విజ్ఞానశాస్త్రంలో వనితలు-4

జన్యుశాస్త్రంలో సూత్రధారి-రొసాలిండ్ ఫ్రాంక్లిన్ (1920-1958)

– బ్రిస్బేన్ శారద

          రచయిత సిద్ధార్థ ముఖర్జీ  “ది జీన్”  (The Gene) అనే తన అద్భుతమైన పుస్తకంలో విజ్ఞాన శాస్త్రం లో వచ్చిన గొప్ప మలుపులు- అణువు, జన్యువు, కంప్యూటర్ బైట్ (atom, gene, byte) అంటాడు. అణువు- భౌతిక పదార్థం యొక్క మౌలిక (లేదా ప్రాథమిక) పదార్థం అయితే, జన్యువు-జీవ పదార్థానికి ప్రాథమిక మూలం, కంప్యూటర్ బైట్ సమాచారానికి మౌలికమైన అంకం అనీ ఆయన అభిప్రాయపడ్డారు. అంటే స్థూలంగా చూస్తే విజ్ఞాన శాస్త్రం పదార్థానికీ, సమాచారానికీ, జీవ పదార్థానికీ మౌలిక అంకాలను వెతకడం వైపు సాగిందన్నమాట..

          మానవ సమాజం పరిణామ క్రమంలో విజ్ఞాన శాస్త్రమూ, సాంకేతిక పనిముట్ల తయారీల పాత్ర గురించి కొత్తగా చెప్పుకోవాల్సినదేమీ లేదు. ఆ మాటకొస్తే, ఈ శాస్త్రాలూ, రాజకీయ వ్యవస్థా, ఆర్ధిక వ్యవస్థా, సాంస్కృతిక వ్యవస్థా అన్నీ కలిసి మానవ జీవిత పరిణామం (human evolution) గా చెప్పుకోవాలి. కలిసి చేతులు పట్టుకొని గుండ్రంగా తిరిగే స్నేహితుల్లా, ఇవన్నీ ఒకదాన్నొకటి ప్రభావితం చేస్తూ, మానవ సమాజాన్ని ముందుకు తీసికెళ్తాయి. ఇలాటి సహాయ సహకరాల వల్లే భౌతిక శాస్త్రం ఫలాలైన మైక్రోస్కోపూ, కెమెరా, వంటి పనిముట్లు మిగతా శాస్త్రాలకెంతో మేలు చేసాయి.

ఉదాహరణకి- ఎక్స్ రే క్రిస్టల్లోగ్రఫీ.

          ఎక్స్‌రేలని విల్‌హెంరొయెంట్‌జెన్ 1895 లో కనుక్కున్నాడు. అతి తక్కువ తరంగ దైర్ఘ్యం కల ఈ తరంగాలు ఏ తరగతికి చెందినవీ, అసలు ఇవి తరంగాలా(waves) లేక పదర్థాలా(matter) అన్న రకరకాల తర్క మీమాంసలు భౌతిక శాస్త్ర ప్రపంచంలో చాలా యేళ్ళు నడిచి, చివరకు 1912 ప్రాంతాల్లో ఎక్స్‌రేలు విద్యుదయస్కాంత తరంగాల కోవలోనిదే అని తీర్మానించారు. అటు పైన ఎక్స్‌రేల తరంగాల స్వభావం మీద ఎంతో పరిశోధన జరిగి, వీటిని రసాయన శాస్త్రం విజయవంతంగా ఉపయోగించి ఎన్నో రసాయన పదార్థాల పైన ప్రయోగించింది.

          మరీ ముఖ్యంగా, స్ఫటిక రూపంలో వుండే పదార్థాల (క్రిస్టల్స్) అంతర్గత స్వరూపం తెలుసుకోవడంలో ఎక్స్‌రే లు చాలా ఉపయోగపడ్డాయి. అలా విస్తరించిన శాస్త్రమే ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ. భౌతిక, రసాయన శాస్త్రాల్లోనూ, పరిశ్రమలోనూ ఎంతో ముఖ్య పాత్ర వహించిన ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ జన్యు శాస్త్రానికి (Genetics) చేసిన మేలు అంతా ఇంతా కాదు.

          ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ జన్యు శాస్త్ర పరిశోధనని వందల మెట్లెక్కించింది. జన్యువుకి మూలమైన డిఏన్ఏ(DNA) స్వరూపాన్ని ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ లేకుండా కనుక్కోవడం అసాధ్యమయేది. అయితే ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీ సాయంతో డిఏన్ఏ స్వరూపాన్ని ఫోటొ51 సాయంతో ప్రపంచానికందించిన రొసాలిండ్ ఫ్రాంక్లిన్ పేరు మాత్రం ఈ పరిశోధనకీ, డీఎన్‌యే స్వరూపానికీ, నోబెల్ బహుమతి గెలుచుకున్న వారి పేర్లలో లేదు.

          డిఏన్ఏ స్వరూపానికి నోబెల్ బహుమతి ఇచ్చే సంవత్సరానికి (1966) రొసాలిండ్ మరణించి నాలుగేళ్ళయింది. నోబెల్ బహుమతి బ్రతికున్న వారికే కాని, మరణించిన వారికివ్వడం ఆనవాయితీ కాదని ఆమె పేరు ఈ నోబెల్ బహుమతి గ్రహీతుల్లో లేదని కొందరంటారు. ఏదేమైనా రొసాలిండ్‌కి ఈ విషయంలో దక్కవలసిన ఖ్యాతి దక్కలేద న్నది కాదన లేని నిజం.

          రొసాలిండ్ ఫ్రాంక్లిన్ 1920 లో లండన్‌లో ఒక సంపన్న యూదుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి అర్థర్ఫ్రాంక్‌లిన్బేంకు ఉద్యోగి. అయిదుగురు సంతానంలో రొసాలిండ్ రెండో సంతానం. వారి బంధువర్గమంతా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో  పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వుండేవారు. ఫ్రాంక్‌లిన్ దంపతులు అప్పట్లోయూరోపంతటా సాగుతున్న ఊచకోత నుంచి తప్పించుకుని పారిపోతున్న యూదులని తమ ఇంట్లో దాచి రక్షించే వారట.

          ఆరో యేటి నుంచే రొసాలిండ్ లెక్కల్లో చాలా ముందుండేది. పదకొండేళ్ళకి రొసాలిండ్ సెయింట్ పాల్స్ బడిలో చేర్చారు. ఆ బాలికల పాఠశాలలో లెక్కలూ, భౌతిక శాస్త్రమూ, రసాయన శాస్త్రమూ నేర్పేవారు. ఆ పాఠశాలలో రొసాలిండ్ ప్రతిభ చాలా ప్రకాశించింది.

          1938లో రొసాలిండ్ రసాయన శాస్త్రం చదవడానికి కేంబ్రిడ్జిలోని న్యూన్‌హాం కాలేజీలో చేరారు. ఉత్తరోత్తరా ఆమెకి ఫిజికల్ కెమిస్ట్రీలో పరిశోధన సాగించడానికి వేతనం లభించింది. అయితే ఆ పరిశోధన పెద్దగా ఫలవంతం కాలేదు. యేడాదిపాటు అక్కడ పని చేసి ఎటువంటి ఫలితాలూ లేక నిరాశతో రాజీనామా చేసి వెళ్ళిపోయింది రొసాలిండ్.

          వెంటనే ఆమెకి బ్రిటిష్ బొగ్గు గనుల వ్యవస్థలో రీసెర్చి ఆఫీసరుగా ఉద్యోగం దొరికింది. అక్కడ రొసాలిండ్ బొగ్గు యొక్క ప్రాథమిక స్వరూపాన్ని కనుగొనడానికి పరిశోధన చేసారు. ఈ పరిశోధనకుగానూ 1945లో ఆమెకి కేంబ్రిడ్జియూనివర్సిటీ పీహెచ్‌డి పట్టాను ఇచ్చింది.

          రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత ఫ్రాన్స్‌లో పరిశోధనలు చేయడనికి వివిధ లేబోరేటొరీలకి దరఖాస్తు చేసారు రొసాలిండ్. అక్కడ ఎక్స్‌రేలని ఉపయోగించి పొడి పదార్థాల అంతర్గత స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు సాగించారు. అప్పటి వరకూ ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫీని స్ఫటిక రూపంలో వున్న పదార్థాల మీద మాత్రమే ఉపయోగించారు. పారిస్ నగరంలో మూడేళ్ళ పరిశోధన, బోలెడన్ని పరిశోధనా పత్రాల అనంతరం, రొసాలిండ్‌కి కింగ్స్ కాలేజ్, లండన్‌లో మూడేళ్ళు పరిశొధన చేయడనికి వేతనం లభించింది.

          జనవరి 1951లో జాన్ రాండాల్ అధ్వర్యంలో పని చేయడానికి కింగ్స్ కాలేజీలోని బయో ఫిజిక్స్ యూనిట్ చేరుకున్నారు రొసాలిండ్. మొదట ఆమెను కొన్ని రకాల ప్రోటీన్ల స్వరూపం అధ్యయనం చేయడానికి నియమించారు. కానీ, రాండల్ఆమెకు డీయెన్ఏ గురించి పరిశోధనలు సాగించమని సూచించారు. ఎందుకంటే అప్పటికి ఆ లేబొరేటరీలో ఎక్స్‌రే డై ఫ్రాక్షన్‌ను ఉపయోగించి ప్రయోగాలు చేయగలిగే సామర్థ్యం ఆమెకొక్కదానికే వుండింది.

          అప్పటికే డియెన్ఏ స్వరూపం గురించి ఎక్స్‌రే లను ఉపయోగించి ప్రయోగాలు చేస్తున్న విల్కిన్స్ తో కలిసి రొసాలిండ్ పనిచేయాల్సి వొచ్చింది. దురదృష్టవశాత్తూ, విల్కిన్స్‌కీ రొసాలిండ్‌కీ ఏ మాత్రం పొసగలేదు. ఇద్దరి పరిశోధనా శైలి వేరు వేరు కావడం, ప్రయోగాల గురించీ, పరిశోధనా పత్రాల గురించి పోటీ, వ్యక్తిగత వ్యవహార శైలీ వేర్వెరు కావడం ఇలా ఎన్నో కారణాల వల్ల ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడేది కాదు.

          డీయెన్‌యే మోలిక్యూల్ రెండు పాయల జడలావుంటుంది. ఈ రెండు పాయలనీ ఎ, బి అని పిలుస్తారు. రొసాలిండ్, విల్కిన్స్ మధ్య ఏ మాత్రమూ సయోధ్య లేకపోవడం వల్ల రాండల్ ఇద్దరినీ చెరొక పాయ మీద పని చేయమని సంధి కుదిర్చారు. విల్కిన్స్  డియెన్‌యే-ఎ పాయ గురించీ, రొసాలిండ్ బి-పాయ గురించీ పని చెసుకుందామని నిర్ణయించుకున్నారు. రొసాలిండ్ బి-పాయని ఎక్స్‌రే ల సాయంతో వందల కొద్దీ గంటల ప్రయోగాలతో విశ్లేషించారు. అప్పటి వరకు వాడుతూ వచ్చిన ఎక్స్‌రే ట్యూబుకి చాలా సాంకేతిక పరమైన మార్పులు చేసి, దాని పనితనాన్ని మెరుగుపర్చారు. 1951 నవంబరు లో మొదటిసారి రొసాలిండ్డియెన్‌యే స్వరూపాన్ని గురించిన పరిశోధనా ఫలితాలు ఒక ప్రసంగంలో అందరితో పంచుకున్నారు.

          1953 జనవరి కల్లా డిఎన్ఏ అణువులో రెండు సూత్రాలు పాముల్లా పెనవేసుకొని వుంటాయని నిర్ధారించారు రొసాలిండ్. ఆమె, ఆమె శిష్యుడు రేమండ్గోస్లింగ్ తీసిన ఫోటో51 ఈ నిర్ధారణలో ముఖ్య పాత్ర వహించింది.

          అయితే, ఈ డిఎన్ఏ పరిశొధనలో తనూ, తన శిష్యుడు గోస్లింగ్ ఒక పక్కా, విల్కిన్స్,  కెవెండిస్ లేబొరాటొరీలో పని చేసే ఫ్రాన్సిస్ క్రిక్, వీళ్ళతో చేరిన అమెరికన్ జేమ్స్ వాట్సన్ లు ఒక పక్కా, చేసిన యుధ్ధాలతో విసిగి 1953 లో కింగ్స్ కాలేజీ వదిలిపెట్టారు రొసాలిండ్.

          డిఎన్ఏ, ఆరెన్ఏ పదార్థాలను అర్థం చేసుకోవడంలో వారు చేసిన కృషికి గానూ 1962లో విల్కిన్స్, క్రిక్, ఇంకా జేమ్స్ వాట్సన్ (అమెరికన్)లకు నోబెల్ బహుమతి ప్రకటించారు. వీరు వ్రాసిన ఏ పరిశోధనా పత్రంలోనూ వీరెవ్వరూ రొసాలిండ్ పంచు కున్న పాలుని గురించి గానీ, ఆమె పరిశోధనా ఫలితాలను గురించికానీ పెద్దగా ప్రస్తావించనేలేదు.

          తనకి పూర్వాశ్రమంలో గురువుగారైన బెర్నల్ గారి లేబొరేటొరీలో పనిచెయడానికి బర్క్‌బెక్ కాలేజీకి వెళ్ళిపోయారు. అక్కడ పనిచేస్తూ వుండగా ఆమెకి రాండల్ దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది, సరిగ్గా ఫోటో51 నేచర్ పత్రికలో రావడానికి వారం రోజుల ముందు.

          “డీఎన్ఏ గురించి పరిశోధన సాగించడం గానీ, అసలు దాని గురించి ఆలోచించడం కూడా రొసాలిండ్ చేయడానికి వీల్లేదు”, అని ఆ లేఖ సారాంశం. అప్పటికే రొసాలిండ్ తన దృష్టిని ఇతర పరిశోధనాంశాల పైకి సారించారు. మొక్కలకు సోకే వైరస్‌ల గురించి పరిశోధనలతో ఆమె పేరు యూరోపు అంతటా మారు మ్రోగిపోయింది. ఎక్స్‌రే టెక్నాలజీ, డైఫ్రాక్షన్, క్రిస్టలోగ్రఫీ ల గురించి ఆమె ప్రసంగించేది. చాలా కాన్‌ఫరెన్సుల్లో ఆమె ఒకతే స్త్రీ.

          తన పరిశోధనలూ, పత్రాలతో అంత పేరు సంపాదించినా ఆమెకి యూన్వీర్సిటీల నుంచి, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి గానీ ఆర్ధిక సహాయం అంతంత మాత్రంగానే వుండేది. ఎట్టి పరిస్థితులలోనూ ఆమెకి ప్రమోషన్లు గానీ, మంచి ఉద్యోగ స్థాయి కానీ ఇవ్వడనికి ఒప్పుకునేవారు కాదు. ఇటు వంటి అవమానాలూ, నిరుత్సాహ పరచే పరిస్థితులు ఎదురైనా, తన పరిశోధన, తన టీంలో పనిచెసే సభ్యుల కోసం ఎంతోయుధ్ధం చేసేవారు రొసాలిండ్. 1956లో (అప్పటికామె వయసు ముప్పై ఆరేళ్ళు!) ఆమెకి ఒవేరియన్ కేన్సర్ అని నిర్ధారించారు వైద్యులు. 1958, ఎప్రిల్లో ఆమె మరణించారు.

          తన చిన్న జీవితంలో సైన్సు పరిశోధనకి తప్ప ఇంకదేనికీ స్థానం లేనట్టు బ్రతికారు రొసాలిండ్. వివాహం కానీ, ఎవరినైనాప్రేమించడం కానీ కూడా జరగలేదు. తన చివరి రోజుల్లో తన అనారోగ్యం వల్ల తల్లి దుఃఖం చూడలేక వేరే ఇంటికి మారిపోయారు.

          కేవలం విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలకే అంకితమైపోయి, ప్రపంచంలోని ఇంకే విషయమూ పట్టని మహామునిలా బ్రతికి నిష్క్రమించారు రొసాలిండ్.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.