పౌరాణిక గాథలు -6
-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి
ఆత్మజ్ఞానము – నచికేతుడు కథ
నచికేతుడి తండ్రి గొప్ప మహర్షి. ఆయన నచికేతుణ్ని యముడి దగ్గరికి పంపించా డు. అయినా కూడా అతడు చిరంజీవిగా తిరిగి వచ్చేశాడు.
అసలు మహర్షి తన కొడుకు నచికేతుణ్నిఎందుకలా చేశాడు? నచికేతుడు తన తండ్రిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. అవి అడగదగ్గవే! అయినా పిల్లలు ప్రశ్నిస్తే పెద్దవాళ్ళ కి కోపం రావడం సహజమే కదా? అదే జరిగింది.
కొడుకు తన విషయాల్లో జోక్యం చేసుకోవడం అతడికి ఇష్టం లేదు. తను చేస్తున్న దానం సరయిన పద్ధతిలో లేదంటాడా? దానం ఇస్తున్న ఆవుల్లో కొన్ని ఆరోగ్యంగా లేక పోతే తను సరిగా దానం చెయ్యనట్టేనా?
చాలా మంది అలాగే చేస్తారు. దానాలు ఇవ్వడంలో ఎంత మంది పద్ధతిగా ఉంటు న్నారు? ఎంత మంది ఉపయోగిస్తున్న వస్తువుల్నే దానం చెయ్యట్లేదు? తను ఇచ్చిన వాటిలో కొన్ని ముసలి ఆవులున్నాయి నిజమే!
వాటి గురించి నచికేతుడికి ఎందుకు? కోపం తెప్పించే ప్రశ్నలు ఎందుకువెయ్యాలి? అన్ని విషయాలు చర్చించేంత పెద్దవాడు మాత్రం కాదు, బాగా చిన్నవాడు. మహర్షి నచికేతుడి మీద బాగా కోపంగా ఉన్నాడు.
నచికేతుడు తండ్రి చేస్తున్న దానం చూశాడు. అతడి మనస్సులో ఎన్నో సందేహా లు. చిన్నవాడు కదా…తండ్రి చేస్తున్న దానం చూసి ఏదో చెయ్యాలి కదా అని చేస్తు న్నట్టుంది కాని, క్రమ పద్ధతిలో లేదు అనుకున్నాడు.
ఆ ముసలి ఆవుల్ని తీసుకుని వెళ్ళి బ్రాహ్మణులు ఏం చేసుకుంటారు? ఇటు వంటి దానాలు చేస్తున్నవాడు తనని ఎవరికి దానంగా ఇస్తాడో? అని అతడికి అనుమానం వచ్చింది.
సందేహం తీర్చుకోవాలని అనుకున్నాడు. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి “నన్ను ఎవరికి దానంగా ఇస్తున్నావు?” అని అడిగాడు.
ఆవుల్ని ఇతర వస్తువుల్ని దానంగా బ్రాహ్మణులకి ఇస్తున్నాడు. తనని ఎవరికి ఇస్తాడో అని నచికేతుడి సందేహం. తనను ఇవ్వడం వల్ల తండ్రికి ఎక్కువ ఉపయోగం. అందువల్ల చిన్నవాడైన నచికేతుడు తండ్రిని అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగాడు. అలా అడిగినందుకే తండ్రికి కోపం వచ్చింది.
“నిన్ను మృత్యువుకి దేవుడయిన యమధర్మరాజుకి కానుకగా ఇస్తాను!” అన్నాడు నచికేతుడి తండ్రి. అన్నాడు! అంటే ఇచ్చేసినట్టే! ఆ రోజుల్లో ఒక మాట అన్నారు అంటే అది జరిగి పోయినట్టే.
నచికేతుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. “నా వయస్సు వాళ్ళతో పోలిస్తే నేను అందరి కంటే బాగా చదువుతున్నాను. ఒకవేళ అందరి కంటే బాగా చదవక పోయినా తెలివితేటల్లో అందరితో సమానంగానే ఉన్నాను. నన్నే ఎందుకు చచ్చిపొమ్మని పంపేస్తున్నారు?” అలోచిస్తున్నాడు.
చిన్నవాడైన నచికేతుడికి తనకి ముందు ముందు చాలా కష్టాలు ఉన్నట్టు అనిపించింది. తన సొంత తండ్రే తనని అక్కర్లేదని అనుకుంటున్నాడు. సహాయం చెయ్యడానికి తనకి ఇంక ఎవరుంటారు?
అయినా తండ్రి మాట అనేశాడు కాబట్టి ఆయన తన మాటని నిలబెట్టుకోవాలి. కనుక, తను యముడి దగ్గరికి వెళ్ళే తీరాలి. మళ్ళీ తండ్రితో చెప్పించుకోకుండా తనకు తానుగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.
నిర్ణయించుకున్నట్టే వెంటనే బయలుదేరి యముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందు కంటే నచికేతుడు తన తండ్రికి సహాయ పడాలని అనుకున్నాడు.
ఆ చిన్న బ్రాహ్మణ పిల్లవాడు యముడి ఇంటి దగ్గరికి వెళ్లాడు. ఆ సమయానికి యముడు ఇంటి దగ్గర లేడు. అందువల్ల అతడు యముడి ఇంటి గుమ్మం దగ్గర యముడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.
మూడు రోజులు గడిచిపోయాయి. కోపంగాని, చిరాకుగాని లేకుండా ఓర్పుతో యముడి కోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చున్నాడు. అతడి ఓర్పు యముడికి నచ్చింది.
ఆ రోజుల్లో గొప్ప చక్రవర్తి అయినా సరే, దేవతలయినా సరే బ్రాహ్మణులని తప్పని సరిగా గౌరవించేవాళ్ళు. అన్ని విషయాలు తెలిసిన యముడు, అంత గొప్ప పదవిలో ఉండి కూడా నచికేతుణ్ని చూసి గౌరవంతో పశ్చాత్తాప పడ్డాడు.
మూడు రోజులు గుమ్మం దగ్గర తన కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉన్న నచికేతు డు చిన్నవాడైనా బ్రాహ్మణ బాలుడు. కనుక, ముందు అతడికి క్షమాపణ చెప్పాడు. అతడి ఓర్పుకి మెచ్చుకుని మూడు వరాలు ఇచ్చాడు.
మొదట తను క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళాలని అనుకుని నచికేతుడు తను ఇంటికి తిరిగి వెళ్ళాక తండ్రి, ఇతర బంధువులు తనని ఆదరించాలని మొదటి వరాన్ని కోరుకున్నాడు.
ఎందుకంటే అక్కడున్న వాళ్ళు తనని చూసి “చచ్చిపోయినవాడు తిరిగి రాలేడు కనుక వచ్చిన వాడు దెయ్యం” అనుకునే ప్రమాదం కూడా ఉంది అనేది అతడి ఆలోచన.
రెండో కోరికగా నచికేతుడు స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో చెప్పమన్నాడు. యముడు ఆ రహస్యం ఏమిటో నచికేతుడికి వివరించాడు.
ఈ రహస్యాన్ని ప్రత్యేకమయిన అగ్నుల వల్ల పొందగలరు. తను చెప్పగానే మొత్తం నేర్చుకున్న నచికేతుణ్ని గౌరవిస్తూ యముడు ఆ ప్రత్యేకమైన అగ్నికి ‘నచికేతాగ్ని’ అని పేరుపెట్టాడు.
తరువాత నచికేతుడు మనిషి మరణించాక మిగిలేది ఏమిటో దాన్ని గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. కొందరు మరణం తరువాత ఏమీ ఉండదనీ… మరి కొందరు మరణం తరువాత అత్మ మిగిలే ఉంటుందనీ… అంటున్నారు. కనుక, దాన్ని గురించి వివరించి చెప్పమని యముణ్ని అడిగాడు.
మొదట యముడు దాన్ని గురించి చెప్పడానికి అంగీకరించలేదు. నచికేతుడికి సంపదలు, ఆరోగ్యము, సంతోషము, రాజ్యము, చక్రవర్తిత్వము, ఎక్కువ కాలం ప్రపంచం లో జీవించ గలగడము వంటి కోరికలు అడగమని చెప్పాడు.
నచికేతుడు అందుకు అంగీకరించలేదు. అతడు చాలా తెలివితేటలు కలవాడు. వీటన్నింటి కంటే ఆత్మను గురించి తెలుసుకోవడమే తనకి ఇష్టమని యముడితో అన్నాడు.
యముడు నచికేతుడికి నచ్చచెప్పాలని ప్రయత్నించాడు. అతణ్ని అనేక విధాలుగా పరీక్షించాడు. నచికేతుడిలో ఎటువంటి మార్పూ లేదు. తనకు పరమాత్మను గురించిన జ్ఞానమే కావాలని పట్టు పట్టుకుని కూర్చున్నాడు.
నచికేతుడి పట్టుదలకి సంతోషించిన యముడు అటువంటి శిష్యుడు దొరికినందు కు అనందపడ్డాడు. నచికేతుడికి పరమాత్మను గురించిన జ్ఞానాన్ని ఉపదేశించాడు.
ఏ మార్పులూ లేని పరమాత్మే గొప్పదని, అదే నిత్యమని చెప్పాడు. మరణం శరీరానికే గాని, ఆత్మకు లేదని వివరించాడు. యముడు నచికేతుడికి చెప్పడం వల్ల, నచికేతుడు తన శిష్యులకి చెప్పడం వల్ల పరమాత్మను గురించి లోకానికి కూడా తెలిసింది.
నచికేతుడు తిరిగి వెళ్ళడానికి బయలుదేరాడు. యముడికి సంతోషంగా ఉంది. నచికేతుడి వంటి శిష్యుడు దొరకడం వల్ల పరమాత్మ గురించి ప్రపంచానికి తెలియ చెయ్యడానికి వీలు కలిగింది.
తన దగ్గర పొందిన జ్ఞానాన్ని తన శిష్యుల ద్వారా నచికేతుడు లోకానికి తెలియ చెయ్యగలడు. నచికేతుడు ఎంతో గొప్ప జ్ఞానము, మంచితనము కలవాడు.
నచికేతుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. పరమాత్మ గురించి పూర్తిగా తెలిసి న యముడి ద్వారా తను జ్ఞానాన్ని పొందగలిగాడు. యముణ్నే గురువుగా పొందడం తన అదృష్టంగా భావించాడు.
అంతే కాదు మరణాన్ని కూడ గెలిచాడు. ఆ సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడి తండ్రి, బంధువులు ఎంతో సంతోషంతో అతణ్ని ఆహ్వానించారు.
చిన్న బాలుడు మనుషులకి సంబంధించిన గొప్ప జ్ఞానాన్ని లోకానికి తీసుకుని వచ్చాడు. ఒకవేళ నచికేతుడు యముడు చూపించిన ప్రపంచానికి సంబంధించి ఆశలకి కనుక లోబడి ఉంటే కథ వేరొక విధంగా ఉండేది. చిన్నవాడయినా నచికేతుడు ఏ కోరిక లకీ లోంగలేదు.
తండ్రి మాట నిలబెట్టడం కోసం యముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. యముణ్ని గురువుగా చేసుకుని ఆత్మ, పరమాత్మల గురించిన జ్ఞానాన్నిపొందాడు… ప్రపంచానికి బోధించాడు… చిరంజీవిగా మిగిలాడు.
అన్ని సంపదలకంటే జ్ఞాన సంపద గొప్పది!
*****