వెనుతిరగని వెన్నెల(భాగం-47)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ” ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసయ్యి, జే.ఆర్.ఎఫ్ సాధించి,పీ.హెచ్.డీ లో జాయినవు తుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. ఎన్నో రోజులు పోరాడి, తన్మయి చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది. హైదరాబాదు కు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా మళ్లీ ఎదురవుతాడు.
***
విశాఖపట్నం నించి తిరిగొచ్చిన మర్నాడంతా “ఆదివారం వస్తున్నాను” అన్న ప్రభు మాటలే చెవిన తిరుగుతూ ఉన్నాయి.
అతనికి తన గురించి ఏం తెలుసని?
చిన్నప్పుడెప్పుడో తనతో కలిసి చదువుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత తను ఒంటరిగా జీవితాన్నీదడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు.
ఈ మధ్య అసలేం జరిగిందో, ఎందుకు తను ఒంటరిగా ఉండాల్సి వస్తూందో అతనెప్పుడూ అడిగి తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు.
మరి అది అతని సంస్కారమో, ఆసక్తి రాహిత్యమో.
కొంతైనా ఊహించి ఉంటాడనేది వాస్తవం, కానీ ఏం ఊహించుకుంటున్నాడనేది ఆలోచించడం ఇష్టం లేదు.
ప్రభు రాగానే ఖరాఖండీగా అదే అడిగేసింది తన్మయి.
“ఏం తెలియాలి?” అని తిరుగు ప్రశ్న వేసాడు.
“నా గతం గురించి…” అంటూ చెప్పబోతున్న తన్మయిని మధ్యలోనే ఆపుతూ “నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు” అన్నాడు.
“అంటే తెలుసుకోవాలన్న ఆసక్తి లేదా, ఇష్టం లేదా?” అంది రెట్టిస్తూ.
“అవసరం లేదు” అంటున్నాను అన్నాడు స్థిరంగా ఒత్తి పలుకుతూ.
అయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది.
“నేను ఎన్ని బాధలు పడ్డానో తెలిస్తే నువ్వు నా వెంట ఇలా పడవు. ఇప్పుడిప్పుడే నా హృదయం కాస్త కాస్తగా కోలుకుంటూంది. నేను దేనికీ సిద్ధంగా లేను.” అంది తన్మయి.
మాటల్లో అతన్ని ఏకవచన ప్రయోగం చేసిందన్న విషయం చప్పున గుర్తు వచ్చి “మీరు…” అంది సర్దుకుంటూ.
“వద్దు. నువ్వు అనే అను తనూ” అన్నాడు గద్గదికంగా.
చప్పున అతని వైపు ఆరాధనగా చూసి వెంటనే కళ్లుదించుకుంది.
తనకి ఆ పిలుపు ఎంతిష్టమో అతనికి అర్థమయినట్లు “తనూ, నీకు చెప్పాలనిపిస్తే చెప్పు. అలాగైనా నీ బాధ తగ్గుతుందేమో” అన్నాడు ఎదురుగా గోడకి జేరబడి కూచుంటూ.
తన్మయి జీవితంలోని ఒక్కొక్క అధ్యాయమూ మెల్లిగా చెప్తూ ఉండగా తన కళ్లలోకే చూస్తూ వినసాగేడు.
“….అలా చివరికి నా జీవితం ఈ ఊరికి చేరింది” అని తన్మయి ముగించగానే
“శభాష్ తనూ! నీ గాథ వింటున్నంతసేపూ నాకు నచ్చినదేవిటంటే ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలకుండా నువ్వు ధైర్యంగా చెప్పిన విధానం. అంతటి దారుణ జీవితాన్ని అవలీలగా దాటి రాగలిగిన నీ స్థయిర్యానికి జోహార్లు. ఐ అడ్మయిర్ యూ. అని ఒక్క క్షణం ఆగి ఊపిరి తీసుకుని, “మనం పెళ్లి చేసుకుందాం” అన్నాడు స్థిరంగా.
తన్మయి అదిరిపడింది.
“పెళ్లి” అనే మాటే తనకు చేదు జ్ఞాపకం. ఒక్కసారిగా దు:ఖం చుట్టుముట్టింది.
“అయ్యో, నేనూ నీకు దు:ఖం తెప్పిస్తున్నానా?” అన్నాడు ఆదుర్దాగా దగ్గరకు జరిగి.
“వద్దు ప్రభూ, నా నించి దూరంగా వెళ్లిపో” అంది కళ్లనీళ్లతో అతన్నించి దూరంగా జరుగుతూ.
“ఎందుకు వెళ్లాలి?” అన్నాడు మొండిగా.
తన దగ్గిర సరైన సమాధానం లేదని తన్మయికీ తెలుసు.
“ఎందుకంటే నా మనసు ఇంకా కోలుకోలేదు. ఎప్పటికి కోలుకుంటుందో తెలీదు. పైగా నాతో జీవనం వల్ల నీ జీవితమూ ములగడం నాకిష్టం లేదు. నువ్వు నా గాథ విన్న ఆవేశంలో నా మీద జాలితో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. పైగా మనిద్దరి కుటుంబాలూ హర్షించవు, ఒప్పుకోవు. ఇవన్నీ నాకు సుతరామూ ఇష్టం లేవు. నిరంతరం పోరాడి అలిసిపోయాను. ఇక నా వల్ల కాదు. దయచేసి నన్ను వొదిలి ఇప్పుడే వెళ్లిపో” అంది రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తూ.
“నేనేదో ఆవేశంలో నిన్ను పెళ్లి చేసుకుంటానన్నానని అనుకుంటున్నావు కదూ! ఇదంతా ఆవేశం కాదు, నిజమని నన్నెలా నిరూపించమంటావు?” అన్నాడు మరింత స్థిరంగా.
“అయినా నా గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు, బాబు మాటేవిటి?” అంది తీక్షణంగా.
“వాడు నీ శరీరంలో భాగం, వాడూ నీతో సమానం నాకు” అన్నాడు అంతే తీక్షణం గా.
“ఊహూ. నువ్వు నా మీద జాలితోనూ, సానుభూతితోనూ తాత్కాలిక ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావు” అంది మళ్లీ.
“అలాగా, బహుశా: నేను ఇప్పుడు చెప్పడం వల్ల నీకు ఆ అభిప్రాయం కలుగుతున్న ట్లుంది. చెప్పు నన్నేం చెయ్యమంటావో” అన్నాడు.
ఒక్క నిమిషం ఆగి “తాత్కలికంగా అతన్ని అక్కణ్ణించి పంపివేయాలన్నదే లక్ష్యం గా
“ఒక ఏడాది తర్వాత కూడా నీకు ఇదే అభిప్రాయం కలిగితే అప్పుడు చూద్దాం” అంది నెమ్మదిగా.
చాలా సేపు నిశ్శబ్దం ఆవరించింది వారిద్దరి మధ్య.
“సరే వెళ్లొస్తాను. నీకోసమే ఇప్పుడు వెళ్తున్నాను. నిన్ను దక్కించుకోవడం కోసమే” అన్నాడు లేస్తూ.
వెళ్లబోతూ గుమ్మం దగ్గిర ఆగిన ప్రభు మీంచి దృష్టి పై కప్పు వైపు మరల్చి, “మరొక్క మాట, ఈ ఏడాదీ నన్ను చూడడానికి రావొద్దు” అంది.
అతను వెళ్లగానే మూసిన తలుపుల దాపున కూలబడి “ప్రభూ!” అంటూ వెక్కి వెక్కి రోదించసాగింది.
నిజానికి అతని పట్ల తనకూ అనుకోని ప్రేమ మొదలయ్యిందన్న సంగతి అప్పుడే తన్మయికి పూర్తిగా అర్థం కాసాగింది.
నిస్త్రాణగా నేల మీద ఒరిగి తనలో తను దు:ఖించసాగింది.
మరో గంట తర్వాత బయట స్నేహితులతో ఆడుకుంటున్న బాబు లోపలికి పరుగెత్తుకొచ్చి “అమ్మా” అని కుదిపే వరకూ అలాగే ఉండిపోయింది.
***
సాయంత్రం మనసు మరీ దు:ఖ భారంతో మూలుగుతూ తల నొప్పి ప్రారంభం కావడంతో మాత్ర ఒకటి వేసుకుని త్వరగా నిద్రకుపక్రమించింది.
నిద్రరాని మనసు పొద్దుటి సంభాషణని మళ్లీ గుర్తు తేసాగింది తన్మయి మనసులో అనేక భయాలు కలగాపులగంగా ముంచెత్తుతూ.
గడచిన జీవితంనించి ఏమి నేర్చుకుంది తను?
ఇప్పటికీ ఎవర్ని నమ్మచ్చో, ఎవర్ని నమ్మకూడదో తెలీని పరిస్థితి.
అడుగు ముందుకు వెయ్యాలంటే భయాందోళనలు.
మోసం తప్ప పరిపూర్ణమైన గొప్ప ప్రేమ ఉందా ఈ ప్రపంచంలో!
ప్రభు మోసగాడు కాదని మనసుకి అనిపిస్తున్నా, “తన అంచనా తప్పయితేనో?” అన్న ప్రశ్న ముందుకు కదలనివ్వడం లేదు.
అతనికి తను చెప్పిన కారణాలన్నీ నిజమైనవే.
తన మనసు ఇంకా కోలుకోలేదు. శేఖర్ నించి విడిపోయి దాదాపు రెండేళ్లు కావస్తున్నా తన మనసింకా కోలుకోలేదు.
ఏ ఒక్క విషయమూ మరిచిపోలేక పోతూంది. ఎవర్ని చూసినా ఏదో ఒక సందర్భం లో గత జీవితం కళ్ల ముందు కదలాడడం, బాధ తన్నుకు రావడం. శేఖర్ తో విసిగి పోయిన తనకి స్నేహితుడనుకున్న కరుణ దుర్మార్గంగా తనని రెండో భార్యగా చేసుకోవా లనుందని మగవాళ్ల మీదే అసహ్యం పుట్టించేడు.
అప్పుడప్పుడే మానుతున్న గాయాన్ని మళ్లీ రేపినట్లు నిన్న గాక మొన్న శేఖర్ రైలులో ప్రత్యక్షమయ్యేడు.
కఠినమైన అతని మాటలు, చూపులు తన బాధని తిరగతోడేయి.
తనెందుకంత బద్ధ శత్రువయ్యిందతనికి? ఉద్దేశ్య పూర్వకంగా అతను చేసినవి కప్పిపెట్టుకోవడానికి తనని శత్రువుగా అందరి దృష్టిలోనూ చిత్రీకరించేడు.
పసివాడెదురుగా రైలులో అతను ప్రవర్తించిన తీరు చూస్తే కంపరం పుట్టుకొచ్చింది.
ఇక ప్రభు తనతో జీవితం పంచుకోవడం వల్ల అతనికి ఎటు వైపు నించి ఏం కష్టాలు వస్తాయో తెలీదు. అతనికిదే మొదటి పెళ్లి. తనకి రెండో సారి. ఈ విషయం అతన్ని భవిష్యత్తులో ఎప్పుడైనా బాధించొచ్చు.
అతను తన గాథ విన్న ఆవేశంలో, జాలితో మాట్లాడుతున్నాడు. తనపట్ల సానుభూతితో అతను తన్ని పెళ్లి చేసుకోవడం తనకి సుతరామూ ఇష్టం లేదు. ఆవేశం లో తీసుకున్న నిర్ణయాలు ఎంత కాలం నిలబడతాయో తెలీదు. తీరా చేసుకున్న కొద్ది నాళ్లలో అతనికి తను వొద్దనిపిస్తే?
ఇక ఇరువైపులా తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ ఈ నిర్ణయాన్ని ఒప్పుకోరు.
అతనికీ, తనకీ ఇరువైపులా కుటుంబాలు, ఆర్థిక పరిస్థితులు, కులాలు, మతాలు ఎందులోనూ సారూప్యత లేదు. వీటన్నిటినీ మించి తను డైవొర్సీ, పిల్లాడి తల్లి.
ఇన్నిటిని ఎదుర్కొని తామిద్దరూ ఎవర్నయినా ఒప్పించడం అన్నవి జరిగే పని కాదు.
తామిద్దరూ అనుకుంటే సరిపోదు. ఇరువైపులా ఉన్న వాళ్లంతా ఒప్పుకోవాలి. అది జరిగే పని కానప్పుడు ఇటువంటి ఆశలు పెంచుకోకపోవడమే మంచిది.
ఇక తనకి ఇలా ఒంటరి జీవితం రాసిపెట్టి ఉంది. ఎవరూ తన జీవితాన్ని సరిదిద్ద లేరు. ఇంతే.
రాత్రంతా కలత నిద్రలో, ఆలోచనలతో అటూ ఇటూ దొర్లుతూ అశాంతిగా గడిపింది తన్మయి.
***
తెల్లారి కాలేజీకి వెళ్లడానికి రెడీ అవుతుండగా “ఏం మేడం, అంతా మంచిగనే ఉన్నవా?” అని పలకరించింది తాయిబా గుమ్మం దగ్గిరికి వచ్చి.
అవునన్నట్లు తలూపింది తన్మయి.
“నిన్న రాత్రి ఏమో ఏడుస్తున్నట్లు శబ్దం ఇనొచ్చింది. ఎవరో, ఏమో అని మస్తు పరేషనయ్యిన. నువ్వయితే కాదు కదా!” అంది.
కాదన్నట్లు తలూపింది తన్మయి.
“ఎవరో, ఏమో పాపం” అని నిట్టూర్చి “సెలవల్ల బండికోసం మెకానిక్కు అచ్చి పొయ్యిండు మేడం, మీరు తీసుకుంటరా వేరోల్లకి అమ్ముకోవాల్నా? అనడిగిండు. నాకు తెల్వదని చెప్పిన” అంది.
“ఊ.. “అని నిట్టూర్చింది తన్మయి.
దారంట ఎవరు పిల్లల్ని బళ్ల మీద ఎక్కించుకుని వెళ్తున్నా ఆశగా చూస్తున్న బాబు ముఖం ఎప్పుడూ గమనిస్తూనే ఉంది.
“నాకు నాన్న లేకపోవడం వల్ల నేనెప్పుడూ బండి మీద వెళ్లలేకపోయేను” అని వాడు బాధ పడ్తున్నాడేమో అని కూడా అనిపిస్తూంది.
వాడికి ఏ లోటూ రాకుండా పెంచడమే తన లక్ష్యం. పైగా చీటీ పాడిన డబ్బులు రెడీగా ఉన్నాయి.
ఇక ఆలోచన అనవసరం అని తోచింది తన్మయికి.
కాలేజీకి వెళ్ళే త్రోవలో బ్యాంకుకి వెళ్లి డబ్బులు డ్రా చేసింది.
మెకానిక్కు మధ్యాహ్నం బండి పట్టుకొచ్చి ఇచ్చేడు.
ఆ సాయంత్రం ఇంటికి బండి వేసుకొచ్చింది.
తన జీవితంలో తను కొనుక్కున్న మొదటి పెద్ద వస్తువు! ముట్టుకుంటే అనిర్వచ నీయమైన ఆనందం కలగ సాగింది.
స్టాండు వేసి, బండికి దారంట అంటిన దుమ్ము తుడవసాగింది.
స్కూలు బస్సు ఆగగానే ఇంటికి పరుగెత్తుకొచ్చిన బాబు వాకిట్లో బండి చూసి ఆగిపోయేడు.
బండి “మనదేనా అమ్మా!? మనదేనా?” అని వెలిగిపోతున్న వాడి ముఖం చూస్తే తన్మయికి బాగా ముద్దొచ్చింది.
గబగబా ముఖం కడిగి బట్టలు మార్చి, “దా, అయిసుక్రీము కొనిబెడతా” అంది బండి స్టాండు తీస్తూ.
హాండిల్ ముందు నిలబడి కుదుపులతో బాటూ ఎగురుతున్న బాబు సంతోషాన్ని చూసి మురిసిపోయింది తన్మయి.
***
మర్నాడు కాలేజీలో మధ్య విరామంలో మేథ్స్ లెక్చరరు “డిగ్రీ కాలేజీలో పరీక్షలకి ఇన్విజిలేషన్ కి పోతరా మేడం?” అనడిగేడు.
తన్మయి అదేవిటన్నట్టు చూసింది. “ఓపన్ యూనివర్శిటీ పరీక్షలు జరుగు తన్నయి. ఆదివారం ఇన్విజిలేషనుకు ఎవరూ దొరకత లేదని ఆ కాలేజీ ప్రిన్సిపలు మన కాలేజీకి ఫోను చేసిండన్నట్లు. మీరు ఊర్లనే ఉంటరు కదా. కాలీగా ఉంటే పోవురి. పైసలు కూడా వస్తయి.” అన్నాడు
తన్మయి “అలాగే సర్. నా పేరు రాసుకోండి, కానీ బాబు….” అంది సందేహంగా.
“మీ సారు గిట్ల పట్టుకోరా మేడం ఒక్క పూటకి” అన్నాడు.
ఇంతలో అక్కడే గుమ్మం దగ్గిర నిలబడ్డ తాయిబా, “బాబుని నేను సూసుకుంటలే మేడం తియ్యి” అంది.
తన ప్రశ్నకి సమాధానం తన్మయి నించి రానందుకు ఒకింత నిరాశపడ్డట్లు ముఖం పెట్టేడాయన.
తన గురించి తెలిసి అడుగుతున్నాడో, తెలియక అడుగుతున్నాడో తెలియలేదు తన్మయికి.
అతను మామూలుగానే అడిగినా తన గురించి అతను ఆరా తీస్తున్నట్లు భావన కలిగింది తన్మయికి.
“నేను ఒంటరిగానే ఉంటాను సర్. నేను డైవొర్సీని” అంది సీరియస్ గా.
“అయ్యో, సారీ మేడం తెల్వక అడిగినా. ఏమైంది?” అన్నాడు తెలుసుకోవడానికి కుతూహలంగా.
తన్మయికి చికాకు వేసుకొచ్చింది. చెప్పేందుకు అది చిన్న గాథ కాదు, గొప్ప గాథ కాదు. పైగా ఇలా అస్తమాటు తన గడచిన జీవితాన్ని తలుచుకుంటూ బతకడం దుర్భరం గా ఉంది.
“ఏదో లెండి, తర్వాతెప్పుడైనా చెప్తాను” అని అక్కణ్ణించి లేచింది.
ఈ ప్రపంచం ఎక్కడికెళ్లినా తనని ఒంటరిగా, ప్రశాంతంగా బతకనివ్వదు.
కాలేజీ బయట వరండాలోకి వచ్చింది.
ఊరి చివర ఉండడం వల్ల కాలేజీని ఆనుకుని పొద్దు తిరుగుడు తోటలు విరగబూసి ఉన్నాయి. ఆ పక్కనే మొక్క జొన్న చేలు. మరొక వైపు అక్కడక్కడా తుప్పల్లంటి సీతాఫలాల చెట్లు.
బయటికి రాగానే మనసులోని అలజడి కాస్త ఉపశమించింది.
ప్రిన్సిపాలు గారితో చెప్పి కాలేజీ బయటికి వచ్చింది.
కాలేజీ మలుపు దాటే వరకూ చూసుకోలేదు. తన వెనకే నలుగురు కాలేజీ పిల్లలు కూడా వస్తున్న సంగతి.
“ఏమిరా, క్లాసు లేదా?” అంది ఆగి వెనక్కి తిరిగి గంభీరంగా.
“లేదు మేడం, ఇయ్యేల మా ఎకనామిక్సు సారు రాలే” అన్నారు వాళ్లు ముక్త కంఠంతో.
“ఇటెక్కడికి మరి?” అంది.
“మీ కోసమే మేడం” అన్నారు మళ్లీ.
ఆశ్చర్యపోయింది తన్మయి.
“నాకు తోడుగానా? ఎందుకు?” అంది.
“ఏం లే మేడం, పొలాల పురుగూ పుట్రా ఉంటయి, అల్లరి పోరగాల్లు ఉంటరు. మేడం ఒక్కతె పోతూందని ఇగో ఈడంటే తోడు వొద్దమని అచ్చినం” అని అందులో ఒకబ్బాయిని చూపించేరు.
తన్మయికి సంతోషంతో కళ్ల నీళ్లు నిండేయి. తనొక్కతే వెళ్తుందని ఎస్కార్టు వచ్చేరన్నమాట. ఎంత ప్రేమ ఈ పిల్లలకి! వీళ్లతో తనెప్పుడూ దండించినట్లు మాట్లాడడమే గానీ ప్రేమగా మాట్లాడలేదు ఇప్పటి వరకూ.
“ఊ అయితే, అలా వెనక నడవక్కరలేదు. నాతో నడవండి” అంది నవ్వుతూ.
ఇక హుషారుగా కబుర్లు చెప్పడం మొదలు పెట్టేరు వాళ్లు. అందులో ఎవరికీ సరైన కాలి జోళ్లు కానీ, మంచి బట్టలు గానీ లేకపోవడం గమనించి మనసు బాధ వేసింది తన్మయికి.
వీళ్లని చూస్తూ ఉంటే తను ఇంటర్మీడియేట్ చదువుకున్న రోజులు జ్ఞాపకం వచ్చేయి.
పదిహేను, పదహారు సంవత్సరాల లేత వయస్సులో ప్రపంచం ఎంత అందంగానో కనిపించేది.
కానీ అప్పట్లో తాము ఇలా లెక్చరర్లతో మాట్లాడడానికే భయపడే వాళ్లు.
ఇంతలో త్రోవ పక్కన ఒక కర్ర ముక్క విరిచి తెచ్చి ఇచ్చేడు అందులో ఒక కుర్రాడు.
“గెప్పుడు తోటకి పొయ్యినా కర్ర పట్టుకో మేడం. పురుగూ పుట్రా గురించే కాదు, మంచిగా నడవొస్తది” అన్నాడు.
అంతా నవ్వేరు.
తన్మయికి వాళ్లని చూసి భలే ముచ్చటేసింది.
తనకి తోడుగా రావాలన్న ఆలోచన కలిగినందుకే మనస్సులోనే అందరికీ కృతజ్ఞత లు చెప్పుకుంది.
“ఊ..చెప్పండి. పొద్దుట పూట కాలేజీకి ఎందుకు లేటుగా వస్తారు మీరు?” అంది ఊరికే వాళ్లని మాట్లాడించాలని.
“పొద్దుగాల నల్లలొస్తయి మేడం. ఇంటి కాడ తాగనీకి, తానాలకి నీల్లు మోసినాకే బయలెల్లి రావాలె” అన్నాడు ఒకబ్బాయి.
“మా ఊరికాణ్ణించి ఆరు మైళ్లు నడిసి రావాలె. దినామూ బస్సుకి పైసలేడికెల్లి ఒస్తాయి మేడం?” అన్నాడింతలో మరొకబ్బాయి.
“మేడం సదువు మీరు ఎంత సెప్పినా ఇంటి కాడ “పనికిబోరా పైసలొస్తయ్” అంటరు. స్కాలర్ షిప్పు వస్తదని మా నాయిన్ని ఒప్పించిన, ఇగో ఈడది విని నవ్వబట్టె”
***
“పొద్దుగాల బువ్వేడొస్తది మేడం, ఏదో టీ తాగి వచ్చుడు, పొద్దుమీకి ఒక్కపూటే ఇంత తినేది“….
పిల్లలు అవన్నీ అతి మామూలుగా చెప్పుకెళ్లిపోతుంటే వింటున్న తన్మయికి. చెప్ప లేని బాధ తన్నుకు రాసాగింది.
ఇంత కటిక పేదరికంలో ఉన్న ఈ పిల్లలు చినిగిన బట్టలు, తెగిన చెప్పులు కాక ఏం వేసుకుని వస్తారు?
తిరిగి వెనక్కి వచ్చేక తిన్నగా ప్రిన్సిపాల్ యాదగిరి గారి దగ్గరకు వెళ్లింది.
“మీరు మధ్యాహ్న భోజన పథకం గురించి ఆలోచిద్దామన్నారు కదా! మొదలు పెడదాం సర్” అంది.
“గట్లనే మేడం. కానీ గీ పోరలు కాలేజీ ఇడిసిపెట్టిందాక ఉండి సదువుత మంటే గదా! అయినా స్టాఫ్ మీటింగు పెట్టి సూద్దాం ” అన్నారాయన సాలోచనగా.
“భోజన పథకానికి ఊర్లో మోతుబర్లను, డబ్బులున్న దుకాణాదారులని సహాయం అడుగుదాం. పిల్లల్ని సాయంత్రం వరకూ కాలేజీలో ఉంచి చదివించాలంటే రెగ్యులర్ క్లాసులు అయిపోయేక స్టడీ అవర్స్ పెడదాం. ఇవన్నీ స్టాఫ్ అంతా సరేనంటే అమలు చేద్దాం. ఇక నా జీతంలో నుంచి 2% నెల నెలా బాగా చదివే పిల్లలకు మెరిట్ స్కాలర్ షిప్పుగా ఇద్దామనుకుంటున్నానండి” అంది గబగబా.
ఆవేశంగా చెప్తున్నా ఆ మాటల్లోని స్థిరత్వానికి అబ్బుర పడ్డారాయన.
“చివరగా మరొక్కమాట. ఆగష్టు పదిహేనుకి స్వీటు బదులు చెప్పుల్లేని పిల్లలందరికీ తలా ఒక జతా చెప్పులు కొనిపెడదాం సర్” అంది.
“ఇన్నినాళ్ల బట్టి నా సర్వీసుల నీ అసుంటి మణిసిని సూడలె మేడం. మంచిది, గట్లనె చేద్దాం” అన్నారాయన నవ్వుతూ.
*****
(ఇంకా ఉంది)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.