విజయవాటిక-20
చారిత్రాత్మక నవల
– సంధ్య యల్లాప్రగడ
మహాదేవవర్మ మందిరం-
రాజ్యవైద్యుడు చెప్పిన ఆ మాటకు అక్కడ హఠాత్తుగా శ్మశాన నిశ్శబ్దం అలుము కుంది.
శ్రీకరుడు నమ్మలేకపోయాడు…
“ఏమిటి?” అంటూ ముందుకొచ్చాడు. అతని కళ్ళలో ఆశ్చర్యం…
మహారాజు మాధవవర్మ మ్రాన్పడిపోయాడు. కొంత తడవకు తేరుకొని ఎఱ్ఱబడ్డ కళ్ళతో నిప్పులు కురుస్తూ…
“కారా! ఏమిటిది? నీవు రాజపుత్రునికి బహిర్‌ప్రాణము. నీకు తెలియక, నిన్ను తప్పుకు ఈ విషప్రయోగమెట్లు సంభవము?” అన్నాడు. ఆయన కంఠం ఉరిమినట్లుగా ఉంది.
శ్రీకరుడు ప్రపంచంలో అతి పెద్ద, వింతైన విషయం విన్నట్టుగా, మిన్నువిరిగి నేల పడినట్లుగా, జీవితంలో ఏదో పోయినట్లుగా వణికిపోయాడు.
“ఇది ఎట్లు సాధ్యము?” స్వగతంగా అనుకుంటూ బయటికే అన్నాడు.
రాజవైద్యుడు “ప్రభూ! మేము రకరకాల మూలికా వైద్యము ప్రయోగిస్తాము. కొన్ని మూలికలు కేవలము విష ప్రయోగమేమో అని అనుమాన నివృత్తికై ప్రయోగించితిని. అది విరుగుడుకై, దాని వల్ల కొంత ఉపయోగముండవచ్చు, కాని రాజకుమారులకు రక్తము చెడినది… అంటే ఈ విషము వారి దేహములో చాలా రోజుల క్రితమే ప్రవేశపెట్టబడినదో, లేక దీర్ఘకాలము క్రితము ప్రవేశపెట్టబడి ఉండవచ్చు…మీరు అనుమతిస్తే నేను మరి కొన్ని ప్రయోగాలు చెయ్యగలను. కాని వికటిస్తే ప్రమాదము కనుక మీకు నా సందేహము తెలియపరిచితిని…” అన్నాడు వినయంగా.
మాధవవర్మ కూలబడిపోయాడు.
చెట్టంత కుమారుడు, ఏకైక కుమారుడు, విశాల సామ్రాజ్యాన్ని ఏలవలసిన వాడు. అదీ కాక సున్నిత మనస్కుడు, ధీశాలి, పరుల మీద ప్రేమ కురిపించేవాడు… వాడికి శత్రువులెవరుంటారు?
ఆయన ఆలోచనలు తెగటం లేదు. ఆయన భార్య, మహాదేవవర్మ తల్లి, ప్రియంవదను రమ్మనమని కబురు పంపారు.
మంత్రి వర్యులు ధైర్యం చెబుతూ “ప్రభూ! మన గురుదేవులు, పరమేశ్వరశాస్త్రుల వారు నగరములోనే ఉన్నారు. వారిని రప్పించెదము. వారు మరణించిన వారిని కూడా బ్రతికించగలవారు. అపర ధన్వంతరి కూడాను…” అని అప్పటికప్పుడు ఒక సైనికునికి రాజగురువులను సగౌరవముగా పిలుచుకురమ్మని చెప్పి పంపారు.
***
శ్రీకరుడు తన మందిరంలో ఉన్నాడు. దీర్ఘమైన ఆలోచనలోకి వెళ్ళాడు.
అతనికి వెనక నుంచి మల్లిక వచ్చి పట్టుకున్నా తెలియలేదు.
“ప్రభువులు ఏదో ధీర్ఘమైన ఆలోచనలలో ఉన్నారే…” అన్నది కిలకిల నవ్వుతూ.
“మల్లీ…” దిగులుతోడైన కంఠంతో పిలిచాడు శ్రీకరుడు.
అతనిని అంత దుఃఖంతో చూడని మల్లిక బెదిరిపోయింది.
“ఏమి జరిగినది ప్రభూ?” అన్నది అతనిని కుదుపుతూ.
“నా బహిర్ ప్రాణము, నా సోదరుని కన్నా ఎక్కువ, నా ప్రాణస్నేహితుడు…” కంఠం బొంగురుపోయింది.
“ఏమైనది దేవరకు?”
“మహాదేవుని పై విషప్రయోగము జరిగింది మల్లీ!” అతని హృదయాంతరాళాల నుంచి దుఃఖం తన్నుకు వచ్చింది.
మల్లికకు ఎలా ఓదార్చాలో తెలియలేదు. ఖంగారుగా అనిపించింది.
“ప్రభూ…”కుదుపుతూ పిలిచింది.
శ్రీకరుడు తేరుకున్నాడు. వెంఠనే లేచి నీరు త్రాగాడు. తనను తాను సర్దుకున్నాడు.
మల్లిక తెల్లబోయి చూస్తుండగా…”వారెవరైనా కానీ, వారి తలను శ్రీపర్వతేశునికి కానుకిస్తాను!” అన్నాడు కోపము అతిశయించి…వీరము తొణికిసలాడుతూ…కంటి వెంట నిప్పులు కురుస్తూ…
మల్లిక తల విదుల్చుకొని “ప్రభూ! మీకో విషయము చెప్పాలని మర్చిపోయాను. ఆ నాడు మీరు శ్రీపర్వస్వామిని కొలిచి తిరిగి వస్తామన్నారని… మీ కోసం నేను కృష్ణ ఒడ్డున ఎదురుచూస్తుండగా…
ఎవరివో చీకటిలో విషప్రయోగము గురించిన మాటలు విన్నాను. కాని, అది చాలా కాలము క్రితము. అంటే మన వివాహ పూర్వమనుకోండి…” అంది.
శ్రీకరుడు ఉలిక్కి పడ్డాడు. ఆమె వైపు తిరిగి “ఏమి విన్నావు? గుర్తున్నంత వరకూ చెప్పు…”
“ఇదే, ఇది నెమ్మదిగా పనిచేస్తుంది….. వెంటనే కాదు…. ఇలాంటిదేదో…” అన్నది గుర్తు తెచ్చుకుంటూ.
“నాకెందుకానాడే చెప్పలేదు…”అరిచాడు శ్రీకరుడు.
“మరిచాను ప్రభూ…” భయంగా చెప్పింది.
శ్రీకరుడు ఇక రెట్టించలేదు. ఆమెను అడగటం వృధా.
ఇంతలో అతని బృందం కూడా వచ్చేశారు.
అతను ప్రతి ఒక్కరికీ చెయ్యవలసినది చెప్పి, పరుగున వలుకనెక్కి రాజమందిరం దిక్కుగా వెళ్ళిపోయాడు.
***
మహాదేవవర్మకు ఆహారం తయారు చేసేవారు మూడు పూటలా ముగ్గురు వేరు, వేరు వారు. వారు ఒకరికి ఒకరు తెలియదు. వారు కలవటం కూడా జరగదు.
వారు వండిన పదార్థం మొదట అతని అంతరంగికుడు తిన్న తరువాత, ఆ పదార్థమే మహాదేవవర్మకు పెడతారు. అంటే మహాదేవవర్మకు విషప్రయోగమైనదంటే ఆయన అంతరంగికుడు కూడా జబ్బు పడి ఉండాలి. కాని ఆ అంతరంగికుడు బాగానే ఉన్నాడు. కాబట్టి ఇది ఆహారం నుంచి వచ్చిన విషప్రయోగం కాదు.
మరి ఇక ఏదై ఉంటుంది?
‘మహాదేవవర్మ శరీరానికి వాడే సుగంధం వలననా, స్నానములో వాడు చౌకారమా?’ ఇలా శ్రీకరుడు ఆలోచిస్తూ ప్రతి దానినీ పరీక్షకు పంపుతూ… వైద్యులకు చూపుతూ వెతుకుతున్నాడు…తిరుగుతున్నాడు.
అతని అనుచరులు ఆ మందిరాన్ని చుట్టు ముట్టి ప్రతి వారిని శల్యపరీక్షలు చేస్తున్నారు. రాజ మందిరంలో పనిచేసే వారు… ఆ మందిరానికి వచ్చిన వారు, ప్రతి వారినీ బంధించి తెచ్చి ఉంచారు.
***
రాజగురువులు పరమేశ్వరశాస్త్రి మందిరంలోనికి ప్రవేశించారు. మాధవవర్మ లేచి నమస్కరించాడు.
ఆశీర్వాదంగా చెయ్యి ఎత్తి దీవించి లోనికి నడిచాడు.
లోపల పట్టపురాణి ఒక ఆసనంలో విచారంగా కూర్చొని ఉన్నది. ఆమె గురువులను చూసి లేచింది.
ఆయన ఆమెను చేయెత్తి దీవించి, మహాదేవవర్మ వైపు చూశారు. అతని చెయ్యి పట్టుకొని నాడి చూశాడు. కళ్ళు తెరిపించి చూసి… కొంత సేపు చేతి వేళ్ళ మీద లెక్క కట్టారు.
తదనంతరం మహాదేవుని బుగ్గల మీద తట్టారు. మహాదేవుడు కొద్దిగా కదిలాడు.
చిన్న మూలుగు అతని నోటి వెంట వచ్చింది.
గురువులు తలఎత్తి మహారాజును చూశాడు. మహారాజు ఆత్రంగా చూస్తున్నాడు, గురుదేవులు ఏమి చెప్పబోతున్నారో అని…
“మహారాజా నాడి లోతుగా ఉన్నది. రక్తం లేదు. ఉన్న రక్తం విషపూరితమైనది. పసరు ఇచ్చి ఉన్న రక్తం కక్కించినా, తేరుకోవటము కష్టం. జాతకరీత్యా రాజకుమారునికి ఇప్పుడు గండం కూడా ఉన్నది. అది మీకు మహాదేవవర్మ జన్మించినప్పుడే చెప్పి ఉన్నాను. ఈ సమయములో చెయ్యవలసినవి మీరు చెయ్యలేదు…” ఆగాడాయన.
“యాగాలు హోమాలు, దానాలు ఎన్నో చేసినాముగా గురుదేవా!”
“మహాదేవుని ఆశ్రమవాసిగా ఉంచవలెనని చెప్పినాము కదా…”
అప్పుడు గుర్తుకు వచ్చింది మాధవవర్మకు. పాతిక సంవత్సరముల ప్రాయంలో ఒక ఏడాది రాజకుమారుని ఆశ్రమవాసిగా ఉంచమని రాజగురువులు చెప్పారు. కాని ఆ విషయం అందరూ మరిచిపోయారు.
“ఇప్పుడేమైనా చెయ్యగలమా గురుదేవా! మా దోషము మన్నించండి…” దుఃఖ పూరితమైన స్వరంతో అడిగాడు మహారాజు.
“మీ లోపాలు తప్పించటానికి రాజమాత మండలదీక్ష తీసుకున్నారు. తన మరణము ఈ రాజ్యానికీ, దేశానికి కలిగే గండం తప్పించగలదని ప్రాణత్యాగము చేసిన మహామనీషి ఆమె…”
మాధవవర్మ ఆశ్చర్యంతో వింటున్నాడు.
“మన ప్రయత్నం మనము చేద్దాము మహారాజా… రాజకుమారులు బ్రతికినా మునపటి వలనె ఉండలేరు. ఈ విషము ఆయన జ్ఞాపకశక్తినో, మాటనో, లేక ఏదో ఒక అంగాన్నో తీసుకుంటుంది. అయినా నేను ప్రయత్నిస్తాను. కానీ నా ఆశ్రమములో నాకు వీలుగా వనమూలికలు అందుబాటులో ఉంటాయి. రాజపుత్రుని అక్కడకి తరలిద్దాము…” చెప్పారు రాజగురువులు.
“మీ ప్రయాణానికి వెంటనే సన్నాహము చేస్తాము..”
అని మంత్రి వైపు చూశారు. మంత్రి ఆ విషయం గ్రహించి, వెంటనే రాజకుమారుని ఇంద్రపురి ఘటికాపురికి పంపటానికీ ఏర్పాట్లకై వెళ్ళిపోయాడు.
మహాదేవవర్మ దాదాపు జీవచ్చవంలా ఉన్నాడు. స్పృహలో లేడు అతను.
***
మాధవవర్మకు అలసటగా ఉన్నది. కుమారుని విషయమై ఆయన చాలా దుఃఖమయమైనాడు. ఆయనకు ఎన్నో ఆశలున్నాయి. అవి ఇప్పుడు కుప్ప కూలి పోయాయి.
ఇంతలో శ్రీకరుడు వచ్చాడు.
అతను మహారాజును అభ్యంతర మందిరానికి రావలసినదిగా కోరాడు.
ఆ అభ్యంతర మందిరంలోనికి మాధవవర్మ వచ్చిన తదనంతరం, తలుపులు మూసి మహారాజుకు దగ్గరగా వచ్చి “ప్రభూ! ఈ విషము ఆహారము ద్వారా ఇవ్వబడలేదు. అదీ కాక ఈ ప్రయోగము మూడు నెలల పూర్వము జరిగినది…” అంటూ ఆగాడు.
“ఎలా జరిగింది. ఎవరు చేశారు…”
“ప్రభూ నన్ను క్షమించండి. నేను మీ వంశ క్షేమము కోరే మీ భృత్యని. మీరు పెంచిన జీవితము ఇది…”
“భయం లేదు కారా. చెప్పు ఆ దుష్టుడెవరు?”
“ప్రభూ… మీ చిన్ననాయన గారు…”
***
అభ్యంతర మందిరం చిన్నబోయింది.
మాధవవర్మ నమ్మలేకపోయాడు… కూర్చున్న మనిషి కూర్చున్నట్లుగా కూలి పోయాడు.
శ్రీకరుడు వచ్చి పట్టుకున్నాడు.
“కారా… నీవు… నా పెంపుడు కొడుకువు. నాకు నీవు ఒకటి మహాదేవుడొకటి కాదు… నే విన్నది అబద్ధమని చెప్పు నాయనా!” కంఠం బొంగురుపోతుండగా అన్నాడాయన.
శ్రీకరుడు కన్నీరు తుడుచుకుంటూ “నాతో రండి ప్రభూ!” అని ఆయనను పట్టుకొని ఆ అభ్యంతర మందిరం నుంచి ఒక రహస్య మందిరానికి తీసుకుపోయాడు.
అక్కడ ఒక రైతు వేషధారి తాళ్ళతో కట్టి పడేసి ఉన్నాడు. ఆ గదికి ఒక్క కిటికీ కూడా లేదు. అది అత్యంత రహస్య భూ గృహం.
శ్రీకరుడినీ, మహారాజును చూసి రైతు వేషంలోని చారుడు వణికాడు. అతని నోటి లోని కుక్కిన బట్టలు తీసి “చెప్పు నాకు చెప్పినది…” అన్నాడు శ్రీకరుడు
“ప్రభూ! నేను విక్రమేంద్రవర్మ భృత్యుడిని. నాకు కాలకూటవిషము రంగులలో కలపటము తెలుసు. దాని వాసన నెమ్మదిగా మనిషి పీల్చి, ఆ విషము గ్రహించి మరణిస్తాడు. దానిని రాజకుమారుడు వేసుకునే చిత్రపటముల రంగులలో కలిపాను. ఆయన చిత్రలేఖనమునకు వాడిన రంగుల నుంచి వాసనను గ్రహించిన విషము ఇప్పటికి పనిచేసినది…”
“విషప్రయోగము చేసి కూడా నీవు ఇక్కడే ఎలా ఉన్నావు?”
“ప్రభు నేను లేను. తీసుకురాబడ్డాను…”
“వీడిని ఎలా పట్టుకున్నారు కారా? ఎక్కడ పట్టుకున్నారు?”
“వీడు విజయవాటికలో చారగణాలకు అధిపతి ప్రభూ. మన వాడే. కానీ మనకు వ్యతిరేకముగా పనిచేస్తున్నాడు. యువరాజులకు… అదీ వీడే చెపుతాడు వినండి…”
“ప్రభూ విక్రమేంద్రవర్మగారిని మీరు రాజుగా రానివ్వనని అన్న మాట వారికి తెలిసి వారు ఈ పని చెయ్యవలసి వచ్చినది…”
“ఆ విషయము ఏమిటి?” శ్రీకరుడు ఆశ్చర్యంగా అన్నాడు.
“ప్రభూ మేము యువరాజు భృత్యులము…”
మాధవవర్మ ఇంక అక్కడ ఉండదలుచుకోలేదు. వడివడిగా వచ్చిన దారిన వెనుకకు వచ్చేశాడు. శ్రీకరుడు చిన్నగా గోడను తట్టి మహారాజు వెనకాలే వచ్చేశాడు.
అతను రాగానే ఆ గది తలుపులు మూసుకుపోయాయి. తరువాత ఆ చారుని జీవితం ముగిసింది.
***
మహాదేవవర్మ మందిరానికి వచ్చిన మహారాజు శ్రీకరునితో, “గురుదేవులు మహాదేవుని ఆశ్రమానికి తరలిస్తున్నారు. నీవు వారితో వెళ్ళు…” అని చెప్పి ముభావంగా లోనికెళ్ళిపోయాడు.
మాధవవర్మకు తన పుత్రుని రాజుగా చెయ్యాలని ఉన్నా, అది అతను ఎక్కడా ప్రస్తావించలేదు. అది తన హృదయంలోని విషయం. అది అతను బయట పెట్టక పోయినా ఎలా చేరిందో అర్థం కాలేదాయనకు. ‘ఒకనాడు మధిర మత్తులో భార్యకు చెప్పటం తప్ప అన్యులకు తెలియదే, అని మదనపడుతున్నాడు. ఈ విషయం విక్రమేంద్రుడునికి తెలిసింది… ఇంత పని చేసేలా ఉసికొల్పినది’ మాధవవర్మకు దుఃఖము కలిగింది.
* * * * *
(ఇంకా ఉంది)
తెలంగాణలో పుట్టి పెరిగారు. వివాహాంతరము అమెరికా వచ్చారు. గత పదహరు సంవత్సరాలుగా అట్లాంటా నగరములో నివాసముంటునారు. ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి ఎం. బి. ఎ డిగ్రి పొందారు. శ్రీవారు కొండల నల్లజర్ల టీ మొబైల్ లో పని చేస్తున్నారు. కుమార్తె మేఘన. స్టాంఫోర్డ్ లో రెసెర్చు అసిస్టెంట్ గా సైకాలజీ ల్యాబ్ లో పనిచేస్తున్నది. సాంఘిక సేవాసక్తితో వివిధ తెలుగు సంఘాలలో కార్యకర్తగా అట్లాంటా తెలుగు సంఘములో పని చేశారు. తానా, అమెరికన్ రెడ్‌క్రాస్, అట్లాంటా సాయి టెంపుల్, అట్లాంటా హిందూ టెంపుల్, వీ.టీ. సేవ ఇత్యాది సంస్థల్లో స్వచ్ఛంద సేవ సేవలందించారు. దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసము సేవలందించే ‘రక్షా’ సంస్థ వారి “Ramesh Bakshi Leadership” అవార్డును, ‘పాడుతా తీయగా’ వారి సహకార అవార్డును, సిలికానాంధ్రవారి అవార్డును అందుకున్నారు. “నేను వడ్డించిన రుచులు, చెప్పిన కథలు” అన్న పుస్తకం ప్రచరించబడింది. కౌముది, సంచిక, మాలిక, దర్శనం వెబ్ మ్యాగజైన్స్ లో వీరివి ప్రతినెలా ప్రచురితమౌతున్నవి. ఊహలుఊసులు అన్న తెలుగు బ్లాగు రచయిత.