క(అ)మ్మతనం

 -డా. మూర్తి జొన్నలగెడ్డ

కలలోనైనా ఇలలోనైనా
కమ్మగ ఉండేదే అమ్మతనం
కన్నుల లోనైనా మిన్నుల లోనైనా
వెలుగులు నింపేదే ఆ తల్లి పదం

గోరు ముద్దల నాడూ
ఆలి హద్దుల నేడూ
అలసటే ఎరుగని
ఆ నగుమోము చూడు
అస్సలంటూ చెరగని
ఆ చిరునవ్వు తోడు

అలసి సొలసిన చిన్నారినీ
అలుక కులుకుల పొన్నారినీ
అక్కున చేర్చేటి ఆ అమ్మ తోడు
అక్కర తీర్చేటి ఆ తల్లి తోడు

ఎవరు తీర్చేది కాదు ఆ తల్లి రుణము
అది ఏ బిడ్డ తీర్చేదంటు చేసేటి రణము
ఆ తల్లి గుండెలో దించెనొక శరము
అది కూడ తెలియని గుడ్డిదీ లోకము
పిల్లలకు మాత్రము తానెంతొ భారము
తన బరువు ఎందుకో తగ్గెనే పాపము

ఐననూ చిరునవ్వు చెరిగి పోనీయక
నీ నీడ తను వీడెను
తన లాంటి వారలను
తను కూడ కూడెను
మనసు మనుమల తోడను
మనిషి మనుగడ ఈడను

వరము లాంటి ఒక్క శాపమ్ము వలననే
గతపు గురుతులన్నిటిని లీలగా మరచి
పసి వయసు లోనికి మళ్ళీ మళ్ళిన
సాటి ఆశ్రమ వాసులను సాకంగ తానే
తల్లిగా నిలిచేను తన బాధ్యతగ తలచేను
ఆ తల్లి మనసు మరల మరి గెలిచేను
తరతరాలకు తానొక్క వెలుగై నిలిచేను

తెలుసుకో రండీ ఓ అయ్య లారా
కనులు తెరువండీ ఓ అమ్మ లారా
కలలోనైనా ఇలలోనైనా
కమ్మగ ఉండేదే అమ్మతనం
కన్నుల లోనైనా మిన్నుల లోనైనా
వెలుగులు నింపేదే ఆ తల్లి పదం

******

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.