దేహ దానం
– రేణుక అయోల
ప్రమాదం వార్త
చూపుని కప్పేసిన
కన్నీటి జడివానలో
హాస్పిటల్ ఎమర్జెన్సీ గది ముందు
అలజడి అడుగు వేయలేక
తడిసిన శిలలలై
ఆరని కనురెప్పలు కింద
నీటి బొట్టు కంట్లోనే తిరుగుతుంటే
మెదడు చనిపోయింది అంటాడు
డాక్టరు
గుండె ఆగిందా !
అంటే
గుండె వుంది కానీ మనిషి
చనిపోయారంటే
నమ్మలేని వైద్య భాష
అవయవ దానం
మరో అర్థం కాని ప్రశ్న
గుండెని ఆపడం
గుండు సూది
గుచ్చుకున్ననొప్పి
ఇలా ఎందుకు జరిగింది
మెదడు అడుగుతుంటే
దుఃఖాన్ని మూటకట్టి
జేబులో పెట్టుకొని
నిలబడం సాధ్యంకాదు
ఎవరి కళ్ళో
వెలుగు కోసం
నిరీక్షణలో
చీకటిని పుట్టుకని నిందిస్తూ
పలవరిస్తూ నడుస్తూన్నాయిట
వాళ్ళ కోసం మనసుని రాయి చేసుకోవాలి
శరీరంలో ఏ భాగమైన
ఎవరి కలలకైనా దారి చూపిస్తుందంటే
క్షణకాలం సానుభూతి ఊగులాడుతుంది
కడుపు కోత
కనిపీంచనివ్వకుండా
దయగల వాళ్ళ మై
నీరు చిప్పిల్లిన కళ్ళని దాచేసి
పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి
ఖాళీ దేహాన్ని
కన్నీళ్ళ సంచీలో వేసుకుని
అగ్ని ముందు కుమ్మురించాక
ఇంకెవరో బతికేవున్నారు
ఎక్కడో మన కడుపు తీపి
శ్వాశ తీసుకుంటోంది
వెనుదిరిగి జీవితానికి
బతికి వున్నారని
చెప్పుకోవాలి…
*****