బాలాదేవి గారికి నివాళి!
స్నేహమయి పింగళి బాలాదేవిగారు!
-కె.వరలక్ష్మి
(పింగళి బాలాదేవి గారికి నివాళిగా ఈ ప్రత్యేక వ్యాసాన్ని, బాలాదేవి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూని పాఠకుల కోసం ప్రత్యేకంగా మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాం.)
***
2009 జనవరిలో అనకాపల్లిలో ‘మనలో మనం ‘ ( ఇప్పటి ప్ర.ర.వే) మొదటి సమావేశాలు జరిగాయి. మొదటి సెషన్ లో అందరం పరిచయాలు చేసుకున్నాం. ఆ సెషన్ ముగిసాక గంధం రంగులో ఫెయిర్ గా ఉన్న ఒకావిడ నా దగ్గరకు వచ్చి చెయ్యందుకుని ఆత్మీయం గా పలకరించారు- ” మీది జగ్గంపేటనా? మాది మీ పక్కనే ఉన్న కాట్రావుల పల్లి” అంటూ, ఆ రోజంతా నాతో కలిసే తిరిగారు, ఎందుకో తెలీదు, ఒకో స్నేహం ఒక సహృదయ వాతావరణాన్ని సృజించి కొనసాగిస్తుంది. ఆవిడకెందుకు నా మీద అంత వాత్సల్యం కలిగిందో తెలీదు. నా ఫోన్ నెంబరు తీసుకున్నారు. తను నివసిస్తున్న భువనేశ్వర్ నుంచి తరచుగా ఫోన్ చేసి మాట్లాడుతూండేవారు. ఎవరికీ చొరవగా ఫోన్లు చేసి మాట్లాడలేని నా అశక్తతను మన్నించి మా స్నేహాన్ని నిలబెడుతూ వచ్చారు. ఎప్పుడూ రాత్రి లీజర్ టైంలో ఫోన్ చేసి కనీసం ఓ గంట మాట్లాడేవారు, కాట్రావుల పల్లి నుంచి పెద్దాపురం వెళ్లి చదువు కున్న రోజులు మొదలు ఇప్పటి తన జీవితం వరకూ ఎన్నెన్నో కబుర్లు కలబోసుకునే వారు, వాళ్ల పెరట్లో మొక్కలు, పడిపోయిన కాంపౌండ్ వాల్ కట్టించడంలో కష్టాలు, అనుకోకుండా మీద పడే అనారోగ్యాలు – ఒకటి కాదు: అన్నీ ఆ మాటల్లో దొర్లేవి, నేను జగ్గంపేటలోని మా ఇంట్లో ఉన్నా ఎప్పుడూ చూడని ఒరిస్సాలోని వారి ఇల్లు అంతా నాకు తెలిసినట్టే ఉండేది. వాళ్ల ఊరికి రమ్మనీ, ఒరిస్సాలో చూడవలసిన ప్రాంతాలు చూపిస్తా ననీ అనేవారు. ఆ సహృదయమూర్తే శ్రీమతి భట్టిప్రోలు/పింగళి బాలాదేవిగారు. పింగళి మెట్టినింటి పేరు. పుట్టింటి పేరును వదల లేనంతగా ఆవిడకు తండ్రి పైన ప్రేమ. ఆ ప్రేమతోనే ఆవిడ రాసిన కథ ‘నాన్నకి రాయని ఉత్తరం’. ఆ కథను నాకు తెలిసిన మిత్రులెందరికో పంపేను. ఆ కథ ఇంటర్నెట్లో వైరల్ అయి, ఎందరినో చేరి ఇవాళ తొమ్మిదో తరగతి పాఠ్య గ్రంథంలో తెలుగు విద్యార్థుల కోసం స్థానం సంపాదించింది. కానీ ఆ విషయం తెలుసుకుని సంతోషించడానికి ఇవాళ ఆవిడ లేరు. ఆవిడ రచనలు ‘నాన్నకి రాయని ఉత్తరం‘ ; ‘ఒక చీకటి – ఒకవెన్నెల‘; ‘పొగమంచులో సూర్యోదయం‘ మిగిలాయి. బాలాదేవిగారు నా కన్నా ముందు తరం రచయిత్రుల కోవకు చెందినవారు.
రచయితలందరి లాగే తన కథల మీద ఎంతో అనురాగం, అంతంత ఖర్చుపెట్టి వేయించుకున్న ఆ పుస్తకాలు ఏమయ్యాయో తెలుసుకోలేని అశక్తత, తనకి చేరిన కొన్ని కాపీలనూ మిత్రులకీ, తెలిసిన వాళ్లకీ పంపించి ఆనందపడే అమాయకత్వం. రాష్ట్రానికి వెలుపల ఉండడం వల్ల తన రచనలకి సరైన న్యాయం జరగలేదనే చెప్పాలి. తనూ, భర్తా ఉన్నతమైన పదవుల్లో పదవీ విరమణ చెయ్యడం వల్ల ఆర్థికమైన ఇబ్బందులేవీ లేక పోయినా వయసుకు సంబంధించిన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టి భర్త మరణం తర్వాత కొన్నాళ్లు ఢిల్లీలో పెద్దమ్మాయికి దగ్గరగా నివాసం. మమకారం వదులుకో లేక తిరిగి సొంతింటికి రాక. తనను జాగ్రత్తగా చూసుకున్న పనమ్మాయి మీద గొప్ప ఆప్యాయత.
ఇంచు మించు ఒక ఏడాదిగా ఫోన్ పలకరింపులు ఆగిపోయాయి. అప్పుడప్పుడు వాట్సప్ మెసేజెస్ తో పలకరింపులు.
క్రమంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతోందనీ, చెప్పిన మాటనే మళ్లీ మళ్లీ చెప్తున్నారనీ అర్థమైంది. మా గీతతో చెప్తే నెచ్చెలి కోసం ఇంటర్వ్యూ చేసి బాలాదేవి గార్ని ఎప్పటికీ మనందరి కళ్ల ముందు ఉండిపోయేలా చేసింది. అప్పటికే ఆవిడ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతు న్నారు. మా స్నేహానికి గుర్తుగా చంద్రుడికో నూలుపోగు అది.
బాలాదేవి గారు ఫిబ్రవరి 17 న కాలం చేసారని ఆలస్యంగా తెలిసింది. వారికిదే నా కన్నీటి నివాళి!
***
పింగళి బాలాదేవి రాశి కన్నా వాసి ముఖ్యమైన ప్రవాసాంధ్ర రచయిత్రి. సొంత ఊరు తూ.గో.జిల్లా కాట్రావులపల్లి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నివాసం. జువాలజీలో ఎమ్మెస్సీ చేసి లెక్చరర్ గా ప్రభుత్వోద్యోగం చేసారు. బాలాదేవి ఇరవై అయిదు దాకా కథలు, వంద వరకు కవితలు, రెండు నవలలు రాసారు. స్త్రీల సమస్యలు, కుటుంబ బాంధవ్యాలు ఇతివృత్తాలుగా రచనలు చేశారు.
వీరు రాసిన “నాన్నకి రాయని ఉత్తరం” కథ ఆ మధ్య సోషల్ మీడియాలో ‘నాన్నకు ప్రేమ తో’ అంటూ వైరల్ అయ్యింది. ఆ కథని స్వయంగా వారు చదవగా ఈ ముఖాముఖిలో నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇచ్చాం.
నవలలు:
1. ఒక చీకటి ఒక వెన్నెల
2. పొగమంచులో సూర్యోదయం
కథా సంపుటి:
నాన్నకి రాయని ఉత్తరం
*****
చాలా ఇన్స్పైరింగ్ స్త్రీమూర్తిని గురించిన సమాచారం. చాలా బాగుంది. ధన్యవాదాలు.
శారద (బ్రిస్బేన్)
చాలా ఇన్స్పైరింగ్ స్త్రీమూర్తిని గురించిన సమాచారం. చాలా బాగుంది. ధన్యవాదాలు.
శారద (బ్రిస్బేన్)
చాలా బాగుంది. మంచి రచయిత్రి గురించిన పరిచయం. ధన్యవాదాలు వరలక్ష్మి గారు.
శారద ( బ్రిస్బేన్)