బతుకు చిత్రం-29

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించుకుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది .

***

సైదులు ఆలోచనలో పడ్డాడు .

          సరూప చెప్పేది నిజమేనా? అమ్మకు ఏ గాలో ధూళో తగిలి ఉంటుందా? లేక ఇంకె వరయినా కావాలనే చేశారా? అలాంటివే అయితే మందులతో నయంకావు. తప్పకుండా మంత్రగాళ్ళ ద్వారానే సాధ్యమవుతుంది. కానీ, సరూప చెప్పేట్టువంటి వాడు అంతా నమ్మకస్తుడేనా? ఏమిటి ఋజువు? అని తనలో తనే అనుకోసాగాడు.

          ఏయ్? ఏం ? సోచాయిన్చుతనావ్? నమ్ముదేట్లానా ?

          ఆ ..ఆ ..అన్నాడు ఆలోచనల్లోనే.

          నేనే సాచ్చి. మా అమ్మ గారింటి కాడ ఒగలకు పిల్లలు గాలే.పెండ్లయి ఇరవయి ఎండులు దాటింది. ఇగేమయితారు? అని అనుకోని సల్లవద్దరు.

          ఎవరో గిట్ల గిట్ల సంగతి, ఓ పారి పోయిరాన్ద్రి. ఎందుకయినా మంచిదంటే,

          సరే! గిన్ని జేసినం. ఏ పుట్టల ఏ పామున్నదో! ఈన్తోక్కటి గూడ జేద్ధమని పోయిన్డ్రట

          అన్జనమేసి చూసిండట. జూత్తే అయినోళ్ళు ఆస్తికి ఆశ పది అడ్డు గాలేసి మంత్రం అయిన్చిన్డ్రని తేలిందట.

          ఇరుగుదేట్లాని అంటే ఫలానా వాళ్ళది బట్టో బాతో, జుత్తో, గొరో ఏదో ఓటి ఆనవాలు తెమ్మనరట. వీళ్ళు అట్నే వట్టుకొని పోయిన్డ్రట.

          మూడు అమ్మాస రాత్రులు, రెండు పన్నాలు ఆయినా జెప్పినట్టు ఆన్నే పన్నరట. నల్ల కోడి తోని జిట్టి దీసి, ఏందో పిండి బొమ్మ జేసి వీళ్ళు దీస్క పోయిన బట్ట తొడిగి పూజ చేసిండట.

          తరువాత తతంగం ఎవరికీ జెప్పకున్డ్రి అంటే వీళ్ళు అట్నే కడుపుల వేట్టుకున్నరు.

          గని ఏమాయో! ఏం మంత్రమో! గని పాటయింది. మూన్న్నేల్లానే వాళ్లకు పిల్లలయితాన్డ్రని వార్త చెవుల వడ్డది.

          ముద్దుగ తోలిచూరు బిడ్డ పుట్టింది. ఆటంకా రెందేడ్లకు కొడుకు పుట్టిండు. ఇగ వాళ్ళ సంబురంగాదు, వల్ల కథ గాదు.

          ఈ ముచ్చట ఎరికయినంక ఆయన దగ్గరికి జనం తీర్థం సాగినట్టు వత్తాన్డ్రట. నీకు ఓపికుంటే అడ్రసు జెప్త నువు గూడ వాళ్ళతోన్ని ఓ పారి మాట్లాడి సూడు. అని చేతిని మెత్తగా నొక్కింది.

          కొంచే కొంచెం సయిదులులో గూడ నమ్మకం కలుగ సాగింది. ఇది గమనించే,

          ఔ ..మల్ల మరసి ప్పోయిన. గా పొద్దు నేను వాళ్ళు యాతతోని పండుగ జేత్తే పోయి సుతం అచ్చిన అన్నది.

          సయిదులు మెల్లగ,

          సరే! నువ్వు ఇంతగనం జెప్తుంటే నాకూ ఆస పుడుతాంది. కని గీ ముచ్చట అన్న ఉన్నప్పుడేచెప్పక, ఇట్లా ఒంటరిగా ఎందకు పిల్సి జెప్తానావ్? అడిగాడు.

          ఆ ..మీ అన్నకు జెప్తే మీ అమ్మ ముచ్చట తెల్సి ,ఇంకేమన్నా ఉన్నదా? డప్పు సాటింపు మొదలువెడుతడు.

          మరి నీకెట్ల ఎరికయింది ?

          ఇప్పుడు చెప్పుడు నాకు, తెలుసుకోవడం నీకు అవసరమున్నదా ? ఇప్పటికే చాలా ఆల్ల్సమయింది. వెళ్ళు ..వెళ్ళు… బయలెళ్ళు అన్నది.

          సయిదులు మంత్రిన్చినట్టే లేచి నిల్చున్నాడు.

          ఆ ..ఇంకో సంగతి. ఈ సుట్టుముట్టు ఊర్లల్ల కాటి కాపరుల నెంబర్లు గావాల్నన్న ఇస్తా, అక్కేరయితే చెప్పు అన్నది.

          ఒక్క క్షణం బిత్తర పోయాడు.

          అమ్మో! మామూలుగా లేదు. ఈమె పరిచయాలు? అనుకోని అట్నే అని తలూపి. బయితపడ్డాడు.

          తోవ్వెంట పొయ్యేటి ప్రగాడా ..ఓ ..పోరాగాడా ..

          మాయలోన పడకు పోరాగాడా ..ఓ ..పొరగాడ …

          కన్ను నీదేగాని కనికట్టు చూపెట్టి ..

          గోతిలో పడదోసి చోద్యమే జూసురా ..నరుడా ..

———————————————————-

తత్వం పాడుకుంట చంద్రం మామ ఎదురయిండు.

          ఎందుకో ఆ పాట తనను జూసే పాడుతాండా? అని “గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకోన్నట్టుగా”  అయింది తనపని.

          చంద్రం మామ ఆపి అడగనే అడిగిండు.

          పిలగా! మల్లెప్పటి నుండి ఇటు బాట వట్టినవ్? అని.

          ఏ ..బాటేక్కడిదే? ఏదో ఉప్పోసకు ..

          అట్నా ..! తాడి చెట్టు కింద నిలవడ్డవ్ ! గని కళ్ళు తాగాలేదంటవ్?

          ఔ ..!మల్ల ..!

          మత్తులోపలికేను మనసెన్నో అసత్తేల పలుకులు …అని ఏదో తోచింది పాడు కుంటూ వెళ్ళిపోయినా ..

          సయిదులుకు తనని పూర్తిగా పసికట్టే పాడాడని అర్థమయింది. అయినా, అతనితో వచ్చిన ప్రమాదం ఏమీ లేదని అక్కడి నుండి ముందుకు నడిచాడు.

          దారంతా ఒకటే తర్జన భర్జన.

          సరూప చెప్పినట్టు అమ్మకు బాగయితదా? మంత్రాలు, తంత్రాలు నిజంగానే ఉన్నాయా? అనుకోని మెడలో చెయ్యి వేసి చూసుకున్నాడు.

          మంత్రం తంత్రం లేనిదే అమ్మ నాకు ఈ తాయెత్తు ఎందుకు కట్టిస్తుంది. అమ్మే నమ్మిందంటే తప్పకుండా ఉన్నట్టే గదా!

          ఏదయితే అదే అయింది. సరూప చెప్పినట్టే చేస్తాను , అని ఫుల్ జోష్ తో ఇల్లు చేరాడు.

***

          కమల పడుకొని ఉంది. పిల్లలూ, ఈర్లచ్చిమి కలిసి అన్నం తింటున్నారు.

          రాజయ్య మంచంల కాలు మీద కాలేసుకొని పడుకొని ఆకాశంవయిపు చూస్తున్నాడు.

          సయిదులుని చూసి రెండో బిడ్డ పరుగెత్తుతూ వచ్చింది.

          ఇంకా పండలేదా? బిడ్డా? ఉండు, కాల్రేక్కలు కడుక్కచ్చుకుంట. అన్నాడు.

          ఆ అమ్మాయి వాల్ల నాన్న కోసమని పళ్ళెంల తను తింటున్న అన్నం పట్టుకొని వచ్చి నిలబడింది.

          నా తల్లే ! నా బిడ్డ గదేనే! అయ్యకు బువ్వ పెట్టడానికే ఇంకా పండుకోలేదా రా? అని ఎత్తి ముద్దాడిండు.

          ఇగ సాలు గని తిను. అన్నది ఈర్లచ్చిమి.

రాజయ్య ,

          ఒరేయ్! కమలను మందలియ్యవయితివి? అన్నాడు.

          ఏం ..?ఎందుకు?ఏమయింది?కమలకు?

          అది నువ్వడిగితేనే బాగుంటది. అన్నది, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ జాజులమ్మ.

          ఏందే ? పొల్ల నవ్వవడితివి? అన్నది ఈర్లచ్చిమి కూడా నవ్వుకుంటూనే.

          సయిదులు వారిద్దరినీ చిత్రంగా చూస్తూ ..

          అది సరే ..! మీరెందుకు నవ్వుకున్టాడ్రు? అంతా గొప్ప విషయమేమిటే?

          నువ్వే కనుక్కో!

          అలాగే లేచి వెళ్ళి కమలను నిద్ర లేపాడు.

          ఏమయింది ఒళ్ళు మంచిగా లేదా?

          లేదు.

          తిన్నదరుగలేదా?

          ఊ ,,,హూ ..!

          మరి ..? ……………

          ఊకె పంటే అట్నే ఉంటది గని, లె ..లే ..! అన్న సైదులు మాటలకు కమల లేచి, తను దేవతక్కను కలిసిన సంగతి చెప్పింది.

          ఏమీ మాట్లాడలేకపోయాడు.

          జాజులును చూసి తలదించుకున్నాడు.

          ఈర్లచ్చిమి ఏదీ అడుగలేదు, చెప్పలేదు.

          రాజయ్య మాత్రం మంచంల నుండి లేచి వచ్చి ,

          ఈ తాపన్న నీకు, నాకు వారసుడు పుడుతడేమో ! అని భుజం తట్టి సంబరపడి మళ్ళీ పడుకున్నాడు.

          జాజులమ్మ చెప్పినట్టు ఇను, అని ఒక్కమాట కమలకు చెప్పి త్వరగా తినడం ముగించాడు.

***

          రాత్రంతా అమ్మకు ఆరోగ్యం బాగా లేదు. ఇప్పుడు కమల తల్లి కాబోతున్నది.

          పాపం ..! జాజులమ్మకు ఎంత కట్టం? ఇటు పిల్లలను, ఆ ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకునే అదనపు భారం పడుతున్నది కదా !

          పక్కనే కొద్ది దూరంలో తన వైపే తిరిగి పడుకున్న జాజులును చూస్తూ ..

          జాజులూ ..! కమల ఇసయంలో అని మొదలుపెట్టబోయాడు.

          కమలకు న్యాయమే చేశారు. ఆమె తల్లి కావడం ఇంట్లో అందరికీ సంతోషంగా ఉందయ్యా! నాతో పాటు.

          అది కాదు ఇక నుండి పని భారం అవుతుందేమో!

          పరవాలేదు! మన వల్ల కోసం అదేమంత కట్టమనిపించదు. మామ కోరుకున్నట్టు కమలకన్న కొడుకు పుడుతే అందరికీ సంబరమే కదా!

          లేకుంటే ..?

          అపశకునం మాటలు ఆడకుండ్రి.

          కొడుకనే అనుకుందాం. అది ఇడ్సి పెట్టు. నువ్వు మల్ల ఆ సరూప ఇంటికి పోతానట్టు న్నావ్? అదయితే మనసుకు కట్టమయితాంది. అన్నది సంశయిస్తూనే.

          నేనా ..నేనా ,,? నేనెందుకు బోత. సరూప భర్త కండ్లవడితే మందలిత్తగని, ఇంటికి నేనేం పనికి పోత? అని బుకాయించబోయాడు.

          ఇంగువ గుద్దలేసి కడితే దాగుతదా? ఎందుకయ్యా? అబద్ధాలు ఆడుతవ్ ? నీ దగ్గరోస్తున్న మందు వాసనే జెప్తాంది, ఆదికే పోయినట్టు.

          సైదులు ఇక లాభం లేదని, దొరికి పోయానని తెలుసుకొని,

          పాండు రంగడు మందు పోపిత్తనంటే వోయిన అన్నాడు తడబడుతూ.

          అవునా ..? అరె !పాండురంగడికి మాయలు మంత్రాలత్తయా ?ఈ పొద్దంతా నాతోని అదోటిదోటి ముచ్చటవెట్టి బొమ్మ శాపల కూర వందిచ్చుక పోయిండు.

          ఒక్క అబద్ధానికి ఇంకో అబద్ధం కూడా జూటా అయిందని తెలుసుకొని , అబద్ధ మాడినా అతికినట్టు ఉండాలని అర్థం చేసుకుంటూ ,

          జాజులూ ..!అదంత పెద్ద ముచ్చట, గిప్పుడు గాదు. పొద్దువోయింది. రేపు మాపటికి ఈలు జూసుకొని అడుగు జెప్తా ! అన్నాడు.

          జాజులు సంతోషించింది. మనసు కుదుట వడ్డది.సైదులు ఈ మాత్రం దాపరికం లేకుండా చెప్తానన్నందుకు, తన మీద అతనికున్న పాయిరం మరోసారి రుజువయి నందుకు నిమ్మలపడింది.         

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.