క ‘వన’ కోకిలలు – 16 :
చైనా దేశ సనాతన మరో మహాకవి లీ పో ( 701 – 762 )
– నాగరాజు రామస్వామి
సాహిత్య స్వర్ణ యుగంగా ఖ్యాతికెక్కిన తాంగ్ రాజుల కవిత్రయం (వాంగ్ వీ, లీ పో, తు ఫు) లో రెండవ వాడు లీ పో. చైనా సంప్రదాయ సాహిత్యాన్ని కొత్త ఎత్తులకు కొని పోయిన మహాకవి. అతని కవిత్వం కాల్పనిక ప్రభ (Romantic brilliance). అతని వచన రచన నెమిలి నడకల నయగారం ( peacock poetry). ఆనాటి “మూడు అద్భుతాలు” లీ పో( Li Po) కవిత్వం, పీ మిన్ ( Pei Min) ఖడ్గ కౌశలం, జాంగ్ జూ ( Zhang Xu) చిత్రలిపి (calligraphy).
లీ పో ది ఆత్మాశ్రయ కవిత్వం. సంభాషణ రూపంలో ఉండే మనశ్చిత్ర కల్పన. అతని రచనలు స్నేహ సౌభాగ్యాన్ని, ప్రకృతి గాఢ శోభను, ఏకాంత శాంతిని, మధుపాన మాధుర్యాన్ని ప్రతిబింబించే ఆదర్శ అక్షర ప్రతిమలు.
ఈ నాటికీ, లీ పో కవితలు చైనా పాఠశాలలో బోధనాంశాలై ఉన్నవి. అతను సృష్టిం చిన జీవిత కథనాలు చలామణిలో వున్నవి. నీటిలోని చంద్రని ప్రతిబింబాన్ని అందకో బోయి నదిలో మునిగి చనిపోయాడని ఓ కథ.
అతను రచించిన 1000 కవితలలో 34 కవితలు 18వ శతాబ్దంలో ఆంగ్లంలోకి అనువదింపబడిన Three Hundred Tang Poems సంకలనంలో ప్రచురించబడ్డాయి. లీ పో కవిత్వం ఎర్జా పౌండ్ (Erza Pound), జేమ్సు రైట్ (James Wright) లాంటి 20వ శతాబ్ధ పు లబ్ధ ప్రతిష్టులను ప్రభావితం చేసింది. యూరప్ లో, ముఖ్యంగా, లీ పో రచనలు ఇప్పటికీ అనువదించ బడుతున్నవి.
లీ పో తొలినాళ్ళ కవిత్వం సుఖశాంతులతో తులతూగుతున్న తాంగ్ సామ్రాజ్య వైభవం గురించి, ప్రకృతి గురించి, మిత్రుల గురించి, అతను నదుల వెంట చేసిన ప్రయాణాల గురించి.
ఉత్తర చైనాలో ఆనాడు నెలకొన్న తిరుగుబాటు (An Lushan) తో, లీ పో కవిత్వం మలుపు తిరిగింది. అతని కవిత్వం విప్లవాత్మకమని, రాజద్రోహం పేరున అరస్ట్ చేశారు. అతని మిత్రుడు దు ఫు లా, విప్లవ అంతిమ కాలాన్నిచూడకుండానే మరణించాడు. జాతీయ హీరోల జాబితాలో అతని పేరు నమోదు చేసుకున్నాడు. చైనా, థాయిలాండ్ల లో అతని పేరు మోగి పోయింది. విడుదలయ్యాక, యాంగ్ట్సేలోయ ప్రాంతానికి (Yangtze Valley) వెళ్ళి సాహిత్య భరితమైన చరమజీవితాన్ని గడిపాడు.
లీ పో కు ఉన్న మరి కొన్ని పేర్లు – Li Pai, Li T’ai-po, Li T’ai-pai, Li Bai, Tai Bai.
లీ పో తాంగ్ వంశజుడు. మధ్య ఆసియాలోని సుహాన్ ప్రావిన్స్ లో పుట్టి పెరిగాడు. కొన్నాళ్ళు ప్రిన్స్ యూన్ వద్ద పనిచేశాడు. కాని, సూయీ రాజ్య పరిపాలనలో లీ పో పూర్వీ కులు రాజవంశస్తులు కారని నిర్ధారింప బడినందున, దక్షణప్రాంతాలకు (నేటి అఫ్గని స్తాన్) వలసబోయి, వ్యాపారులుగా స్థిరపడ్డారు.
లీ పో చిన్న నాటనే చాలా గ్రంథాలు అధ్యయనం చేశాడు. కన్ఫ్యూస్యస్ క్లాసిక్సు, టావో సాహిత్యం చదివాడు. వంద కవులను చదవడం వాళ్ళ కుటుంబ సాహిత్య సంప్రదాయంగా వుండేది. పదేళ్ల ప్రాయంలోనే కవివం రాయ సాగాడు. “Six Idlers of the Bamboo Brook,” మిత్ర కూటమి సభ్యుడు. తాగడం, కవిత్వం రాయడం వాళ్ళ దైనందిన కార్యక్రమం. యువ లీ పో కు వేట, గుర్రపు స్వారి, కత్తి సాము లాంటి క్రీడలలో సామర్థ్యం సంపాదించాడు. 20వ ఏట, ఆ నాడు చెలామణిలో ఉన్న వీరత్వ సంప్రదాయం మేరకు కత్తి యుద్ధాల పోటీలలో పాల్గొని పలువురు ప్రత్యర్థులను చంపాడు.
లీ పో కొన్నాళ్ళు రాజోద్యోగం చేశాడు. చక్రవర్తి Hsüan-tsung ఆస్థానంలోని గౌరవ ప్రదమైన Hanlin Academy లో ఉన్నత ఉద్యోగం. అతని కవన శక్తి ఉధృతంగా వున్న ఆ రోజుల్లో, లీ అనేక రాజాస్థాన ఉత్సవ పాటలు రచించాడు. ఆస్థానంలో అతనికి మరో ఏడుగురు మందు మిత్రుల పార్టీ ఉండేది. ఆ కూటమిని “Eight Immortals of the Wine-cup.” అనే వాళ్ళు. కాని, ఆ రెండేళ్ళ రాచరికపు జీవితానికి విసిగి పోయి, మరో దీర్ఘయాత్ర కు నడుం కట్టాడు.
లీ గొప్ప మేధావి. వికీపీడియాలో అతని ఆత్మకథ 139 భాషల్లో లభిస్తున్నది. అతడు నాలుగు వివాహాలు చేసుకున్నాడు. సమకాలీన మహాకవి తు ఫు ఇతని అత్యంత ప్రియమై న మిత్రుడు.
ఇవి, లీ పో ఆంగ్లానువాదాలకు నా తెలుగు సేతలు:
1. (Staying the Night at a Mountain Temple)
వంద అడుగుల ఎత్తు ఆ కోట బురుజు,
చేయిసాచి నక్షత్రాలను కోసుకోవచ్చు.
గట్టిగా మాట్లాడే సాహసం చేయను,
స్వర్గ నివాసుల ప్రశాంతి భగ్నమౌతుందని
నా భయం.
2. నా ఏకాంత వినోదంలో నేను :
(Amusing Myself – Li Bai)
మధు చషకం నా ముందు,
గమనించనే లేదు సుందర సూర్యాస్తమయాన్ని,
నా ఒడి మడతలలో రాలిన సుమ దళాలను.
పక్షులు లేని, మానవ సందడి లేని
ఏకాంతం;
సుష్టుగా తాగిన నేను
లేచి నడచాను
పిల్ల కాలువలోని చందమామ కేసి.
3. పురా పవనం
(Ancient Air (39) Li Bai
ఎత్తైన కొండనెక్కి
నాలుగు సముద్రాలను పరికించాను,
అంతంత దూరాలకు విస్తరించిన
నింగీ నేలా!
సమస్త హేమంత ద్రవ్యం మీద కప్పుకున్న మంచు దుప్పటి,
ఉధృతంగా వీస్తున్న గాలిలో ఎడారి హిమ తుహినం,
నదీ జలాలలో లక్ష కెరటాల ఉప్పెన.
మసకబారుతున్న సూర్యతేజం,
ఆకాశంలో ఎడతెగని మబ్బుల బారులు,
గూటికి చేరుకుంటున్న సందె పక్షులు,
ముళ్ళ కంచెమీద స్థిరపడుతున్నవి చిట్టి పిట్టలు.
ఇది ఇంటికి మరలాల్సిన సమయం.
ఇక, వెనుతిరుగతాను
కత్తిని విదిలిస్తూ,
దుర్గమ బాటల పాటలు పాడుకుంటూ.
4. (Laolao Ting Pavilion – Li Ba)
వీడికోలు వేళ
ఈ నింగి కింది ఏ నేల ఎదను అంతగా బాధిస్తుందో
ఆ నేల లౌలో టింగ్.
ఆమని అనిలాలకు తెలుసు గుండెపిండే ఆ బాధ;
ఇక ఏ నాటికీ చిగురించదు నీటిగట్టు మల్లె పొద.
5. (Long Yearning) Li Bai
ఛాంగాన్ లో ఉండాలని గాఢ కాంక్ష.
అక్కడ
పసిడి కమ్ముల దిగుడుబావి చెంత
గొల్లభామలు హేమంత గీతాలు అల్లుతుంటవి,
వెదురు చాపను హత్తుకున్న తడిమంచు చలి రంగులను అద్దుతుంది.
ఇక, ఈ తలపులను మానుకుంటాను;
నా ఒంటరి దీపం కాంతిని కోల్పోతున్నది.
నేను వెల్లకిలా వాలిపోయి
నింగిలోని చంద్రున్ని చూస్తూ వృధాగా నిట్టూర్చుతుంటాను.
మంచి మనుషి
అంబుదాల అంచుల అవతల పూచిన అందమైన పువ్వు.
పైన ఆకాశమంత ఎదిగిన చీకటి రాత్రి,
కింద అలలెత్తుతున్న ఆకుపచ్చని నది.
ఈ ఆకాశం సువిశాలం, ఈ రోడ్డు సుదూరం;
ఏదో చేదు నా ఊపిరిలో తేలుతున్నది.
నా చేతనాత్మ కదలకున్నది;
కఠినమైనది ఈ కొండ కనుమ ఇరుకు దారి.
సుదీర్ఘమైన నా ఈ తీవ్రకాంక్ష ఎడదను చీల్చుతున్నది.
*****