విజ్ఞానశాస్త్రంలో వనితలు-5
ఆగిపోని నదీ ప్రవాహం – కమలా సొహొనీ (1912-1997)
– బ్రిస్బేన్ శారద
కొందరుంటారు. వాళ్ళని ఆపాలని ప్రయత్నించటం నిష్ప్రయోజనం. నేలకేసి కొట్టిన బంతి రెట్టింపు వేగంతో ఎలా పైకొస్తుందో అలాగే వాళ్ళని ఆపాలని ప్రయత్నించిన కొద్దీ ముందుకెళ్తారు. వారిని చూసి ఆరాధించి, అబ్బురపడి, స్ఫూర్తిని పొందడమే మన వంతు.
అటువంటి వైజ్ఞానికవేత్త మన దేశానికి చెందిన కమలా సొహొనీ. భారత దేశంలో పీహెచ్‌డీ పట్టా చేజిక్కించుకున్న మొట్టమొదటి మహిళ కమలా సొహొనీ. ఆడవారికి ఎమ్మెస్సీ చదవడానికి సీటు లేదన్న చొటే చదివి, ఆ పైన పీహెచ్‌డీ పట్టా కొట్టి మరీ గెలిచిన ధీర వనిత. ఇంతకీ ఆమెకి ఎమ్మెస్సీ సీటివ్వొద్దన్నది ఇంకెవరో కాదు, ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞుడూ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ తో సహా ఎన్నో సైన్సుపరిశోధనాలయాల స్థాపకుడూ, నోబెల్ బహుమతీ, భారత రత్న పురస్కార గ్రహీత చంద్రశేఖర వెంకట రామన్ గారు (Sir C.V.Raman) !
ఈ విచిత్రం మనం చాలా సార్లు చూస్తాం. వారి వారి వృత్తిలో, వారి వృత్తికి సంబంధించిన విషయ పరిజ్ఞానంలో మహా మేధావులై ప్రపంచం చేత కీర్తించబడేవారికి వ్యావహారిక ప్రపంచానికి వచ్చేసరికి చాలా నేలబారు అభిప్రాయాలు కలిగిన వారై, వారితో దగ్గరగా నివసించేవారి గౌరవానికి ఏమాత్రం పాత్రులు కాకపోవడం, మనం నమ్మలేక పోయినా చాలా తరచుగా జరిగే విషయమే.
ఉదాహరణకి, ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశాన్ని లెక్క కట్టటానికి “ఆయిల్ డ్రాప్” ప్రయోగాన్ని చేసి, 1923లో నోబెల్ బహుమతి గెలుచుకున్న అమెరికన్ శాస్త్రవేత్త రాబర్ట్ మిలికాన్ గురించి తెలుసుకుందాం. భౌతిక శాస్త్రంలో సాటిలేని మేధస్సు, ప్రయోగాల నేర్పూ కనపర్చిన మిలికాన్ వ్యక్తిగత అభిప్రాయాలు చాలా జాత్యహంకారంతో నిండి వుండేవి. చాలాసార్లు ఆయన స్త్రీలకి భౌతిక శాస్త్రం చదవడానికి సీట్లివ్వడానికి నిరాకరించారు. “యూజెనిక్స్” అనే శాస్త్రాన్ని అభివృధ్ధి పర్చడానికి చాలా డబ్బూ, మాట సాయమూ చేసారు. ఈ యూజెనిక్స్ అనే “శాస్త్రం” మానవాళికి ఎంతో అవమానకర మైనదనీ, ఇటు వంటి శాస్త్రాల్లో పరిశోధన వల్ల జాత్యహంకారాలు పెచ్చుమీరిపోతాయనీ గ్రహించిన ప్రభుత్వాలు ఎప్పుడో కలగజేసుకొని చట్టాల ద్వారా ఇటు వంటి శాస్త్రాల అధ్యయనాలని నిరోధించాయి. రెండేళ్ళ క్రితం కాల్‌టెక్(Caltech) యూనివర్సిటీ అధికారులు తమ లైబ్రరీకి పెట్టిన మిలికాన్ పేరును ఉపసంహరించుకుంది.
“ఆ కాలంలో వున్న ఆలోచనా ధోరణి అటువంటిది, దానికి వారిని తప్పు పట్టి లాభం లేదు,” అనే వాదన సరైనది కాదు. తమ మేధస్సుకి లభించిన అవార్డులూ, హారతులూ తీసుకున్నప్పుడు, తమ తప్పుడు అభిప్రాయాలకి వచ్చిన ఆక్షేపణలూ స్వీకరించాలి కదా?
***
కమల 1912 లో మధ్య ప్రదేశ్ లోని ఇండోర్‌లో జన్మించారు. నారాయణ రావ్ భగవత్ ఆమె తండ్రి. (ఆమె తల్లి పేరు ఎన్ని పేపర్లు పుస్తకాలు వెతికినా దొరకలేదు!) ఆమె తండ్రీ, పిన తండ్రి మాధవరావ్ భగవత్ ఇద్దరూ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో కెమిస్ట్రీ చదువుకున్నారు. (ఇప్పుడు ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, IISc). ప్రముఖ మరాఠీ రచయిత్రి, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దుర్గా భగవత్ ఈమె అక్క గారు. 1933లో కమల బొంబాయి యూనివర్సిటీలో భౌతిక శాస్త్రమూ, రసాయన శాస్త్రమూ చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యారు.
తండ్రిలాగే తనూ టాటా ఇన్స్టిట్యూట్‌లో రసాయన శాస్త్రంలో పరిశోధనలకి అవకాశం కోసం దరఖాస్తు చేసారు కమల. కానీ, ఆడపిల్లలకి రసాయన శాస్త్రంలో సీటివ్వమని నిరాకరించింది ఇన్స్టిట్యూట్ యాజమాన్యం. అప్పటి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఇందాక మనం చెప్పుకున్నట్టు, నోబెల్ బహుమతి గ్రహీత శ్రీ సి.వి.రామన్. అయితే కమల ఈ అన్యాయాన్ని ఎదిరించారు. ఆమె ఇన్స్టిట్యూట్ యాజమాన్యం తమ నిరాకరణ కు కారణాలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరుతూ, ఆ కారణాలు చెప్పేంత వరకూ రామన్ గారి ఆఫీసు ముందు సత్యాగ్రహం మొదలు పెట్టారు. ఆయనకి దిగిరాకతప్పలేదు. ఏమ్మెస్సీలో చేరి చదువుకుంటూ పరిశోధనలు చేయడానికి “తాత్కాలిక” అనుమతి ఇచ్చారు, కానీ, బోలెడన్ని నిబంధనలు విధించారు.
అందులో ముఖ్యమైనవి మూడు.
- ఆమెకి ఈ ఫెలోషిప్ అవకాశం ఒక సంవత్సరం మాత్రమే వుంటుంది. ఈ సంవత్సరంలో ఆమె చేసిన పరిశోధన ఇన్స్టిట్యూట్ యాజమాన్యాన్ని మెప్పిస్తే, ఫెలోషిప్ పొడిగిస్తారు.
- తన పరిశోధన పర్యవేక్షించే ప్రొఫెసర్ ఎప్పుడు రమ్మన్నా ఆమె రావడానికి సిధ్ధంగా వుండాలి. అంటే, “నేను ఆడపిల్లని, ఈ సమయంలో రావడానికి కుదరదు”, లాటి సాకులు చెప్పకూడదన్నమాట.
- తన చుట్టూ పని చేసుకుంటున్న ఇతర మగ విద్యార్థులతో స్నేహం, చనువూ పెంచుకొని వారి ధ్యాస భగ్నం చేయకూడదు.
ఈ నిబంధనలు అర్థం లేనివే కాదు, ఎంతో అవమానకరమైనవి అని వేరే చెప్పక్కర్లేదు. అయితే, కమల ఈ నిబంధనలకి లోబడి పని చేయడానికి ఒప్పుకుని పరిశోధన మొదలు పెట్టారు.
ప్రొఫెసర్ శ్రీనివాసయ్య గారి పర్యవేక్షణలో కమల పాలూ, పప్పు దినుసులూ వంటి ఆహార పదార్థాలలో వున్న ప్రొటీన్ల గురించి పరిశోధన ప్రారంభించారు.ఈ పరిశోధనకి ఆమెకి బయోకెమిస్ట్రీలో ఎమ్మెస్సీ డిగ్రీ ఇచ్చింది ఇన్స్టిట్యూట్. ఆ పైన కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేయడానికి ఆమెకి ప్రవేశం దొరికింది.
కేంబ్రిడ్జిలో పరిశోధనల్లో భాగంగా కమల ఆలుగడ్డల్లోని ప్రోటిన్లను అధ్యయనం చేసి అందులో సైటోక్రోం-సి అనే ఎంజైము వుందని నిర్ధారించారు. ఈ పరిశోధనకి పీహెచ్‌డి డిగ్రీ లభించింది. ఈ పరిశోధన ఆమె కేవలం పధ్నాలుగు నెలల్లోనే పూర్తి చేసి, నలభై పేజీల థీసిస్ వ్రాసి సబ్మిట్చేసారు. దీంతో కమల కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి విజ్ఞాన శాస్త్రంలో పీహెచ్‌డీ పొందిన మొదటి భారతీయ మహిళ అయ్యారు.
ఇంకొన్ని పరిశోధనల అనంతరం ఈ సైటోక్రోం-సి అనే ఎంజైము, ఒక్క ఆలుగడ్డ లోనే కాక, మిగతా మొక్కల్లోనూ వుంటుందనీ, ఈ ఎంజైము వల్లనే మొక్కలు శక్తి తయారు చేసుకుంటున్నాయనీ కనుక్కున్నారు కమల. ఆ తరవాత ఇంకా జరిగిన ఇతర పరిశొధనల వల్ల ఈ ఎంజైము మానవ శరీరంలో కూడా శక్తి తయారు చేయడానికని వుంటుందని కనుక్కున్నారు.
***
1939లో పీహెచ్‌డీ పట్టాతో భారత దేశం తిరిగొచ్చిన కమల, న్యూడిల్లిలోని లేడీ హార్డింగర్ కళాశాలలో బయో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్‌లో పరిశోధన మొదలుపెట్టారు. 1947లో కమలా భగవత్ ఎం.వి.సొహోనీని వివాహమాడి ముంబైలో స్థిరపడ్డారు. ముంబైలోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో (ప్రస్తుతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ముంబై) బయోకెమిస్ట్రీ విభాగంలో చేరారు. అక్కడ ఆమె చేసిన పరిశోధన వల్ల, ఎన్నో ఆహార పదార్థాలల్లోని పోషకాహార విలువల గురించిన వివరాలు వెలువడ్డాయి. అంతేకాక, ఆయా ఆహార పదార్థాలలోని పోషకాహార విలువలు మెరుగుపరిచేటందుకు ప్రయోగాలూ, విధానాలు కనుక్కోవడం సాధ్యమయింది. దీని వల్ల పోషకాహార లోపంతో బాధపడే ఎంతో మంది పేదలకి మెరుగైన పోషకాహారం వున్న పప్పు దినుసుల వంగడాలు పండిచడం సాధ్యపడింది.
ఆమె పరిశోధనల్లో ఎంతో ముఖ్యమైనదీ, పేదలకు ఎంతో మేలు చేసిందీ, “నీరా” అన్న తాటి పూల రసం. తాటి పళ్ళ నుంచీ, తాటిముంజల నుంచీ తీసే కల్లు గురించి అందరికీ తెలుసు. అయితే, తాటి పూల మొవ్వు నుంచి తీసి తయారు చేసే నీరా అనే పానీయంలో విటమిన్లు సమృధ్ధిగా వుంటాయని కమల చేసిన పరిశోధనల వల్ల తేలింది. కానీ ఈ నీరా చాలా త్వరగా పులుపెక్కి కల్లుగా మారుతుంది. అందుకని అది తీసిన మూణ్ణాలుగు గంటల్లోనే తాగాలి. వెనకబడిన ప్రాంతాలూ, గిరిజనుల్లోనూ వున్న పిల్లలూ, గర్భిణీలకు ఈ పానీయం ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యం చాలా మెరుగుపడింది. ఈ నీరా పరిశోధనా ఫలితాలకుగానూ కమలా సొహోనీకి రాష్ట్రపతి పురస్కారం లభించింది. ఇంత పేరు ప్రఖ్యాతులు గడించినప్పటికీ ఆమె ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ పదవి అధిరోహించడానికి చాలా కాలం పట్టింది. డైరెక్టర్ పదవి నుంచి ఆవిడ 1969 ప్రాంతల్లో పదవీ విరమణ చేసారు.
అయితే ఆ తరవాత దాదాపు ఇరవై యేళ్ళు ఆవిడ రకరకాల కార్య కలాపాలతో తీరుబడి లేకుండా వుండేవారు. మరాఠీ భషలోసైన్సు గురించిన పుస్తకాలూ వ్యాసాలూ వ్రాసేవారు. మార్కెట్లలో లభ్యమయ్యే ఆహారా పదార్థాల నాణ్యతను పరిరక్షించేందుకు ఆవిడ ఇంకొక ఎనమండుగురు స్త్రీలతో కలిసి “కన్స్యూమర్ గైడెన్స్ సొసైటీ (Consumer Guidance Society) ” స్థాపించి నడిపారు. తాము కొనుక్కునే ఆహార పదార్థాల నాణ్యతనీ, కల్తీని అంచనా వేసేందుకు గృహిణులకి అందుబాటులో వుండే చిన్న కిట్ (పనిముట్ల సముదాయం) తయారు చేసారు.
1997 లో, అంటే ఆమెకి ఎనభై అయిదేళ్ళ వయసులో ఆమెని ప్రభుత్వం “నేషనల్ అవార్డ్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఎండ్ కంట్రిబుషన్ టు సైన్స్ (National Award of Excellence and Contribution to Science)” అనే అవార్డుతో సత్కరించారు. ఆ అవార్డు ప్రదానోత్సవం లో ఆవిడ స్టేజీ మీదే కూలబడిపోయారు. ఆ తరవాత కొద్ది రోజూలకే మరణించారు.
సౌమ్యంగా ప్రవర్తిస్తూ, తన చుట్టూ వున్న పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ, అనుకున్నది సాధించే వరకూ ఆగిపోని డాక్టర్ కమలా సొహొనీ, ఎంతో మంది స్త్రీలకి ఆదర్శం కావడం సహజమే.
*****
ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు వ్రాస్తూ వుంటారు. 1996 లో మొదలైన కథా రచనతో దాదాపు నలభై తెలుగు కథలు, ఇరవై అనువాద కథలూ ప్రచురించారు.
“నీలాంబరి”, “మలయ మారుతం” పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువరించారు.. “వీలునామా” అనే అనువాద నవలా, “తమసోమా జ్యోతిర్గమయా” అనే తెలుగు నవలా కినిగెలో ఉచితంగా లభ్యమవుతున్నాయి. “శంకరాభరణం” అనే అనువాద కథల సంపుటి ఆర్కైవ్ డాట్ ఆర్గ్ లో ఉచితంగా లభ్యమవుతుంది.
ధన్యవాదాలు, శేషారత్నం గారూ, చంద్రశేఖర రావుగారూ.
ఈ శీర్షికన ఇటువంటి ఇన్స్పైరింగ్ శాస్త్రవేత్తల జీవిత గాథల్ని పరిచయం చేయడమే నా ఉద్దేశ్యం. దానివల్ల ముందుగా ఆడవారికి విజ్ఞాన శాస్త్రంలో పెద్ద నైపుణ్యం వుండదు అనే తప్పు అభిప్రాయాన్ని కొంతవరకైనా ఎదుర్కోవాలన్నదే నా ఆశ. ఆ పైన ఇటువంటివారి వృత్తి నైపుణ్యాల గురించీ, జీవితాల గురించి చదివి ఆడపిల్లలు సైంటిస్టులు కావడానికి ముందుకొస్తే, అది బోనస్.
శారద(బ్రిస్బేన్)
విజ్ఞాన శాస్త్రంలో వనితలు శీర్షికన బ్రిస్బేన్ శారద గారి కమలా సోహానీ గారి పై వ్యాసం స్త్రీజాతి కి ఎంతో ఆదర్శ ప్రాయం. గా ఉంది. కమల గారి పట్టుదల నిరంతర కృషి ఆమె ను ఉన్నత శిఖరాలను అధిరోహింప జేసింది. ఎందరో నారీ శిరోమణులను పరిచయం చేస్తున్న నెచ్చెలి కి ధన్యవాదాలు .
తెలియని విషయాలు చాలా తెలిశాయి
అభినందనలు