ఊ…ఊ అంటోంది పాప
-వసీరా
ఒక స్వప్నంలో తేలుతోంది పాప పడుకున్న మంచం
కల మీద తేలే మరో కలలాగ ఉన్నది మంచం మీద పడుకున్న పాప
చిన్నిపాప నిద్రపోతోంది మంచు నిద్రపోయినట్లు
మంచు ఉదయం సరస్సు నిద్రపోయినట్లు
సరస్సు మీద లేత ఎండ నిద్రరపోయినట్లు
మేలిమి ఎండలో సరస్సులోని కలువ నిద్రపోయినట్లు
అలా పడుకుని ఉన్న పాప శరీరం బహుశ ఒక స్వప్నం
తన చిన్నిశ్వాసలోంచి పాపలోకి ఓ స్వప్నం ప్రవేశించి విస్తరిస్తోంది
బేబీ నిశ్వాసంలోంచి బయటికొచ్చిన స్వప్నం
పరుగెడుతోంది సతత హరితారణ్యాల్లోకి
అటూ ఇటూ చేతులు అల్లుకున్న వెదురు పొదల మీద సూర్యరశ్మిలోకి
బంగారు కిరణాల్లోంచి ఎగిరి చెట్లలో మాయమయ్యే చిలకలతో ఆటకి
చెట్టుచెట్టునా పిట్టల పాటల్ని నెత్తిన జల్లుకునే లేత ఎండలోకి
హరివిల్లుకి ఆ మూలా ఈ మూలా ఒకర్నొకరు పిలుచుకునే ఉడతల మధ్యకి
తెల్లని కొంగల హారంతో సంజె మబ్బుల్లో మెరిసే యేటిమలుపు కొండ దగ్గరికి
రెక్కల మీంచి రంగుల మబ్బుల్ని రాలుస్తూ పోతున్నపక్షుల గుంపులు
ఆమెలో ప్రతిధ్వనిస్తూ,…… ఆ చిన్నారి నిశ్వాసం నుంచి బయటికి తొంగి చూస్తూ
బంగారుతల్లి లోలోపలి స్వప్నం చిన్ని పెదవుల మీద తీయగా ఆడుతూ
పురిటి మంచంతో సహా ఒక స్వప్నంలో చిట్టితల్లి తేలుతోంది.
పాపలోంచి ఒక హరిత స్వప్నం బయటికొచ్చి సంచరిస్తోంది.
బంగారుతల్లి నిద్దట్లోనే పకపకా నవ్వుతూ
ఎవరి ఊసులకో.. ..ఊ…ఊ అంటూ ఊ… కొడుతోంది.
******