పేషంట్ చెప్పే కథలు – 15
తపన
–ఆలూరి విజయలక్ష్మి
“చిన్నపిల్లవి. నీకు గుండె నొప్పేమిటమ్మా?! ఫిగర్ కాపాడుకోడానికని మరీ నాజూగ్గా తినక శుభ్రంగా తిను” మందులచీటీ యిస్తూ రాగిణితో చెప్పింది డాక్టర్ శృతి.
“మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మేడం. మీ పనయ్యేదాకా కూర్చుంటాను” దిగాలుపడిన ముఖంతో శృతి పనయ్యేదాకా కాచుకూర్చుంది రాగిణి.
“మీరు మా వారితో ఒక విషయం చెప్పి ఒప్పించాలి మేడం!” రాగిణి మాటలు విని గలగలా నవ్వింది శృతి.
“లవ్ మ్యారేజ్ జంట. మీరొకరినొకరు ఒప్పించుకోవడం కష్టమయి మూడో వ్యక్తి కల్పించుకోవలసిన అవసరం రావడమా?” మందలింపుగా ఆమె వంక చూసింది శృతి.
“పెళ్ళైన ఆరునెల్లకే ఆ చాప్టర్ క్లోజయిపోయింది మేడం” ఆత్మన్యూనతతో తల దించుకుని చెప్పింది రాగిణి. ఒక నిమిషం ఆగి మళ్ళీ చెప్పసాగింది.
“మాది తొందరపాటో, ఆకర్షణో, వ్యామోహమో… ఏం పేరు పెట్టాలో నాకు తెలియడం లేదు. కానీ ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి వచ్చాం. అతని రంగు, రూపు, తియ్యటి మాటలు నన్నొక విధమైన మత్తులో ముంచేసి అతనేది చేసినా అద్భుతంగా, అతనేది మాట్లాడినా అపురూపంగా కనిపించేది. ఆ మత్తులో అతను రాక్ ఫెల్లర్ కొడుకులా ఎలా బ్రతకగలుగుతున్నాడు, అతని కుటుంబం స్థితిగతు లేమిటి, నేను బ్రతుకంతా గడపవలసిన ఇంటి వాతావరణం, మనుషుల మనస్తత్వాలు ఎలాంటివి అని ఒక్కసారి కూడా ఆలోచించలేక పోయాను.” రాగిణి అత్తమామలు, ఇంట్లో వ్యక్తులు శృతికి తెలుసు. అందరూ ఏదీ దాచుకోకుండా మాట్లాడే భోళా మనుషులు. ఏంతో సహృదయులుగా, మర్యాదస్తులుగా కనిపిస్తారు. అలాంటి కుటుంబం గురించి రాగిణి ఫిర్యాదేమిటో శృతికి అర్థం కాలేదు.
“తమాషా ఏమిటంటే ఏ యింటి కోడలైనా ఆ యింటి స్థితిగతులు బాగోలేకపోతే, కనీసావసరాలు తీరకపోతే బాధపడుతుంది. నా బాధ డబ్బు ఎక్కువవడంతో వచ్చిన సమస్య.” అన్నీ విడమరిచి చెప్పడానికే పూర్తిగా నిశ్చయించుకున్నదాన్లా ఏమాత్రం సంకోచం లేకుండా తన విషయాల్ని ఏకరేవు పెడుతుంది రాగిణి.
“మా మామగారి ఉద్యోగం సంగతి మీకు తెలిసిందే గదా! పీడించి పీక్కు తినకుం డానే ముందు జాగ్రత్త కోసం ఆయనతో అవసరం వున్నవాళ్ళు తమంతట తామే కట్టలు, కట్టలు డబ్బు తెచ్చిపడేస్తారు. మొదటి నుంచి తేలికగా దొరికే డబ్బుకు అలవాటు పడిపోవడం వల్ల డబ్బు విలువ తెలియకుండా రెండు చేతులా ఖర్చు పెట్టేయడం హాబీ అయిపోయింది ఇంట్లో వాళ్లందరికీ. మీరు పురుళ్ళు పోసిన మా ముగ్గురాడపడుచులు ఈ సౌఖ్యాలనీ, స్వేచ్ఛను వదులుకుని అత్తారిళ్ళకు వెళ్ళడానికి ఇష్టపడరు. మా మామగారు తన పలుకుబడితో అల్లుళ్ళను యిక్కడికి ట్రాన్స్ఫర్ చేయించారు. మా వారు, మరిది యిద్దరూ ఎం. ఏ. పాసయి కూడా ప్రొద్దస్తమానం మోటార్ సైకిలేసుకుని ఊరు బలాదూర్ తిరుగుతూ వుంటారు. కొడుకుల్ని ఉద్యోగం సంపాదించుకుని కుదురుగా ఉండమని బుద్ధిచెప్పే బదులు ‘అమ్మా! డబ్బు’ అనగానే వందరూపాయల నోట్లు చేతిలో పెడతారు మా అత్తగారు. దాన్ని రూపాయి నోటును ఖర్చుపెట్టినంత తొందరగా, తేలిగ్గా ఖర్చుపెట్టి జల్సా చేసేస్తారు వీళ్ళు.” శృతిని ఓ పేషెంట్ గురించి అడగడానికి నర్స్ రావడంతో ఆమె వెళ్ళేదాకా ఆగింది రాగిణి.
“వెళ్ళిన నాలుగు రోజులకే ఇంటిని చూసి హడలిపోయాన్నేను. బడాబడా వాగుతూ ఉండే మనుషులు, శుచీశుభ్రం లేకుండా ఎక్కడ పడితే అక్కడ బట్టలు, సామానుతో నానా బీభత్సంగా ఉండే ఇల్లు. నేను పుట్టి పెరిగిన ఇంటికి పూర్తిగా వ్యతిరేకం. ప్రశాంతంగా, డీసెంట్ గా వుండే మనుషుల మధ్య పెరిగిన నేను ఎల్లప్పుడూ రణగొణ ధ్వనులతో, చేపల బజార్లావుండే యీ యింట్లో మెలగడానికి గాభరాపడి పోయాను… తప్పేది లేదు గనుక రాజీపడిపోవడానికి ప్రయత్నిస్తూ ఇంటిని నీట్ గా ఉంచడానికి అన్నీ సర్దసాగాను. నన్నో వింత జంతువును చూసినట్లు చూసి, తమ సహజవాతావరణం కలుషితమయి నట్లుగా బాదపడిపోయి, ఆ పనులను పొగరుమోతు పనులుగా వర్ణించి వెటకారం చేయ సాగారు” తనకు తెలిసిన వ్యక్తుల గురించి కొత్తగా తెలుస్తున్న విషయాన్ని నమ్మలేనట్లు చూస్తోంది శృతి.
“అన్నిటినీ మించి నన్ను ప్రతి నిమిషం బాధపెడుతున్న విషయం మరొకటుంది. ఇలా ఎంతకాలం సర్కస్ జంతువుల మధ్య బ్రతికినట్లు బ్రతకడం, ముందుచూపు లేకుండా ఒక్క పైసా కూడా ఆదా చేయకుండా ఎప్పటికప్పుడు ఖర్చుపెట్టేస్తున్న వీళ్లెలా బ్రతుకుతారు?… ముఖ్యంగా నీతి, నిజాయితీతో కష్టపడి పనిచేసి సంపాదించుకు తినడం మానవ ధర్మం అని మా నాన్నగారి దగ్గర్నుండి నేర్చుకున్న నేను, తేలిగ్గా వచ్చిన ఈ లంచపు తిండిని తినలేకపోతున్నాను. ఇద్దరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మయుండి, ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉజ్వలమైన బవిష్యత్తుకు పునాదులు వేసుకోవాల్సింది పోయి సోమరిపోతుల్లా, పరాన్నజీవుల్లా బ్రతకడానికి నాకసహ్యంగా వుంది. రెండు చేతులూ ఉండి కూడా అవిటి వాళ్ళలా నా బాబు భవిష్యత్తును మరొకరి చేతుల్లో వదిలేయడానికి నా ప్రాణం పోతూంది” రాగిణి గొంతు గద్గదమయి, భావావేశాన్ని ఆపుకోలేక పోయింది.
“ఇద్దరం జాబ్స్ చేసుకుని మన బ్రతుకు మనం బ్రతుకుదామని మా వారికి చెప్పి చెప్పి విసిగిపోయాను… బహుశా నేను ఆవేశంతోనో, బాధతోనో, నా బ్రతుకు నేను కోరుకు న్నట్లు లేదన్న ఉక్రోషంతోనో, చెప్పవలసిన విధంగా ఆయనకు చెప్పడం లేదేమో. అందుకే ఆయన వినడం లేదేమోనన్న అనుమానమొస్తుంది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మేడం! మీ మాటంటే మా వాళ్లందరికీ గురి. మీరంటే మా వారి కెంతో గౌరవం. మీరు నచ్చచెప్తే వింటారని ఆశతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మేడం!”
ఒక విద్యాధికుడికి ఉచిత సలహాలు, నీతిబోధలు చెయ్యడం, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో జోక్యం కలిగించుకోవడం ఎంత వరకు సమంజసమని తటపటాయించి శృతి, రాగిణి ముఖం చూసి తప్పో, ఒప్పో, సమంజసమో కాదో – అతనికి చెప్పడానికే నిర్ణయించుకుంది.
“మీ స్వశక్తిమీద మీరు బ్రతకాలనే నీ తపనను నేనర్థం చేసుకుంటున్నానమ్మా! రేపోసారి రాజుని తీసుకుని రా.” రాగిణి ముఖం పుచ్చపువ్వులా వికసించింది.
*****
డా.ఆలూరి విజయలక్ష్మి ప్రముఖ రచయిత్రి, వైద్యులు, సంఘసేవకులు. దాదాపు 150 కథలు, 5 కథా సంపుటాలు, 4 నవలలు, 3 వైద్య సంబంధ గ్రంథాలు రచించారు. అనువాదాలు కూడా చేసారు. వీరి రచనలు వివిధ వార, పక్ష, మాస, దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఆకాశవాణి విశాఖ పట్టణం, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. వనిత మాసపత్రికలో ‘ఆరోగ్య విజయాలు’ అనే శీర్షికను నిర్వహించారు.