ప్రకృతి ఎంత అద్భుతమైనది. నిన్న మొన్నటి వరకు ఆకు కనిపించకుండా గుత్తులు గుత్తులుగా విరగబూసిన పూలు, గాలికి అక్షంతల్లా రాలిపోతూ… చిగురాకులు పుట్టుకొస్తూ.. ప్రతి ఇంటి ముందు, ఇంటి ఆవరణలో , వీధుల్లో ఎటు చూసినా రంగు రంగుల పూల హరివిల్లు… ఆకుపచ్చ నేల పై పరుచుకునే రంగుల హరివిల్లు.. లావెండర్ కలర్ పూలెందుకో మరింత ఆకర్షిస్తూ..
అలా ప్రకృతిలోకి చూస్తూ డ్రైవ్ చేస్తుంటే మనసుకు కొత్త శక్తి,, జీవితం పట్ల కొత్త ఉత్సాహం.. పోతున్న నిష్కలకి అకస్మాత్తుగా ఈ రోజు కలిసిన క్లయింట్ రాఘవ గుర్తొచ్చా డు. అతని మాటలు గుర్తొచ్చాయి.
స్టూడెంట్ వీసాతో వచ్చిన రాఘవ హెచ్ 1బి 1 వీసాలోకి మారాడు. ఉద్యోగం చేస్తున్నాడు. సిటిజెన్ ని చేసుకుంటే భవిష్యత్ లో వీసా ఇబ్బందులు, గ్రీన్ కార్డు గోల ఉండదని అనుకున్నాడు. ఆదిశగా అడుగులు వేశాడు.
మాట్రిమోనిలో రిజిస్టర్ చేసుకున్నాడు. సిటిజన్ అమ్మాయిలతో మాత్రమే మాట్లాడ టం మొదలు పెట్టాడు. ఆ క్రమంలో మధురతో ఓ ఏడాది మాట్లాడాడు. ఆ తర్వాతఇద్దరూ కలిసి ముందుకు నడవాలనుకున్నారు. కోవిడ్-19 కారణంగా రాఘవ తల్లిదండ్రులు అమెరికా రాలేకపోయారు. వాళ్ళకి చదువు తక్కువ. పల్లెటూరి వాళ్ళు. వ్యవసాయ దారులు. ఆస్తిపాస్తులు మాత్రం దిట్టంగా ఉన్నాయి.
మధుర అమెరికాలో పుట్టి పెరిగిన పిల్ల. నువ్వు ఎవరిని చేసుకున్నా పర్లేదు కానీ ఇండియన్స్ ని చేసుకోమని చెప్పే తల్లి మాటలు మధురకి బాగా ఎక్కాయి. రాఘవ అందగాడు. తెలివైనవాడు. చదువులో చురుకైన వాడు మాటకారి అయిన రాఘవ ఆమెకు నచ్చాడు.
పిల్లవాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అతని తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు కాబట్టి అత్తమామల ఇబ్బంది ఉండదు.అందులో పల్లెటూరి వాళ్ళు కాబట్టి వచ్చి ఇక్కడ ఉండలేరు. ఇమడలేరు. రాఘవ తమ చెప్పు చేతల్లో ఉంటాడని ఆలోచించారు మధుర తల్లిదండ్రులు.
రాఘవ శాలరీలో మధుర శాలరీ సగం కూడా లేదు. అయినా పర్వాలేదను కున్నాడు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి లెక్కలోకి తీసుకోలేదు. ఆమె నచ్చింది. సిటిజన్ అని మాత్రమే చూశాడు.
అమెరికాలో అట్టహాసంగా జరిగింది పెళ్లి. రాఘవ తల్లిదండ్రులు ఆన్ లైన్లో చూసి తృప్తిపడ్డారు. అమ్మాయికి సంప్రదాయం ప్రకారం పెట్టవలసినవి కొరియర్ లో పంపించి సంతోషపడ్డారు.
ముప్పై ఐదేళ్ల క్రితం ఉద్యోగం కోసం హెచ్ 1బి 1 వీసాతో మాతృ దేశం వదిలిన మధుర తల్లిదండ్రులు ఇప్పుడు అమెరికన్ పౌరులుగా స్థిరపడ్డారు. మనుషులు విశాలం గా ఉంటారని అనుకున్నాడు రాఘవ. అక్కడే తప్పులో కాలేశాడని ఇప్పుడు అర్ధమై తల పట్టుకున్నాడు. అడకత్తెరలో పోకచెక్కలా సతమతమవుతున్నాడు రాఘవ.
అమెరికన్లలో వర్ణ వివక్ష, జాతి వివక్ష ఉంటుంది అంటారు కానీ మన వాళ్ళల్లో ఉన్న వివక్ష మాత్రం ఏం తక్కువ? సిటిజన్ కాదని, హెచ్ 1బి 1 వీసా వ్యక్తి అని పనివాడికంటే చాలా చులకన చేసి మాట్లాడుతున్నారని రాఘవ బాధ.
మా అత్తమామలు ఇంత ఘోరమైన మనుషులనుకోలేదు. మా వూళ్ళో మా జీతగాడిని కూడా ఇంత తక్కువ చేసి ఎప్పుడూ చూడలేదు మా వాళ్ళు బాధపడి పోతున్నాడు రాఘవ.
అతను చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఏమీ కనిపించలేదు నిష్కలకు. నిజమే, క్యాంపస్ లో తనకి అనుభవమే. ఇండియన్స్ అని చొరవ తీసుకుని పలకరిస్తే స్టూడెంట్ వీసా మీద వచ్చిన తనని చులకనగా చూసే గ్రీన్ కార్డు హోల్డర్స్ , సిటిజన్స్ విద్యార్థు లను ఎలా మరువగలదు.
తమకన్నా తక్కువ జాతిని చూసినట్లు చూసిన చూపులు కళ్ళముందు మెదిలాయి నిష్కలకు. వాళ్లంతా ఒక బ్యాచ్. స్టూడెంట్ వీసా పై వచ్చిన వాళ్ళని తమతో కలుపుకొనే వారు కాదు. బ్రిలియంట్ స్టూడెంట్ అయితే కొద్దిగా వెసులుబాటు.
హింస, దౌర్జన్యానికి, అహంకారం ప్రదర్శించడానికి, ఆధిపత్యం చెలాయించడానికి జెండర్ ఉండదేమో! అధికారం ఉన్న ఆడవాళ్లు దౌర్జన్యం మగవాళ్ల దౌర్జన్యానికి ఏమీ తీసిపోదేమో! అందువల్లే మధుర, ఆమె తల్లి అలా ప్రవర్తిస్తున్నారు, ఆలోచనలో వెళ్తున్న నిష్కల కారు స్లో అయింది.
ఎవరీవిడ ఇండియన్ మహిళ. ఆ నడి వయసు స్త్రీ చేతిలో ఒక సంచి. మన దేశంలో ఆపినట్టు చేయి ఊపుతూ కారు అపుతున్నది ఏమిటి అని ఆశ్చర్యపోయింది. ఆమెను దాటుకుంటూ జుయ్ అంటూ కార్లు దూసుకుపోతున్నాయి.
నిష్కల కారు ఆగింది .
అమ్మా.. తెలుగు వారా .. తెలుగులో అడిగింది నిష్కల
ఆ మహిళ మొహం వేయి వోల్టుల బల్బులా విచ్చుకుంది. ఆనందంగా అవునమ్మా , తెలుగు తప్ప మరో భాష తెలియదు అని చెప్పింది.
అయ్యో.. అట్లాగా.. అని ఆవిడకేసి చూస్తూ మన ఊళ్ళలో ఆపినట్లు చెయ్యి ఊపితే ఎవరూ ఇక్కడ పట్టించుకోరు. దేశం కాని దేశంలో భాష తెలియని ప్రాంతంలో ఈవిడ ఎక్కడికి పోతున్నట్లు? ఎందుకు ఆపినట్లు అని లోలోన అనుకున్నది. ఆ వెంటనే అదే మాట ఆవిడను అడిగింది నిష్కల.
ఏం చెప్పనమ్మా నా పాట్లు. మా అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకోవడం నేర్పింది. అలవాటు లేదుగా మర్చిపోయాను. మా అమ్మాయికి ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. మా ఆయన కి చేద్దామంటే ఆయన దగ్గర ఫోన్ లేదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇద్దరి మధ్యలో ఒక ఫోన్ వాడుతున్నాం. ఏం చేయాలో తెలియక కాసేపు కాళ్ళు చేతులు ఆడలేదు. ఇక ఏం చేయాలో తెలియక చేయి ఎత్తి బళ్ళు ఆపమని అడుగుతూన్నా. నా అదృష్టం బాగుండి మీరు కార్ ఆపారు సంతోషంగా అన్నదామె.
ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినప్పుడు ఎడిసన్ లో ఓ ఇండియన్ రెస్టారెంట్ పేరు చెప్పింది ఆవిడ.
ఈవిడ ఒక్కటే రెస్టారెంటు కు వెళ్తుందా.. చేతి సంచీ చూస్తే బట్టలు ఉన్నట్లుగా ఉంది అనుకుంటూ రెస్టారెంటుకా అని ఆశ్చర్యంతో అడిగింది నిష్కల.
అవునమ్మా.. రెస్టారెంటుకే. అని ఒక్క క్షణం ఆగి ఏం చెప్పనమ్మా .. ఇంత బతుకు బతికి ఇక్కడ ఈ పని చేయాల్సి వస్తోంది అని చెంగుతో కళ్ళు వత్తుకున్నది ఆవిడ.
దూసుకుపోతున్న కార్లలో వాళ్ళు వీళ్ళను వింతగా చూస్తూ పోవడం నిష్కల దృష్ణిని దాటిపోలేదు.
రండి వెళ్తూ మాట్లాడుకుందాం. మీరు చెప్పిన చోట దింపుతా అని కారు డోరు తెరిచింది నిష్కల.
ఒంట్లో శక్తి ఉంది. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేస్తారని మా అమ్మాయి అల్లుడు మా ఇద్దరికీ రెస్టారెంటు ఉద్యోగం చూపించారు. వాళ్ళిచ్చిన చిన్న గదిలో సర్దుకుంటున్నాం. నేను కూరగాయలు కోస్తాను, వంట దగ్గర సాయం చేస్తాను. మా ఆయన ఈ పని ఆ పని లేకుండా అన్ని పనులు చేస్తున్నాడు.
కూతురు దగ్గరకి వెళ్తున్నాం అని వచ్చామా .. వారం పదిరోజులు ఉన్నామో లేదో పనిలో పెట్టేశారు. ఇంతకు ముందు రెండుసార్లు వచ్చినప్పుడు మనవడిని చూసుకోవడం తో సరిపోయింది నాకు. మా ఆయన ఒకసారి వచ్చి ఇరవై రోజులుండి చలికాలం పడ లేదని తిరిగి మా వూరు వెళ్ళిపోయాడు. రెండోసారి రానని రాలేదు. ఆయనక్కడ, నేనిక్కడ చాలా ఇబ్బంది పడ్డాం.
ఈ సారి పిల్లని రమ్మంటే తనకు కుదరదని మాకు టికెట్లు పంపింది. వేసవి కాలం కాబట్టి మా ఆయన రానని చెప్పలేకపోయాడు. లేక లేక పుట్టిన బిడ్డ కదా ప్రాణం ఆయనకి. మా తాహతుకు మించి కట్నం ఇచ్చి అమెరికా సంబంధం చేశాం అని మురిసిపోయాం.
కానీ ఇప్పుడు ఇలా ..
వ్యవసాయం తప్ప మరో పని తెలియదు ఆయనకు. మనుషులను పెట్టి పని చేయించుకోవడం తప్ప మరొకరి దగ్గర పనిచేయడం తెలియదు. నాకు ఇల్లు, పాడి తప్ప మరోటి తెలియదు. ఖర్మకాలి ఇప్పుడీపని చేయాల్సొచ్చింది అన్నప్పుడామే గొంతులో బాధ ఉండలు చుట్టుకుంటూ…
కొన్ని క్షణాల మౌనం తర్వాత ఏమ్మా .. ఏం చేసుకుంటాం చెప్పు. ఈ సొమ్ము పోయేటప్పుడు ఏసుకుపోతామా.. మడిసికి ఎందుకింత ఆరాటం? ఊళ్ళో ఇబ్బంది కాకుండా ఎవరి మీద ఆధారపడకుండా బతకగల పరిస్థితి. అల్లుడు ఏం చెబితే అదే నా కూతురుకి వేదం. ఖర్చు చాలా పెరిగిపోయిందని గోల పెడుతున్నాడు. మరి మనుషులు పెరిగితే ఖర్చు పెరగదా? రమ్మన్నది వాళ్ళే. టికెట్ పంపింది వాళ్ళే… ఇంట్లో ఉండి పిల్లలకు సాయంగా ఉండగలం కానీ ఇట్లా బయట పనిచేయడం మాకు కష్టంగా ఉంది. అసలు అట్లా చేయకూడదంట కదా మొన్న కాలేజీ పిల్లడు చెప్పాడు నిజమేనా అని అడిగింది.
ఇప్పుడు చూడండి .. మీరు రాకపోతే నేనెంత తిప్పలు పడేదాన్నో .. ఇక్కడ మనిషికొక కారేసుకుని రయ్ మంటూ పోతున్నారు కానీ అరగంట నుంచి ఒక్కరు కారాపరే.. అంటూ నిట్టూర్చింది ఆవిడ
క్యాబ్ బుక్ చేసుకో అని ఇట్లా చెయ్ అట్లా చెయ్ అంటూ టకాటకా చెప్పి ఇక్కడ దింపి వాళ్ళ డ్యూటీ కి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పినప్పుడు అంతా వచ్చినట్టే , తెలిసినట్టే ఉంది. బుక్ చేద్దామంటే రాలేదు. వాళ్ళతో మాట్లాడాలన్నా భాష రాదని బుర్ర లేదు నాకు నా వాళ్ళకి. పిల్లలిద్దరూ బాగానే సంపాదించుకుంటున్నారు కదా, ఇంకా మా సంపాదన కూడా కావాలా లేకపోతే మేం వాళ్ళకు భారం అయ్యామా .. అని గుండెల్లో మెలిపెట్టే బాధని అమ్మాయితో చెప్పుకోలేం. మేం పైసా పైసా ముడేసిన వాళ్ళమే కానీ ఖర్చు చేసే వాళ్ళం కాదు. మా దగ్గర ఉన్న డబ్బుల్తో అమ్మాయి డైమండ్ కావాలంటే కొనుక్కొచ్చాము. ఇంట్లో పని చేయించుకునే మేం ఇట్లా పని చేయాల్సి రావడం చాలా చిన్నతనంగా ఉంది అంటూ మనసు లోతుల్లోని గోడు వెళ్లబోసుకున్నది ఆమె.
ఆవిడ చెప్పిన రెస్టారెంట్ నిష్కలకు తెలుసు. అప్పుడప్పుడు ఇండియన్ ఫుడ్ కోసం వెళ్తూనే ఉంటుంది. అక్కడ ఆవిడను దింపి వెళ్తున్న నిష్కలకు ఆశ్చర్యంగా ఉంది. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఇంత స్వార్థంగా ఆలోచిస్తారా డబ్బుకి తప్ప మనుషు లకు విలువ లేదా? ఆ కూతురు ఏం కూతురు? కనిపెంచిన విద్యాబుద్ధులు చెప్పించిన తల్లిదండ్రులు, తమ స్థాయికి మించి బిడ్డను అందలం ఎక్కించి తృప్తిపడే తల్లిదండ్రులకు ఆ బిడ్డ ఇచ్చిన బహుమానం వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం. సంపాదించే యంత్రాలుగా మార్చడం. తల్లిదండ్రులు దొంగచాటుగా పనిచేసి సంపాదించిన సొమ్ము లు ఇవ్వాలి కానీ వీళ్ళిక్కడ పనిచేసే విషయం మాత్రం బంధు మిత్రులు ఎవరికీ తెలియ కూడదు. తెలిస్తే తమని ఎక్కడ ఆడిపోసుకుంటారోనని భయం. ఇక్కడ ఎటువంటి పని చేసినా అది తప్పు కాదని నచ్చచెప్పి పనిలో పెట్టిన వాళ్ళకు ఇతరులకు తెలిస్తే నామోషీ.
బతకడానికి, సుఖంగా బతకడానికి కావాల్సింది సంపాదించుకోవడం తప్పు కాదు. అందుకోసం మాతృదేశం వదిలి రావడం తప్పు కాదు. కానీ సంపాదన పై ఆకలి ఎక్కువ అవడమే జీర్ణం కావడం లేదు నిష్కలకు.
ఇండియన్స్ ఎక్కడున్నా మారరేమో.. చదువుకోవడానికి వచ్చినవాళ్లు, ఉద్యోగులు గా వచ్చినవాళ్ళు అమెరికాలో మంచి ఉద్యోగాల్లో ‘స్థిరపడ్డారు. రెస్టారెంట్స్, గ్యాస్ స్టేషన్స్, బోటిక్స్, రియల్ ఎస్టేట్, డైమండ్ జ్యువలరీ రకరకాల బిజినెస్ లు చేస్తూ మిలియనీర్స్ , బిలియనీర్లుగా రూపాంతరం చెందారు. రాజకీయాల్లోనూ పాగా వేయడానికి ప్రయత్నిస్తు న్నారు. తమ పరిధిని విస్తృతం చేసుకుంటున్నారు. మాతృదేశ పౌరసత్వం కొందరు వదులు కుంటే వేలు లక్షల్లో వదులుకోడానికీ సిద్దపడుతున్నారు. అమెరికాని స్వంత దేశంగా మార్చుకుంటున్నారు. పెరిగిన ఆర్థిక భద్రత, సామాజిక హోదా, అధునాతన మైన అన్ని హంగులతో కూడిన ఇంద్రభవనాల్లాంటి విశాలమైన ఇల్లు కొంటున్నారు. అది వారి వారి ఇష్టం. అందుకు వాళ్ళను తప్పు పెట్టాల్సిన అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు.
మారిన జీవన శైలి, విస్తృతమైన అవకాశాలతో పై పైకి ఎగబాకిన కొద్దీ మనుషిలో విశాల దృక్పథం పోయి మనసులు ఇరుగ్గా మారిపోతున్నాయి. భారతదేశంలో ఉన్న కులం, మతం, ప్రాంతం, రాజకీయం, సినిమా హీరోల పై అభిమానం అన్నీ ఈ దేశానికి వచ్చినా కూడా వెర్రితలలు వేస్తున్నాయి. నలుగురిలో చులకన చేస్తున్నాయని ఆవేదన పడింది నిష్కల.
ఎటు నుంచి ఎటెటో ప్రయాణిస్తున్న నిష్కల ఆలోచనలకు ఆఫీసు నుండి వచ్చిన ఫోన్ తో బ్రేక్ పడింది .