సముద్రం
-వసీరా
ఆకాశాన్ని నెత్తి మీదమోస్తూ
సముద్రం ఒక చేపగా మారి
ఈదేస్తుంది భూతలం మీద
సముద్రం ఎగురుతుంది పక్షిగా మారి
నీటిరెక్కలతో నీలమేఘమైపోయి
సూరీడికి ఆవిరి స్నానం చేయించి సముద్రమే
బడి వరండాలోంచి బయటపెట్టిన చిన్నారుల
అరచేతుల మీద చినుకులై
మునివేళ్లమీద విరిసిన సన్నజాజులై
సముద్రమే చిన్నారుల ముఖాలమీద మెరుపులై
ముఖపుష్పాల మీంచి ఎగిరే నవ్వుల సీతాకోక చిలుకలై
సముద్రమే సముద్రమే బడిగంటమోగినంతనే
చినుకుల మధ్య కేరింతలతో మారుమోగే గాలికెరటాలై
సముద్రమే తన సొట్టబుగ్గల మీద గులాబి రంగు సంధ్యాకాశాలను
నౌకల మీంచి రేవులకీ , రేవులమీంచి నౌకలకి తరలిస్తూ
సముద్రమే పడవల తలల మీంచి నింగిలోకి రంగుల్ని విసురుతూ
సంధ్యాకాశపు చెక్కిలి మీది కాంతిలో
ఎగురుకుంటూ ఇంటికి పోయే పక్షుల్ని
దిగంత రేఖగా విస్తరించిన చిరునవ్వుతో
సాగనంపే సముద్రమే
సముద్రం ఎంత చిలిపిదీ ?
ఖండాంతరాలకు విస్తరించి
కొండల నడుం చుట్టూ చేతులు వేసి
ఆకాశాన్నే తన ముఖంగా చేసుకుని
తన మేని పసిడి ముసుగును శిఖరాల మీద కప్పేస్తుంది.
తన లోతుల్లోని గుసగుసలను విన్పిస్తుంది
కొండ గుహల గుండెల్లోనికి
తన రహస్యాలను శ్వాసలుగా
ఎంత చిలిపిదీ సముద్రం తన ఆనందాన్ని
కెరటాల గంపల కెత్తి పంపింస్తుంది
సుదూర తీరాల్లోని కుటీరాల్లో ధ్యానమగ్నులై వారికి
సముద్రం పంపిస్తుంది తన ఆనందాన్ని
తీరాన పల్లెల్లోకి , నగరాల్లోకి , నిదురపోయే శిలల్లోకి
నిదుర లేచిన అరణ్యాలకి జనావాసాలకి సమస్త జీవజాలాల్లోకి
సముద్రం పంపిస్తుంది తన ఆనందాన్ని
తన కడుపులోని పగడాల కొండల మీద
గర్జించే రంగుల వలయాలుగా
ఉదయాలుగా అపరాహ్ణపు బంగారు తీగలుగా ,
సాయంత్రపు అస్తమయాలుగా..
సముద్రమే తన ఆనందాన్ని ప్రసరిస్తుంది
తన ఒడిలోని జల చరాలను తల మీది నక్షత్రాలను
సముద్రమే ప్రసరిస్తుంది తన శ్వాసలోని ప్రాణశక్తిని
గడ్డ గట్టిన మంచు పర్వతాలకి
కరిగి ప్రవహించే నదులకి
నదుల తీరాన మహారణ్యాల్లోకి మహా మైదానాల్లోకి
చరాచరాల ఆహారంలోకి శరీరాల్లోకి వాటి చరిత్రలోకి
సముద్రమొక మహోద్యమం
సముద్రమొక మహా మాతృత్వం
సముద్రమొక మహా ప్రేమ స్వరూపం
నేనూ సముద్రమూ సూరీడూ
దోబూచులాడుతూ ఒకరికొరు దొరికిపోతూ
ఒకరి లోంచి ఒకరు బయటికొస్తూ
ఎన్ని యుగాల నుంచో ప్రయాణం
బహుశ అనాది నుంచి అనాది వరకూ
******