మా కథ (దొమితిలా చుంగారా)- 43

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

“దురదృష్టకరమైన ప్రమాదం”

         బొలీవియాలో యువకులందరూ పద్దెనిమిదేళ్ళకే సైన్యంలో చేరాల్సి ఉండింది. సైన్యంలో చేరిన పత్రాలు లేకపోతే బైట ఉద్యోగాలు దొరకక పదిహేడేళ్ళకే సైన్యంలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. సైన్యంలో చేరనంటే పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. నరకంలాంటి బాధలు అనుభవించాల్సి వచ్చేది.

         కొడుకులు బారలకు వెళ్ళే పరిస్థితి వచ్చిన రోజు తల్లిదండ్రులు నోరువిప్పి మాట్లాడ గూడదు. ఇక సైన్యంలో చేరాక తమ స్వజనాన్ని కాల్చేయడానికి కూడ వెనుకాడకూడదు. బొలీవియాలో ఇలాంటి స్థితి ఎన్నో సార్లు ఏర్పడింది. ఉదాహరణకు 1967 సాన్ జువాన్ హత్యాకాండలో కాల్పులు జరపడానికి నిరాకరించినందుకు పదిమంది యువ సైనికులు ప్రాణాలు పోగొట్టుకోవలసి వచ్చింది. ఆ సైనికుల కుటుంబాల వాళ్ళు, తండ్రులూ, తల్లులూ, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ, బంధుమిత్రులూ అంతా సైగ్లో – 20 లోనే ఉన్నారు. అధికారులు ప్రత్యేకించి “సైగ్లో-20 కటావిలకు చెందిన వాళ్ళు ముందుకు రండి” అని పిలిచి మరీ కాల్పులు జరపమన్నారు. ఈ యువకులు ఒప్పుకోకపోతే అక్కడికక్కడే కాల్చిపారేశారు.

         మే ’75లో మాకిప్పటికీ అర్థంకాని సంఘటన ఒకటి జరిగింది. అప్పుడు నమోదు చేయించుకోవడానికొచ్చిన సైనికులు కొందరు చంపేయబడ్డారు.

         సైగ్లో-20కి దగ్గరలో అన్ సియాలో ఒక సరస్సు ఉంది. మేం ప్రతి శని, ఆదివారాలు అక్కడికెళ్ళి సంతోషంగా గడిపి ఈతలు కొట్టి వస్తుండేవాళ్ళం. సైన్యం ఇప్పుడా స్థలాన్ని ఆక్రమించుకొని బ్యారళ్లు కట్టింది. ఆ బ్యారక్ సైనికులు సైగ్లో – 20కీ, కటావికీ, లాలాగువాకు వచ్చి తెగతాగి, ఎవడైనా అడ్డం వస్తే తన్ని పడేసి పోతుంటారు. అంగడి రోజు వచ్చి మొరటుగా జనాన్ని అటూ ఇటూ తోస్తూ తిరుగుతుంటారు. రెండు జేబుల్లోనూ తుపాకులు పెట్టుకొని, నడుం మీద చేతులానించి పోకిరీ వేషాలు వేస్తుంటారు. తమనెవ్వడూ ఏమీ చేయలేడని వాళ్ళ ధీమా.

         సరే – 75 మేలో సైన్యంలో చేరడానికి నమోదుచేసుకున్న కొంతమంది యువకుల్ని బ్యారక్స్ కి పంపించారట. వాళ్ళందరూ లాపాలో దరఖాస్తులు పెట్టుకున్నారు. వాళ్ళలో ఒక ముప్ఫై నలభై మందిని అన్ సియాలో ఉండడానికి పంపించారు.

         వాళ్ళు బ్యారలకి చేరగానే దుస్తులు కూడా ఇవ్వక ముందే ఆరుగంటల పాటు నిటారుగా నిలబడాలని శిక్ష విధించారట. ఆ తర్వాత వాళ్ళందరినీ ఆ సరస్సులోకి కుప్పగా వదిలారట. పాపం వాళ్ళు అక్కడ నీళ్ళలో మునిగి చనిపోయారు. అప్పుడక్కడ పనిచేసిన మేజర్ అడాల్ఫో “ఆ రెడ్ ఇండియన్ వెధవలండీ! ఈత చేతగాక భయపడి మునిగిపోయారు…” అన్నాడు.

         ఊహించండి! అంత మందికి సామూహికంగా తిమ్మిరి వచ్చిందంటే అర్థమేమిటి? ఇలా తిమ్మిరి రావడానికి కరెంట్ షాక్ కారణం కావచ్చునా? ఆ చెరువు పెద్ద లోతు కూడా లేదు. ఎలా జరిగిందో గాని మొత్తానికి తొమ్మిది మంది యువ సైనికులు అప్పుడు చని పోయారు. వివరాలు తెలుసుకొని రమ్మని యూనియన్ మమ్మల్ని పంపించింది.

         మేం అన్ సియా బ్యారక్ లకి వెళ్ళి ఏం జరిగిందని వాకబు చేస్తే కల్నల్ రామల్లో “ఓరి దేవుడో … ఎంత ఘోరం జరిగిపోయింది! చాల దురదృష్టకరమైన సంఘటన అది. ఆ యువకులందరికీ ‘సామూహిక తిమ్మిరి’ వచ్చింది. నిజానికి వాళ్ళంతా రెడ్ ఇండియన్లు గనుక ఈత కూడా రాదు. ఇక భయంతో చెరువులో పడి చనిపోయారు. వాళ్ళ చావేమోగాని మా చావుకొచ్చింది. ఇక ఇప్పుడు ఉగ్రవాదులు ఈ సంఘటనను అవకాశంగా తీసు కుంటారు” అన్నాడు. మేం శవాల్ని చూడొచ్చునా అని అడిగాం.

         “అయ్యో! శవాల్ని కటావి ఆస్పత్రికి పంపించేశాను. తర్వాత ఎటుపోయి ఎటొస్తుందో అని శవపరీక్ష చేయిస్తున్నాను” అన్నాడాయన.

         మేం వెంటనే సైగ్లో-20కి వెళ్ళిపోయి యూనియన్ ప్రధాన కార్యదర్శికి విషయమంతా చెప్పాం. మా నాయకుడు కటావి ఆస్పత్రికి వెళ్ళి, శవపరీక్ష చేయడం కోసం ముగ్గురు డాక్టర్లను తన వెంట అనేసియాకు రమ్మని అడిగాడు. కాని ఆస్పత్రి డైరెక్టర్ “దయచేసి నన్ను క్షమించండి. ఈ శవపరీక్ష గొడవలోకి మమ్మల్ని దిగొద్దని కటావి గనుల కంపెనీ నుంచి ఒక హెచ్చరిక అందింది. లాలాగువాకు వెళ్ళి అక్కడి ఆస్పత్రి డాక్టర్‌ను పిలిచి చూడండి ….?” అన్నాడు. కాని లాలాగువా డాక్టరేమో “నా భద్రతకు మీరు హామీ యిస్తారా…?” అని అడిగి ఈ శవపరీక్ష చేయనన్నాడు.

         ఇవన్నీ చూశాక ఇందులో ఏదో తిరకాసుందని, దీని అంతు తేల్చుకోవలసిందేనని మేం నిర్ణయించుకున్నాం. యూనియన్ ప్రధాన కార్యదర్శి లాపాజ్ కు ఉత్తరాలు రాశాడు. వైద్య కళాశాల నుంచి, న్యాయ, శాంతి వ్యవహారాల కమిషన్ నుంచి, పత్రికల నుంచి ఒక ప్రత్యేక విచారణ బృందం వచ్చి ఈ విషయాన్ని దర్యాప్తు చేయవలసిందిగా మేం కోరాం.

         మాకీ సంగతి తెలిసి అప్పటికే మూడు రోజులు దాటిపోయింది. మిలిటరీ వాళ్ళు మృతదేహాల్ని వెంటనే ఖననం చేశారు. లాపాజ్ నుంచి విచారణ బృందం వస్తున్నదని తెలియగానే వాళ్ళు అని సియా శ్మశానం నుంచి శవాల్ని తవ్వి తీసి మాయం చెయ్య దలచుకున్నారు. ఓ రోజు రాత్రి పదకొండు గంటలకు ఇరవై మంది సాయుధ సైనికులు శవాల్ని తవ్వి తీసి రెండు ట్రక్కుల్లో ఎక్కించారు. నాలుగు శవాల్ని ఒక ట్రక్కులో, ఐదు శవాల్ని ఒక ట్రక్కులో పెట్టారు.

         కాని ప్రజలప్పటికే చురుగ్గా ఉన్నారు. శ్మశానంలో లైట్ల వెలుగు కనబడుతోందనే మాట ఊరంతా పాకిపోయింది. కొందరు స్త్రీలు పరుగెత్తుకెళ్ళి సైనికుల్ని చుట్టుముట్టారు. ఆ స్త్రీలు ఎంత పకడ్బందీగా ఈ పనిచేశారంటే సైనికులకి ఎటూ మెసిలే అవకాశం లేకపోయింది. వాళ్ళు కాల్పులు గూడ జరపలేని స్థితి వచ్చింది. అప్పుడిక వాళ్ళు ఆ స్త్రీలను తిట్టడం మొదలెట్టారు.

         ఈ గందరగోళంలోనే నాలుగు శవాలున్న ట్రక్కు అకస్మాత్తుగా వెళ్ళిపోయింది. డ్రైవర్ సిద్ధంగా లేకపోవడంతో ఐదు శవాల ట్రక్కు మాత్రం అక్కడే నిలిచిపోయింది. కొందరు స్త్రీలు సైనికులతో వాదనకు దిగితే మరికొందరు శవాల్ని కిందికి దించారు. తమ శాలువాలు పరిచి శవ పేటికల్ని వాటిమీద పెట్టారు. ఇక ఆ శవాలన్నిటినీ ఆన్ సియా చర్చికి తీసుకెళ్ళారు. ప్రధాన ద్వారం నుంచి వాళ్ళు మాకు ఫోన్ చేసి “మాకు సాయం కావాలి. వాళ్ళు యువ సైనికుల శవాలెత్తుకుపోతుంటే మేం అడ్డగించాం. త్వరగా రండి …” అని చెప్పారు.

         గని కార్మికులు చర్చికి వెళ్ళి ఆ రాత్రంతా అక్కడ కాపలా కాశారు. ఆ రాత్రి అక్కడ ఆ మృతదేహాల్ని చూసిన వాళ్ళందరూ ఆ సైనికులకి పట్టిన దుర్గతికి కంట తడి పెట్టారు. ఆ మృత సైనికుల కడుపు ఒత్తితే నోట్లోంచి నీళ్ళు రావడం లేదు. నోట్లోంచీ, ముక్కులోంచి నెత్తురొస్తోంది. వాళ్ళ పొత్తి కడుపు నల్లగా, నీలంగా మారిపోయి ఉంది. కొందరికి తలపగిలి ఉంది. కొందరికి ఎదురు రొమ్ము ఎముక విరిగిపోయి ఉంది.ఒంటినిండా గాయాలున్నాయి. వాళ్ళు నీళ్ళలో మునిగి చనిపోలేదని, చిత్రహింసలకు గురై చనిపోయారని ఎవరైనా సులభంగా చెప్పవచ్చు.

         అంతేకాదు, వాళ్ళు దాదాపు నగ్నంగా ఉన్నారు. ఒంటిమీద ఉన్న కాస్త బట్టలైనా చెడిపోయి ఉన్నాయి. యూనియన్ వాళ్ళ కోసం కొత్త బట్టలు కొని తెప్పించింది. ఈ బట్టలు అనేసియా తీసుకెళ్ళి ఇవ్వాల్సిన పని నాకు అప్పగించారు. నేనెళ్ళి చూసేసరికి వాళ్ళ బట్టలు పూర్తిగా చిరిగిపోయి దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. వాళ్ళల్లో ఓ కుర్రాడి తల మీద బహుశా పరిహాసానికేమో ఓ పాత మురికి చెడ్డీ తొడిగారు.

         ఇంతచేసి ఆ మృతదేహాలను సైనిక లాంఛనాలతో ఖననం చేసామని వాళ్ళు రేడియోలో ప్రకటించారు. అంటే కార్మికుల పిల్లలకూ, రైతు కూలీల పిల్లలకూ దొరికే సైనిక లాంఛనాలకు అర్థం ఇదన్నమాట. ఈ విషయమంతా జనాన్ని బాగా ఉద్రిక్తుల్ని చేసింది. ఆ యువ సైనికుల చావుతో దేశానికేం ఒరిగింది? ఏ మేలు కోసం వాళ్ళను హత్యచేశారు? ఇవాల్టికీ మాకు అంతుపట్టని విషయం ఇదే. వాళ్ళ నోళ్ళలోంచి నెత్తురు పైకి ఉబకడం ఇంకా నా కళ్ళలో ఆడుతోంది.

         ఎన్నెన్ని చూశాం మేం! ఇంకా మిగతా దేశాల్లో ఇలాంటివి ఎన్నెన్ని జరుగు తున్నాయో?!  రేడియో, పత్రికలూ, టెలివిజన్ అన్నిటికన్ని ప్రభుత్వం గుప్పిట్లో పెట్టు కుంది గనుక మాకు అసలైన వార్తలే తెలీవు.

         ఇప్పుడు బొలీవియన్ సైన్యంలో కూడా చీలిక వచ్చిందనీ, కొందరు చైతన్య వంతులు మిలిటరీ పాలనను విమర్శిస్తున్నారనీ, తమ అసంతృప్తిని ఏదో ఒక రూపంలో ప్రకటిస్తున్నారనీ మాకు తెలిసింది. సైన్యం ఇలాంటి వాళ్ళను రహస్యంగా మాయం చేస్తుంది. ఏ దూర తీరాలకో ప్రవాసం పంపుతుంది. లేదా, వాళ్ళను బాధ్యతల నుంచి తప్పిస్తుంది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.