యాదోంకి బారాత్-7
-వారాల ఆనంద్
ఎస్.ఆర్.ఆర్.కాలేజ్ డిగ్రీ చదువులు, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు
1974-77 ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో బి.ఎస్సీ. డిగ్రీ చదువు ఆడుతూ పాడుతూ సాగిన కాలం. కాలేజీకి వెళ్ళామా వచ్చామా అంతే. అట్లని విచ్చలవిడితనం అన్నదీ లేదు. మంకమ్మతోట ఇంటి నుంచి రాజేందర్ జింబో, నేను సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు భాగ్యనగర్ వున్న చోట పెద్ద కుంట వుండేది. తర్వాత వరి మడులు. కేవలం St. John’s English medium SCHOOL వుండేది. దాని ప్రహరీ గోడను ఆనుకుని వున్న చిన్న దారి గుండా కాలేజీకి వెళ్ళే వాళ్ళం. కాలేజీ వెనుక నుండి మైదానం దాటి లోనికి మా దారి. మంకమ్మతోట అంటే వెనకటి కాలంలో ఎప్పుడో అక్కడ ఓ తోట ఉండేదని మంకమ్మ పేర ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అనేవాళ్ళు. కరీంనగర్ నుండి వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డిలకు వెళ్ళే ప్రధాన రహదారి మంకమ్మ తోట గుండా వెళ్తుంది. ఇక ఆ రోడ్డు మీదే SVTC ( ఎస్.వీ.టీ.సి.) అని ఓ ట్యుటోరియల్ కాలేజీ బాగా పాపులర్. దాన్ని స్థాపించి నడిపింఛిన వారు శ్రీ సముద్రాల నాగభూషణం. కరీంనగర్ కు ట్యుటోరియల్ కాలేజీ అన్న భావనను పరిచయం చేసింది ఆయనే. అప్పుడు పదవ తరగతికి ఎస్.వి.టి.సి. నోట్స్ అంటే చాలా పాపులర్. ఆర్ ఎస్ ఎస్ భావ జాలంతో వున్నా ఆయన చాలా డెమోక్రటిక్ గా ప్రవర్తించేవారు. అందుకే ఆయనంటే కరీంనగర్ లో గొప్ప గౌరవ భావం వుండేది. ఆయన కూతురు బొడ్ల అనురాధ ఇంగ్లీషులో ప్రావీణ్యత సాధించారు. తాను నా కవిత్వాన్ని ‘SIGNATURE OF LOVE” పేర ఇంగ్లీష్ లోకి అనువదించారు. తర్వాత నా ముక్తకాలు కూడా “MUKTHAKAALU” ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేట్ చేసారామే. ఇక మంకమ్మ తోట అనగానే మా ఇంటర్ మిత్రులు, తర్వాత డిగ్రీలో చేరిన వాళ్ళు అనేక మంది గుర్తొస్తారు. సుబ్బారావు సార్ కొడుకు మధు, బట్టీల రంగయ్య కొడుకు రాజేందర్, విజేత శంకర్ తమ్ముడు తిరుపతి గౌడ్ , అర్ధంతరంగా మమ్మల్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన మాధవ్, ఇట్లా అనేక మంది ఆత్మీయ మిత్రులు మదిలో మెదులుతారు. అంతే కాదు మంకమ్మతోట అనగానే సంతోష్ కుమార్ (తర్వాత ఎం ఎల్ సి అయ్యాడు), శంకర్, లక్ష్మినారాయణ ఇంకా ఎందరో.. మంకమ్మతోటలో నేను కొద్ది రోజులు టైపింగ్ నేర్చు కోవడానికి వెళ్ళిన విద్యార్థి ఇన్స్టిట్యుట్ ఇప్పటికీ వుంది, అంతే కాదు మా ఇంట్లో అందరికీ వైద్యం చేసిన ఆర్.ఎం.పి.డాక్టర్ తిరుపతి గారు యాది కొస్తారు. ఆయనకో చిత్రమయిన అలవాటు ఉండేది పేషంట్లను ఎవరయినా సరే ఎక్కువ సేపు వెయిటింగ్లో ఉంచేవాడు. చాలా రోజులు అర్థం కాలేదు. బోర్ కొట్టేది కోపం కూడా వచ్చేది. అయితే వచ్చిన పేషంట్లు మొదట ప్రశాంతం కావడానికో లేక ఎక్కువ మంది వున్నారనే భావన కలగడానికో అని అర్థం అయ్యాక నవ్వుకున్నాను.
ఇక మంకమ్మ తోటలో మరో రెండు ప్రధాన కుటుంబాలున్నాయి. ఒకటి కల్పనా దేవేందర్ వాళ్ళది వాళ్లకు బస్ స్టాండ్ రోడ్డులో మొదట సైకిల్ టాక్షి తర్వాత కల్పనా హోటల్ వుండేది. ఇక మరో కుటుంబం పొన్నం వాళ్ళది. నిజానికి వాళ్ళ ఇల్లు కూడా క్లాక్ టవర్ దగ్గర మా మిఠాయి దుకాణం ప్రాంతంలోనే వుండేది. తర్వాత వ్యవసాయం వుండి ఇటు వైపు వచ్చారు.
గతంలో వారాల వాళ్ళకూ అవద్ గాని కుంట దగ్గర వ్యవసాయ స్థలాలు ఉండేవని అన్నీ పోయాయని నాన్న చెబుతుంటారు.
***
ఇక నా రచనా యాత్రలో మొదటి కథ రాయడం అది చిత్రిక వార పత్రికలో అచ్చు కావడం ఒక ఎత్తయితే కవిత రాసి మొట్ట మొదటిసారి వేదిక మీద చదివి అభినందనలు అందుకోవడం ఎస్.ఆర్.ఆర్.డిగ్రీ కాలేజీలోనే జరిగింది. అది ఎంతో ఆనందకర మయిన సందర్భం. డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పటి మాట అంటే 1976 లో కాలేజీ ప్రిన్సిపాల్ గా శ్రీ కే.వై.ఎల్.నరసింహా రావు వచ్చారు. అప్పటిదాకా వున్న వెల్చాలకొండల రావు బదిలీ మీద హైదరాబాద్ కు వెళ్ళారు. కే.వై.ఎల్ గారు సౌమ్యుడు. చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించెంత గంభీరంగానూ ప్రేమగానూ వుండేవారు. ఆయన వచ్చిన తర్వాత కాలేజీలో సాహితీ వాతావరణం ఏర్పడింది. మా కాలేజీకి గతంలో ప్రిన్సిపాల్ గా పనిచేసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మీద గౌరవంతో కాలేజీ మీటింగ్ హాల్ కు ‘విశ్వనాథ సభామందిరం’ అన్న పేరు పెట్టారు. అందులో ఒక రోజు ఓ సాహితీ కార్యక్రమం, కవి సమ్మేళనం ఏర్పాటు చేసారు. ముఖ్య వక్తగా అప్పుడు కరీంనగర్ లోని బిషప్ సాల్మన్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనుచేస్తున్న సుధామ గారిని పిలిచారు. సభా మందిరం క్రిక్కిరిసి పోయింది. సుధామ ఆ రోజు తెలుగు కవిత్వంలో ఆధునికత విషయాన్ని ఎంచుకుని శ్రీ శ్రీ కవిత్వం నుంచి మొదలు ఆధునిక తెలుగు వచన కవిత్వం గురించి అద్భుత ప్రసంగం చేసారు. ఆయన గొంతు చాలా బాగుండడంతో శ్రోతలు స్పెల్ బౌండ్ అయ్యారు. తర్వాత ప్రిసిపాల్ కే.వై.ఎల్. నరసింహ రావు మాట్లాడుతూ సుధామ గారు బాగా మాట్లాడారు కాని శ్రోతలు సాహిత్యానికి ఒక వైపే విన్నారని మరో కోణం కూడా వుందని తెలియజేయడానికే నంటూ విశ్వనాథ, రాయప్రోలు లాంటి వారి సాహిత్యాన్ని కృషిని సోదాహరణంగా ప్రసంగించారు. ఆ రెండు ప్రసంగాలూ హాలులోని వాళ్ళందరినీ మంత్ర ముగ్దుల్ని చేసాయి. అనంతరం జరిగిన కవి సమ్మెళనంలో నా మొదటి కవితా పఠనం. చదివిన కవిత గుర్తులేదు కాని చదివిం తర్వాత కే.వై.ఎల్. గారి చేతుల మీద అందుకున్న సత్కారం ఎప్పటికీ మర్చిపోలేను.
సుధామ మరికొంత కాలం బిషప్ సల్మాన్ కాలేజీలో పని చేసారు. ఆ కాలేజీకి వెళ్లి తనని కొన్నిసార్లు కలిసాము. తరవాత సుధామ ‘ఆకాశవాణి’ లో చేరిపోయారు.
***
మరోవైపు కరీంనగర్ లో నెహ్రు యువకేంద్రం బాగా ఆక్టివ్ అయింది. యూత్ కో ఆర్డినేటర్ గా వచ్చిన వి.రామారావు గారు వినూత్న కార్యక్రమాలతో జిల్లాలో యువకులను సమీకరించి చైతన్య వంతం చేయడం ఆరంభించారు. అందులో భాగంగా బస్ స్టాండ్ కు ఎదురుగా వున్న యువ కేంద్రంలో ‘WEDNESDAY CLUB’ ప్రారంభించారు. ఆ క్లబ్ లో యువకులని సభ్యులుగా చేర్పించారు. ఆ క్లబ్ ప్రతి బుధవారం సాయంత్రం సమావేశ మయ్యేది. అందులో ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసమూ, ఉపన్యాస కళ, వర్తమాన సామాజిక విషయాల మీద చర్చలు జరిగేవి. అందులో ప్రధానంగా వాసుదేవ రెడ్డి, మహేష్, వెంకటేష్, నేను ప్రధాన పాత్రల్ని పోషించాం. బుధవారం క్లబ్ తో పాటు వివిధ గ్రామాల్లో యూత్ కాంపులు పెట్టేవారు. ఆ టీంలో వాసుదేవ రెడ్డి మహేష్ తదితరులు ‘శారదానికేతన్ “సంస్థ పెట్టి ‘కరీంనగర్ కళాభారతి హాలులో ఎన్నో నాటకాలు వేసారు. యువ కేంద్రలో అకౌంటెంట్ గా వున్న టి.వి.విద్యాసాగర్ రావు, టైపిస్ట్ గా వున్న చీటీ జగన్ రావు ఎంతో సహకరించే వాళ్ళు. శ్రీ విద్యాసాగర్ రావు తర్వాతి కాలంలో కో ఆర్డినేటర్ అయ్యాడు, చీటీ జగన్ రావు గంగాధర మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
***
సరిగ్గా ఆ కాలంలోనే మా మిత్రులందరి జీవితాల్లోకి సంగీతం ఆర్కెస్ట్రాలు వచ్చి చేరాయి. చిన్నప్పటి నుండీ బినాకా గీత్మాలా, పురాని ఫైల్మొంకా గీత్ తదితర కార్యక్రమా లతో హిందీ పాటల ఊయలలో వూగుతున్న నాకు ఇంటర్ కు వచ్చేసరికి కరీంనగర్ లో కరీంనగర్ కల్చరల్ వింగ్ పేర ఓ ఆర్కెస్ట్ర తగిలింది. అనేక వాయిద్యాలతో సాగే ఆ ప్రదర్శనలు లైవ్ కావడంతో విపరీతంగా ఆకట్టుకొనడం ఆరంభించాయి. ఈ టీంలో హన్మాండ్లు, నరేంద్రచారి తదితరులు తెలిసిన మిత్రులు వుండేవాళ్ళు. వినాయక చవితి ఉత్సవాలు, స్కూలు కాలేజీ కార్యక్రమాలల్లో వారి కార్యక్రమాలు గంటలు గంటలు సాగేవి.
ఇక ఇంటర్ లో మా క్లాస్మేట్ రవీందర్ తన సుశీల గొంతుతో పాటలు పాడేవాడు. ‘శారదా నిను చేరదా..” లాంటి పాటలతో ఆయన పాపులర్. డిగ్రీ కాలేజీకి వచ్చేసరికి మా వెంకటేష్ తమ్ముడు మా కంటే ఒక సంవత్సరం జూనియర్ అయిన ప్రసాద్ పాటలు పాడడం మొదలు పెట్టాడు. ఇక ఏముంది మా చుట్టూ ఒక పాటల టీం తయారయ్యింది. ఆ టీంలో పాటలు రాని పాడని మిత్రులమూ వుండేవారు. అలాంటి వారిలో నేను, వెంకటేష్ లతో పాటు రాదాకృష్ణ కూడా వున్నాడు. వెంకటేష్ వాళ్ళు మంకమ్మ తోటకు వెంకటేశ్వర గుడి పక్క ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళ ఇంటికి పక్కనే వున్న కల్వర్ట్ పైన ప్రతి సాయంత్రం కూర్చుని కాలక్షేపం చేసేవాళ్ళం. ప్రసాద్ తో పాటు సుధాకర స్వామి, మోహన స్వామి, ఇట్లా పలువురు గాయకులూ తయారయ్యేవారు. ఆంధ్ర నుంచి వచ్చి బాంక్ లో చేరిన ఇంకో మిత్రుడు కూడా లేడి గొంతుతో పాడేవాడు. ప్రసాద్ ‘ ఏ దివిలో విరిసిన పారిజాతమో ..‘, ‘ఎదో ఎదో అన్నది ఈ మసక వెలుతురు’ అన్న పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. సుధాకర స్వామి తన గొంతుతో పాటు లేడీ గొంతుతో కూడా పాడే వాడు. ‘ఎన్నెన్నో జన్మల బంధం…’ అనే పాటతో వాడు పాపులర్. ఇక మోహన స్వామి ఘంటసాల పాటలకు ఫేమస్. మోహన స్వామి పాడటంతో పాటు తబలా, హార్మోనియంతో సహా పలు వాయిద్యాలు వాయించేవాడు. మరో మిత్రుడు చెన్నారెడ్డి ముకేష్ గొంతుతో హిందీ పాటలు పాడేవాడు. ఈ టీం బయటే కాకుండా కాలేజీలో కూడా పాటలు పాడటం ప్రోగ్రామ్స్ ఇవ్వడం చేసేవాళ్ళు. వీళ్ళతో మంకమ్మతోటలో మా ఇంటికి దగ్గరలోనే వుండే చారి తన గొప్ప వాయిస్ తో ఘంటసాల పాటలు బాగా పాడేవాడు. ఘంటసాల భగవద్గీత ను ఆలపించే వాడు. ఆయన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు వేణుగోపాలా చారికి బంధువు కూడా. వాళ్ళే కాకుండా సుధాకర స్వామి అన్న మనోహర స్వామి, గోపాల్ లాంటి వాళ్ళు కూడా పాడేవాళ్ళు. ఈ గాయకుల నడుమ పోటీ, ఈర్శా సూయలూ బాగానే వుండేది. అయినా టీమ్ గా అనేక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఈ పాటలు ప్రోగ్రాములూ రెండు మూడేళ్ళు సాగాయి. తర్వాత క్రమంగా ప్రసాద్ పోస్ట్ ఆఫీసులోనూ, మోహనస్వామి టీచర్ గానూ మిగతా అందరూ వేర్వేరు ఉద్యోగాల్లో వృత్తుల్లో స్థిర పడి పోయారు. కరీంనగర్ మొత్తం మీద ఆర్కెస్ట్రా వాతావరణం కనుమరుగయి పోయింది.
అలా అనతి కాలంలో సాహిత్యంతో పాటు పాటలూ మమ్మల్ని పెనవేసుకున్నాయి.
*****
(సశేషం)
వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా సభ్యుడిగా వున్నారు.
రచనలు-
లయ (కవిత్వం), మానేరు తీరం (కవిత్వం), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మనిషి లోపల (కవిత్వం), మెరుపు ( సాహిత్య కారుల ఇంటర్వూలు), అక్షరాల చెలిమె (కవిత్వం), ఆకుపచ్చ కవితలు (గుల్జార్ కవిత్వానువాదం), ముక్తకాలు(చిన్న కవితలు)
అర్థవంతమయిన ‘సినిమా’ల పై పుస్తకాలు- నవ్య చిత్ర వైతాళికులు,
బాలల చిత్రాలు, సినీ సుమాలు , 24 ఫ్రేమ్స్, బంగారు తెలంగాణాలో చలన చిత్రం,
తెలంగాణ సినిమా దశ దిశ, Signature of Love(poetry), Children’s Cinema, Documentary films made-
తెలంగాణా సాహితీ మూర్తులు: ముద్దసాని రాంరెడ్డి, యాది సదాశివ,
శివపార్వతులు, Long Battle with short messages,
A Ray of Hope, KAFISO a saga of film lovers.