అనఘతల్లి
-శింగరాజు శ్రీనివాసరావు
ప్రభానుడు తన ప్రతాపాన్ని ప్రజ్వలింప చేస్తున్నాడు
రోహిణి వచ్చిందేమో రోళ్ళు పగిలేటంత భగభగలు
సగం కాళ్ళు మాత్రమే కప్పుతున్న పాదరక్షలు
వడివడిగా అడుగులు వేస్తూ కదిలి పోతున్నాయి
నడినెత్తి మీద మెడలు విరిగేటంతటి భారం
మోయకపోతే పొయ్యిలో పిల్లి లేవదు మరి
చేతులు మాత్రం ఖాళీగా ఉన్నాయనుకోవడానికి లేదు
నవమాసాల భారం నేలను తాకి చంకకు చేరింది
బుడి బుడి అడుగులు మరో చేతికి అలంకారమాయె
కొంగు చుట్టూచేరి చేతనున్న వాడికి గొడుగైతే
నెలల బిడ్డకు అర తెరచిన ముసుగయింది
రాళ్ళు కొట్టి తెచ్చే మగని సంపాదన సగం తాగుడుకు పోతే
అరకొర గంజితో ఆయుర్దాయాన్ని కాపాడుకోలేక
అమ్మతనంతో పాటు ఆడతనం వీధిలోకి నడిచింది
తలమీద కాయగూరలు కాసులుగా మారితే
పసికూనలకు పట్టెడు అన్నం పెట్టాలనే తపన ఆమెది
తాగి వచ్చిన వాడు తన్నుల వరమిడినా
పదికాలాలు పసుపుతాడును నిలుపుకోవాలనే ప్రేమ ఆమెది
ఎండకు జడవని దీక్ష ఆమెది
ఏ కష్టానికి వెనుదీయని పట్టుదల ఆమెది
మగడికి పట్టని కుటుంబాన్ని తలకెత్తుకున్న మగువ
మానాన్ని సంరక్షించుకుంటూ బ్రతుకు బాటను వెతుకుతున్నది
ఏ పురస్కారానికి అందని అనఘతల్లి ఆమె
ఏ పద్మశ్రీలను కోరని పేదతల్లి ఆమె
అసమతుల్యతలు పర్యావరణంలోనే కాదు
పడతుల బ్రతుకులలోను ప్రతిఫలిస్తున్నాయి
తలుపు తట్టి వచ్చిన ఆ తల్లి కాయలను బేరమాడకండి
తనవారి కోసం తపనపడే ఆమెకు చేయూతనివ్వండి
కోటి దానాల కన్నా కొసరని బేరమే పదింతలు మిన్న…
*****