కథా మధురం
ఆ‘పాత’ కథామృతం-6
-డా. సిహెచ్. సుశీల
భారతదేశ స్వాతంత్య్ర సాధనోద్యమంలో స్త్రీలు కూడా చైతన్యవంతంగా పాల్గొనా లని, రాచరికపు పరదాల కాలం తీరిపోయిందని, దేశ స్వాతంత్య్రంతో పాటు స్త్రీ ‘వ్యక్తి స్వాతంత్య్రం’ కూడా అత్యవసరమని గుర్తిస్తూ ఆనాడు విస్తృతంగా వ్యాసాలు, కవితలు, కథలు వచ్చాయి.
సామాజికంగా కౌటుంబికంగా తమకున్న సంకెళ్ళను తెంచుకోవడానికి స్త్రీలు ప్రయత్నించారు. అయితే ‘మితవాద’ ధోరణిలోనే ప్రయత్నించారు. తమ అభిప్రాయా లను యధేచ్చగా భర్తతో పంచుకొన్నారు, నెగ్గించుకున్నారు. తాము విద్యావంతులై, తోటి స్త్రీలను విద్యావంతులుగా చేయటానికి, తద్వారా స్వాతంత్య్రపు ఆవశ్యకతను తెలియ జేయడానికి చిన్నచిన్న సంభాషణల ద్వారా కథలు రచించారు. స్త్రీ పురుషుల పుట్టుక ఎంత సహజమో – సమానత్వమూ అంతే సహజమని మనసారా నమ్మారు వారు. ఆ దిశగా జరిగిన నాటి స్త్రీల ‘సాహిత్య చైతన్యం’ ఈనాటికీ గౌరవనీయమైనదే.
రెండు వరాలు
1941 గృహలక్ష్మి, అక్టోబర్ సంచికలో సమయమంత్రి రాజ్యలక్ష్మి రాసిన “రెండు వరాలు” అనే కథలో నాటి స్త్రీలు దేశ స్వాతంత్య్రం పట్ల, సాంఘిక సంస్కరణల పట్ల ఎంత అవగాహన కలిగి ఉన్నారో తెలుస్తోంది. స్త్రీల విషయంలో సంఘంలో నెలకొని ఉన్న మూఢాచారాలు, ముఖ్యంగా వితంతువుల పట్ల కాఠిన్యం, పునర్వివాహం పట్ల వైముఖ్యం వంటి భావనలను తుత్తునీయాలు చేయాలన్న దృఢసంకల్పం ఉన్నదని తెలుస్తోంది.
***
సుబ్బారావుకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద పిల్లకి బాల్య వివాహం చేసి, ఆరు నెలలు తిరగకుండానే బాల్య వైధవ్యంతో పుట్టినిల్లు చేరడంతో, ఆమె కష్టాన్ని మనసులో పెట్టు కొని సుబ్బారావు రెండో కూతురు సుశీలను ఆరో ఫారం వరకు చదివించి, బిఏ చదువు కున్న కేశవరావుకిచ్చి వివాహం చేశాడు. కేశవరావుకి తల్లి గారాబం వల్ల పెంకితనం బాల్యం నుంచే పెరిగింది. రెండు పూటలా క్లబ్ కి పోవడం, టెన్నిస్ ఆడటం, సిగరెట్లు తాగడం అలవాటయ్యాయి. నిర్లక్ష్యం వల్లనో, సరిగ్గా కష్టపడకపోవడం వల్లనో ఏఉద్యోగము రాలేదు. దాంతో ‘డిప్రెషన్’ కి లోనయ్యాడు. దుర్మార్గుడు కాడు గాని నిరుద్యోగం, డిప్రెషన్ కారణాల వల్ల భార్యమీద అనుమానమూ తల్లి తనను మగమహారాజుగా చూడటం వల్ల, తనకు పని పాటా లేకపోవడం వల్ల భార్య అంటే దాసి మాత్రమే అన్న భావనలో ఒక ఆనందాన్ని పొందే మనస్తత్వం.
చదువుతో పాటు చురుకుదనము, తెలివితేటలు, స్వాతంత్రపుటూహలతో పెరిగిన సుశీల భర్తను ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది కానీ అతని పూర్వాచార పరాయణతను, స్త్రీ లంటే అతనికున్న కుంచిత భావాన్ని గమనించి బాధపడుతుంది. ఎలాగైనా ఎప్పటికైనా అతను మారతాడనే ఆశతో అతని అనుమానాన్ని, అవమానాల్ని సహిస్తుంది. కిటికీ దగ్గర నిలబడి వీధిలోకి చూసినా అతని దృష్టిలో దుర్మార్గపు పనే.
సమయం చిక్కినప్పుడల్లా – సంఘంలో పేరుకుపోయిన పాడు ఆచారాలను, స్త్రీల భావాల పై బలవంతంగా రుద్దుతున్న దౌర్జన్యాలను ఎండగడుతూ ఉంటుంది. పత్రిక లకు వ్యాసాలు రాయాలన్న తన అభిప్రాయాన్ని భర్త ముందు వ్యక్తం చేస్తే –
” ఇప్పుడు సంఘంలో నీవు దిద్దాల్సిన తప్పులేమున్నాయి” అంటాడు వేళాకోళంగా.
“స్త్రీ స్వాతంత్రం” అని ఆమె అనగానే – ” స్త్రీకి స్వాతంత్రం లేక జైల్లో పెట్టారా” అంటాడు మరింత వెటకారంగా.
“జైలు అంటే వ్యక్తి స్వాతంత్రాన్ని హరించడం. ఖైదీలు ఎక్కడకు వెళ్లేందుకు వీలు లేదు. ఎల్లప్పుడూ ఒకరు కాపలా ఉంటారు. స్త్రీకీ అంతే. ఆమె ఎక్కడకు వెళ్లేందుకు వీల్లేదు. మగవారి అనుజ్ఞకావాలి. కాకుంటే ఎవరో సాయం ఉండాలి. నిజం అవునో కాదో మీరే ఆలోచించి చెప్పండి” అన్నది ఆమె స్పష్టత.
” మన పూర్వుల ఆచారాలు మనం ఆచరిస్తున్నాం. ఇందులో తప్పేమున్నది” అన్నది అతని పలాయన వాదం.
” ఎన్నాళ్ళు ఈ ‘గానుగ ఎద్దు’ మాదిరిగా ఉండటం? అప్పటి స్త్రీలకు పారమార్థిక వాంఛ ఎక్కువగా ఉండటం వల్లా, అప్పటి పురుషులకు స్త్రీ అంటే ఇంత నిరసన భావం లేక పూజ్య భావం ఉండటం వల్లా, మనవారు ధర్మ శాస్త్రాలు సృజించేటప్పటికి దేశం పరదాస్యంలో లేకపోవడం వల్లా వారికి హక్కులతో నిమిత్తం లేకపోయింది. వారు కోరలేదు. క్రమంగా పురుషులు స్త్రీల స్వాతంత్రాన్ని అడుగున త్రొక్కారు” అంటుంది ఆమె.
“ఇప్పటి స్త్రీలు మాత్రం పారమార్థిక చింతన ఎందుకు ఉంచుకోకూడదు? వారు చేసే పనులు ఇప్పుడు మాత్రం ఏమి మిగిలిపోయాయి?” అనేది అతని మూర్ఖత్వపు వాదన.
” ఇప్పటి దేశ కాల పరిస్థితులను బట్టి స్త్రీ చేయవలసిన పనులలో స్త్రీ స్వాతంత్రం ముఖ్య అవసరం. *స్త్రీలు పరదాలు దాటి* *బయటకు వస్తేనే గాని* *స్వరాజ్యం, స్వాతంత్రం రాదు.* ఈ దేశంలో పురుషులకు మాత్రం ఉన్నదా పూర్తిగా వ్యక్తి స్వాతంత్రం? స్త్రీలను పరదాలలోంచి పైకి రానిస్తే దేశానికే మోక్షం కలగవచ్చు” అంటుం దామె.
ఆమె మాటలతో అతనిలో సక్రమమైన ఆలోచనలు మొదలయ్యాయి. మనసు ఆమె భావాల్ని గౌరవించడం మొదలైంది. ఆ సమయంలోనే గర్భవతి అయిన ఆమెను మరింత జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాడు. కానీ, తల్లి పెత్తనం ఉన్న ఆ ఇంటిలో అతనికి ఏమీ స్వాతంత్రం లేదు. నెలలు నిండుతున్నా పుట్టింటికి పంపలేదు అత్తగారు. సరియైన పోషణ లేక, ఇంటిలో చాకిరి చేసేటప్పటికి ఆమె నీరసించి పోసాగింది.
సుశీలకు పురిటి సమయం సమీపించింది. రెండు రోజులు ప్రసవ వేదన పడుతూ కష్టపడసాగింది. తానైనా స్వతంత్రించి ఆమెను పుట్టింటికి పురిటికి పంపనైతిని – అని పశ్చాత్తాప పడుతూ కేశవరావు మామ గారికి కబురంపాడు. సుబ్బారావు వచ్చి, డాక్టర్ని తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది. తన నిర్లక్ష్యానికి వెక్కివెక్కి ఏడ్చాడు కేశవరావు.
మరణం అంచులకు చేరువౌతున్నానని తెలుసుకొన్న ఆ సమయంలో కూడా సుశీల తన జీవితాశయాన్ని మర్చిపోలేదు. భర్తను రెండు వరాలు కోరింది.
” మనదేశంలో స్త్రీని భోగ వస్తువుగా చూడక ఆమె యొక్క సున్నిత హృదయాన్ని, ఉదారపూరితాలైన ఆశయాల్ని, వ్యక్తిత్వాన్ని గమనించి ఆమెకు సమాన హక్కులు ఇచ్చి దేశాన్ని, సంఘాన్ని ఉద్ధరించటం ముఖ్యఅవసరం. మీరు వివాహమాడే స్త్రీకి సమాన హక్కులు ఇచ్చి ఆదర్శకు లవడం నా మొదటి కోరిక. మీ వివాహం వితంతు వివాహంగా ఉండటం రెండవది” అంటూనే ప్రాణాలు విడిచిందామె.
ఈ కథలో సుశీల పాత్ర ద్వారా రచయిత్రి రాజ్యలక్ష్మి ఆ నాటి స్త్రీల యొక్క ఆదర్శ భావాలను వెల్లడించారు. పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు ఉండాలనీ, వితంతువులకు పునర్వివాహం ప్రోత్సహించడం, బాల్య వివాహాల వల్ల కలిగిన నష్టాలు ఈ కథలో చెప్పారు రచయిత్రి.
80 ఏళ్ల క్రితం నాటి ఇలాంటి కథలు ఈనాడు ఎవరు చదువుతారు, ఏం అవసరం? అని కొందరు అనవచ్చు.
స్త్రీల చైతన్యం కాలానికతీతంగా, క్రమానుసారంగా ఏ విధంగా వెల్లివిరిసిందో ఒక గ్రహింపుకు రావటం అవసరమే. స్త్రీల చరిత్రను క్రోడీకరించే సమయంలో సింధు నాగరికత నుండి… సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ రోజు వరకు… స్త్రీల జీవన విధానాన్ని, స్త్రీల చైతన్యాన్ని రికార్డు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ముఖ్యంగా రాజుల కాలం నాటి పరదాల వెనుక నుండి, సమర రంగంలో విజృంభించి కత్తి పట్టిన వీర నారీమణుల నుండి, దాస్యశృంఖలాలను తెంచు సమయం లో స్వాతంత్య్ర సమరంలో ‘కలం ఆయుధం’ గా చేపట్టిన కవయిత్రులను, రచయిత్రు లను స్మరించుకోవలసిన అత్యవసరం నేటి సమాజానికి ఉన్నది.
*****
వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం