జీవితం అంచున -7 (యదార్థ గాథ)
(…Secondinnings never started)
-ఝాన్సీ కొప్పిశెట్టి
మనిషికి ఆనందంలో కలిగే ఉత్సాహానికి, దిగులు వలన కలిగే నిస్సత్తువకి ఎంత వ్యత్యాసం..?
ఒక్కసారిగా అన్నింటి పైన ఆసక్తి తగ్గి నన్ను నైరాశ్యం ఆవహించేసింది.
అర్ధ శతాధిక వసంతాల జీవితచక్రం కళ్ళ ముందు గిర్రున తిరిగింది. రక్తపాశాలు, పేగు బంధాలు, స్నేహ సాంగత్యాలు, అనేకానేక పరిచయాలు, కీర్తి శేషమైన ప్రియ బంధాలు… ఒక్కొక్కటిగా రీలు మారుతూ కనుమరుగవుతున్నాయి.
జీవితం ఇంతేనా అనే వైరాగ్య వీచికలు ముమ్మరమయ్యాయి.
మొదటి రోజు ఉదయం, రెండో రోజు మధ్యాహ్నం, మూడో రోజు సాయంత్రం అతి కష్టo మీద కఫం లాంటి ఉమ్మునీటిని డాక్టరు ఇచ్చిన చిన్న సీసాల్లోకి ఉమ్మి ల్యాబ్ లో పరీక్షకి ఇచ్చాము. ఒక్కసారిగా జీవితం పైన ఎంత విరక్తి వచ్చిందంటే ఆ పరీక్ష ఫలితాల పైన ఎటువంటి ఆసక్తి లేదు. ఫలితాలు పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా నాలో ఎటువంటి భావ సంచలనం కలగనటు వంటి స్థితిలో వున్నాను.
బేజారుగా వున్న ఆ స్థితిలో ఎందుకో తమ్ముడు గుర్తొచ్చ్చాడు. అనుమానాస్పద ఆరోగ్య పరిస్థితి నా మానసిక స్థితిని తారుమారు చేసేసింది. కొద్ది రోజుల్లో తాను చనిపోతా డన్న విషయం ముందుగా తెలిసిన తమ్ముడి మానసిక సంక్షోభం తలుచుకుని బాధ పడ్డాను. వాడు చాలా ధైర్యవంతుడేననిపించింది.
“మమ్మీ, ఇప్పుడు ఏం జరిగిందని అంత డిసప్పాయింట్ అవుతావు. వ్యాధి పూర్తి నిర్ధారణ జరుగలేదుగా. వుంటే గింటే లేటెంట్ దశలో వుంటుంది. అసలు మన దేశంలో ఎవ్వరూ సాధారణంగా ఇలాంటి పరీక్షలు చేయించుకోరు. నీ స్నేహబృందంలో, బంధు వర్గంలో కూడా TB లేటెంట్ దశలో వున్నవారు వుండవచ్చు. అయినా నర్సింగ్ కారణంగా ఈ విషయం తెలుసుకోగలగటం మనం సంతోషించాల్సిన విషయం. తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవసరమైతే చికిత్స చేయించుకోవచ్చు.”
నిరాసక్తంగా వుంటున్న నన్ను చూడలేక అమ్మాయి ఏమేమో చెబుతోంది.
స్పూటం రిజల్ట్స్ వచ్చాయని మాటాడాలి రమ్మనమని మెసేజ్ వచ్చింది.
మెసేజీలో పాజిటివా నెగెటివా అన్న వివరణ లేదు.
ఫలితం ఏదయినప్పటికీ దాని వలన నా స్పందనలో కొత్తగా కలిగే మార్పేమీ వుండదు.
ఈ కొద్ది రోజుల ఆరోగ్య పరీక్షల ప్రహసనం జీవితం పట్ల ఒక అవగాహన కలిగించింది.
అమ్మాయితో వెళ్ళి డాక్టరుని కలిసాను. మూడు సీసాలు నెగెటివ్ చూపిస్తున్నాయి. కాని అది అంగీకరించటానికి అతను సముఖంగా లేడు.
“మీరు సీసాల్లో కఫం తీసి వేసారా…” అనుమానంగా అడిగాడు.
“లేదు. ఎంత ప్రయత్నించినా నాకు గొంతులోకి కఫం రాలేదు. దగ్గు వస్తే కదా కఫం రావటానికి, కఫం తెచ్చుకోవటానికి ప్రయత్నించి విఫలమై ఆఖరికి సీసాల్లోకి ఉమ్మాను. అది ఉమ్మి నీరు మాత్రమే..”
డాక్టర్లకు లాయర్లకు అబద్దాలు చెప్పకూడదంటారు. నిజాయితీగా నిజం చెప్పేసా ను.
“దట్స్ ఇట్… ఇట్ ఈజ్ ఫాల్స్ రిజల్ట్. లోపలి నుండి, ఊపిరితిత్తుల నుండి కఫం సక్ చేసి తీసేందుకు ఒక చిన్న ప్రొసీజర్ వుంది. ఆ ప్రొసీజర్ లేదా చెస్ట్ ఎక్స్రే చేస్తే కాని కరెక్ట్ గా ఏ నిర్ధారణకి రాలేము”
డాక్టరుగారు ఛాయిస్ మాకే వదిలేసాడు.
నాకు ఈ ప్రొసీజర్ కన్నా ఎక్స్రే సులువనిపించింది. ఎక్స్రే కోసం ప్రిస్క్రిప్షన్ రాయించుకుని డయాగ్నొస్టిక్ సెంటర్లో అప్పాయింట్మెంట్ తీసుకున్నాం.
నర్సింగ్ అడ్మిషన్ ఖరారు చేసుకోవటానికే ముప్పు తిప్పలు పడుతున్నాను అడ్మిషన్ అయ్యాక ఏమేమి తిప్పలు వుంటాయో…
చివరాఖరుకి నా అడ్మిషనుకి సంబంధించిన డాక్యుమెంట్లకి చెస్ట్ ఎక్స్రే రిపోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చేసి కొద్దికాలంగా నాలో రగులుకున్న అలజడికి తెర దించింది. అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో నా అప్లికేషను జమ అయ్యింది. నా అడ్మిషన్ ఖరారు చేస్తూ స్టూడెంట్ ఐడి నంబరు మెయిల్లో పంపారు. అరవై ఏళ్ళ ప్రాయంలో విద్యార్థి పాత్రలోకి నా ప్రవేశo జరిగింది.
*****
(సశేషం)