వెంటాడే కల
-కొమురవెల్లి అంజయ్య
వెంటాడే కల
ప్రశ్నిస్తుంది చేతగానితనాన్ని
నిలదీస్తుంది సోమరిపోతు వైఖరిని
మొండి బారకుండా, తుప్పు పట్టకుండా
ఎప్పటికప్పుడు నూరుతుంది కొత్తగా
దారిలో నుంచి పక్కకు జరుగకుండా చూస్తుంది
కలలెన్నో ముల్లె కట్టుకొని ఉంటాయి
అన్నీ కుమ్మరిస్తాం, ఏరుతాం
నచ్చినవి కొన్ని చొక్కాజేబులో దాచుకుంటాం
గుండెకు దగ్గరగా
విత్తనం ఏదైనా కనిపిస్తే
భూమిలో నాటి నీళ్ళు పోసి పెంచుతాం
రాళ్ళల్లో రత్నాన్ని మెడలో ధరిస్తాం
వెంటాడే కల సాకారం కోసం
నా చెమటతో నా పాదాలు కడుక్కున్నా
కోర్కెలు తీర్చే కాళ్ళు కడిగి నెత్తిన సల్లుకున్నా
ఒక్క కల తీరడానికే బండెడు బరువు ఎత్తుకున్నా
కలను కిరీటంగా ధరించడానికి
కొందరి వీపులను మెట్లుగా చేసుకోవడం ఇష్టంలే
అమాయకులను పాతి పెట్టడం నచ్చదు
పక్కలో బల్లెంలతో పోరు తప్పదు
వెంటాడే కలను తిట్టుకుంటాం కానీ
అది చేజారిపోకుండా చూసుకోవాలి
మనల్ని ముందుకు నడిపించే లక్ష్యమది
పిక్క బలం పెంచి ఉరికించేదదే
ఎప్పటికైనా వెంటాడే కలను జయిద్దాం
జన విజేతల స్ఫూర్తిని తీసుకుందాం
*****