పేషంట్ చెప్పే కథలు – 13
పరుగు
–ఆలూరి విజయలక్ష్మి
“గుడ్ మార్నింగ్ యంగ్ లేడీ!”
“గుడ్ మార్నింగ్! నేనింకా యంగ్ లేడీలా కనిపిస్తున్నానా మీకు?” స్నిగ్ధంగా నవ్వింది డాక్టర్ శృతి.
“మీరెంత పెద్ద వాళ్ళయినా నువ్వూ, హరితా నాకు చిన్నపిల్లలానే కనిపిస్తారమ్మా!” పండిపోయిన జుట్టు, అలిసిపోయిన కళ్ళు, ఆర్ద్రంగా వున్నా కంఠం… శ్రీపతిరావును చూస్తుంటే ఆయన రూపురేఖల్ని పుణికి పుచ్చుకున్న తన స్నేహితురాలు హరిత కళ్ళ ముందు నిలిచింది శృతికి.
“హరిత ఫోన్ చేసింది. రిజర్వేషన్ దొరకలేదట. హైదరాబాద్ వరకు ఫ్లైట్లో వచ్చి అక్కడ నుండి ఎలాగోలా రేపు ఉదయానికి ఇక్కడకు చేరుకుంటానని చెప్పింది. మీకు వచ్చింది మైల్డ్ ఎటాకేనంటే నమ్మదే. బాగా కోలుకుంటున్నారు. ప్రమాదమేమీ లేదని ఫీజీషియన్ చెప్పారని చెప్పాను. అయినా రెక్కలు కట్టుకుని మీ ముందు వాలాలని దాని ఆత్రుత.”
“నిజమేనమ్మా! నాకూ అలాగే ఉంది, ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను” శ్రీపతిరావు కళ్ళు చెమ్మగిల్లాయి.
అవును, ఇన్నాళ్ళకు తను మనుషుల కోసం, ప్రేమకోసం, చల్లటి పలకరింపు కోసం మొహం వాచినట్లేదురు చూస్తున్నాడు.
“హరనాధ్ గారు, హృషీకేష్ గారు, హసిత ఎక్కడున్నారు? వాళ్ళ ఫోన్ నంబర్లు ఇవ్వండి. ఫోన్ చేస్తాను.” శ్రీపతిరావు కళ్ళల్లో మేఘాలు కమ్ముకున్నాయి.
“ఎందుకమ్మా ఫోన్ చెయ్యడం!? వాళ్ళెలాగూ రారు. ఒకడు అమెరికాలో, ఒకడు జపాన్ లో, హసిత జెర్మనీలో ఉన్నారు. ముగ్గురూ ఆ దేశాలవాళ్ళనే పెళ్లి చేసుకుని తరువాతెప్పుడో ఒక ఉత్తరం ముక్క రాసిపడేశారు… హరిత ఒక్కటే నా మనసు గ్రహించి నేను కుదిర్చిన సంబంధం చేసుకుని ఇండియాలో ఉండి పోయింది. అదికూడా నా మాట వినకుండా ఏ శ్రీలంక వాడ్నో చేసుకుని ఉంటే ప్రపంచంలో నాలుగు దిక్కుల్నీ కలిపినా బిడ్డల్ని కన్నా ఖ్యాతి దక్కేది నాకు” నవ్వాడాయన. ఆ నవ్వు వెనుక దాగివున్న విషాదాన్ని శృతి పసిగట్టింది. ఆయన్ని కదిపి, అంతగా మాట్లాడేలా చేసినందుకు కించ పడింది.
“మీరీ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకోండి. పేషెంట్స్ ని చూచి మళ్ళీ వస్తాను.” ఆప్యాయంగా పళ్లరసం తాగిస్తున్న శృతిని చూస్తుంటే శ్రీపతిరావు కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగి గడిచిపోయిన జీవితం, మరుగు పడిపోయిన జ్ఞాపకాలు వెలికి వచ్చాయి.
నిరుపేద కుటుంబంలో పుట్టిన తనకు ఊహ తెలిసిన దగ్గర నుండి డబ్బు లేకపోవడంలోని లోటు, డబ్బు లేనినాడు తప్పనిసరిగా దిగమింగాల్సిన అవమానాలు, ఆశాభంగాలు అనుక్షణం అనుభవంలోకి వచ్చాయి. అష్టకష్టాలు పడి, అన్నిటికీ తల వంచి చదువులో నెగ్గుకు వచ్చి ఇంజనీర్ అయ్యాడు. ఉద్యోగంలో చేరిన రోజున తన ముందున్న ఏకైక లక్ష్యం డబ్బు సంపాదించడం. తాను కోరిన డబ్బు, తనను అవమానించిన వారిని పరిహసించ గల స్థాయి తన ఉద్యోగంలో సంపాదించలేనని కొద్ది రోజుల్లోనే తెలిసొచ్చింది.
ఆలోచించి, ఆలోచించి చివరకు తెగించి ఉద్యోగం మానేసి కాంట్రాక్ట్స్ చెయ్యడం ప్రారంభించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు బ్రతుకంతా ఒకటే పరుగు. ఇంకా ఇంకా పై శిఖరాలకు చేరుకోడానికి నిర్విరామంగా కృషి. ఒకసారి పరుగు పందెంలో పాల్గోవడం మొదలు పెట్టాక వెనుకపడి పోకూడదని పట్టుదల. పరుగు, పరుగు, నిరంతరం పరుగు పెడుతూనే ఉన్నాడు. ఈ పోటీ నిషాలో పూర్తిగా కూరుకుపోయి బ్రతుకులో ఎన్నో మధుర మైన అనుభూతుల్ని కోల్పోయానని, ఎన్నో విలువైన వాటిని చేజార్చుకున్నానని చాలా ఆలస్యంగా గుర్తించాడు. అప్పటికే తాను డబ్బుకు దగ్గరగా, మనుషులకు దూరంగా జరిగి పోయాడు. తాను సంపాదించిన డబ్బు తన పిల్లల్ని ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చింది కానీ వాళ్లకూ తనకూ మధ్య దాటలేని అగాధాన్ని సృష్టించింది.
బ్రతుకులో తనేం కోల్పోయాడో తెలుసుకునే సరికి హరిత ఒక్కతే తన దగ్గర వుంది. ప్రయత్న పూర్వకంగా తను పూడ్చు కుంటూ వచ్చిన అగాధాన్ని హరిత సులభంగా దాటి వచ్చేసింది. పరుగు వేగాన్ని తగ్గించి హరితతోనూ, తన భార్యతోనూ తీరికగా కొన్ని సంతోష సమయాల్ని పంచుకుంటూన్నప్పుడు హరిత స్నేహితురాలు శ్రుతికూడా అప్పుడప్పడూ తమతో చేరేది… ఆయన కళ్ళలోని తడిని గమనించి వెంటనే వెళ్లిపోవడానికి మనసొప్పక అలాగే నిలబడిపోయింది శృతి.
“నీకు చాలా శ్రమనిస్తున్నానమ్మా!’ తెప్పరిల్లి శృతివంక బాధపడుతున్నట్లుగా చూశాడు శ్రీపతిరావు.
“మీరలా అంటే నాకు చాలా బాధ కలుగుతుంది. మీరు హరితకెంత ప్రియమైన వ్యక్తో, నాకూ అంతే. ఆ కాంట్రాక్టు పుణ్యమా అని పని మీద మీరీ ఊరొచ్చారు. సడన్ గా గుండెనొప్పి వచ్చి అనుకోకుండా ఇక్కడకు వచ్చారు, కాబట్టి ఇన్నేళ్ళకు మిమ్మల్ని చూడగలిగాను… మీరు మరచి పోయినా, ఓక పేదపిల్లకు మీ కూతురితో పాటు ఆప్యాయతను పంచిన మీ ఔదార్యాన్ని నేను మరచిపోలేను” ఎమోషన్ తో చలించింది శృతి స్వరం. ఎప్పుడో నిస్వార్థంగా తాను పంచిన రవ్వంత ప్రేమకు ప్రతిగా ఎంత ఆప్యాయతనూ ప్రేమనూ పొందుతున్నాడు తాను!… సన్నజాజి పరిమళంలా సంతోషం అలముకుంది శ్రీపతిరావు గుండెల్నిండా.
*****
డా.ఆలూరి విజయలక్ష్మి ప్రముఖ రచయిత్రి, వైద్యులు, సంఘసేవకులు. దాదాపు 150 కథలు, 5 కథా సంపుటాలు, 4 నవలలు, 3 వైద్య సంబంధ గ్రంథాలు రచించారు. అనువాదాలు కూడా చేసారు. వీరి రచనలు వివిధ వార, పక్ష, మాస, దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఆకాశవాణి విశాఖ పట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. వనిత మాసపత్రికలో ‘ఆరోగ్య విజయాలు’ అనే శీర్షికను నిర్వహించారు.