కరీనంగర్ జిల్లాలోని ఎలగందుల గ్రామంలో 1953 లో పుట్టిన ఎలనాగ వృత్తి రీత్యా డాక్టరైనా ప్రవృత్తి రీత్యా కవి, అనువాదకుడు, విమర్శకుడు. హైస్కూల్లో ఉన్నప్పటి నుండే రచనలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడు రాసిన మొదటి కవిత, కరీంనగర్ నుండి వెలువడుతుండిన గౌతమి అనే పత్రికలో ప్రచురితమైంది. మెడిసిన్ చదువుతున్న కాలంలో భారతి, కృష్ణా పత్రిక, స్రవంతి, ఆంధ్రప్రభ, తరుణ, పొలికేక, విపుల మొదలైన పత్రికల్లో వీరి రచనలు ప్రచురితమయ్యాయి.
సోమర్సెట్ మామ్ రచన అయిన ది ఏలియెన్ కార్న్ అనే నవలికకు వీరు చేసిన తెలుగు అనువాదం కలుపుమొక్క శీర్షికతో 2005 లో అచ్చైంది. 2005 వరకు చేసిన రచనలన్నీ నాగరాజు సురేంద్ర అనే పేరుతో వచ్చాయి. తర్వాత ఎలనాగ అన్న కలంపేరు పెట్టుకున్నారు.
2009 లో మొదటి కవితా సంపుటి వాగంకురాలు వెలువడింది.
కవిత్వం (అనువాదాలు కలుపుకుని): వాగంకురాలు తర్వాత పెన్మంటలు – కోకిలమ్మ పదాలు (గేయసంపుటి), సజల నయనాల కోసం, అంతర్లయ, అంతర గాంధారం, అంతర్నాదం కవితా సంపుటులు వెలువడ్డాయి. అంతస్తాపము వీరి ఛందోబద్ధ పద్యాల సంపుటి. మోర్సింగ్ మీద మాల్కౌఁస్ రాగం, కొత్తబాణి వీరి ప్రయోగ పద్యాల సంపుటులు. ఈ రెండింటిలో అచ్చం వచన కవితల్లా కనిపించే ఛందోబద్దమైన పద్యాలుంటాయి. ప్రత్యేకంగా చెప్తే తప్ప అవి పద్యాలు అని గుర్తు పట్టలేం. పొరుగు వెన్నెల, ఊహల వాహిని ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదింపబడిన అనువాద కవితా సంపుటులు. Faded Leaves and Fireflies, Impression – Images, Memorable Melody Makers and Other Poems on Music, Seedlings of words and Other Poems – ఈ నాలుగు తెలుగు నుండి ఆంగ్లంలోకి వీరు అనువదించిన కవిత్వ పుస్తకాలు. కవిత్వాన్ని, శాస్త్రీయ సంగీతాన్ని వస్తువులుగా చేసుకుని పెద్ద సంఖ్యలో కవితలు రాశారు. లెక్కలేనన్ని పారాగ్రాఫ్ కవితలు రాసారు. కవిత్వంలో
శిల్పం కూడా చాలా ముఖ్యమైన అంశమని వీరి నమ్మకం.
వచనరచనలు (అనువాదాలు కలుపుకుని): భాషాసవ్యతకు బాటలు వేద్దాం, యుక్తవాక్యం, నుడిక్రీడ (ప్రామాణిక గళ్లనుడికట్ల పుస్తకం), ‘పన్’నీటి జల్లు, మేధామథనం, పళ్లెరం (భాషా, సాహిత్య, సంగీతాల మీద రాసిన వ్యాసాల సంపుటి) వీరి స్వతంత్ర రచనలు. కలుపుమొక్క, ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు, ఉత్తమ ఆఫ్రికన్ కథలు, సోమర్సెట్ మామ్ కథలు, కథాతోరణం (వివిధ దేశాల కథలకు అనువాదం), గాలిబ్ – నాటి కాలం (పవన్ కె. వర్మ రాసిన Ghalib: The Man, The Times కు అనువాదం) – ఇవి వీరు ఆంగ్లంనుండి తెలుగులోకి చేసిన అనువాద వచన రచనలు.
Inside the Prison, Fire Flowers and Other Stories of Dasarathi Krishnamacharya, Short Stories of Kaloji Narayana Rao – ఇవి వీరు తెలుగునుండి ఆంగ్లంలోకి అనువదించిన వచన రచనలు.
భాషాసంగీతాల గురించిన రచనలు, ప్రయోగ పద్యాలు, ప్రామాణిక గళ్లనుడికట్లు, అనువాదాలు వీరి ప్రత్యేకతలు. మెదడుకు మేత వేసి, తద్వారా దానికి పదును పెట్టే విభిన్న రచనలు కూడా చెప్పుకోతగినవే. వివిధ ప్రింట్ మరియు వెబ్ పత్రికల్లో వీరి పదకొండు ధారావాహికలు (సీరియల్స్) ప్రచురితమయ్యాయి. వీరు రచించిన మొత్తం పుస్తకాల సంఖ్య 32.
హృదయాన్ని కదిలించే ఎలనాగ సార్ గారి కవిత ఎక్స్ లెంట్ హృదయ పూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు
ఎంతో నిర్వేదంతో కూడిన దుఃఖపు ఆనవాళ్ళు కవితలో ప్రతిధ్వనిస్తున్నాయి. అనువాదంలో కూడ మంచి పదాలను వాడారు. అభినందనలు సర్
Chala baagundi sir!