నా అంతరంగ తరంగాలు-5
-మన్నెం శారద
అమ్మమ్మ ఊరు కాకినాడ గురించి చెప్పానుకదా… ఇప్పుడు నానమ్మ ఊరు ఒంగోలు గురించి చెప్పాలి.
మా తాతగారు అమ్మ పెళ్ళికి ముందే చనిపోవడంతో మా పెదనాన్నగారే గుంటూరు లో పనిచేస్తూ ఈ సంబంధం చూశారని చెప్పాను కదా!
నాన్నమ్మకు ఈ సంబంధం ఎంత మాత్రం ఇష్టం లేదట!
“అంత పెద్ద కుటుంబం నుండి వచ్చిన పిల్ల మనతో ఎక్కడ కలుస్తుంది, వద్దు “అని చాలా గొడవ చేసిందట.
అయితే నాన్న పట్టుదలవలన మా నాన్న గారి చిన్నమ్మ, చిన్నాన్న దగ్గరుండి జరిపించారట. అయిదురోజులపెళ్ళి. ఘనంగానే జరిపించారట.
పెళ్లయ్యాక అమ్మ కూడా మా రెండో మామయ్య , అత్త, అమ్మకూడ ఒంగోలు వచ్చారట.
ఇక్కడ ఆచారవ్యవహారాలు, పద్ధతులు గోదావరి జిల్లా వాళ్ళకి అప్పట్లో చాలా వ్యత్యాసంగా ఉండేవట. ఆడవాళ్ళు సారె తీసుకుని ఊరేగింపులో పాల్గొవడం, అలా ఏవేవో…
అసలు సమస్య ఏ ఇంటికి చాలా వరకు లెట్రిన్స్ లేకపోవడం. అమ్మకు గుండె ఆగినంత పనయిందట. వెంటనే మా మామయ్య ఆ సంగతి తెలిసి ఉగ్రుడయి పోయి “బావగారూ, మీరు టాయిలెట్ వున్న ఇల్లు తీసాకనే మా చెల్లిని పంపుతాం “అని తిరుగు టపాలో అప్పటికప్పుడు హౌరా మెయిల్ లో వెనక్కి తీసుకొచ్చేసారట.
నాన్న తర్వాత రాజాపానకాల వీధిలో ఘోషా ఆస్పత్రి ఎదురుగా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అమ్మని తీసుకొచ్చేరట.
మేము అక్కడే అయిదారేళ్ళు పెరిగాం. నాకు కొన్ని కొన్ని సంఘటనలు గుర్తున్నా యి. నానమ్మ వచ్చి అప్పుడప్పుడూ మా వీధి అరుగుమీద కూర్చుని నాన్నని పిలిచేది.
కాంపౌండ్ వాల్ బయట ప్రతి ఇంటికి అరుగులుండేవి. అమ్మ” లోపలికి రండి అత్తయ్య గారూ!”అని పిలిచినా మా నానమ్మ వచ్చేది కాదు. మేం పిల్లలం వెళ్లి “నానమ్మా, ఇంట్లోకి రా!”అని బ్రతిమాలినా”మీరంతా మహారాణులు, నైసు నేను రాను “అని అక్కడే కూర్చుని నాన్నకి ఏవో చెప్పి వెళ్లిపోయేది. అవన్నీ నిష్టూరాలే!
ఇంటికి పెద్దకొడుకు.. కష్టపడి చదివిస్తే ఎక్కడో అమ్మాయిని చేసుకున్నాడనే ఆవేదన ఆమెది కావచ్చు. మా అత్తలు , బాబాయ్ లు చాలా సౌమ్యులు, గడప దాటి బయటకు వచ్చేవారు కాదు. మేం వెళ్తే బాగా ప్రేమగా చూసేవారు. నానమ్మ మాత్రం ఏదో దెప్పి పొడుస్తూనే ఉండేది “ఆడ దయ్యాలు, ఒకరికి నలుగురు పుట్టారుగా మీ నాన్నకి తెలిసోస్తుందిలే “అనేది. మేం నవ్వేవాళ్ళం. మా ఆఖరి బాబాయ్ చాలా మంచివాడు. మమ్మల్ని బాగా ఎత్తుకుని తిప్పేవాడు. కానీ అకాలంగా ఏదో జ్వరమొచ్చి చనిపోయాడు .
మా ఇంటిపక్కనే సినీనటి భానుమతిగారి ఇల్లుండేది. భానుమతి గారు అప్పటికే సీనియర్ నటి !అమ్మ ఒకసారి మద్రాస్ నుండి వస్తే చూసిందట !అయితే భానుమతి అమ్మగారు పేరు సరస్వతమ్మ గారట …ఆమె లోపలి మా ఎత్తరుగుల వరండాలోకూర్చుని భానుమతి గారు రాసిన ఉత్తరాలు అమ్మ చేత చదివించుకునేవారట. అందులో ఆమె కొంత ఘాటుగా తమ్ముళ్ళని మందలించే మాటలు రాస్తే ఆమె కన్నీళ్ళు పెట్టుకునే వారట!! మంచి సంగీత విద్వాంసురాలు ….మంచి గాత్రం కానీ చదువుకోలేదట !
ఆమె రోజూ కట్టుకునివచ్చే కంచి పట్టుచీరలకు మా అరుగు నున్నబడి మెరిసి పోతున్నదని అమ్మ జోక్ చేస్తే ఆమె నవ్వేవారట !
ఘంటాపాలెంలో వున్నప్పుడు మా తాతగారికి భానుమతిగారి తండ్రి గారికి మంచి స్నేహం ఉండేదట, ఇద్దరి పేర్లు సుబ్బయ్యే !
ఇప్పుడు మా వాళ్ళందరూ లాయర్ పేటలోనే ఇళ్లు కట్టుకున్నారు .
భానుమతి గారి చెల్లెలు మాత్రం నాకు కొంచెం గుర్తున్నారు. హై నెక్ బ్లౌజ్ లు ,బాబ్డ్ హెయిర్ ,,,నన్ను ఉప్పుమూట మోసుకుని తిరిగేవారు.
మేం గెద్దలకుంట లో వున్న త్రిలోచన, చక్రపాణి మాస్టర్ల ఇంటికి ట్యూషన్ కి వెళ్ళే వాళ్ళం. వాళ్లిద్దరూ భార్యాభర్తలు. చూసారా.. అప్పుడు నాకు సరిగ్గా ఆయిదు సంవత్సరాలు. అయినా వాళ్ళ పేర్లు కూడా నేను మరచి పోలేదు. మొదటి గురువులు కదా!
ఒంగోలు లో తరచూ భూకంపం వచ్చేది. వాళ్ళింట్లో గిన్నెలు, చెంబులు దొర్లు తుంటే, రుబ్బురోలు టకటక కదులుతుంటే మేం తెగ నవ్వేవాళ్ళం. టీచర్స్ మమ్మల్ని తీసుకుని బయటకు పరిగెత్తుతుంటే మాకు ప్రమాదం గురించి తెలిసేది కాదు.
ఒకసారి ఒక తమాషా జరిగింది.
ఒంగోలుకి తోలుబొమ్మలాడించే వాళ్ళు వచ్చారు. ఊరంతా ఒకటే సందడి!
అంతకు ముందు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇలానే తోలుబొమ్మల వాళ్ళు వచ్చినప్పుడు ఒక వైశ్యులబ్బాయి అయిదు సంవత్సరాలు ఉంటాయట.. తప్పి పోయాడట. ఆఁ అబ్బాయి తల్లిదండ్రులు వీళ్ళ దగ్గర చూసి ఆనవాలు కట్టి పట్టుకుంటే వాళ్ళు నిజం ఒప్పుకుని “మాకేం తెలుసు.. అక్కడ తప్పిపోయి దొరికితే తీసుకెళ్ళి పెంచు కున్నాం “అని చెప్పి ఆఁ అబ్బాయిని ఇచ్చేసి వెళ్లిపోయారట…
తీరా వాళ్ళు తీసుకెళ్ళి పట్టుబట్టలు కట్టబెట్టి, ఉంగరాలు, గొలుసులు వేసినా ఆఁ అబ్బాయి మీతో ఉండలేనని చెప్పి ఆఁ పెంచిన వాళ్ళదగ్గరకే వెళ్లిపోయాడట. ఈ న్యూస్ అంతా మా పనమ్మాయి మోసుకొచ్చింది.
ఆమె పేరు ముకుందిని. పేరు బాగుంది కదూ! కానీ బహు పెంకిది.
మా అమ్మ పెళ్లినాటి నుండి ఆమె ఒక్కర్తే మా ఇంట్లో పని చేసెదట. మా అమ్మా, ఆవిడ, ఉప్పూ, నిప్పు.
మా అమ్మ ఏమన్నా అంటే చాలు …..వెంటనే “నేను చెయ్యను పో పని!”అని సర్రున “రండి, నాయుడూ, రారా పంతులు “అని మా చెల్లెల్ని చంకనేసుకుని నా చెయ్యి పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లిపోయేది. మా చెల్లెలు తెల్లగా ఉంటుంది కాబట్టి పంతులు, నేను నల్లగా ఉంటానని నాయుడు! ఈమెకు కూడా నలుపు రంగు చులకనే..
ఆమె గుడిసె ముందు చాలా శుభ్రం గా ఉండేది. పేడ కళ్ళాపి చల్లిన పచ్చటి నేల, ఎర్రగా ఉన్న గోడలు, ముందు చక్కటి ముగ్గు! మాకు నులక మంచం వేసి ఉతికిన దుప్పటి పరచి దానిమీద కూర్చోబెట్టి సెనగవుండలో, పల్లీ ఉండలో ఇచ్చి కూర్చునేది.
“చూడండి, తను పనిచెయ్యకపోగా పిల్లల్ని తీసుకుపోయింది “అని అమ్మ నాన్నకి ఆఫీస్ నుండి రాగానే చెబితే నాన్న వచ్చేవారు.
“ఏంటి ముకుందిని, అమ్మ కోపం తెలిసిందే కదా, పిల్లల్ని తీసుకొచ్చేసావ్! అని కేకలేస్తే మా నాన్న వెనుక మమ్నల్ని తీసుకుని వచ్చి “ఇదిగో అయ్య పిలిచేడని వచ్చా, నిన్ను చూసి కాదు “అని బడాయిగా లోపలకొచ్చేది.
ఏడిసావ్ లే నోరుమూసుకుని పని చెయ్ “అని అమ్మ అనేది.
ఒంగోలులో నీళ్ళకి కటకట! ఆఁ బావులు లో పాతాళ లోకం కనిపించేది. లోపలంతా రాయి. ఎక్కడో ఒక మూల రాళ్ళ సందులో ఇన్ని నీళ్లు! బకెట్ వేస్తే రాళ్లకి తగిలి ఖంగున మొగేది. దానినిండా చోట్టలే “ఇక తాడు అలనాడు ఆంజనేయస్వామీ రావణాసురుడి ముందు తోక పెంచి కూర్చున్నంత! ఒక బిందె నింపాలంటే గంట పట్టేది .
ఆఁ పనిమనుషుల ఋణం ఏమిచ్చి తీర్చుకోగలం! ఎంత ప్రేమ చూపించేవారో “
గుండ్లకమ్మ వచ్చాక ఒంగోలు నీటి కష్టాలు తీరాయి. మేము మాచర్ల కు ట్రాన్ఫర్ అయి వెళ్లిపోతుంటే మా బండి కూడా స్టేషన్ దాకా వచ్చింది. “ఇదిగో, ఆ పిల్లల్ని వూరికే కొట్టిసంపబాక, “అని అమ్మని హెచ్చరించింది. మేము మా టీనేజ్ లో తిరుపతి నుండి వస్తూ ఒంగోలుకి వెళ్లి ముకుందిని ని చూసి చీర పెట్టి వచ్చాం.
మేం ఒంగోలు నుండి వచ్చేసే రోజుల్లో ఒక ఘాతుకం జరిగి మా చిన్ని స్నేహితురా లు హత్యకు గురయ్యింది. తన పేరు మంగ. మా అక్కకు బాగా ఫ్రెండ్!
ఒక రోజు వర్షపు నీటిలో మంగ ఉంగరం కొట్టుకుపోతే మా అక్కకు దొరికి తీసుకెళ్లి ఇచ్చింది, అందుకు అక్కంటే వాళ్ళమ్మగారికి చాలా ఇష్టం .
ఆ రోజు అత్యంత దురదృష్టకమైన రోజు ! మంగ బడికి పోనని మారాం చేసి అక్కతో ఆడుకుంటూ కూర్చుంది .
ఆ మధ్యాన్నానికి వాళ్ళమ్మ గారికేమి పూనిందో బడికి వెళ్ళమని పట్టుబట్టి లంచంగా తనమెడలోని ఆరుకాసుల గొలుసు మంగ మెడలో వేసింది .
మంగ అయిష్టంగానే బడికి వెళ్లిందట !
అంతే ….మరి ఇక తిరిగిరాలేదు
ఇల్లిల్లూ తిరిగి వెదికారు. పెట్రోమాక్స్ లైట్లు పెట్టి బావులూ ,చెరువులూ చూసారు .
పోలీసులు మైకుల్లో ఏమేమో చెబుతున్నారు నేను వణికి పోతూ అమ్మ పక్కలో జేరాను .
తెల తెలవారుతుండగా ఘోషా ఆస్పత్రి వెనుక గోడ దగ్గర గోనెలో చుట్టిన మంగ శవం దొరికింది ….24 కత్తిపోట్లతో..
ఒక చిన్నగొలుసు మంగ ప్రాణం తీసింది .
మా ఇంటి పక్కనవుండే బాయమ్మ అనే బొందిలి స్త్రీని అనుమానించి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు పోయారు. ఆమె ఎవరో తెలియదు. యాభయి సంవత్సరాల వయసున్న విడో .
మా పిల్లల్ని చాలా ప్రేమగా చూసి గోరుముద్దలు తినిపించేది. ఇంట్లో జామ, దానిమ్మ నారింజ చెట్లు ఉండేవి. మా అందరికి అవన్నీ ఇచ్చేది. మంగని చంపిందంటే ఎవరం నమ్మలేక పోయాం. మూడు నెలల తర్వాత అసలు హంతకులు దొరికి బాయమ్మ ని వదిలేశారు. అవమానంతో ఆమె వూరు విడిచి వెళ్లి పోయింది.
నింద పడినవారి మనసు ఎంత కకావికలమవుతుందో …ఆ బాధ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది.
అదిగోపులి అంటే …ఇదిగో తోక అనే లోకులకి నిజంతో పనేముంది! పసిబిడ్డలని రేప్ చేసి చంపుతుంటే ఏ స్పందనా లేకుండా చూసే రోజులొచ్చాయి ! మేరా భారత్ మహాన్ హై !
*****
(సశేషం)
నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.