కొత్త అడుగులు – 42
ఆగ్రహం ఇవాళ్టి స్త్రీ స్వరం
– శిలాలోలిత
డాక్టర్ నీలిమా వి.ఎస్.రావు అసలు పేరు తాటికొండాల నీలిమ.పుట్టింది ముదిగొండ మండలం బొప్పరం గ్రామంలో. హైస్కూలు విద్య అంతా ఖమ్మం. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ చేశారు. పాల్వంచ హోలీ ఫెయిత్ కాలేజీలో బీ.ఇడీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పీ.హెచ్.డీ చేశారు. తీసుకున్న అంశం “రాష్ట్ర శాసన సభలలో మహిళా నాయకత్వం”. (2009 – 2014) మధ్యనున్న సాధారణ ఎన్నికల పై పరిశోధన చేశారు. విలువైన వినూత్నమైన పరిశోధనాంశం ఇది. ప్రస్తుతం ఇబ్రహీం పట్నంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
గొప్ప రాజకీయ నేపథ్యంతో, ప్రాపంచిక అవగాహన ఎక్కువగా ఉండటం, రాజకీయాల పట్ల అవగాహన ఉండటం ఆ పరిశోధనలో కనిపిస్తుంది.
అంతేకాకుండా సాహిత్య వారసత్వం, వాతావరణం ఉండటం వల్ల మొదటి కవిత్వ
పుస్తకమే ‘ఆగ్రహి’ అయినా పరిణితి నిండిన కవిత్వంగా మన మధ్యకు తీసుకువచ్చింది.
నిశ్శబ్దానికి బరువెక్కువ. బలమెక్కువ. దీనికి ఉదాహరణ నీలిమే. చాలా మెత్తగా, నెమ్మదిగా ఓపిగ్గా ఉన్నట్లు కనబడుతుంది, ఆమె అంతరంగం మండుతున్న కొలిమే. సూక్ష్మమైన విషయాలు కూడా ఆమెను దాటి పోలేదు. తన నిరసనను, కోపాన్ని అసహనాన్ని ప్రకటించడమే ‘ఆగ్రహి’. ఎంత స్పష్టంగా చేప్తుందంటే ఎదుటి వాళ్ళు కన్విన్స్ కావాల్సిందే.
బహువచన రూపులైన వంశీకృష్ణ, ప్రసేన్ లు కవిత్వంలో చాలా సలహాలు ఇచ్చారంది.
నీలిమకు వంశీకృష్ణ అన్నయ్య కూడా. తండ్రి తాటికొండాల నరసింహారావు గారు
కూడా మంచి నాటక ప్రయోక్త, రచయిత, పేరున్న మనిషి. ఆయన సహాయ సహకారాలు
ఉన్నాయి. వాళ్ళ అమ్మ, భ్రమరాంబ కూతురితో ఇలా అనేదట. రెండు లైన్లు రాసినా రెండు వందల లైన్లు రాసినంతగా అభినందించే అమ్మది నా కవితా ప్రయాణంలో ప్రధాన పాత్ర అన్నది నీలిమ.
నలభై కవితలు ఉన్న ‘ఆగ్రహి’ ఒక్కో కవిత ఒక్కో ఆగ్రహ ప్రకటనగా కనిపిస్తోంది.
“నీలిమ కవిత్వంలో నడుస్తున్న చరిత్ర ఉంది. ప్రస్తుత సమాజంలో మహిళల పై
కొనసాగుతున్న దౌర్జన్యాల పై ఆగ్రహముంది. సాధారణంగా చరిత్ర రచయితలు ఎక్కువగా మగవారే ఉంటారు. మగవారి దృష్టితోనే చరిత్ర రాయబడుతుంది. మహిళా దృష్టిలో చరిత్రను తెలుసుకోవాలంటే మహిళల కవిత్వం చదవాలి. మహిళ గొంతులో సమకాలీన సమాజంలో మహిళ స్థితి కవిత్వంలో ధ్వనిస్తుంది. నీలిమ కవిత్వం కూడా అదే పని చేసింది.
ఒరిస్సాలో సంగీత పాటిల్
బీహార్లో మాయా త్యాగి
ఆంధ్రాలో రమీ జాబి
బలి పశువులు వారసులందరు
అనే వాక్యాలు చరిత్రను రికార్డు చేసిన వాక్యాలు.” అని కవి యాకూబ్ తను రాసిన
‘ముందుమాట’ లో అభిప్రాయపడ్డారు.
“ఎడారిలో గొంతు ఆర్చుకుపోయిన కొన్ని పదాలను ఏరుకొచ్చుకుని వాటికి కాస్త
చెమ్మను ఊది పొందికగా దండలల్లి మా ముందు పెట్టావు. అవన్నీ కోపపు నీడలు,బిగిసిన పిడకిలి పాయలు, మంటల సెగలు. కనుకనే నీవు ఆగ్రహి”. అని జయశ్రీమువ్వా ‘ముందు మాట’ లో అభిప్రాయపడ్డారు.
“నీలిమ భావోద్వేగాలు అనేక అనేక బహురూపులే. ఒక ఆత్మ రెండు దేహాలుగా
విడిపోయే రహస్యం తెలిసిన నీలిమ ఏదో ఒకటిగా బతికేయడానికి కాస్త ఊపిరి మాత్రమే కోరుకోదు. ఆమె ఆకాంక్ష కాస్త స్వేచ్ఛ కూడా. ఆ కాస్తా మరణమైన సరే” అని ప్రసేన్, వంశీ కృష్ణలు అభిప్రాయపడ్డారు.
ప్రేమంటే
నువ్వు రాలేదని
దిగులు
ప్రేమంటే
నువ్వు వచ్చి వెళ్ళావని
దిగులు
ప్రేమంటే
నువ్వు రావేమోనని
దిగులు
ప్రేమంటే
నువ్వు రాలేవేమోనని
దిగులు
ఈ కవిత చదవగానే “రేవతీ దేవి” గుర్తొచ్చింది.
దిగులు
దిగులు దిగులుగా దిగులు
దిగులు ఎందుకో తెలిస్తే దిగులే ఉండదు. అని తాత్వికతను వెల్లడిస్తుంది.
ఇక నీలిమ కవిత్వంలోకి వెళ్తే ఇటీవల కాలంలో వచ్చిన మంచి కవిత్వ పుస్తకమిది.
చదివేకా నీలిమ ఇష్ట సఖిగా, కవిగా మారింది. ‘నీలిమ’ అన్న పేరే నాకిష్టంగా ఉండేది. చాలా సంవత్సరాల క్రితం కవనశర్మ అనే రచయిత సీరియల్ ‘నీలిమ’ వార పత్రికలో వస్తుండేది. ఆ పేరు మీద ఇష్టం. ఆ క్యారెక్టర్ చాన్నాళ్ళు నన్ను వెంటాడింది. మళ్ళీ ఇన్నాళ్ళకు నీలిమ రూపంలో ఇలా. తనేమిటో, తన కవిత్వమెందుకో, తనేం రాసిందో, రాయడం అనేది తనలో అంతర్గత భావమై ఎలా నిలిచిందో. ‘రావు’ గారి సహచరత్వం తనకు ఎంత నేర్పిందో ఇష్టపడిందో రాస్తూ అందరి జీవితాలు తనలా లేవని మాత్రం ఆమెకు తెలిసింది. తోటి స్త్రీల జీవితాలు చాలా వరకు ఇంకా హేయంగా, దీనంగా,దౌర్జన్యాలతో, అసమానతలతో ఆవిరి కక్కుతున్నాక , చూస్తూ ఊరుకోలేకపోయి అక్షరాన్ని ఆయుధం గా చేసుకుంది.
“నేను నిగ్రహి
నేను సంగ్రహి
నేను ఆగ్రహి” – అని ప్రకటన చేసింది.
“నేను నీలిమ” అనే కవితలో
లోకం హింసకు కన్నీరై పిడచకట్టిన
చారిక అంచున పేరుకున్న
ఓదార్పు నీలిమ నేను
…….
కోపాన్ని పంటి బిగువు ఖైదు నుంచి
తప్పించి కత్తి వాదరలో మాటువేసిన
వేటు పదును నీలిమ నేను
……..
స్వీయ దహన గీతాగ్నిలో
చమురు దేహాన్ని వత్తికి నేర్పిన
దారి దీప నీలిమను నేను.
మృగ భూమి చాలా పదునైన కవిత. ఇలా ప్రతీ కవిత విలక్షణతను ప్రదర్శిస్తూ
సాగుతుంది. ఒక మంచి కవిత్వాన్ని చదివి ఆలోచింప జేయడమే కాక, ఆలోచనాగ్నులను
రగిలించే శక్తివంతమైన కవిత్వమిది.
*****