ఒక్కొక్క పువ్వేసి-24
మహిళల్ని బత్కనియ్యుండ్రి
-జూపాక సుభద్ర
ఏనాడు టీవీల,పేపర్లల్ల ఆడోల్లు అత్యాచారాలకు, హత్యలకు, అఘాయిత్యాలకు
గురిగాని రోజు వుండది, వార్త వుండది. ఆడోల్ల మీద రోజూ నేరాలు,ఘోరాలు నిత్యకృత్య మైనయి. ఒక్క టీవీలల్లనే పేపర్లల్ల వచ్చేటియే గాక యింకా వాట్స్ ఆప్ లాంటి సోషల్ మీడియాలల్ల గూడ గియ్యే వార్తలు మారుమోగుతుంటయి.యిది వరకు రోజుకో, పూటకో జరిగేటియి. యిప్పుడు దేశవ్యాప్తంగా గంట గంటకు నిమిష నిమిషానికీ నేరాలు పెరుగు తున్నయి. యాన్నో కాడ హత్యలు, అత్యాచారాలు,లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, అనుమానాలు, ఆత్మహత్యలు, పరువు హత్యలు, సామాజిక హింసలు, గృహహింసలు ఆడవాల్ల మీద ముఖ్యంగా దళిత, ఆదివాసీ, వెనకబడిన కులాల ఆడవాల్ల మీదెక్కువగా జరుగుతున్నవి సంఘటనలుగా కాదు. యివన్నీ ఆడవాల్ల మీద, బాలికల మీద వ్యవస్థీ కృతంగా జరుగుతున్న హత్యలు,హింసలు. అదీ అణగారిన కులాల మహిళల మీన్నే జరుగుతున్నయి.
యివన్నీ ఆడవాల్ల మీద మగవాల్లు చేసే మానవ హననం. సాటి మనిషి పట్ల సహాను భూతి లేకుండా ‘అదున ఆడది నా బానిస’ అనే మగ కౄరత్వాలకు బలవుతున్నది. ఆడ సమాజం. మగవాల్ల సంపుడు పందెంలో సమాధులవుతున్నారు మహిళలు బాలికలు. ప్రేమ పేరుతో,పెండ్లి పేరుతో,అనుమానాలతో,కూరల కారమెక్కువైందనీ, ఉప్పు యెక్కువైందనీ, తాగుడుకు పైసలిస్త లేరనీ కొందరు, కూలికి బొయిన కాడ బలాత్కారా లతో చంపడం. రాళ్లతో కొట్టి చంపడం. కాల్చిచంపడం. గొంతు నులిమి, వురేసి, గొడ్డలి కత్తులతో నరకడం.పెద్దపెద్ద బండలు మీదెత్తేసి,పురుగు మందులు తాగిచ్చి, కొట్టి చంపడం. చంపి ముప్పయారు ముక్కలు జేసి డ్రైనేజీలల్ల అక్కడిక్కడ పారేసుడు. చంపి ముక్కలు జేసి, కుక్కర్ల వుడక బెట్టి, మిక్సీలో వేసి కుక్కలకు వేసుడు లాంటి అమానుష వార్తలు నిద్ర బోనివ్వనివి. చంపి డ్రైనేజిలేసి సిమెంటుతో పూడ్చేసుడు. ఇట్లాంటి మగ క్రూరత్వాలతో మహిళలు బత్కుడు బహు కష్టంగున్నది. యిక బాలికల మీద జరిగే వాటి క్కూడా అంతులేదు. యింట్ల తండ్రి,అన్న,దగ్గరి బందువులు, బైటి మగ సమాజం అందరూ ఆ పసిబిడ్డల్ని నలిపేసే టోల్లే ప్రాణాలు తీసేటోల్లే.
ఎన్కముందు సూడని ఉన్మాదత్వాలు హత్యలు చేస్తే, అవి ఆనవాలు లేకుంట ముక్కలు జేసుడు కుక్కలకేసి ఆమె శరీరాన్ని మాయం చేసి చట్టానికి దొర్కకుండా వుండడానికి, శిక్షల నుండి తప్పించుకునే దానికి యిట్లాంటి అమానుషాలకు యెగబడ్తుం డ్రు మగవాల్లు.
ఒక్క రకం గాదు అనేక రకాలుగ మహిళలు,బాలికలు చంపబడ్తన్నరు.ఒక్కటా రెండా, ఎన్నని చెప్పాలె? ఏమని చెప్పాలె? మహిళల ఉనికే, మహిళల బతుకే ఒక ప్రమాదపుటంచున వున్నది.
గామద్దెన ప్రేమ పేరుతో నమ్మించి యింటికి తీసుకొచ్చి ఒకడు ఒకమ్మాయిని చంపి
ముక్కలు చేసి కాకులకు గద్దలకు, మురిక్కాలవల పడేసి,సాక్షాలు లేకుండా దొరక్కుండా మనిషినే మాయం చేద్దామనుకున్నడు.పాపం నమ్మి వచ్చిన ఆ బిడ్డను, సహజీవనం చేసిన ఆ ప్రేమికురాల్ని, ముక్కలుబడ కోసెయ్యడానికి చేతులెట్లా వచ్చినయో వాడికి? యిది దేశమంత పెద్ద సంచలనమైంది.యివ్వి బైటికొచ్చినయని సంచలనమైంది. బైటికి రానియి యెన్నో యెన్నెన్నో? తర్వాత యీ కేసులో చంపబడ్డామె హిందువనీ (ఏ కులమో చెప్పది) చంపినోడు ముస్లిమ్ అనీ ‘లవ్ జిహాద్’ గా మలిపిండ్రు హిందుత్వ మూకలు. హిందూ ఆడ పిల్లల్ని ముస్లిమ్ మగపిల్లలు లవ్ జిహాద్ చేస్తున్నారనీ, మతకోణంల చిచ్చు బెడ్తున్నరు. నిజానికి యీ కేసుల లవ్ జిహాద్ ఎక్కడుంది? ముస్లిమ్స్ గనక అట్లా చేసిండు అదీ హిందూ మహిళను. యిది ఫక్తు హిందూ – ముస్లిమ్ దుష్మన్ వుందంటు న్నరు. కానీ, సమాజాల్లో వ్యక్తులు యింత వున్మాదంగా, కౄరంగా ఎందుకు మారుతు న్నారు? మహిళలను యింత అమానుషంగా చంపడానికి వున్న మానసిక, సామాజిక, సాంఘిక కారణాలేంటి? డిప్రెషన్స్ ఏంటి? వాటి నివారణా చర్యల పట్ల ఎలాంటి చర్చలు, చలనాలు ప్రభుత్వాలకుండడం లేదు. మహిళల పై జరుగుతున్న మారణ హోమాల్ని ఆపేందుకు ఏ కార్యాచరణలు చేయరు గానీ, లవ్ జిహాద్ కుట్రలు, హిందూ వ్యతిరేక ముస్లిమ్ వాదమని యింకా హింసాత్మకం చేస్తున్నదీ హిందుత్వవాదము.
యీ సంఘటన మనసుల నుంచి మాయంగాక ముందే పదిరోజుల కింద బొంబాయి ల ఒకడు యిట్లనే ఒకామెను చంపి, ముక్కలు చేసి కుక్కర్ల బెట్టి మిక్సీల యేసి, కుక్కల కేసిన వార్త దేశమంత పెద్ద గగుర్పాటు. ఎందుకు ఆడోల్ల మీద గింత పగ, కచ్చ. చంపి నంక గూడ ఆమె శరీరం పట్ల అంత అమానుషత్వమా! యిట్లాంటి మానసిక స్థితి మహిళల కే కాదు సమాజానికి కూడా పెను ప్రమాదమే. యీ కేసుల చంపినోడు (మనోజ్ సాని), చంపబడ్డ మహిళ — యిద్దరు హిందువులే. యిప్పుడు హిందుత్వ వాదులు, మహిళా వాదులు ఏమని వ్యాఖ్యానిస్తారు? ఏ మత కోణాలు తీయగలరు? కుల కోణాల మీద వాస్తవాలు మాట్లాడే నిజాయితీ హిందుత్వకు లేదు. చాతుర్వర్ణ వ్యవస్థ మీదనే హిందూ త్వం వుంది గనక వాల్లే కులమ్ ఆదిపత్యకులమా? అణగారిన కులమా? అనేది
మాట్లాడరు. ఈ దేశంలో కులాన్ని బట్టి హింసలు, న్యాయాలు వ్యవస్థీకృతంగా వున్నయి. యిక్కడ ఈ కేసులో చంపినోడు ఏ కులమో? చంపబడిన మహిళ ఏకులమో బైటకు రాదు! క్రైమ్ రిపోర్టు బ్యూరోలు కూడా మహిళల మీద నేరాలు, హింసలు, ఎట్లా ఎన్నిరెట్లు పెరుగుతున్నాయో సంఖ్యలు చెప్తారే గానీ, ఆ మహిళలు ఎవరు ఏ కులాల మహిళలనేది చెప్పరు. ఏకులమ్ చేసిందనే వివరాలు బైటకు పొక్కవు. యిట్లా బైటికొస్తే ఆధిపత్య మగ రాజకీయార్ధిక సామాజిక దౌర్జన్యాలు, నేరాలు, హింసలు బహిరంగమై దోషులుగా నిలబ డాల్సి వస్తదని.
హైద్రాబాద్ లో ఇదే నెలలో (జూన్) ఒక పూజారి చేసిన హత్యానేరం గూర్చి చెప్పాలి. ఒక అర్చకుడికి భార్య పిల్లలన్నారు. నిత్యం మంత్రోచ్చారణలు, దూపదీప నైవేద్య కుంకుమార్చన దినచర్యగా వుండిన పూజారి. గుడికొచ్చే ఒక భక్తురాల్ని (సొంతకులం) లొంగదీసుకొని కడుపు జేస్తే…పెండ్లి చేసుకొమ్మని ఆ భక్తురాలు అడిగిందని చంపేసి డ్రైనేజీలో వేసి ఉప్పు, మట్టి పోసి సిమెంటుతో పూడ్చేసిండు. హిందుత్వ సామాజిక భావజాలం ‘నేరాలు,ఘోరాలు అణగారిన కులాలే చేస్తయి’ బ్రాహ్మణ, పూజారి కులాలు చేయవు’ చేసినా దోషం kadgu’ అనే ప్రచారమ్ సమాజంలో కూచో బెట్టినది. కాని యిది తప్పుడు భావ జాలం.. చారిత్రకంగా చూసినా వీరి నేరమయమే వ్యవస్థీకృతంగా వుంది . కతువా కేసులో కూడా ఎనిమిదెండ్ల ఆసిఫాను అత్యాచారం చేసి హత్య చేసింది గుడి పూజార్లే. కాని యీ కులాల్ని హింసకు ఆవల, నేరాలకు, దోషాలకు ఆవల వుండే సత్పురుషులనే దృక్పథాన్ని ప్రచారం చేసుకున్నా… వాస్తవాలు వేరుగా వున్నాయి. వాల్లు హింసలకు, నేరాలకు, దోషిత్వాలకు అతీతులు కారని చారిత్రకంగా వర్తమానంగా కూడా మన కళ్లెదుట బోలెడు కథలున్నయి. అయినా వారికి శిక్షలుండవు. బ్రాహ్మణుడిని శిక్షించ కూడదు అనే మనుస్మృతి రక్షణల ముందు రాజ్యాంగ శిక్షాస్మృతులు వెల వెల బోతుంటాయి. ఆ మనుస్మృతే హైద్రాబాద్ లో భక్తురాల్ని చంపేసిన పూజారి నేను జైలుకెళ్లను, నన్ను ఆరెస్ట్ చేయవద్దు అనీ, యిక హిందూ సైన్యాలు కూడా అతనికిమద్దతు ర్యాలీ చేస్తున్నయి.
అట్లా మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు చేస్తూ మహిళల
బత్కుల్ని బుగ్గి పాల్జేస్తున్న నేరస్తుల్ని ఏ కులం, ఏ మతం అని చూడకుండా చట్టమ్ముం దు అందరూ సమానులే అనే సూత్రంగానే శిక్షించాలి. మహిళల భద్రత కోసం, ప్రభుత్వా లు మరింత అప్రమత్తమై మహిళల్ని బతికించాలి.
*****
జూపాక సుభద్ర కవయిత్రి, కథకురాలు, కాలమిస్టు, వ్యాసకర్త, అనువాదకురాలు, పరిశోధకరాలు, వక్తగా, సంఘసేవకురాలు, ప్రభుత్వ ఉన్నతాధికారిణి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల సంఘంలో కీలకంగా పనిచేస్తున్నారు.
సుభద్ర గారు తెలుగు సాహిత్యంలో, మహిళా సాహిత్యంలో ఉన్న అగ్రకుల బావజాలాన్ని ప్రశ్నిస్తూ, ఆధునిక సాహిత్యంపై విమర్శ చేస్తూ దళిత, బహుజన సాహిత్యం యొక్క ఉన్నతిని పెంపొందిస్తూ రచనలు చేసున్నారు.