ఒక్కొక్క పువ్వేసి-23
గీల్ల మన్ కీ బాత్ గూడ జెరయినుండ్రి సారూ!
-జూపాక సుభద్ర
గిదేమన్యాలమ్ సారూ… గా ఆడి పిల్లలు యెవ్వలకెర్కలేనోల్లు, ముక్కుమొకం దెల్వ నోల్లు గాక పాయె. కుస్తీ పోటీలల్ల పైల్వాం యే మొగపోరగాండ్లు గెలువని బంగారి బిల్లలు, యెండి బిల్లలు, కంచు బిల్లలు దెచ్చి దేశానికి పేరుతెచ్చిన ఆడి పిల్లలు. గిప్పుడుగా కుస్తీ ఆటలాడే ఆడిపిల్లలను మీ పార్టీలోడే, కుస్తీ సంగం పెద్దనట, వెన్క ముందు బాగా పతార వున్నోడట, తొమ్మిది సార్లు గెల్సిండాట పెద్ద సచలకు బోనికి. గీయన గా కుస్తీ పైల్వాన్ ఆడపోరగాండ్లను షిడాయించుడు, ఒంకరసూపులు, టింకర బుద్ధుల బూతులతోని శానా సతాయిస్తుండట. గీ బిడ్డెలు శాన యేండ్ల కాంచి బరించి బరించి యిగ వొశంగాకరోడుమీది కొచ్చిండ్రు. గా కుస్తీ సంగం లీడర్ మమ్ములను బూతులతోని పిడా యిస్తుండు, బలాత్కారం జెయ్యొచ్చిండు, గీయనను కుస్తీ సంగం పెద్దగా తీసేయండి. మీ పార్టీ లీడర్ గగూడ వుంచొద్దని లొల్లి జేస్తుండ్రు. గీ సెడ్డ లీడరు మీద శాన సార్లు ఫిర్యాదులు గూడ రాసిచ్చిరి. అయినా ఎవ్వులు సప్పుడు చెయ్యలే.
గా కుస్తీ ఆట ఆడ పిల్లల లొల్లి ఏలినోల్ల కండ్లగ్గన వడ్త లేదు సెవులకు యినవడ్త లేదు. గప్పుడెప్పుడో అయిదు నెల్లకిందిచ్చిన ఫిరాదు. పోలీసులు కేసు రాయలే. సూసి సూసి కేసు పోలీసు టేషండ్ల ఎక్కేదానికి సిన్నీ, సిత్క కోటుకు గాదు ఏక్ దమ్ న దేశంపెద్ద కోటుకే పోతేగాని పోలీసులు కేసురాసుకోలే. యిగ పెద్దకోటు గూడ ‘మా పవైపోయింది. పోలీసులు కేసు తీస్కున్నరు గదా ! యిగ మా కాడికి రాకుండ్రి, సిన్న సిన్న కోర్టులున్న యి గదా! గాడ జూసుకొండ్రి అని సేతులు దులుపుకునిరి . గంత పెద్ద కుస్తీపైల్వాన్ ఆడపిల్లలు, దునియా అంత, దేశమంత ఆడి దేశానికి పరువు మర్యాదలు దెచ్చిన గాల్లకే సిడాయింపులు, బూతు సతాయింపులున్నయని ఫిరాదుజేత్తే, ఆ ఫిరాదుకు నల్ల లేదు, తెల్లలేదు. పోలీసు టేషండ్ల కేసుగూడ యెక్కలే. దాని కోసం పెద్ద కోటుకు బోయిండ్రు. గీల్లకే గింత అన్యాయలముంటే యిగ మామూలు ఆడ పోరగాండ్ల సంగతిని యెవలడుగు తరు.
బేటి పడావో, బేటి బచావో అంటరుగానీ గీ కుస్తీ ఆడపిల్లలు బేటీలు గాదా! మాటలు శాన శాన జెప్తరు గానీ సేతల కచ్చేటాలకు సున్నే.
యెందో కమిటీలు గూడెత్తిరి, యిసారిత్తిరి యెమైంది, ఏం జెప్పిండ్రో తెల్వదాయె పాపం గంట పెద్ద పేరున్న పైల్వాన్ ఆడిపిల్లలు వాల్ల గోస జెప్పుకోనీకి రోడ్ల మీది కొచ్చిం డ్రు. తిండి, తిప్పలు, నిద్ర అంత రోడ్లు మీదనే వుండి లొల్లి జెత్తండ్రు. మమ్ముల బూతు లతో, బలాత్కారానికి సతాయించిన కుస్తీసంగం లీడరును ‘పోలీస్టేషండ్లే యాలే జేల్లేయ్యాలె ‘ అని మొరబెట్టుకుంటుండ్రు. అయినా ఏ ఆటల మంత్రికి, పెద్ద సభల ఆడలీడర్లకు సెవుల పేను బార్త లేదు. గా సెడ్డ లీడరు మీ సొంత పార్టీకాకుంటే, యేరే పార్టీలో డయితే గిట్లనే వుండునా కత. పోలీసు కేసు రాసుకున్నాంకనన్నాగా సతాయింపు లు జేసినోన్ని, ఆడిపిల్లల తో సెడ్డగ మాట్లాడినోన్ని పోలీసు టానాల బెట్టిండ్రా! ఏమాయె యెందుకు వెట్టలేదో సెప్పుండ్రి సారూ!
పిరాదులు యిచ్చి, యిచ్చి, రోడ్లమీదికొచ్చినా, పోలీసుకేసురాస్కున్నా ఏమైంది? ఏమైతలేదని గా కుస్తీ ఆటల ఆడిపిల్లలు ఢిల్లీ సెంటర్ జెంతర్ మంతర్ లకు వచ్చిండ్రు. తప్పుడోని మీద ఏంచెయ్య లేని పోలీసులు జెంతర్ మంతర్ ల లొల్లి జేస్తే కుస్తీ ఆడి పిల్లల మీద జులుము, కొట్టుడు, గొర్ర గొర్ర యీడ్సేసుడు. అదీ సెరిసగం నాత్తిరి గిట్ల జేసుడు ఏమన్న నాయమా! గీ ఆర్తలు రాసే ఆడిపిల్లల్ని గూడ బట్టలు సినిగిపొయే దాక పొట్టు పొట్టు కొట్టి పోలీసు టానాల బెట్టుడు బేటీ బచావోనా। గీల్లు యేం తప్పు జేసిండ్రని ఆడపిల్లల మీద గింత దురుసు. గాల్ల సోంటి బిడ్డెలు మీకు లేరా! పాపం పైల్వాన్ బిడ్డలు గోడు గోడున యేడ్వ బెట్టిరి.
ఆటల మీద భాయిషుతోని మా అసోంటి పేదసాదల ఆడి పిల్లలు గూడ ఆటల్లకు రావట్టె. ఎన్ని బాదరబందీలున్నా, ఎవ్వడేమన్నా ఓర్సుకొని, ఓర్సుకొని దేశంకు బంగారి బిల్లలు తే వట్టిరి – గిసోంటి పిల్లగాండ్లను గిట్లా సిడాయింపులు, పక్కలకు రమ్మని సతాయింపులుంటే… ఎన్నేండ్లని వుగ్గ పట్టుకుంటరు రైతు సంగాలోల్లు, సదువుల సంగాలోల్లు ఏరే పాల్టోల్లు మయిలా సంగమోల్లు ఏంబయం లేదు బిడ్డలారా మీకు మేమున్నమ్ అని యిమ్మతిగున్నరు. యిగ ఆటల సంగాలోల్లు ఎటు బోయిండ్రో! యిగ గా వురుకుడు రాని వుషమ్మయితే… మీరిట్ల లొల్లి చేసి దేశం పరువు బోయేట్టు జెత్తండ్రని బంజేయండ్రని కుంగదీసే మాటలు అంటందంటే… గామెకున్న ఆటల సంగం లీడర్ గిరి పోతదేమోనని బయ పడుంటది . పెద్ద సభల ఆడ లీడర్లు మాట్లాడకున్నాగా మమతమ్మ పార్టీనుంచి ఒక్క లీడరమ్మే గీల్ల గోసకు, గోడుకు యిమ్మతిగ, గల్ల వట్టి అడిగి నట్లు మాట్లాడింది.
వోగగా సెడ్డ వీడర్ ‘ గాల్లెం చేసినా నాకేంగాదు, నామీద ఫిరాదుల్జేసినా, రోడ్ల మీద లొల్లి చేసినీ జెంతర్ మంతర్ లో ఆ ఏంచేసినా నాకేంగాదు. కోర్టుకు బోండ్రి, పోలీస్ టానా కు బోండ్రని మాట్లాడినా ఎవ్వరికి ఏం బడ్డలేదు. ఆ లీడరు మీద ఒక్కటిగాదు రెండు గాదు వందకేసులున్నయన్నమాట అయినా కూడ ఒక్కనాడు పోలీసు టానాల లేడు,జేల్లలేడు. గిట్లున్నరు లీడర్లందరు. గిన్ని కేసులున్నోన్ని కుస్తీ సంగం పెద్దమనిషి గెట్ల బెట్టిండ్రు. ఇక లొల్లి జేసే కుస్తీ ఆడ పిల్లల్ని రోజూ బెదిరిచ్చుడు, సంపుతమనీ సే జంతర్ మంతర్ నుంచి పొండ్రని బెదిరిత్తండ్రట, సంపితె సంపుండ్రి యెన్కకు బోమంటున్న బిడ్డలకు అందరం దన్నయిదాము.
కుస్తీ పోటీలల్ల దునియలు గెలిసి బిల్లలు దేస్తే ఆల్ల యిండ్లకు ఆకిల్లకు బోయి, ఆల్ల కుట్టింబాల్ని సూయించి మాట్లా డిచ్చే టీవీలోల్లకు జెంతర్ మంతర్ కాడ గాల్లు కనబడ్త లేరా జెంతర్ మంతర్ లకు పోలీసులు బోయి ఆడ పిల్లలని గూడ సూడ కుంట కొడితే కొట్టుండ్రి సంపుండ్రి మేము యీన్నించి కదలము మాకు నాయం జరిగే దాక, గాసెడ్డ లీడర్ను జేల్లేసే దాక, కుస్తే సంగం ల నుంచి యెల్లిపోయేదాకా, మా పార్టీ లీడర్ గిరి పోయేదాక మేంకదులమ్. మాబిల్లలు; అవాడులు మాకొద్దు. మీకే యిత్తము.
సారూ! మీ మాన్కీ బాత్ గాదు గా కూస్తీ పైల్వాన్ ఆడిపిల్లల మన్ కీ బాత్ గూడ జెరయినుండ్రి గాల్లడిగే నాయం జెయ్యుండ్రి.
*****
జూపాక సుభద్ర కవయిత్రి, కథకురాలు, కాలమిస్టు, వ్యాసకర్త, అనువాదకురాలు, పరిశోధకరాలు, వక్తగా, సంఘసేవకురాలు, ప్రభుత్వ ఉన్నతాధికారిణి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల సంఘంలో కీలకంగా పనిచేస్తున్నారు.
సుభద్ర గారు తెలుగు సాహిత్యంలో, మహిళా సాహిత్యంలో ఉన్న అగ్రకుల బావజాలాన్ని ప్రశ్నిస్తూ, ఆధునిక సాహిత్యంపై విమర్శ చేస్తూ దళిత, బహుజన సాహిత్యం యొక్క ఉన్నతిని పెంపొందిస్తూ రచనలు చేసున్నారు.