిఖిత సాహిత్య వికాసం జరిగే అవకాశం ఉంది. ఈ విశ్రాంతి వర్గం తమ విశ్రాంతికీ విలాసాలకూ సమర్థన కల్పించుకోవడానికి విశ్రాంతి వర్గ సాహిత్య రచనా, ఆస్వాదనా, శ్రవణ వాతావరణాన్ని, అందుకు తగిన సాహిత్య సిద్ధాంతాన్ని తయారు చేసింది. ఆ వాతావరణాన్ని, సిద్ధాంతాన్ని కల్పించడంలో మతమూ, రాజ్యమూ సహకరించాయి. అందువల్లనే లిఖిత సాహిత్య సంప్రదాయం తప్పనిసరిగా శ్రామిక వర్గాల, ప్రజల పునాది పై కాకుండా మతం పునాది పై, రాజ్యం పునాది పై బలపడింది.

         లిఖిత సాహిత్యమంతా విశ్రాంతివర్గ సాహిత్యమే, రాజాస్థాన సాహిత్యమే అనే అతివాద సూత్రీకరణ చేయనక్కరలేదు గాని, విశ్రాంతి వర్గం ఏర్పడడమే లిఖిత సాహిత్య విస్తరణకు అవకాశాలు పెంచింది. విశ్రాంతి వర్గం ఏర్పడడమంటే శ్రామికవర్గం తమ అవసరాల కొరకు మాత్రమే కాక మరొక వర్గం అవసరాలకు కావలసిన అదనపు ఉత్పత్తి కూడ చేయవలసి వచ్చిందన్నమాట. అలా తాము శ్రమించకుండానే, ఉత్పత్తిని అనుభవించే హక్కు తమకు ఉందని చూపుకోవడానికి విశ్రాంతి వర్గం పాలన సాగిస్తున్నట్టుగా, పౌరోహిత్యం చేస్తున్నట్టుగా, రక్షణ కల్పిస్తున్నట్టుగా, సమాజపు విజ్ఞాన, వినోద అవసరాలు తీరుస్తున్నట్టుగా నటించడం మొదలయింది. ఈ విశ్రాంతి వర్గపు ఒకానొక కార్యకలాపమే ఆస్థాన సాహిత్యం.

         ఈ ఆస్థాన సాహిత్యంలో ఎక్కడైనా ఒకచోట వాస్తవికత, మానవీయత, గొప్ప భావాలు ఉన్నట్టు కనిపించినప్పటికీ దాని పునాది మాత్రం శ్రామికవర్గాల అదనపు ఉత్పత్తిని సంగ్రహించడంలోనే ఉంది. ఆ సంగ్రహం ఎంత పెద్ద ఎత్తున జరిగితే ఆస్థానాల వైభవం అంతగా విలసిల్లింది. ఆస్థానంలో విలాసాలు పెరిగినకొద్దీ ఆస్థాన సాహిత్యపు మైమరపూ పెరిగింది. ఆ విలాసభరిత, వైభవోపేత ఆస్థానాలలో సాహిత్య పోషణ భువనవిజయంగా సాగింది.

         అయితే వందల ఏళ్ల పాటు సాగిన ఈ ఆస్థానాల సాహిత్యసేవ అంతా వ్యర్థమే అనుకోనక్కరలేదు. సామాజిక శ్రమవిభజనలో భాగంగా బహుశా భౌతిక ఉత్పత్తి కార్యక్రమంతో పాటుగా ఈ మానసిక ఉత్పత్తుల కార్యక్రమం కూడ జరగవలసిందే. కాని అది సామాజిక అవసరాలకు, ప్రాధాన్యతలకు, ఉపయోగానికి లోబడి జరగాలి. సమాజానికి అవసరమైన మేరకే జరగాలి. సమాజానికి అధినాథులమని తమను తాము భావించుకునే కొందరి వీర, శృంగార, బీభత్స, ఔదార్య చర్యల వర్ణన మాత్రమే కాదు, సమాజాన్ని చిత్రించే బాధ్యత చేపట్టాలి. కాని ఆస్థాన సాహిత్యం, ప్రత్యేకించి తెలుగులో ఆస్థాన కవిత్వం ఆ పని చేయలేదు. కవులు సమాజపు సమస్యలు కనబడని, అర్థం కాని ఏకాంత దంత ప్రాకారాలలో నివసించారనడానికి ఆధారాలేమీ లేవు. వారు కొంతవరకైనా సామాన్య ప్రజల జీవితం చూసే ఉంటారు. కాని అటు ఆస్థాన అవసరాలూ, ఇటు లక్షణ శాస్త్రాలూ వస్తువు మీద, శిల్పం మీద నిర్దేశించిన కఠిన నియమాలు, వ్యాకరణాల సంకెళ్ళు, ఛందస్సుల సర్పపరిష్వంగం, కవులను సామాజిక వస్తువులవైపు చూడకుండా చేశాయి. సృజనకర్తకు సహజమైన ప్రయోగపరత్వం, అన్వేషణ, నవత అనే కార్యకలాపాలు చివరికి చిత్ర, బంధ, ద్వంద్వార్థ, నిరోష్ట్య వంటి సాముగరిడీలకు పరిమితమైపోయాయి.

         ఈ స్థితి కొన్ని వందల ఏళ్లు గడిచి, శ్రీకృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యంలో సాహిత్య పోషణ ప్రచారార్భాటం మితిమీరి ఆస్థాన కవిత్వమే ఏకైకం అన్నట్టు తయారయింది. “మూడు వందల యేళ్లపాటు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, కుట్రలు, దోపిడులతో లక్షల, కోట్ల సామాన్య ప్రజల్ని పీడనకూ హింసలకూ గురిచేసిన విజయనగర సామ్రాజ్యం” అని కంభంపాటి సత్యనారాయణ ‘ఆంధ్రుల సంస్కృతి – చరిత్ర’ లో రాసిన వాస్తవం ఆంధ్రభోజుడి ఆస్థానంలో వెల్లువెత్తిన సాహిత్యంలో ప్రస్తావనకే రాలేదు. కృష్ణ రాయల కీర్తి ఘల్లుమని మారుమోగుతుంటే మరుగున పడిపోయిన డజన్ల కొద్దీ దుర్భర మైన పన్నుల వివరాలను, ప్రజల మీద పన్నుల పీడనను కంభంపాటి సత్యనారాయణ సమకాలిక యూరోపియన్ ఆధారాల నుంచి సేకరించగలిగారు గాని ప్రజల కష్టాల గురించి ఒక్కటంటే ఒక్కటైనా ఆస్థాన సాహిత్య రచన మాట్లాడలేదు.

         మరొక మాటల్లో చెప్పాలంటే “ఆ రాజు పారేసిన ఎంగిలి పెరుగన్నం మెక్కి/ ఆస్థాన కవి నాటకం రాసాడు” అని ఆ తర్వాతెప్పుడో సరోజ్ దత్తా ‘శకుంతల’ కవితలో రాసినట్టు రాజ్య దుర్మార్గానికి మేలి ముసుగు కప్పడానికే అత్యధిక భాగం ఆస్థాన కవిత్వం ప్రయత్నించింది. ఆస్థాన సాహిత్యకారులు తమకు ఉప్పుపెట్టిన రాజును సంతోష పెట్టడమే తమ సాహిత్య బాధ్యత అనుకున్నారు. నిజానికి ఆ ఉప్పు రాజుది కాదని, అసంఖ్యాక శ్రమజీవుల నుంచి సంగ్రహించినదని గుర్తించలేదో, గుర్తించీ విస్మరించారో తెలియదు. మొత్తానికి బుద్ధిజీవులు ప్రభువులవైపా ప్రజలవైపా అనే ప్రశ్న వేసుకో కుండానే ప్రభువుల కొమ్ము కాశారు.

         తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు విజయనగర (హంపి) సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత ఏర్పడిన విశాలమైన కుతుబ్ షాహి రాజ్యమైనా, ఆ తర్వాతి కాలంలో ఎక్కడికక్కడ ఏర్పడిన చిన్న చిన్న సంస్థానాలైనా, చివరికి ఆర్థిక వనరులు మరీ అంత ఎక్కువ లేని సంస్థానాలు కూడ సాహిత్య పోషకులుగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించాయి. తమ శక్తికి మించి కూడ సాహిత్య పోషణ చేశాయి. అటువంటి సాహిత్య పోషక సంస్థానాలలో ఒకటి వెంకటగిరి. విజయనగరం (ఉత్తరాంధ్ర) తర్వాత అతి పెద్ద జమీందారీగా వెంకటగిరి 730 గ్రామాలతో, 617 శివారు పల్లెలతో, 2,171 చదరపు మైళ్ల విస్తీర్ణంతో, 1900 నాటికే సాలీనా రు. 14,46,222 ఆదాయంతో ఉండేది. ఆ సంస్థాన ప్రభువులలో ఒకరైన సర్వజ్ఞ కుమారయాచమనాయకుడు కవిపండిత పోషకుడు. స్వయంగా కవి అయి విద్వత్ కుమార యాచమనాయకుడని పేరు పొందాడు. వెంకటగిరి సంస్థానాన్నే విద్వత్సంస్థానం అని పిలిచేవారు.

         ఈ సంస్థాన చరిత్రను, సామాజికాంశాలను కాళిదాసు పురుషోత్తం ఈ సిద్ధాంత గ్రంథంలో రెండు అధ్యాయాలలో చాల ఆసక్తిదాయకంగా వివరించిన తర్వాత ఆ సంస్థానంలో జరిగిన సాహిత్య సృజనను మూడు అధ్యాయాలలో వివరంగా చర్చించారు. వీటిలో మొదటి అధ్యాయంలో సాహిత్యాన్ని మూడు ఉప అధ్యాయాలలో (1600-1850, 1850-1950 – గోపీనాథుని  వెంకయ్యశాస్త్రి, 1850-1950) చర్చించి, ఆ తర్వాత పదకవిత (1700-1950), సంస్కృత సాహిత్యం (1600-1950) కూడ చర్చించారు. ఆయాకాలాలలో ఒక్కొక్క కవినీ, ఆ కవి రచనలనూ తీసుకుని, ప్రాతినిధ్య, ఆసక్తికర పద్యాలను, సందర్భాలనూ ఉదహరిస్తూ సాధారణ పి ఎచ్ డి సిద్ధాంత గ్రంథాల కన్న విశిష్టంగా సాగిన గ్రంథం ఇది. ఉదహరించిన రచనల ఆధారంగానే ఇంతకన్న లోతైన సామాజిక, ఆర్థిక విశ్లేషణకు అవకాశం ఉంది గాని ఒక తెలుగు పి ఎచ్ డి పరిశీలన నుంచి అంతకన్న ఎక్కువ ఆశించలేం.

         ఈ పుస్తకం చదవడం గత కాలపు సాహిత్య తీరుతెన్నుల గురించి, సాహిత్య సృజన గురించీ, సాహిత్య అనుభవం గురించీ, సాహిత్య వస్తురూపాల గురించీ చాల ఆలోచన లను ప్రేరేపిస్తుంది.

         సంస్థాన సాహిత్యం ఎంతగా పాలకవర్గ, విశ్రాంతివర్గ సాహిత్యం అయినప్పటికీ, అది ఆ వ్యవస్థ దుర్మార్గాలకు మేలి ముసుగుగా పనిచేసినప్పటికీ అందులో ఒకటి రెండు సానుకూల అంశాలున్నాయనిపిస్తుంది. ఒకటి, సమాజ సంపదలో నుంచి కొంత మిగులును సాహిత్య, కళా రంగాల మీద తప్పనిసరిగా ఖర్చు పెట్టాలనే నియమం. అప్పటికి సాహిత్యానికి మార్కెట్ ఏర్పడలేదు గనుక సాహిత్య సృజన పూర్తికాలపు వృత్తిగా మారే అవకాశం లేదు. సాహిత్యం ఎవరో ఒకరి పోషణలో ఉండవలసిందే. (సాహిత్యం – పోషణ అనే మాటలు రాస్తున్నప్పుడు ఒక బాల్యపు జ్ఞాపకం గుర్తుకొస్తున్నది: మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చే యాయవారపు బ్రాహ్మణుడు ‘సాహిత్యం ఇప్పించండి’ అని పంచె పరిచేవారు. మా అమ్మ సోలెడు బియ్యమూ, దోసెడు కందిపప్పూ, కొన్ని కూరగాయలూ, చింతపండూ, మిరపకాయలూ ఆ పంచెలో వేస్తుండేది. సాహిత్యానికే స్వయంగా పోషణ అనే అర్థం ఉండిందన్నమాట!!) అందువల్ల ఆ నాటి స్థితినిబట్టి సామాజిక మిగులులో సాహిత్యానికి ఒక నియమబద్ధమైన వాటా కేటాయింపు మార్గంగా ఆస్థాన సాహిత్యం, కళాపోషణ పనిచేశాయా ఆలోచించాలనిపిస్తుంది.

         రెండో అనుకూలాంశం, ఎంత దుర్మార్గ పాలకులైనా, ప్రజల పట్ల ఎంత అన్యాయంగా ప్రవర్తించినా, వారిలో కూడ కళాకారుల పట్ల, సాహిత్యకారుల పట్ల కొంత ఔదార్య, దాతృత్వ లక్షణాలుండేవని ఆస్థాన సాహిత్యం చూపుతుంది. కవిత్వం పట్ల, కళల పట్ల అభిమానం ఉండడమంటేనే మానవీయ లక్షణం ఎంతో కొంత ఉన్నట్టు లెక్క. కనుక ఆ రాజులు, ఆ పాలన రాజకీయార్థిక అర్థంలో ఎంత దుర్మార్గమైనవైనా సాహిత్య, కళా అర్థాలలో కొంత సున్నితత్వాన్ని మిగుల్చుకున్నాయనుకోవాలి.

         అది విశ్రాంతి వర్గాల సాహిత్యం కావడం వల్ల, ఒత్తిడి లేకపోవడం, విలాసాలు, ప్రశంసలు, కానుకలు వంటి ప్రోత్సాహకాలు ఉండడం వల్ల కవితాశిల్పానికి కొంత మేలు జరిగిందనిపిస్తుంది. కొండొకచో అది వేలంవెర్రిగా మారి పాండిత్య ప్రదర్శనకూ, భేషజా లకూ, తప్పుడు, సాగదీత మార్గాలకూ దారి తీసి ఉండవచ్చు గాని, సాధనకు, మెరుగు పెట్టడానికి అవకాశం దొరికినందువల్ల కవితాశిల్పం ప్రశంసార్హంగా, ‘పూత మెరుంగులు’ తీర్చిదిద్దినట్టు తయారయిందని ఒప్పుకోక తప్పదు.

         “…ఆ వ్యవస్థ దోపిడిని, హేయత్వాన్ని కొంత వరకు కప్పి పుచ్చేవి ఈ సాహిత్య కళా పోషణలే! సామాజిక శాస్త్రవేత్తలూ, కళాదార్శనికులూ భూస్వామ్య వ్యవస్థ నాణేనికున్న రెండో పార్శ్వాన్ని అధ్యయనం చేసి, అప్పటి సాహిత్య కృషికి దోహదం చేసిన సామాజిక స్థితుగతులను అంచనా వేయాలి. మధ్యయుగాల్లోని సాహిత్యకృషిని, ఒక్కమాటలో, భూస్వామ్య వ్యవస్థకు పుట్టిన వికృతశిశువుగా అభివర్ణించడం సమంజసమా? సాహిత్య వస్తువును అటుంచుదాం.

         సాహిత్యాభి వ్యక్తిలోని సొగసులను, మెలకువలను పట్టించుకోనవసరం లేదా? ఆ యుగపు సాహిత్య కృషిలో అంతర్భాగమైన శతక వాంగ్మయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సామాజిక దృష్టితో చూసినప్పుడు, నీతి వైరాగ్య శతకాలతో పాటు, స్థానిక పాలకులను ధిక్కరిస్తూ నిరసనను తెలియజేసిన రచనలు (ఈ గ్రంథంలో ప్రస్తావించబడిన శార్దూల శతకం వంటివి) నారసింహ శతకం, వేమన పద్యాలు అప్పటి సాహిత్య సృష్టిలో భాగం కావా? సంస్థానాలు సాహిత్య పోషణకేగాక, భాషోద్ధరణకు, సంఘ సంస్కరణకు, కళాభి వృద్ధికి దోహదం చేశాయి. గురజాడ, వీరేశలింగం, రఘుపతిగార్ల కృషికి తోడ్పాటు నందించినవి సంస్థానాలే” అని ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో వకుళాభరణం రామకృష్ణ అన్న మాటలు చర్చనీయాలు.

         అయితే, ఆస్థాన సాహిత్యం మన సాహిత్యంలో ప్రవేశపెట్టిన అపసవ్యతలను గురించి తక్కువ చేయడానికి వీలులేదు. ప్రతి రచననూ ఒక కన్యగానూ, కృతి కర్తను దాని తండ్రి గానూ భావించి ఒక కృతి భర్తకు, సాధారణంగా పోషణ బాధ్యత తీసుకున్న రాజుకు, అంకితం ఇవ్వడం అనే దుష్ట సంప్రదాయాన్ని ఆస్థాన సాహిత్యమే ప్రవేశ పెట్టింది. సాధారణంగా ఈ సాహిత్యం రాజుల కోరికల మేరకు, రాజుల మెప్పు కొరకు సృష్టి అయింది గనుక కొంత, అత్యధిక ఆస్థాన రచయితలు బ్రాహ్మణులు కావడం వల్ల కొంత ఆస్థాన సాహిత్యంలో ఎక్కువ భాగం వర్ణాశ్రమ ధర్మాన్ని, మత ప్రాధాన్యతను, కుల అంతరాలను ప్రచారం చేశాయి.

         అలాగే, ఆస్థాన సాహిత్యం తనను తాను పీఠం మీద స్థిరపరచుకోవడానికి ఆస్థానాల బైటి సాహిత్య సంప్రదాయాల మీద చిన్నచూపును ప్రదర్శించింది. అసలు అది సాహిత్యమే కాదన్నట్టు ప్రవర్తించింది. నిజానికి మన ప్రజా సాహిత్యంలో, మౌఖిక సాహిత్యంలో, కొంత వరకు లిఖిత సాహిత్యంలో కూడ ఆస్థానాల బైట వెలువడిన ఆణిముత్యాలెన్నో ఇలా విస్మరణకు గురయ్యాయి. ఆ రచనల్లో ఆస్థానేతర వస్తువు ఉందని మాత్రమే కాదు, అవి ఆస్థానాలకు బైట వెలువడడమే, ఆస్థాన పీఠాధిపతులకు కంటగింపయింది.

         అలాగే ఆస్థాన సాహిత్యం తనకు బైటి ప్రజాజీవితంలో ఏమి జరుగుతున్నదో పట్టించుకోని బధిరాంధకతను ప్రదర్శించింది. సమాజ సాహిత్య సంబంధాలను వక్రీకరించింది. సాహిత్యాన్ని సమాజానికి దూరం చేసింది.

         సరిగ్గా ఈ అవలక్షణాలకు వ్యతిరేకంగానే సాహిత్యంలో ప్రజాస్వామికత కోసం సామాజిక, సాహిత్య ఉద్యమాలు చెలరేగాయి. ఒకవైపు నుంచి సమాజం తన ఉత్పత్తి అయిన సాహిత్యం తన నుంచి దూరం కావడాన్ని నిరసించగా, స్పందనాశీలురైన సాహిత్యకారులు సామాజిక పరిణామాలకు స్పందించడం ప్రారంభించారు. తొలినాటి ఈ పరిణామాలలో కూడ సంస్థానాల పాత్ర కొంత ఉండడం సామాజిక చలనశీలతకు ఒక నిదర్శనం. సాహిత్యంలో ప్రజాస్వామిక భావాలు, ఆస్థాన వ్యతిరేక భావాలు, భూస్వామ్య వ్యతిరేక భావాలు క్రమక్రమంగా విస్తరించి తెలుగు సాహిత్యం ఎన్నో ఉద్యమాలకు, ధోరణులకు, కొత్త గాలులకు వేదిక అయింది.

         అదంతా గడిచిపోయి ఎన్నో దశాబ్దాలు దాటింది. కాని క్రమక్రమంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలనేవి కూడ రాజాస్థానాలుగా మారిపోవడం, సంపన్నులు, నయాసంపన్నులు సాహిత్య, కళాపోషణలోకి రావడానికి ప్రయత్నించడం జరిగాయి గాని, మొత్తంగా తెలుగు సమాజంలో ఈ వ్యవస్థానుకూల ధోరణులపట్ల వ్యతిరేకతదే పైచేయిగా ఉంటూ వచ్చింది. తనను తాను ప్రజాస్వామికమని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆస్థానకవి పదవిని కొనసాగించడం పట్ల తీవ్రమైన విమర్శలే వచ్చాయి. దిగంబర కవితోద్యమానికి వచ్చిన విస్తృత ప్రజాదరణలో ప్రధానభాగం ఈ అధికారిక ప్రాపకాన్ని నిరసించడం వల్ల వచ్చిందే. శ్రీకాకుళ గిరిజనోద్యమ నేపథ్యంలో నక్షత్ర సప్తకం అనే సాహిత్య సంస్థను ముందు పెట్టి శ్రీశ్రీని కొనివేసి ఆస్థాన సాహిత్యంలో భాగం చేయడానికి ప్రభుత్వమూ, పాలకవర్గాలూ, వ్యవస్థతో సామరస్యం కుదుర్చుకున్న రాజకీయపక్షాలూ ప్రయత్నించినప్పుడు దానికి వ్యతిరేకంగా ఎంతటి తీవ్రపరిణామాలు జరిగాయో సాహిత్య చరిత్రకు తెలిసిందే.

         అదంతా కూడ గడిచిపోయి నాలుగు దశాబ్దాలు కావస్తున్నది. ఈ మధ్య కాలంలో వ్యవస్థానుకూల ఆస్థానాలను పునరుద్ధరించే ప్రయత్నాలు అడపాదడపా జరిగాయి గాని అవి చెప్పుకోదగిన విజయం సాధించలేదు. కాని గత కొద్ది సంవత్సరాలుగా మళ్లీ వ్యవస్థా సమర్థకులకు సాహిత్య పోషణ చేయాలనే వెంపరలాట పెరుగుతున్నట్టు కనబడు తున్నది. సాహిత్యకారులలో కొందరిలోనైనా మళ్లీ ఆస్థానాల వైపు , పీఠాలవైపు ఆసక్తి పెరుగుతున్నట్టు కూడ కనబడుతున్నది.

         శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని రక్తపుటేర్లలో ముంచిన పోలీసు అధికారులు ఆ తర్వాతి కాలంలో సాహిత్య కళాసంస్థల నిర్వాహకులుగా, సాహిత్య పోషకులుగా అవతారమెత్తారు. జరపవలసిన హింసాకాండ అంతా జరిపి, రెండున్నర లక్షల మంది సైనికులను చంపి, కళింగ రాజ్యపు దయానదిలో నెత్తురు ప్రవహింపజేసి, ఆ తర్వాత బౌద్ధ మతాన్ని అవలంబించిన అశోక చక్రవర్తి లాగ ఈ అధికారుల్లో కొందరు సాహిత్య పోషణతో పాటు బౌద్ధధర్మ నిర్వాహకులు కూడ అయ్యారు. ఇక ఆ తర్వాతి తరంలో అత్యంత క్రూరులుగా, మనుషులను పట్టుకుని చంపిన కర్కోటకులుగా పేరుపొందిన పోలీసు అధికారులు ఇవాళ ప్రచురణ సంస్థల నిర్వాహకులు, సలహాదారులు, పుస్తక ఆవిష్కర్తలు, రచయితలు కూడ అయిపోతున్నారు. అధికారులు, రాజకీయనాయకులు, వ్యాపారులు ఏర్పరుస్తున్న సాహిత్యేతర అధికార పీఠాల సాహిత్య పోషణ సజావుగా సాగిపోతున్నది. కొత్త కృతిభర్తలు తయారవుతున్నారు. సాహిత్యకారులు ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా ఉండాలనే మాట వెనుకపట్టు పట్టి ప్రభుత్వమే ప్రజాప్రభుత్వమనీ, అందువల్ల ప్రభుత్వ పక్షం ఉండడమే సాహిత్యకారుల బాధ్యత అనీ కొత్త ప్రవచనాలు వస్తున్నాయి. ప్రజా ధనంతో నిర్వహించబడే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం ఉండడమంటే ప్రజాధనంలో సాహిత్యకారులకు న్యాయంగా రావలసిన వాటాను నిరాకరించడమనే వాదన వస్తున్నది. ప్రజాధనాన్ని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల ప్రచారం కోసం, భజన కోసం వాడు తున్నప్పుడు కూడ అది ప్రజా కార్యక్రమం ఎలా అవుతుందన్న ప్రశ్న రావడం లేదు. ఇక కార్పొరేట్ సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) పేర కార్పొరేట్ సంస్థల సాహిత్య కళాపోషణలు, సాహిత్య ఉత్సవాలు పెద్ద ఎత్తున ఎటువంటి ప్రశ్నలూ లేకుండా జరుగుతున్నాయి. ప్రశ్నించేవాళ్లు చాదస్తులుగా కనబడుతున్నారు. భూముల్ని గుంజు కుని ఉపాధి పోగొట్టి ప్రజలను నిర్వాసితుల్ని చేస్తున్న, విషపదార్థాలు గాలిలో, నీటిలో, నేలలో కలిపి సమాజాన్ని కలుషితం చేస్తున్న, నామమాత్రపు ప్రజా సంక్షేమ చట్టాలకు కూడ తూట్లు పొడుస్తున్న కార్పొరేట్ సంస్థలు ప్రజా సాహిత్యాన్ని ఆదరిస్తున్నట్టు నటిస్తున్నాయి.

తెలిసో తెలియకో, అమాయకత్వంతోనో తమ రచనలకు గుర్తింపు వస్తుందనో ఆశతోనో, తమ రచనలు అచ్చవుతాయనో ప్రలోభంతోనో సాహిత్యకారులు, కళాకారులు ఈ ఆకర్షణలకు లోబడుతున్నారు. అటు నుంచి ఉద్దేశపూర్వకమైన బలమైన పుల్ ఫాక్టర్, ఇటు నుంచి తెలిసీ తెలియని కొంత పుష్ ఫాక్టర్ కలిసి సాహిత్యలోకంలో మళ్లీ ఆస్థానాలవైపు చూపు పెరుగుతున్నది. ఇటీవలి కాలంలో రాజకీయ, అధికార, వ్యాపార రంగాలలో వ్యక్తులతో సాహిత్యకారులకు గతంలోకన్న ఎక్కువ పరిచయాలు పెరగడం వల్ల, మొత్తంగానే సమాజంలో 1960ల్లో, 70ల్లో కంటె మధ్యతరగతి మొహమాటాలు పెరగడం వల్ల కూడ ఈ కొత్త ఆస్థానాలు బలపడుతున్నాయి.

         ఆస్థానంలో ఉండి కూడ ‘రాజుల్మత్తులు వారిసేవ నరకప్రాయంబు’, ‘రాజశబ్దంబు ఛీ జన్మాంతరమందునొల్లను’ అన్న ధూర్జటి, ‘హాలికుడైననేమి నిజదార సుతోదర పోషణార్థమై’ అని సంతృప్తి చెంది ‘నినునాకటికైగొనిపోయి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ’ అనీ, రాజులను “ఇమ్మనుజేశ్వరాధములు” అనీ అన్న పోతన, ‘కులము గలవాడు గోత్రంబు గలవాడు విద్యచేత విర్రవీగువాడు పసిడి గలుగువాని బానిస కొడుకులు’ అన్న వేమన వంటి ఉజ్వల సంప్రదాయం ఏమైపోతున్నది? దిగంబరకవుల ధర్మాగ్రహ వారసత్వం ఏమైపోతున్నది? విప్లవ సాహిత్యోద్యమ ధిక్కారం ఏమైపోతున్నది? అస్తిత్వ ఉద్యమాల ప్రతిఘటనా స్వరాలు ఏమైపోతున్నాయి? “…కసాయివాడు జీవకారుణ్యం మీద సెమినార్ పెడితే భూతదయ కలవాళ్లు ఉరకటమేనా?” అని కొడవటిగంటి కుటుంబరావు గారు 1970లో వేసిన ప్రశ్న వినిపించడం ఆగిపోయిందా?

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.