ఇరాము లేని ఈగురం

 (నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- డా.కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)

– పెనుగొండ బసవేశ్వర్

సుక్కకు తెగవడ్డ నాయినతోటి అవ్వకు
సుఖం ఎంత దక్కిందో తెల్వదు గానీ
దాని సూరునుంచి ఐదు సుక్కలం కారినం

శియకూర వండలేదని శిందులేసినోని చేతుల
శీమునేత్తరు ఇడిషి శీపురు దెబ్బలు తిన్నా
శీకట్లనే సూర్యుణ్ణి కొట్టిలేపేటి శీపురు అవ్వ

బజార్ల బర్ల మంద ఎనకాల ఉరుక్కుంట
తట్ట నిండ వేడివేడి తళతళ పెండ తీసుకొచ్చి
ఆకిలి అంత పచ్చగ సల్లిన అలుకు అది

జబ్బు చేసినప్పుడు కూడా జబ్బలన్ని పోంగ
సర్కారు బాయిల శాంతాడు బొక్కెనేసి
గోలెంలన్నీ నింపిన గోదారితల్లి గోస అవ్వ

మొగడు మొగోడు మొద్దోలే పండుకుంటే
ఎనకమాల ఉన్న ఎలుమోల్ల శెల్కలల్లకెల్లి
వంటకోసం కట్టెలు కొట్టుకొచ్చిన గొడ్డలి అవ్వ

మా భవిష్యత్తును ఈగురంగ చెక్కేటందుకు
అయ్యకు ఔపడకుంట ఆఠానబిళ్ళలను ముడేసుకొని
బొడ్లే షెక్కుకున్న బొంతపాతచీర కొంగు అవ్వ

ఖాళీ అయిన గిన్నెల సప్పుడు తెలువకుంట

ఉపాసమున్న దాని పేగుల లొల్లి ఇనబడకుండ
నీళ్లతోటి కడుపునింపుకున్న బువ్వకుండఅవ్వ

కడుపుతోటి ఉన్నా కల్వకొయ్య పోయినపుడు
చేతులిరిగిపోయేలా చేనుకోసినప్పుడు ఎన్నిమాట్ల
చెయ్యి తేగిందో కూడా సోయిలేనీ చెమట అవ్వ

శీకట్ల లేశింది మొదలు మల్ల శీకటయ్యే దాకా
పనిలోపనిగా పనియేపనిగా పచ్చడిపచ్చడైన అవ్వకు
ఇంతకాలానికి జరంత ఇరాము దొరికింది

గోడమీద ఫోటువాల దండేసుకుని దమ్ము తీస్తాంది

*****

ఆర్ట్ : వి.వి స్వామి

Please follow and like us:

3 thoughts on “ఇరాము లేని ఈగురం (నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- డా.కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)”

  1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సర్

  2. కవితా వస్తువు సామాజిక స్పృహ కలిగిన రచయితలకు సాధారణమనిపించినా, మాండలిక ప్రయోగంతో సరికొత్త అందాన్ని సంతరించుకున్నది కవిత. చాలా హృద్యంగా సాగిన కవితలో ముగింపు హైలెట్. ఇంత మంచి కవితను రచించిన బసవేశ్వర్ గారికి, ఎంపిక చేసిన సంపాదక వర్గానికీ అభినందనలు

Leave a Reply

Your email address will not be published.