శ్రీరాగాలు-9

జీవన సత్యం

-లంక సీత

         సుబ్బారావు సుజాతలు ఇంచుమించుగా ఒకేసారి బ్యాంకులో చేరారు. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకింటివారయ్యారు.

         ఇది పాతికేళ్ల నాటి సంగతి.

         ఈ పాతికేళ్ళ సంసార జీవితంలో సుబ్బారావు సుజాతలు ఎంతో అన్యోన్యంగా సుఖంగా గడిపారు. ఇద్దరు కూతుళ్ళు సౌజన్య, సౌమ్యల భవిష్యత్తు చక్కదిద్దాలనే తపనతో అహర్నిశలూ కష్టపడి, చదివించి పెంచి పెద్ద చేశారు. చక్కటి సంబంధాలు చూసి పెళ్లిళ్లు కూడా చేశారు.

         పెద్దమ్మాయి భర్త అమెరికాలో ఒక సాప్ట్ వేర్ ఇంజనీర్. చిన్నమ్మాయి భర్త హైదరాబాద్ కాలేజిలో లెక్చరర్. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. సౌమ్య పెళ్లికి ముందు సుజాత ఆరోగ్యం దృష్ట్యా, పెళ్లికి డబ్బు కోసం వాలంటరీ రిటైర్మెంట్  తీసుకున్నది.

         సుబ్బారావు కూడా ఇటీవలే రిటైర్ అయ్యాడు. ‘ఇక రిటైర్డ్ జీవితం సుఖంగా గడుపుదాం’ అనుకున్నారు ఆ యిద్దరూ. కానీ ‘తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడు’ అన్న మాదిరిగా సుబ్బారావు సుజాతల టెన్షన్లు తీరలేదు.

         పెద్దమ్మాయి అమెరికా వెళ్లినప్పటి నుంచి అస్తమానం ఎవరో ఒకరు ఇండియాకి వస్తున్నారని, అది పంపించమనీ – ఇది పంపించమనీ ఫోన్లు చేస్తూనే ఉండేది. కొత్తగదా అని ఆమె అడిగినదల్లా పంపడం వీళ్లకీ అలవాటయింది.

         పెద్ద పిల్ల గదా అని కొంచెం గారాబము ఎక్కువే చేసారు. అది యిప్పుడు పీకకు చుట్టుకుంది. సౌజన్యకి తన ధ్యాసే తప్ప తల్లితండ్రుల గురించి ఆలోచన ఏ మాత్రం ఉన్నట్లు అనిపించదు. తన ధోరణే గాని మరో ఆలోచన లేదు.

         ఓ రోజు పొద్దున్నేటెలిఫోన్ మోగింది. సుజాత అనుకుంటూనే వుంది “ఇంకెవరు అమెరికా నుంచే అయి ఉంటుంది”అని. ఫోన్ పైకెత్తి హలో అనగానే “అమ్మా, నేనే సౌజన్యని, పదహారో తారీఖున నా స్నేహితురాలు సుమ హైదరాబాద్ వస్తోంది. దానితో రెండు మూడు రకాల పొడులు, నేను మొన్న వచ్చినప్పుడు వదిలేసిన పట్టు చీరలు, పుల్లారెడ్డి స్వీట్స్ పంపించు. వాళ్ళు హైదరాబాద్ లోనే వుంటారు. నాన్నను వెళ్లి యిచ్చి రమ్మను. నేను వచ్చేప్పుడు వాళ్లకు బోలెడు వస్తువులు తెచ్చాను,” అంది. సుజాత నోరు తెరిచేలోపే ఫోన్ కట్ అయింది.

         ‘ఎలా వున్నావు’ అని అడగడం గాని ‘ఏమిటి విశేషాలు’ అనడం గాని లేదు! నిస్త్రాణగా ఒక నిట్టూర్పు విడవడం తప్ప ఏమీ అనలేకపోయింది సుజాత.

         “మొదలయ్యాయి.. పొద్దున్నే ఇండియా – అమెరికా మధ్య సరఫరా ఆదేశాలు” అనుకుంటూ సుబ్బారావు హాల్లోకి వచ్చాడు. “ఏమంటోంది నీ ముద్దుల కూతురు?” అన్నాడు.

         “చాల్లెండి, మీ మాటలూ మీరునూ! ఏదో మనం ఉన్నన్నాళ్లూ వాళ్ళు ఆశపడకుండా ఎలా ఉంటారు?”

         “ఇదేం కొత్త కాదులే, కానీ ఎంత ఉందేమిటి లిస్ట్? నీదేం పోయింది, మోసుకు వెళ్ళాల్సిన వాడిని నేనే! ఇది ఎప్పుడూ వున్నదే గదా” అన్నాడు సుబ్బారావు. మళ్ళీ తనే “సుజీ! ఆలోచించు! తల్లికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. కానీ యిలాకాదు. ఏ వస్తువులు అవసరమో, ఎక్కడ ఉంటే అక్కడి సమాజంలో ఎలా కలిసిపోవాలో నేర్పాలి. మనం ఏం చేస్తున్నాం? వాళ్లకు మంచి జీవితాన్ని అందించాలన్న తపనతో వాళ్లను అడుగు లేయనీయకుండా భుజాల పై మోస్తున్నాం,” అన్నాడు.

         “పోనీలెండి.. పిల్ల అంత దూరంలో వుంది. ఒక అచ్చటాముచ్చటా లేదు. పాపం ఎంత కష్టపడుతోందో. కన్న తల్లి తండ్రులుగా ఈ మాత్రం మనం భరించలేమా?” అన్నది ఆమె.

         “ఖర్చులు నువ్వు లెక్కరాయవు సుజీ. కానీ నువ్వు చేసే సరఫరాతో మనం ఇంకో సంసారాన్ని పోషించవచ్చు.”

         “మీరు మీ పిచ్చి మాటలు ఆపండి, “అన్నది ఆమె. ఇది తరచూ వారి మధ్య జరిగే సంభాషణ.

         రెండు వారాల తరువాత తల్లికి సౌజన్య ఫోన్ చేసింది.

         “అమ్మా, నాకు మూడో నెల. డాక్టర్ ఈ రోజే కన్ఫర్మ్ చేసారు. నవంబరు నెలాఖరులో డెలివరీ డేట్ యిచ్చారు. నువ్వు నవంబరు మధ్యలో వచ్చి, మే వరకు ఉండాలి. నేను చేసుకోలేను. మా ఆయన టికెట్ బుక్ చేస్తాడు. నాన్నను ఇన్సూరెన్స్ తీసుకోమను. నువ్వు డాక్టర్ దగ్గర అన్ని పరీక్షలు చేయించుకుని, ఆరు నెలలకి సరిపడా మందులు, పుట్టబోయే బేబీకి హోమియో మందులు తీసుకురావాలి. ఇద్దరికీ టికెట్ పెట్టుకోలేం. ఒక ఆరు నెలలు నాన్నని చెల్లాయి దగ్గర ఉండమని చెప్పు..” అంటూ గబగబా చెప్పేసింది.

         వింటూ నిర్ఘాంత పోవడం సుజాతవంతయింది..

         ఒక పక్క కూతురు గర్భవతి అన్న సంతోషం, మరో పక్క కూతురు తమ ఇద్దరినీ కాకుండా తనను ఒక్కదానినే రమ్మని చెప్పడం, పైగా ఆమె మాట్లాడిన తీరుకి సుజాత కాసేపు తేరుకోలేక పోయింది. కాసేపటికి “ఏమండీ విన్నారుగా, నా కోసం డాక్టర్ అపాయింటుమెంటు తీసుకోండి” అంది భర్తతో.

         సుజాతకి వున్నబీపీ, సుగరు ప్రస్తుతం మందులతో, ఎక్సర్‌సైజులతో కొంతలో కొంత అదుపులో వున్నాయి. పని ఎక్కువైతే మోకాళ్ళ నెప్పులు వస్తాయి.

         భార్యభర్తలిద్దరి సర్వీస్ లో దాచుకున్న సొమ్ము, సుజాత రిటైర్మెంట్ డబ్బుతో ఇద్దరు కూతుళ్ళ పెళ్లిళ్లు చేసేశారు. నిజం చెప్పాలంటే ఇంకా బ్యాంకులో డబ్బు పెద్దగా లేదు. నెలనెలా యిద్దరికీ వచ్చే పింఛను తప్ప వేరే ఆదాయము లేదు. ఇంటద్దె లాంటి ఖర్చు లేదు కాబట్టి సంసారము పెద్దగా ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది.

         అక్కలా అది కావాలి ఇది కావాలి అంటూ అవసరాలు చెప్పదు సౌమ్య. ‘అక్కకి నాకంటే ఎక్కువే చేస్తున్నారు అని మనసులో గుర్రుగానే ఉన్నా, విషయం అర్ధం చేసుకుని సానుకూలంగానే స్పందిస్తుందిలే’ అనుకుంటూ సుజాత సౌమ్యకి ఫోను చేసి విషయాన్ని వివరంగా చెప్పింది.

         “సౌమ్యా..అక్క నన్నొక్కదాన్నేఅమెరికాకు రమ్మంటోంది. ఇక్కడ నాన్న ఒక్కరూ ఉండటం కష్టం, మంచిది కూడా కాదు. మరి నీ దగ్గిర..”

         తల్లిమాట పూర్తి కాకుండానే “అమ్మా, నాకు మా అత్తగారితోనే సరిపోతోంది. ఆఫీస్, ఇల్లు, అత్తగారు..ఇంకా నాన్న కూడానా? అందులో నాన్న ‘అది కరెక్ట్ కాదు! ఇది కరెక్ట్ కాదు!’ అంటూ కామెంట్స్ చేస్తూ వుంటారు. ఈయనకి ఆవి ఇష్టం ఉండదు. సర్ది చెప్పే ఓపికా, టైమూ నాకు లేవు. మీరే ఏదో ఒకటిచేసి నాన్నని కూడా అమెరికాకు తీసుకు వెళ్ళండి.”

         గోడకి కొట్టిన బంతిలాగా వచ్చేసింది సౌమ్య సమాధానం.

         సుజాత అవాక్కయింది.

         “ఎంత కష్టపడి పెంచాం పిల్లలని. కావలసినంత స్వేచ్ఛ ఇచ్చి, మంచి చదువులు చదివించి పెళ్లిళ్లు చేస్తే ఒక్క నిముషంలో ఇద్దరూ ఇలా తమ సౌకర్యాన్ని, స్వార్ధాన్ని ఎలా చూసుకోగలుగుతున్నారో” అని నిర్ఘాంతపోయింది. ఈ మాట భర్తకు తెలిస్తే నొచ్చు కుంటాడని,అబద్ధమాడింది.

         “ఏవండీ.. మీరు రాకుండా ఆరు నెలలు ఉండలేను. సౌజన్యకి ఎన్ని డబ్బు ఇబ్బందులున్నాయో, అల్లడు ఏమంటున్నాడో. కాబట్టి మనమే ఏదో రకంగా డబ్బు సర్దుబాటు చేసుకుని మీకు కూడా టికెట్ తీసుకుని ఇద్దరమూ వెళ్లొద్దాం,” అంది.

         “సుజీ, ఇలా ప్రతి దానికి మన రిటైర్మెంట్ డబ్బు ఖర్చు చేస్తే ఇంక ముందు ముందు ముసలితనం మీదబడ్డాక మనకి గడవటం కష్టమవుతుంది. నేను ఒక్కడినే వుంటాను. సౌమ్యని కూడా ఇబ్బంది పెట్టదలచుకో లేదు. నాకు వంటవచ్చు, పనిమనిషి మిగతా పనులన్నీ చేస్తుంది.. ఫర్వాలేదు”అన్నాడు.

         “మీరు లేకుండా నేను ఒక్క వారం రోజులు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఆరు నెలలంటే నా వల్లకాదు. మీరు రావలసిందే,”అంటూ పట్టుబట్టింది సుజాత..

         చేసేదిలేక “ఫిక్సెడ్ డిపాజిట్చేసిన లక్ష రూపాయల గ్రాట్యుటీ సొమ్ముని తీసి ఈ టికెట్ కోసం ఖర్చు పెట్టాలి”…అనుకుంటూ ఒప్పుకున్నాడు.

         ప్రయాణానికి రెండు నెలల ముందు నుంచే సౌజన్య ఆర్డర్లు మొదలయ్యాయి.. “అమ్మా, ఆ గాగ్రాచోళీ జాకెట్, ఫలానా పట్టుచీర, శ్రీవారికి ఫలానా కుర్తా పైజామా, రెండు మూడు రకాల పుల్లారెడ్డి స్వీట్స్..” అలా మరింకెన్నో వస్తువులకు పురమాయింపు. ఈ దుబారా ఖర్చు దాదాపు యాభై వేలు.

         “సార్, అమెరికా ప్రయాణం అంటున్నారు కాబట్టి, ఇద్దరికీ ఎక్సిక్యూటివ్ మాస్టర్ హెల్త్ చెక్ అప్ చేయించుకోవడం మంచిది. ఈ ప్యాకేజీలో హార్ట్, కిడ్నీ పరీక్షల్లాంటివన్నీ ఉంటాయి.” అని అటు బెదిరిస్తున్నట్టూ, ఇటు ముక్కు పిండుతున్నట్టూ తెలీకుండా సలహా ఇచ్చాడు డాక్టర్.

         తప్పేదేముంది? బిల్ కౌంటర్ దగ్గిరకు వెళ్లి కనుక్కుంటే టకటకా కంప్యూటర్లో లెక్కలు వేసి “మొత్తం పరీక్షలకి 40 వేలు” అనే చావు కబురు చల్లగా తెలిసింది.

         సుబ్బారావుకు గుండె ఆగినంత పనయింది. ఎక్కడ నుంచి తేవాలి? ఇప్పుడింత ఖర్చు అవసరమా? తిరిగి ఇంటికి వెళ్లారు దంపతులిద్దరూ.

         “అమ్మా సౌజన్యా, మా హెల్త్ చెకప్ కి 40 వేలు అవుతుందిట. మేము చేయించు కోలేం. రోజూ వేసుకునే మందులే ఆరు నెలలకి సరిపడా తెచ్చుకుంటాం.. చాలదా?” అంటూ కూతురికి ఫోను చేసింది సుజాత..

         “అమ్మా, మీకు అర్ధం కాదేంటి? ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్యవస్తే, ఇస్యూరెన్సు కవరేజ్ లేకపోతే ఖర్చు భరించడం చాలా కష్టం. మీరు ఇబ్బంది పడి, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. దయచేసి అన్ని టెస్టులు చేయించుకోండి. మీకున్న క్రానిక్ డిసీజెస్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల ఖర్చులేవీ విజిటర్ ఇన్సూరెన్స్ లో కవర్ అవ్వవు. మీరు పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి,” అంది సౌజన్య.

         కూతురి ఆజ్ఞవిని సుబ్బారావు దిగులుపడ్డాడు. భార్య మీద ప్రేమతో, తన సేవింగ్స్ అకౌంట్ లో వున్న డబ్బు ఖర్చుపెట్టి ఇద్దరికీ పరీక్షలు చేయించాడు. భగవంతుని దయవల్ల సీరియస్ విషయాలేమీ లేవు. ఆరు నెలలకి సరిపడా జలుబు, దగ్గు, జ్వరం, మోకాళ్ళ నెప్పులకి మందుల ఖర్చు పదిహేనువేలు. ఇవి కాక కూతురికి పుట్టబోయే బిడ్డకి హోమియో మందుల ఖర్చు మరో అయిదువేలు…తడిసి మోపెడయింది.

         ప్రయాణం వారం రోజుల్లోకి వచ్చింది. విమానంలో ఎకానమీ క్లాస్ టికెట్ తో ఒక్కొక్కరికి 40 కేజీల బరువు మాత్రమే తీసుకు వెళ్ళవచ్చు. బట్టలు, అప్పటికి కొన్న సామాను బరువు కలిపితే ఒక్కొక్కరికే50 కేజీలు దాటాయి. తమకు కావలసిన వస్తువులు తీసేసి కూతురి ఆనందం కోసం, తమ ఆరోగ్యం కోసం ముఖ్యమయినవి మాత్రం ఉంచి అతి కష్టం మీద సూట్కేసుల బరువు సరిచేశారు. వెళ్లే ముందు రోజు రాత్రి సౌజన్య అత్తగారింటి నుంచి ఫోను. “వదినగారూ, చెప్పటం మర్చిపోయాను, మా వాడికి జీడిపప్పు పాకం చాలా ఇష్టం. రెండు కేజీలు యిస్తాను…పట్టుకు వెళ్ళండి” అని వియ్యపురాలు సన్నాయి నొక్కులు నొక్కుతూ చెప్పింది. వియ్యపురాలు కావటంతో మొహమాటపడి అలాగే అంది సుజాత.

         “సుజీ, మన చెకింగ్ లగేజి నిండింది. అవన్నీ ఎక్కడ పెడతావు?” విసుక్కున్నాడు సుబ్బారావు. “ఏవండీ హ్యాండ్ బాగ్ లో పెట్టుకుందాము. బాగుండదు. అల్లుడు, వియ్యాల వారు ఏమయినా అనుకుంటారు,” నచ్చజెప్పింది సుజాత.

         ఏడు కేజీల హ్యాండ్ బాగేజీలో వియ్యాలవారి వస్తువులు కుక్కి, ఇల్లు తాళం పెట్టి బయలుదేరారు.

         వాషింగ్టన్ విమానాశ్రయంలో సౌజన్య, అల్లుడూ రిసీవ్ చేసుకున్నారు. బయటకు రాగానే కారు ఎక్కేలోపు వొళ్ళుగడ్డకట్టుకుపోయే చలి. బ్రతుకు జీవుడా అని ప్రయాణపు అలసటతో ఇంటికి చేరారు.

         ఇక మొదలయింది నరకం.

         సౌజన్య నిండు చూలాలు కావడంతో ఇంటి బాధ్యత అంతా సుజాత మీద పడింది. రెండు పూటలా సింక్ నిండా అంట్లు, రెండ్రోజులకొకసారి ఇల్లంతా వాక్యూమ్క్లీనర్ తో క్లీనింగ్, వాషింగ్ మెషిన్లో బట్టలు వేయడం తీయడం.. ఊపిరిపీల్చుకునే తీరిక కూడా లేక సుజాతకి పగలు రాత్రి తేడా తెలియడం లేదు.

         మొదట్లో సుబ్బారావు సుజాతను అంతగా పట్టించుకోలేదు. మెల్లమెల్లగా సుజాత పని భారం అర్ధమయింది. సహాయం చేయడం మొదలు పెట్టాడు. డిష్ వాషర్లో గిన్నెలు కడగడం, బట్టలు వాషింగ్ మెషిన్లో వేయడం వంటి పనులు చేయడం మొదలు పెట్టాడు. భారంగా రోజులు గడుస్తున్నాయి.

         పిల్ల కానుపు అయింది. బాబు పుట్టాడు. బారసాల అంటూ హంగామా. మొత్తం వంటా వార్పూ సుజాత మీదనే పడింది. దాదాపు యాభై మంది దాకా అయ్యారు ఆ రోజు. ఆ తర్వాత మొదలయ్యాయి సుజాతకి ఆరోగ్య సమస్యలు. విపరీతమయిన మోకాళ్ళ నెప్పులు, మోచేతి నెప్పులు..గ్లాస్ కూడా ఎత్తలేని పరిస్థితి, అడుగు తీసి అడుగు వేయ లేదు…చంటి బిడ్డకి స్నానం చేయించడానికి కూతురుకి సాయం చేయాలి, ఇంటి పని. అతి కష్టం మీద ఎవ్వరికీ చెప్పకుండా ఒక నెల గడిపింది. తరువాత సౌజన్యతో చెప్పింది.

         “సౌజన్యా.. నాకు మెడ, మోకాళ్ళ నెప్పులు విపరీతంగా వస్తున్నాయి. పెయిన్ కిల్లర్స్ పనిచేయడం లేదు. ఇక్కడ ఎవరయినా డాక్టర్…” అనే లోపునే సౌజన్య రియాక్ట్ అయింది.

         “అబ్బా, నేను ముందే చెప్పాను కదమ్మా. ఇండియాలోలాగా ఇక్కడ డాక్టర్లు పొద్దస్త మానూ అందుబాటులో వుండరు. అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక ఇండియన్ డాక్టర్ వున్నాడు. అపాయింట్‌మెంట్ కోసం ట్రై చెయ్యాలి. ఈ లోపున నువ్వు హైదరాబాద్ డాక్టర్ కి ఫోన్ చేసి కనుక్కో..ఆయనేమన్నా మందులు చెబితే తెప్పిస్తాను,” అంది.

         “కనుక్కున్నానే. చూస్తేగాని మందులు చెప్పలేను ఫోన్ లో అన్నారు. డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్తీసుకో.. నెప్పి భరించలేక పోతున్నాను” అంది.

         అతి కష్టం మీద మరో వారం తరువాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. ఫీజు వంద డాలర్లు! ఇన్సూరెన్స్ లో కవర్ అవదు. తెచ్చుకున్న డాలర్లలోంచి వంద తీసి ఇచ్చింది సుజాత.

         “సౌజన్యా! యువర్ మదర్ నీడ్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ ఫర్ వన్ వీక్. ఈవెన్ ఆఫ్టర్ దట్, ఇఫ్ ది పెయిన్ పెర్సిస్ట్స్, నీడ్ స్కానింగ్” అని డాక్టర్ చాలా కూల్ గా చెప్పాడు. సౌజన్యకి గుండెల్లో రాయి పడింది. తల్లిని తీసుకుని ఇంటికి వచ్చింది.

         ఒక వారం ఎలాగోలా తనే ఇంటి పనులు చూసుకుంది. సుజాతకి ఆరోగ్యం కుదుట పడలేదు. “అమ్మా! కొంచెం ఓర్చుకో. యింకో వారం రెస్ట్ తీసుకుంటే సరి అవుతుంది, “అని సర్ది చెప్పింది. “ఎటూ వచ్చారు.. తిరిగి వెళ్ళడానికి యింకా ఒక నెల వుంది. ఆ లోపున రెస్ట్ తీసుకుంటే కాస్త నయమవుతుంది. ఇక్కడ స్కానింగ్ లు అవీ అంటే కష్టం,” అంది.

         అలా మరొక వారం గడిచింది. సుజాతకి ఆరోగ్య సమస్య కంటే మానసిక ఒత్తిడి ఎక్కువై, విపరీతమయిన చలి మూలంగా ఆరోగ్యం మరింత దిగజారింది.

         సుబ్బారావు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి కూతురుతో “సౌజన్యా, మీ అమ్మకి ఇలానే ఉంటే మీకు కష్టమౌతుంది. మేము ఇండియాకి తిరిగి వెళ్లిపోతాం.. నేను టికెట్స్ మార్పించాను. రేపు ఆదివారమే మా ప్రయాణం,” అని తెగేసి చెప్పాడు.

         సౌజన్యకి మతిపోయింది. చంటి పిల్లవాడితో మేనేజ్ చేయడం కష్టం. అమ్మ ఉంటే కొంచెం సహాయంగా ఉంటుంది అనుకుంది. కానీ మనసులో గిల్టీగానే వుంది. అమ్మ ఆరోగ్యం కూడా ముఖ్యమేగా.. అందుకే పైకి ఏమీ అనలేకపోయింది.

         అయిష్టంగానే సౌజన్య దంపతులు వారిని ఇండియా విమానం ఎక్కించారు. ఇండియా అనగానే సుజాతలో ఉత్సాహం మొదలయింది. హైదరాబాద్ లో దిగిన వెంటనే డాక్టర్ కి చూపించుకున్నారు. స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, చలి ఒత్తిడికి శారీరక శ్రమ అధికమవటంచేత అని, మందులు వాడితే ఒకటి రెండు నెలలలో ఆరోగ్యం కుదుట పడుతుందని ధైర్యం చెప్పాడు డాక్టర్. సుబ్బారావే సుజాతని కంటికి రెప్పలా చూసుకుని కాపాడుకున్నాడు.

         ఆ రెండు నెలలు వారిద్దరి మధ్యా, అమెరికాలో ఇంటికి బందీ అయిన జీవితం, ఆ చలి, పిల్లల స్వార్ధం, నేటి ప్రపంచ పోకడలు, నిస్సహాయత వంటి ఎన్నోఅంశాలు చర్చకి వచ్చాయి. స్వదేశపు గాలీ నీరూ కన్నబిడ్డలకన్నా ఎంత సాంత్వన నివ్వగలవో అనుభవమైంది సుజాతకి.. స్వదేశం స్వర్గం అన్న భావన కలిగింది.

         సౌజన్య నుండి సుజాతకి మళ్లీ ఫోను! “..అమ్మా మీరు ముందుగా వెళ్లిపోయారు అందుకని మా అత్తగారు బయలుదేరుతున్నారు. నాకు చాలా వస్తువులు కావాలి. ఆవిడకిచ్చి పంపించండి”.

         సుజాత భద్రకాళే అయి, తెగేసి చెప్పింది.. “చూడు సౌజన్యా! మా దగ్గర ఇంకయే వనరులూ లేవు. మేము జీవిత చరమాంకానికి దాచుకున్న డబ్బంతా ఖర్చయిపోయింది. మా జీవితమంతా మీ కోసం అన్నట్లుగానే బ్రతికాం. ఇప్పటి వరకూ అన్ని ఖర్చులూ భరించాం. ఇక మా వల్లకాదు. నీ ఆడంబరాలకు, నీకు నిరంతరమూ కొని పంపించడానికి మా దగ్గర స్తోమత లేదు. మీకు కావలసినవన్నీ మీరు ఇండియా వచ్చినప్పుడు కొనుక్కుని తీసుకు వెళ్ళండి. మీకు వండి పెట్టగలనేమో గాని, మీ గొంతెమ్మ కోర్కెలు తీర్చే శక్తి మాకు లేదు”.

         వింటున్నసౌజన్య నోట మాట లేదు.

         భార్య మాటలు వింటున్నసుబ్బారావు ఆశ్చర్యపోయాడు!

         ‘ఈ పని రెండేళ్లముందే చేసి ఉంటే ఎంత బాగుండేది! మన చరమాంకానికి డబ్బులు మిగిలేవి,’ అనుకున్నాడు. “ఇప్పుడయినా మించిపోయింది లేదు. నేను ప్రైవేట్ బ్యాంకులో కన్సల్టెంట్ ఉద్యోగంలో చేరతాను. ఓపిక ఉన్నన్నాళ్ళు చేస్తాను. మన జీవితాలు గడిచిపోతాయి. ఇకనైనా మన శేషజీవితం మన ఆనందం కోసం,స్వేచ్ఛగా, మన ఇష్టం వచ్చిన విధంగా బ్రతుకుదాం… ఏమంటావు సుజీ?”

         “అవునండీ.. కూతుళ్లిద్దరూ నాకు కనువిప్పు కలిగించారు. స్వార్ధంతో నా కోసం మానవత్వాన్ని కూడా చూపించలేక పోయారు. ఇక నుంచీ మీ మాటే నా మాట. మన శేషజీవితం ప్రశాంతంగా గడుపుదాం” అంది.

         మర్నాడు సౌజన్య మళ్లీఫోన్ చేసింది. “నాన్నా, అమ్మకి కోపం వచ్చినట్టుంది..”

         ఆమె మాట పూర్తి కాకుండానే సుబ్బారావు అందుకున్నాడు..

         “చూడమ్మా, మా జీవితమంతా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచాము. మగ పిల్లలయినా ఆడపిల్లలయినా మీరే అనుకున్నాము. చదువు, ఉద్యోగం, పెళ్లిళ్ల వరకే ఉండే మా బాధ్యతని మేము సక్రమంగా నిర్వహించాం. మీ పిల్లలు, మీ ఇంటి బాధ్యతలు మావి కావు. మీరు అక్కడి పరిస్థితులు, అవసరాలకి అడ్జస్ట్అవకుండా, మా ఆర్ధిక, శారీరక స్థితులని అర్ధం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారు. మీ అమెరికా అవసరాల కోసం మా వైపు నుంచి ఏమీ ఆశించవద్దు.

         ‘..మాకు సంపాదించే వయసు దాటిపోయింది. మీకు పాతికేళ్ళు దాటినా స్వావలంబన లేకపోవడం ఒక రకంగా మా పెంపకంలో లోపమే. దాన్నిఇప్పుడయినా దిద్దాలని మేం నిర్ణయించుకున్నాం. ఇకనయినా మా పరిస్థితిని అర్ధం చేసుకుని, మీ పనులు, మీ అవసరాలు మీరే పరిష్కరించుకోండి,”అని పెట్టేశాడు..

         సుజాత ఆరోగ్యం కుదుటపడిన తరువాత, దంపతులిద్దరూ ఉత్తర భారత యాత్రలకి ఒక 20 మంది స్నేహితులతో కలసి టికెట్స్ బుక్ చేసుకున్నారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.