శ్రీరాగాలు-10

గూడు

(రిషబన్ తమిళ కథ “కూడు” కథకు గౌరీ కృపానందన్ తెలుగు అనువాదం “గూడు”)

గౌరీ కృపానందన్

          తలుపు తియ్యడానికి ఎందుకు ఇంత ఆలస్యం? కాలింగ్ బెల్లును మళ్ళీ నొక్కాను. బస్ స్టాండు నుంచి ఇంటికి రావడానికి పావుగంట నడక. ఇంకా ఊపిరి అందకుండా ఉంది.

          ఇంట్లో కుక్కూ మంటూ కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. కానీ అమ్మ ఇంకా వస్తున్నట్లు లేదు. ఏమై ఉంటుంది? నిద్ర పోతోందా? లేక…

          అమ్మయ్య! నా ఆందోళన ఎక్కువ కాక ముందే అమ్మ వచ్చేసింది. తలుపులు తియ్యగానే కోపంగా అడిగాను.

          “ఏం చేస్తున్నావు ఇంతసేపు?”

          “చప్పుడు ఎక్కడి నుంచి అని ఆర్థం కాలేదు. రోజంతా పిచ్చుకల గోల వేరే. ఈ కాలింగ్ బెల్ కూడా అదే చప్పుడుతోనే కొనాలా?”

          హాలులో ఎక్కువగా వెలుతురు లేదు. అన్ని కిటికీలు మూసి ఉంచి చీకటి కమ్ము కుని ఉంది.

          “కిటికీలన్నీ ఎందుకు మూసి ఉంచావు?”

          అమ్మ నాకు కాఫీ కలపడం కోసం వంటింట్లోకి వెళ్లి పోయింది. నేను అడిగింది తప్పకుండా వినిపించే ఉంటుంది. ఇంకా చెవులు పనిచెయ్యకుండా పోలేదు. డెబ్భై ఏళ్ళ వయసుకు శరీరం ఉక్కులాగే ఉంది. ఇప్పుడు కూడా పత్రికల్లో వచ్చే సీరియళ్ళు చదివి, రాత్రి పూట పడుకునే ముందు నాతో చర్చిస్తుంది.

          ప్రొద్దున్న ఎనిమిది గంటలకు బయలుదేరే నాకు వేడిగా టిఫిన్ చేసి పెట్టడం నుంచి రాత్రి వంట దాకా అన్నీ తనే.

          మగదక్షత లేని కుటుంబం. పగలంతా ఒంటరితనంతో అమ్మ…

          “చాలా కష్టంగా ఉంటోందే.” అమ్మ ఒకసారి అంది. వార, మాస పత్రికలన్నింటినీ ఆఫీసు క్లబ్బులో నుంచి తీసుకువచ్చాను.

          “చదవడం అవడం లేదే. మర్నాడే తీసుకువెళ్లి పోతున్నావుగా?”

          అమ్మ కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను కొనడం ప్రారంభించాను, ఆ రోజుల్లో చాలా పేరు పొందిన పత్రిక అది. ప్రతీ వారం వచ్చే సీరియళ్ళను చదవడంలో అమ్మకు చాలా మక్కువ. అదిగాక ఆఫీసు పుస్తకాలు కూడా.

          “అమ్మా! ఈ పుస్తకాన్ని తీసుకుని వెళ్లిపోవచ్చా రేపు?” అని అన్నాను. కాఫీ తీసుకు వచ్చిన అమ్మతో.

          “ఈరోజు కూడా చదవడం కుదరలేదే. కిటికీ తలుపులు మూసి… ఒకటే చీకటి… పవర్ కట్… ఉక్కపోత వేరు. తలనొప్పితో తల బద్దలైపోతోంది.”

          “కిటికీ తలుపులు మూసి పెట్టడం ఎందుకు?”

          “ఈ పిచ్చుకలతో ఒకటే గొడవ. నోరు ముయ్యకుండా ఒకటే చప్పుడు. ఈ గోలను భరించలేక పోతున్నాను” అంది, ఇప్పుడు కూడా ఆ చప్పుడు వినబడుతున్న భ్రమలో చెవులను మూసుకుంది.

          కిటికీ తలుపులను తెరిచాను. నిజమే మరి. పక్కనే ఉన్న చెట్ల నుంచి పక్షుల కలకలం.

          అమ్మ వెళ్లిపోయింది. పాపం! వయసు మీరిపోయింది. మనసు ఎంత కాలం దాకా సహకరిస్తుంది?

          కన్నకూతురు… ఇంకా స్వంతంగా ఒక గూడు లేకుండా ఒంటరిగా, మోడుబోయిన చెట్టులా మిగిలిపోతే…

          కిటికీ ద్వారా స్వతంత్రంగా లోపలి దూరి, హక్కు ఉన్నట్లు గూడు కట్టుకుంటున్న పిచ్చుకల మీద అమ్మకి ద్వేషం పుట్టుకు వచ్చిందా?

          నాకు ఇంకా బాగా గుర్తుంది.

          ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చీ రాగానే హాలు నిండా చెల్లా చెదురుగా పడి ఉన్న ఎండు గడ్డి పరకలను ఆశ్చర్యంగా చూశాను.

          “ఏంటమ్మా ఇది? ఒకటే చెత్తా చెదారంగా ఉంది?”

          “అదిగో ఆ వైపు చూడు ఆ పనికిమాలిన దాన్ని.”

          పైన చూపించింది. పై గోడ మీద అనువైన చోట ఇటుకలు లేకుండా సిమెంటు లేకుండా సహజంగా సృష్టించిన గూడు. చిన్ని పిచ్చుకలు రెండు ముందు హాల్లో సగర్వంగా రెక్కలు అల్లలారుస్తూ ఎగురుతూ ఉన్నాయి.

          “ఒకే రోజులోనా? ప్రొద్దున్న ఆఫీసుకు వెళ్ళేటప్పుడు కూడా లేదే?”

          “ఇంటిని నాశనం చేసేస్తాయి. బూజుకర్ర తీసుకువచ్చి దాన్ని తీసి పారేసి వెళ్ళగొట్టు. ఆ గోల భరించడం నా వల్ల అవడం లేదు.”

          “పాపం అమ్మా…   దాన్ని ఎలా తీసి పడెయ్యడం?”

          “పాపం ఏంటి పుణ్యం ఏంటి? మనుషులకు ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ఇక్కడ లేకుంటే వేరే చోటు. గూడు కట్టుకోవడానికి చోటుకా కొరత?”

          నాకు మనసు రాక తటపటాయించాను.

          అమ్మ బ్రహ్మాస్త్రాన్ని సంధించింది.

          “ఆ పిచ్చుకల మేలు కోసమే చెబుతున్నాను. రోజంతా మనకి ఫ్యాను తిరుగుతూ ఉండాల్సిందే కదా, ఎక్కడైనా దెబ్బ తగిలి చచ్చిపోతే ఫరవాలేదా మరి?”

          కూడదు… ఈసారి నా చెయ్యి తానుగా బూజుకర్రను పైకి లేపి గూడును చెల్లాచెదురు చేసింది.

          కీచుకీచుమంటూ చాలాసేపు అరిచి వెళ్లి పోయాయి. ఆ రోజు రాత్రి నాకు చాలా సేపు నిద్ర పట్టలేదు. ‘ఇలా చేసావు కదా?’ అంటూ అవి నన్ను నిలదీస్తున్నట్లుగా భ్రమ చాలా రోజుల దాకా ఉండేది.

          ఇప్పుడు కూడా ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. నా స్వభావం అది కాదు. తెలిసే మోసపోవడం నా లక్షణం. నా చుట్టూ ఉన్న వాళ్ళు సులభంగా నన్ను తమ పనులకు ఉపయోగించుకుంటారు. పోయిన వారం కూడా వచ్చిన సమస్య అదే కదా.

          ఆఫీసులో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది.

          “ఇంటికి త్వరగానే వచ్చేస్తావుగా ఈ రోజు?” తమ్ముడు మాట్లాడాడు. హైదరాబాదు నుంచి వచ్చాడు. ఉన్నట్లుండి ఈ రాక ఎందుకోసం?

          “ఏమయ్యింది? ఎందుకు?” అడిగాను.

          “రా రాదూ. అర్జంటు పని.”

          ఆఫీసులో అనుమతి తీసుకుని ఇంటికి వెళ్లాను. అమ్మ కొడుకు మీది ప్రేమతో ఇన్ని రోజులుగా బెంగ పెట్టుకుని ఉన్నట్టుంది. మా లావు కొడుకు! ఎలాంటి కొడుకు?

          “అక్కయ్యా! నువ్వు తప్పుగా భావించవద్దు. ఏదో ఈ కుటుంబాన్ని నువ్వు కూడా కొంచెం ఆదుకున్నావు. పెళ్లి చేసుకోకూడదు అన్న నిర్ణయం మాత్రం పూర్తిగా నీదే సుమా. ఆ విషయంలో నువ్వు మా అభిప్రాయం అడగను కూడా అడగలేదు. ఇప్పుడు నీ జీతం డబ్బులతో నువ్వు అమ్మను పెట్టుకుని హాయిగా పోషించవచ్చు. అమ్మ కూడా అలవాటైన చోటులో ఉండడానికే ఇష్టపడుతుంది. నేను తీసుకువెళ్ళలేదే అని అనుకోకు.”

          అప్పుడు వెళ్లిపోయాడు. అమ్మకు లోలోపల కొరతగా ఉండి ఉంటుంది. కానీ బయటకి చూపించుకోదు. ఎప్పుడైనా ఒంట్లో కులాసాగా లేకపోతే నస పెడుతూ ఉంటుంది. నేను సెలవు పెట్టలేని పరిస్థితి అంటే ఆ మూల్గుడు రెండింతలు అవుతుంది.

          “నీకేంటీ? పిల్లా పాపా? సంసారం కూడా లేదు. ఇస్తే తగ్గిపోతుందా ఏంటి?” అంటూ కోరికల చిట్టాతో బంధువుల గుంపు వచ్చినప్పుడు నాకు లోలోపల ఛీ అనిపిస్తుంది.

          “నువ్వయినా చెప్పరాదూ” అంటూ అమ్మను సిఫారిసు చేయమని వేధిస్తారు.

          అమ్మకి అప్పుడైనా లోకం పోకడ అర్థం అయి ఉండాలి. లేకపోతే… అమ్మ కూడా అదే రీతిలో ఆలోచిస్తూ ఉందేమో?

          “నీకు వీలుపడితే ఇవ్వు” అంటుంది అంటీ ముట్టనట్లు.

          అదీ గాక తన కొడుక్కి అంటే…

          ఈ సారి ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చి చేరాను.

          సంప్రదాయమైన సంభాషణలు ముగిసిన సహజ పరిస్థితికి వచ్చిన తర్వాత అతని రాక యొక్క ఉద్దేశ్యం అర్థం అయ్యింది.

          “ముందూ వెనకా ఆలోచించకుండా ఫ్లాటుకు అడ్వాన్స్ ఇచ్చేశాను. ఎదురు చూసిన విధంగా డబ్బులు సమకూరలేదు. ఆలస్యం అవుతోంది. నీకు ఏదో జీతం సెటిల్మెంట్ అయి మొత్తంగా డబ్బు వచ్చిందని విన్నాను. సరే నువ్వయినా నాకు సహాయం చేస్తావని బయలుదేరి వచ్చాను” అన్నాడు నన్ను గుచ్చి గుచ్చి చూస్తూ.

          అమ్మ వైపు చూశాను. రెండు వారాల ముందు అమ్మ పోస్ట్ చెయ్యమని ఇచ్చిన ఉత్తరం దీని కోసమేనా?

          “అమ్మ వైపు ఎందుకు చూస్తున్నావు? డబ్బులు చేతికి వచ్చాయని యదార్థంగా వ్రాసింది. నాకూ ఆ డబ్బును కొల్లగొట్టాలన్న కోరిక లేదు. ఏదో సమస్య… సరేలే, వేరే ఎవరో పరాయి మనుషులను అడగడం కన్నా, నీ దగ్గరే అడుగుదామని వచ్చాను.”

          మౌనంగా ఉండిపోయాను. ఆయాసంగా అనిపించింది.

          అక్కయ్యను చూడాలని కోరికతో ఒక్కసారి కూడా రాని మనిషి, డబ్బు మీది వ్యామోహంలో పరిగెత్తుకు వచ్చాడు. నిజంగానే నేను ఒంటరి మనిషినేనా? నా కంటూ ఒక్కరు కూడా లేరు. కాలమంతా ఒంటరిగానే ఉండిపోతానని నేను తీసుకున్న నిర్ణయం తప్పా?

          కీచు కీచుమంటూ బయట పిచ్చుకలు గగ్గోలు పెడుతూ ఎగురుతూ ఉన్నాయి.

          “ఏమంటావు? ఇవ్వడానికి కుదురుతుందా?” అన్నాడు కొంచెం కూడా ఓపిక లేనివాడిలాగా.

          కిటికీ బయటే నా చూపు నిలిచిపోయింది. ఎంత కుతూహలంగా ఎగురుతూ… ఖచ్చితంగా పిచ్చుకలన్నింటికీ ఏదో ఒక విధమైన చుట్టరికం ఉండి ఉంటుంది. ఇంకొకరు మీద ఆధారపడి, డబ్బులు గుంజే బుద్ధి లేదు. సొంత ప్రయత్నంలో గూడు కట్టుకుని…

          “నాకు జవాబు చెప్పి ఆ తరువాత తీరికగా చూద్దువుగానీ.”

          ఇటువైపు తిరిగాను. నాలో అవసరానికి మించిన నిదానం.

          “కుదరదు. ఇప్పుడు ఇవ్వడం నా వల్ల కాదు. కావలసినంత మేరకు సహాయం చేసేసాను. ఇది కూడా నా సొంత లాభం కోసం కాదు. మా ఇద్దరికీ ఒక భద్రత కోసం.”

          చివుక్కున అమ్మ వైపు తిరిగాడు. “అంతా విన్నావు కదా. నాకు ఎంత అవమానం జరిగిందో చూసావుగా. బయలుదేరేటప్పుడే నీ కోడలు అంది. ‘వెళ్ళకండి. ఇవ్వడానికి తనకి మనసు రాదు. వట్టి చేతులు ఊపుకుంటూ తిరిగి వస్తారు. చూస్తూ ఉండండి’ అని. చెప్పినట్లుగానే అయ్యింది. ఎంత తలవంపు?”

          అమ్మ నా వైపు చూసింది. “ఏంటే…” అంటూ ఏదో చెప్పబోయింది.

          “వద్దమ్మా… నావల్ల నువ్వు అవమానం పాలు కానక్కర లేదు. నిన్ను కూడా గడ్డిపోచ లాగా తీసి పారేసి మాట్లాడుతుంది” అన్నాడు.

          “ఆమె మాట్లాడితే ఏమయ్యింది? పోవే… నువ్వూ నీ డబ్బూ అన్నీ వదిలేసి; ఈ క్షణమే నీతో బయలుదేరి వచ్చేస్తాను. తను వదిలేస్తే నన్ను పెట్టుకోవడానికి ఎవరూ లేరా ఏంటి?” అమ్మ అంది అలవాటు చొప్పున అమాయకంగా.

          చటుక్కున తమ్ముడు సుధారించుకున్నాడు. డబ్బు దొరకకపోవడంతో బాటు ఇదెక్కడి ఝంఝాటం! రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు.

          “వద్దమ్మా. తరువాత నన్ను దెప్పి పొడుస్తుంది, అమ్మని నా దగ్గర్నుంచి విడదీసి తీసుకు వెళ్లిపోయావు అని. ఏదో తోబుట్టువు కదా. సహాయం చేస్తుంది అని వచ్చాను. మంచి గుణపాఠం దొరికింది. వస్తాను.”

          రోషం పొంగి వచ్చినట్లు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. అమ్మ ఇంకా అతని మాటలను నమ్ముతూ ఉంది. నా వల్లే కొడుకుతో తను ఉండలేక పోతున్నదనీ, మనవల్ని ముద్దు చేయలేక పోతున్నానని అనుకుంటూ ఉంది.

          ఆ విషయంలో నాకు ఏ బెంగా లేదు. వెళ్తే తెలుస్తుంది. ఒకే వారం… అతని రంగు వెలిసిపోతుంది. నాకూ బాధ్యత ఉంది. నాకూ హక్కు ఉంది. పెట్టుకుని పోషిస్తాను.

          బయట ఇంకా పక్షుల కిలకిలారావం… కీచుకీచుమంటూ ఉల్లాసంగా అవి  ఆకాశంలో ఎగురుతూ ఉంటే లోలోపల అసూయగా కూడా అనిపించింది. నాకూ పక్షి జన్మ లభించి ఉంటే, ఈ పాటికి  సొంతంగా ఒక గూడు ఉండి ఉంటుంది. నా చుట్టూ కూడా పక్షులు గుంపుగా ఎగురుతూ ఉంటాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.