వ్యాధితో పోరాటం-15
–కనకదుర్గ
నిన్నటిలాగే ఇన్సూలిన్ ఇస్తున్నారు. మంటలెక్కువగా వుంటే చల్లటి టవల్స్ ఇచ్చారు. చైతు, శ్రీని తల పైన, కళ్ళపైన, చేతులు, కాళ్ళపైన వేస్తూ వున్నారు.
థాంక్స్ గివింగ్ డిన్నర్ నాలుగు గంటలకు స్పెషల్ వుంటుందన్నారు. మధ్యాహ్నం కాఫెటేరియాకి వెళ్ళి వాళ్ళకి నచ్చినవి తినేసి వచ్చారు.
ఫాల్ సీజన్ మొదలయ్యింది. ఈ సారి స్నో చాలా త్వరగా పడింది. ఇప్పుడు బయట ఆకులు రంగులు మారాయి ఇప్పుడు.
మొత్తానికి ఈ ట్రీట్మెంట్ వల్ల నొప్పులు రావడం తగ్గుముఖం పట్టింది.
చైతుకి స్కూల్, శ్రీనికి ఆఫీస్ నాలుగు రోజులు సెలవుల వల్ల, రోజూ పొద్దున 11 గంటల వరకు వచ్చేసి సాయంత్రం 7 గంటల వరకుండి వెళ్ళే వారు. దాంతో నాకు కాస్త సంతోషంగా వుండేది.
మూడు రోజుల తర్వాత మాగ్నీషియంసల్ఫేట్ట్రీట్మెంట్ఆపేసారు. మూడు రోజులు బెడ్ లోనే వుండడం వల్ల ఎపుడెపుడు మంచం దిగి నడవాలా అని వుంది నాకు.
ట్రీట్మెంట్ ఆపిన తర్వాత కాళ్ళకు రక్తప్రసరణ కోసం పెట్టినవి తీసేసారు. లేపి కూర్చోబెట్టారు నర్సులు, కొన్ని నిమిషాలు కూర్చున్నాక, మెల్లిగా మంచం మీదే కూర్చొని కాళ్ళు క్రిందకి వెళ్ళాడేసాను. అలా కాసేపు కూర్చున్నాక ఇద్దరు నర్సులు నాకు రెండు వైపులా వుండి భుజాల క్రింద చేతులేసి పట్టుకుంటే మరో నర్సు పక్కన నిల్చుని వుంది. కాళ్ళూ క్రింద పెడితే అస్సలు నిల్చోలేక పోయాను. రబ్బర్ కాళ్ళలా వేళ్ళాడి పోతున్నాయి. నర్సులిద్దరూ జాగ్రత్తగా పట్టుకున్నారు. మరో నర్సు నా వెనకగా వచ్చి వీపుకి సపోర్ట్ ఇచ్చి నిల్చుంది. నేను నిల్చోలేక కూర్చోబోయాను. “నో, నో, కూర్చోకు, మేము పట్టుకుంటాము, నువ్వు కాళ్ళు గట్టిగా నేల పై పెట్టి నిల్చోవడానికి ప్రయత్నించాలి. భయపడవద్దు. మేము నిన్ను పడనీయకుండా పట్టుకుంటాము.” అన్నదొక నర్స్.
అలా చాలా సేపు ప్రయత్నం చేయగా కాళ్ళు నేల పై ఆనించి నిల్చోగలిగాను. చంటిపాపను పట్టుకున్నట్టు నన్ను వాళ్ళు పట్టుకునే వున్నారు. మెల్లిగా అడుగులేసాను, మొదటిసారి అడుగులేసినపుడు ఇలాగే ఫీల్ అవుతారేమో పిల్లలు. నా కాళ్ళ మీద నేను నిల్చోగల్గుతున్నాననే ఆనందం.
బాత్రుమ్ వైపు నడిపించి తీసుకెళ్ళారు. బాత్రూంకెళ్ళి రావడానికి వాళ్ళు సాయం చేసారు. కుర్చీ తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను బ్రష్ చేసుకున్నాక, స్పంజ్బాత్ అంటే వేడిగా వున్న చిన్న సోప్ టవల్స్ తో వొళ్ళంతా తుడిచి హాస్పిటల్ గౌన్ మార్చారు. కొద్దిగా ఫ్రెష్ గా అనిపించింది. పెద్ద జుట్టు, ఒక నర్స్ మెల్లిగా బ్రష్ చేసి తనకొచ్చినట్టుగా అల్లింది.
“యూ హావ్ సో బ్యూటిఫుల్ హెయిర్, వియ్ నో యువర్ బేబి ఈజ్ గోయింగ్ టు బి సో బ్యూటిఫుల్లైక్ యూ!” అన్నారు.
“థ్యాంక్ యూ,” అన్నాను.
నాకు ఒకోసారి అనుమానం వస్తుంటుంది, వీళ్ళు నిజంగా నేను బాగున్నానంటు న్నారా, లేకపోతే హేళన చేస్తున్నారా అని. ఎందుకంటే నా చిన్నప్పట్నుండి నేను సన్నగా, పీలగా, పొట్టిగా వుంటాననే మాటలు వినిపించేవి. అదీ కాకుండా మా అక్కయ్య కొంచెం పొడుగ్గా వుంటుంది, పెద్ద పెద్ద కళ్ళు పద్నాల్గేళ్ళకే పద్దెనిమిదేళ్ళ అమ్మాయిలా అనిపించేది.
తను హేమామాలినిలా వుంటుందని, నేనేమో పొట్టిగా వుంటాను కాబట్టి నాకు పెళ్ళి కావడం కష్టమనే మాటలే ఎక్కువగా విన్నదాన్ని.
అదీ కాకుండా నాకు అలంకారం పై అంత ఆసక్తి కూడా వుండేది కాదు. చాలా సింపుల్ గా వుండేదాన్ని. డిగ్రీలో నేను పిల్లలకు ట్యూషన్స్ చెప్పేదాన్ని. చుట్టుప్రక్కల వున్న పిల్లలందరూ వచ్చేవారు. అందులో వున్న 12,13 ఏళ్ళ ఆడపిల్లలు అడిగేవారు నన్ను, “దీదీ, మీ జుట్టు ఇంత పెద్దగా, అందంగా వుంది కదా, వదిలేసుకోవచ్చు కదా! రక రకాల హెయిర్ స్టయిల్స్ వేసుకోవచ్చు మీరు. ఎందుకు ఎప్పుడు ఒక్క జడే టైట్ గా వేసుకుంటారు?” నేననుకునేదాన్ని, నా జుట్టు గురించి ఆలోచించేకంటే అదే ఇంట్రస్ట్ చదువు పై పెడితే వీళ్ళకు మార్కులు బాగా వస్తాయి కదా! అని.
బట్టలు కూడా, కాటన్ లక్నో చుడీదార్స్, ప్యాంట్స్, పైన లక్నో కుర్తా టీ షర్ట్స్ వేసుకునేదాన్ని. అవి కూడా బస్సుల్లో వెడితే కంఫర్టబుల్ గా వుంటాయని, లంగాలు వేసుకు వెళితే అవి కట్టుకుంటే, సన్నగా వుండడం వల్లనో ఎందువల్లనో కానీ చాలా సార్లు లూజ్ అయిపోతే మళ్ళీ మళ్ళీ కట్టుకుంటూ వుండాల్సి వచ్చేది. ఇంటర్మీడియట్ వరకు రెండు జడలు అపుడపుడు వేసేది అమ్మ. ఆ తర్వాత ఒక్క జడే వేయమనేదాన్ని. పెళ్ళయ్యేదాక నూనె రాసి మా అమ్మే జడ వేసేది.
చిన్నపుడు చాలా ఏళ్ళు హేయిర్ కట్ చేయించేది అమ్మ, దాదాపు 7-8 ఏళ్ళ వరకు అలాగే వుండేది. అదీ కాక విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా తప్పకుండా గుండు చేయించేవారు. 9,10 ఏళ్ళ వయసు నుండి నాకు, అక్కయ్యకు హేయిర్ కట్ ఆపేసి జుట్టు పెంచడం మొదలుపెడితే బాగా పెద్దగా, మందంగా వుండేది ఇద్దరికీ.
‘హమ్మయ్య, ట్రీట్మెంట్అయిపోయినట్టేనేమో! ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చేమో!’ అనుకున్నాను.
అదే విషయం నర్సులని అడిగితే, “డాక్టర్లు వచ్చి మాట్లాడతారు. తర్వాత ఏం చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలి అన్ని చెబుతారు.”
కాసేపయ్యాక డాక్టర్ వచ్చి, “ఇంకో రోజు వుండాలి, ఇంటికి వెళ్ళేపుడు నొప్పులు ఎక్కువ రాకుండా వుండడానికి, కంట్రోల్ లో వుండడానికి మూడు రోజులు ఇచ్చిన మందే కానీ చిన్న డోసుల్లో వొంట్లోకి వెళుతూ వుండేలా ఒక బ్రెదిన్ పంప్ ( Brethen pump) పెట్టి పంపిస్తారు. రోజు నొప్పులు ఎంత వస్తున్నాయనేది చూడడానికి ఒక మానిటర్ వుంటుంది, అది రోజు మీ గైనకాలజిస్ట్ కి పంపిస్తూ వుంటుంది. వాళ్ళు రోజూ చెక్ చేస్తూ వుంటారు, ఎక్కువ వస్తే చిన్న డోసుల్లో వెళుతున్న మందుకి తోడు బూస్టర్ డోస్ తీసుకోమని చెబ్తారు. నర్సులొచ్చి చెక్ చేస్తూ వుంటారు. నువ్వు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఈ ఒక్కరోజు వుంటే ఎంత డోస్ తో పంపించాలో మాకు తెలుస్తుంది,” అని చెప్పింది డాక్టర్.
ఇలాంటివన్నీ ఉంటాయని తెలియని మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. నేను కేవలం రెండు నెలలు బెడ్ రెస్ట్ లో వుంటున్నాను, కానీ కొంత మంది క్రిటికల్ ప్రెగ్నెసీలు వున్నవారు నెల తప్పినప్పట్లుంటే బెడ్ రెస్ట్ పై వుంటారు వారికిచ్చే ట్రీట్మెంట్ ఇంకెంత కఠినంగా వుంటుందో.
నాకు తెల్సు అందరూ ఏమంటారో, పిల్లల మధ్య అంత గ్యాప్ ఉండకూడదని, ముప్ఫై ఏళ్ళ తర్వాత గర్భం దాలిస్తే ఇలాగే అవుతుందనీ ఇండియాలో అందరూ అనుకుంటారని నాకు తెల్సు.
పెద్ద గండం తప్పి బయట పడినట్టనిపించింది.
మర్నాడు ఇంటికి వెళ్ళాము. పూర్తిగా బెడ్ రెస్ట్. పొద్దునే బ్రష్ చేసుకుని కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసిం తర్వాత ఏ పని చేయకూడదు. డిశ్చార్జ్ చేసే రోజు నన్ను చూసే గైనకాలజిస్ట్ వచ్చి, ” ఇపుడు నువ్వు చాలా జాగ్రత్తగా వుండాలి….”
“కానీ నాకు చాలా భయంగా వుంది. నన్ను మామూలుగా తినమంటున్నారు కానీ పాన్ క్రియాటైటిస్ వల్ల నేను అన్నీ తినలేను కదా!”
“ఇది భయపడే సమయం కాదు. ఈ జబ్బున్న వాళ్ళు నొప్పి వచ్చినపుడు ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిన తర్వాత మామూలుగా తింటారు. ఇపుడు నువ్వు కూడా అదే చేయాలి. అలా అని నీకు పడనివి తినమని చెప్పను, నీకు పడేవన్నీ భయపడకుండా తిను. రిలాక్స్ డ్ గా వుండు, అస్సలు స్ట్రెస్స్ తీసుకోకూడదు. స్నానం చేసిన తర్వాత నీ బ్రేక్ ఫాస్ట్, నువ్వు ఫన్ గా వుండే బుక్సే చదువుతావో, కామెడీ మూవీసే చూస్తావో నీ ఇష్టం. బాగా పడుకో, లేచి తిరిగి పనులు చేయకూడదు. ఈ ఒక్క నెల నువ్వు జాగ్రత్తగా వుంటే నీ పాప నార్మల్ వేయిట్ తో హెల్తీగా పుడుతుంది. తెలిసిందా?” అని అడిగింది డాక్టర్.
నేను తల వూపాను అర్ధం అయ్యిందన్నట్టుగా.
*****
(సశేషం)
నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.
దేశం మనుగడను దెబ్బ తియ్యడానికి రకరకాల శత్రువు లుంటారు. కొందర్ని వ్యవస్థతో అదుపు చెయ్యొచ్చు. కానీ యుద్ధానికి దిగేవారిని అదుపు చెయ్యడానికి మాత్రం సైనికశక్తి కావాలి. ఆ సైనికుల పోరాటం ఎన్నో కావ్యాలకు స్ఫూర్తి. ఆ కావ్యాలు ఎందరి జీవితాలకో స్ఫూర్తి.
శరీరం మనుగడను సవాలు చేసే శత్రువుల్లో ముఖ్యమైనది వ్యాధితో. వ్యాధిని ఎదుర్కునేందుకు వైద్యశాస్త్రం ఎన్ని సాధనాలు సమకూర్చినా- ఆ శత్రువులతో పోరాడేందుకు ముఖ్య సాధనం శరీరమే.
ఆ పోరాటంలో- జీవితమొక వరమనుకుంటే వరం. శాపమనుకుంటే శాపం. ఒకోసారి శాపంలాంటి వరం. ఒకోసారి వరంలాంటి శాపం
ఏదేమైనా జీవితం జీవించడానికే అనుకోగలగితే అదో వరం. ఆ వరం అంత సులభంగా లభించదు. అందుకు ఏకాగ్రతతో ఘోరతపస్సు చేయాలి. శరీరాన్ని శుష్కింపజేసే ఆ తపస్సుకి- ఓ కొత్త జీవికి జీవితాన్నిచ్చే ప్రయత్నం జతపడ్డం- ఊహతీతం, అలౌకికం. అది వాస్తవమైతే- ఈ ‘వ్యాధితో పోరాటం’.
మానవాతీతం అనిపించే మనోబలంతో- ప్రేరణాత్మకం, స్ఫూర్తిదాయకం కాగల స్వానుభవాన్ని- కదిలించే కథనంతో అందిస్తున్న- శ్రీమతి కనకదుర్గ అందిస్తున్న అపూర్వ యథార్థగాథ ఇది. మొదటి భాగం నుంచీ ఆర్ద్రం చేస్తున్న ఈ విశిష్ట రచనకు వేదిక నిచ్చిన నెచ్చెలికీ, రచయిత్రికీ- అభినందనపూర్వక ధన్యవాదాలు.
జె. రామలక్ష్మీ గారికి,
మీ ఈ స్పందన నా మనసుని హత్తుకుంది. ప్రతి నెల నేను రాస్తున్న “వ్యాధితో పోరాటం,” మీరు చదువుతూ, లింక్స్ షేర్ చేసుకుంటూ, నన్ను ప్రోత్సహిస్తున్న మీకు ఎన్ని విధాలుగా ధన్యవాదాలు తెలిపినా తక్కువే. ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ గారు, “ఈ జబ్బుతో నువ్వు ఎంతగా భాద పడుతున్నావో అందరికి తెలియాలి, నీలాగే ఇతర జబ్బులతో భాద పడ్తున్నవారికి ఉపయోగపడుతుందని,” చెప్పడంతో రాయడం మొదలుపెట్టాను.
మీరు 90’ ల్లో రచన పత్రికలో మీరిచ్చిన సలహాలతోనే కథలు రాయడం, ఆ తర్వాత ఆ రచన పత్రికలో, వెబ్ పత్రికల్లో, కొన్ని కథలు కథల పుస్తకాల్లో కూడా ప్రచురితమైనవి. రంగనాయకమ్మగారి, మీ ప్రోత్సాహంతో నేను రాయగలుగుతున్నాను. ఒకోసారి పాఠకుల దగ్గర నుండి కామెంట్స్ వస్తాయి. రామలక్ష్మీ గారు మీ ప్రోత్సాహం, మీ సలహాలు ఇలాగే ఇస్తుండాలని మనసారా కోరుకుంటున్నాను.
అభిమానంతో,
కనకదుర్గ.