నారి సారించిన నవల-44
కె. రామలక్ష్మి – 4 (భాగం – 1)
-కాత్యాయనీ విద్మహే
1980వ దశకపు కె. రామలక్ష్మి నవలలు ఆరు లభిస్తున్నాయి. కొత్తపొద్దు 1982 మే లో వచ్చిన నవల. శ్రీ శ్రీనివాస పబ్లికేషన్ ( గుంటూరు) ప్రచురణ. రామలక్ష్మి నవలలో ఎక్కువగా ఒంటరి తల్లులు. వాళ్లే వ్యవసాయం తదితర వ్యవహారాలు చక్కబెడుతూ పిల్లలను పెంచి పెద్ద చేస్తారు. ఆ పిల్లల జీవితపరిణామాలే నవలకు అసలు ఇతివృత్తం. కొత్తపొద్దు నవలలోనూ శాంతమ్మ అలాంటి ఒంటరి తల్లి. భర్త గుండె పోటుతో మరణిస్తే వూళ్ళో ఆమె వ్యవసాయం చేయిస్తుంటే కొడుకు చంద్రం పట్నంలో స్నేహితుడి గదిలో ఉంటూ చదువుకుంటున్నాడు. ఆ ఊళ్ళోనే సూర్యనారాయణ కూతురు సుమతి. తండ్రి తాగుడుకు, పెట్టే హింసకు విసిగిపోయిన ఆమె తల్లి మరణించటంతో నవల మొదలవు తుంది. చంద్రం సుమతి ఒకరి నొకరు ఇష్టపడ్డారు కనుక మరణ శయ్యమీద ఉన్న సుమతి తల్లికి శాంతమ్మ వాళ్ళిద్దరి పెళ్లి చేయిస్తానని వాగ్దానం చేసింది. కానీ చంద్రానికి ఆశ్రయం ఇచ్చిన రామేశం స్త్రీ వ్యసనం సుమతి తండ్రి ధనాశ కలిసి పెళ్ళి పేరుతో సుమతి జీవితంలో సృష్టించిన కల్లోలం, లా చదువు పూర్తి చేసి లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న చంద్ర ఆమెను కాపాడి పెళ్ళి చేసుకొనటం ఈ నవల ఇతివృత్తం.
వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులు రామేశాన్ని తల్లిని, చదువును లక్ష్యపెట్టకుండా తాగుడుకు, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడేట్లు చేశాయి. దేన్నైనాఎలాగయినా తన స్వంతం చేసుకొనే స్థితికి తీసుకు వెళ్లాయి. సుమతి చంద్రం ఇష్టపడుతున్న అమ్మాయి అని తెలిసి మరీ ఆమెను వెతుక్కొంటూ వెళ్ళి ఆమె తండ్రి బలహీనతలను ఉపయోగించుకొని ఆమెను గుళ్ళో పెళ్ళి చేసుకొని నిత్యం ద్వేషిస్తూ, హింసిస్తూ ఆమె శరీరం మీద తన అధికారాన్ని అమలుచేయటమే కాక డబ్బు సంపాదనలో లావాదేవీలలో ఆమె శరీరాన్నే పణంగా పెట్టిన ఘనుడు అతను. అది ఆమెను బ్రోతల్ కేసులో అరెస్టయ్యే లా చేసింది. తనకు ఆమెకు సంబంధం ఏమీ లేదని అతను తప్పుకొనటం ఆమెను హంతకురాలిని చేసింది. వీటన్నిటి నుండి ఆమెను బయటపడేసి, పెళ్ళాడటానికి సిద్ధపడిన చంద్రం అచ్చమైన ప్రేమను ఆదర్శంగా చూపింది ఈ నవల.
1983 లో వచ్చిన ప్రేమపోరాటం నవల వస్తువు కూడా ఒక ఒంటరి తల్లి కొడుకు జీవిత ప్రస్థానమే. రవి ఇంజనీర్ చదివి ఉద్యోగం వేటలో ఉన్నాడు. కూతురిని ఇచ్చి పెళ్ళిచేస్తానని, అడగటానికి వచ్చిన పెద్ద మేనమామను కాదని మద్రాసు వెళ్ళాడు. చిన్నప్పుడు తనతో కలిసి చదువుకొన్న థామస్ ను వెతుక్కుంటూ వెళ్ళాడు. అతని చెల్లెలు జెనిఫర్ సాయంతో ఆమె ఆఫీసులోనే ఉద్యోగం సంపాదించి ప్రయోజకుడని పించుకొని స్థిరపడటం, ఒక అమ్మాయి ప్రేమలో పడటం, జెన్నిఫర్ అతనిని ఇష్టపడటం ఈ క్రమంలో జెన్నిఫర్ హత్య కేసులో నిందితుడుగా అరెస్ట్ కావటం, ప్రేమించిన అమ్మాయి లాయర్ ను పెట్టి అతను నిర్దోషి అని తేల్చటం స్థూలంగా ఈ నవలలో కథ.
నవల రచనాకాలమే కథాకాలం అనుకొంటే 1980 లలో కథ అవుతుంది ఇది. అప్పుడు యువకుడు రవి. అతని హైస్కూల్ చదువు కూడా పూర్తి కాకముందే తండ్రి మరణించాడు. అంటే డెబ్భైలలో తల్లి ఒంటరిదైంది. ఆర్ధికంగా స్వతంత్ర జీవితం లేని వ్యవహార జ్ఞానం లేని వితంతు స్త్రీల పరిస్థితి సాధారణంగా పిల్లలతో అత్తింటివారినో, పుట్టింటివారినో ఆశ్రయించి బ్రతకటంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయో చూపటం ఈ నవల ఇతివృత్తంలో ఒక అంశం. భర్త చనిపోయి కొడుకుతో మిగిలిన చెల్లెలిని అన్నలు రవిని హాస్టల్ లో వేసి ఆమెను తమ ఇంట్లో వచ్చి ఉండమన్నారు. ఆమెకున్న పొలం తమ పొలంతో కలిపి సాగుచేస్తామని చెప్పారు. అందులో ఏదో అన్యాయం ఆ వయసుకే రవికి తోచింది. తల్లిని తనను విడదీయటం, తమ పొలం మీద పెత్తనం సంపాదించటం, తల్లి ఒంటరిగా వాళ్ళ ఇళ్ళలో ఉండి రెండు పూటల తిండి కోసం ఇంటెడు చాకిరీ చేస్తూ గడిపెయ్యటం అతనికిసహించ రానివి అయ్యాయి. ఈ వూరు వదల వద్దు … ఇక్కడి నుండే చదువుకుంటాను అని పట్టు బట్టాడు. ఒప్పుకోకోపొతే కనబడకుండా పోతానని తల్లిని బెదిరించాడు. కొడుకు చిన్నవాడే అయినా అతని మాట కాదనలేక పోయింది తల్లి. చేతికి వచ్చిన డబ్బుతో చిన్న ఇల్లు కొన్నది పొలం మీద వచ్చే గింజలు ధైర్యాన్ని ఇచ్చాయి. చెల్లెలి ఈ స్వతంత్ర నిర్ణయాలు ఆమె అన్నలకు ఇష్టం కాలేదు. తరువాత కాలంలో రవి చదువు విషయంలో వాళ్ళ పాట్లేవో వాళ్ళు పడ్డారు కానీ ఏ సహాయానికి ముందుకురాని మేనమామకు ఇంజనీరు చదువు పూర్తి చేసిన రవి తన ఏకైక కుమార్తెకు తగిన వరుడుగా అనిపించాడు. ప్రభుత్వ రుణాలు ఇప్పించి స్వంత ఫ్యాక్టరీ పెట్టుకొనటానికి ఏర్పాటు చేస్తానని చెప్పి రవిని పెళ్ళికి ఒప్పించటానికి వచ్చాడు. తల్లికి అది సహజంగానే అనిపించింది కానీ రవికి ఆ పేరు మీద తన జీవితమంతా అతనికి తాకట్టు పెట్టటమేనని అర్ధమై ఉద్యోగం సంపాదించి తనకు నచ్చిన అమ్మాయిని తానే ఎంచుకొని పెళ్ళి చేసుకొవాలను కొనటం ఇందులో కీలకం. తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకొని తానే నిర్మించుకొనాలన్న ఆధునిక యువకుడి ఆంతర్యం అది. అందుకే సంప్రదాయ అధికార బంధుత్వ సంబంధాలను నిరాకరిం చటం. తనను తాను నిరూపించు కొనటానికి ఒంటరి పోరాటం చేయటానికి మద్రాసు బయలుదేరటం.
సంప్రదాయ కుటుంబ వ్యవస్థలో పెళ్ళి విషయంలో వ్యక్తి నిర్ణయాలు పరువు తక్కువిగా భావించే స్థితి గురించి ఆలోచించమనటం కూడా ఈ నవల ఇతివృత్తంలో ఉంది. తన కూతురిని కాదన్న రవి మద్రాసు పోతున్నాడంటే అక్కడ చిన్నమేనమామ ను చూడటానికి పోతున్నాడా అని అనుమానం వచ్చి ‘కులం కుటుంబ గౌరవం గంగపాలు చేసి యెవత్తెనో లేవదీసుకు పోయాడు’ అంటూ అతని గురించి, అతను చేసుకొన్న పెళ్ళి గురించి అవమానకరంగా పెద్ద మామయ్య చెప్పిన మాట దానినే సూచిస్తుంది. వాళ్ళు మనం ఆలోచించదగ్గ వాళ్ళుకాదు అన్న తల్లి మాట కూడా ఆ సంప్రదాయ దృష్టినే ప్రతిఫలిస్తుంది.
రవి ఏ స్నేహితుడు వున్నాడన్న భరోసాతో మద్రాసు వెళ్ళాడో, ఎవరు చొరవచేసి అతనికి తన ఆఫీసులోనే ఉద్యోగం వచ్చేందుకు తోడ్పడిందో వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్లు. క్రైస్తవులు. తెలుగు సమాజంలో క్రైస్తవులు, ముస్లిములు భాగమే అయినా తెలుగు నవల లో వాళ్ళు పాత్రలుగా రావటం చాలా తక్కువ. రామలక్ష్మి ఈ నవలలో రవికి క్రైస్తవ స్నేహితులు ఉన్నట్లు చూపటం ద్వారా, ఇతివృత్త గమనంలో వాళ్ళకు ప్రాధాన్యతను ఇయ్యటం ద్వారా కూడా తెలుగు నవల యొక్క మూస లక్షణాన్ని బద్దలు కొట్టింది.
రవి స్నేహం చేసి ప్రేమించిన ప్రేమగా తమ ఫ్యాక్టరీ యజమాని కూతురు కావటమే కాదు తన చిన్న మేనమామ కూతురు కూడా అని తెలియటం కొంత నాటకీయంగానే ఉన్నా ఇవేవీ తెలియక ముందే అతను ఒక సహజ మానవీయ సంస్కార సందర్భం నుండి ప్రేమకు పరిచయం కావటం, ఇద్దరి మధ్యా అది స్నేహమై తీగసాగి ప్రేమగా విస్తరించటం అనే క్రమాన్ని ఇతివృత్తంలో భాగం చేయటం ద్వారా స్త్రీ పురుషుల మధ్య స్నేహం, ప్రేమ కులమత ఆర్ధిక అంతస్థులకు అతీతంగా వికసించవలసినవి అన్న ఆదర్శాన్ని చూపింది రచయిత్రి.
రవికి ఉద్యోగం ఇప్పించిన జెన్నీఫర్ లైంగిక విషయాలలో స్వేచ్ఛ సంబంధాలలో ఉండటం ఈ నవలలో మరొక ముఖ్యాంశం. అవసరాలనో, అహాన్నో సంతృప్తి పరచు కొనటానికో, అస్థిత్వాన్ని నిరూపించుకొనటానికో, పురుషుల చాంచల్యాన్ని పరీక్షించ టానికో ఆమె ఆఫీసులో పురుష ఉద్యోగులతో చొరవగా చనువుగా ప్రవర్తిస్తుంటుంది. ఈ రకమైన చెల్లెలి ప్రవర్తన పట్ల థామస్ కు అసంతృప్తి ఉంది. ఎప్పుడు ఏ సమస్య తెచ్చి పెట్టుకొంటుందో అన్న దిగులు ఉంది. ఆమె ఎవరినో ఒకరిని పెళ్ళి చేసుకొని స్థిరపడితే బాగుండునన్న ఆలోచన కూడా ఉంది. అలాగని నీతి మాలిన దానిగా ఆమెను దూరం పెట్టలేడు. అలాగే ఆమె లైంగిక నీతి విషయం ఒక సమస్యగా చేసి తీర్పులు ఇచ్చే వాళ్ళ ను కూడా రచయిత్రి ఎవరినీ సృష్టించలేదు. రవి జెన్నీఫర్ కలిసి బయట కనబడు తున్నారని అతనిని పెళ్ళి చేసుకొనటం గురించి జాగ్రత్తగా ఆలోచించమన్న హెచ్చరిక తండ్రి దగ్గర నుండి వచ్చినప్పుడు ప్రేమ ఈర్ష్యా ద్వేషాలను ప్రకటించకుండా ఇద్దరూ ఒకచోట కలిసి పనిచేస్తున్నారు అటువంటప్పుడు కలిసి బయటకు పోవటంలోఅసహజం, అసంబద్ధత ఏమున్నాయి అన్నట్లుగా మాట్లాడటం ఆ ఆధునిక ప్రజాస్వామిక సంస్కారం వల్లనే.
జెన్నీఫర్ ఒక దశలో రవిని తాను ఇష్టపడుతున్నాని గ్రహించటం, అతనిని పెళ్ళాడి స్థిరపడాలని అనుకొనటం చూస్తాం. తాను ప్రేమను ప్రేమిస్తున్న విషయం రవి చెప్తే తాను అతనిని ప్రేమిస్తున్న విషయం ప్రేమకు చెప్పమని సవాల్ చేయగల తత్వం ఆమెది. అది ఒక ప్రత్యేక ఉద్వేగ ఉద్విగ్న మనఃప్రవృత్తి. అదే చివరకు ఆమె మరణానికి కారణమైంది. ప్రేమ ఉన్నచోట నమ్మకం ఒక తప్పనిసరి షరతు అనేది ప్రేమ విషయం లో నిరూపించటం చూస్తాం. ఆ నమ్మకం వల్లనే ప్రేమ రవిని విపత్కాలంలో వదిలెయ్యక అతను నిర్దోషి అని నిరూపించే పర్యంతం పని చేసింది. అలా ఈ నవల మనుషుల జీవితాలకు బాధ్యత వహించేవి, వహించవలసినవి వాళ్ళ ప్రవర్తనలే, పనులేతప్ప పూర్వ నిర్ధారిత విలువలు కావు అనే విషయాన్ని స్పష్టం చేసింది.
1984 సెప్టెంబర్ లో వచ్చిన కొత్త కోరిక నవలలో కథకు చిన్నప్పుడే తల్లీతండ్రీ చనిపోయి తాతగారి పోషణలో పెరిగిన మణి అనే అమ్మాయి జీవితం కేంద్రం. విశాఖ పట్నం, సముద్ర తీర గ్రామం గోపాలపురం కథా ప్రదేశాలు. భర్త మరణానంతరం పెద్ద సంపదతో, ఒక్కగానొక్క కొడుకుతో విదేశాల నుండి వచ్చి విశాఖ పొలిమేరలలో ఇల్లు కట్టుకొని స్థిరపడిన మేనత్త కొడుకు గోపాల్ తో పెళ్ళి, గాఢమయిన అనురాగం, తన ఆస్తికి, అంతస్తుకు తగిన చదువుకొన్న పిల్ల కాదన్న మేనత్త అసంతృప్తులు, నిర్లక్ష్యాల మధ్య సంసారం, ఒకానొక సందర్భంలో గోపాల్ కు సన్నిహితంగా ఉన్న యువతిని చూసి మేనత్త కోరిక ప్రకారం పెళ్ళాడి ఉంటాడని ఆశాభంగానికి లోనై వెనుతిరిగి వెళ్ళిపోతూ ప్రమాదానికి గురై మతిపోయి గతమంతా మరిచి పోవటం గతానికి సంబంధించిన కథ అయితే గోపాల్ ఆమె లేక శాంతిలేక తాతగారికి ఇష్టం లేకపోయినా గోపాలపురం వచ్చి ఆమెను పూర్వపు స్థితికి తీసుకురావటానికి చేసిన ప్రయత్నాలు, పరిణామాలు, ఫలితాలు నవలలో వర్తమానం. సంగీత విద్వాంసుడైన తాతగారి శిక్షణలో మణికి, ఇటు గోపాల్ కు కూడా అబ్బిన సంగీత జ్ఞాన నేపథ్యంలో కథను నడపటం ఈ నవలలో విశేషం.
1984 డిసెంబర్ లో వచ్చిన నవల ‘దేవుడు లేనిచోట’. ఇందులో కథా నాయకుడు శంకర్ కూడా తల్లీ తండ్రీ లేనివాడే. తాతగారి పెంపకంలో పెరిగాడు. ఇంజనీరింగ్ చదివి ఎంబిఏ కూడా చేసాడు. కానీ ఆయన ఆశించినట్లు ఆయన పెట్టిచ్చిన మిల్లుల నిర్వహణ చేపట్టలేదు. జర్నలిస్ట్ అయ్యాడు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య తిరుగుతూ ఏమి జరుగు తున్నదో ప్రజలకు తెలియపరిచే గురుతర బాధ్యత తన మీద ఉందనుకొని పని చేస్తున్నాడు. పరిశోధనాత్మక జర్నలిజం అతనికి ఇష్టమైన రంగం. ఆ పని క్రమంలో అతను జైలు వ్యవస్ధ గురించి, పాముల తోళ్ళ అక్రమ వ్యాపారం గురించి, స్త్రీల అక్రమ రవాణా గురించి చేసిన పరిశోధనలు వాటి ప్రయోగాలు, ఫలితాలు, పరిణామాలు ఈ నవలకు ఇతివృత్తం. వీటితో పాటు గిరిజన సమస్య మీద అతని అనుభవం, దాని మీద ఒక వార్తా కథనం కూడా ఈ నవలేతి వృత్తంలో భాగం అయింది. అయితే ఇది శంకర్ అనుకొని చేసిన శోధన కాదు. కాకతాళీయంగా ఎదురైన అనుభవం. ‘కళ్ళతో చూసింది రాయకుండా ఎలా ఉంటాడు జర్నలిస్టు అన్నవాడు !?’ అన్న న్యాయం వ్రాయిస్తే వ్రాసిన నివేదిక అది.
జైలులోపల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని రిపోర్ట్ చెయ్యాలన్నలక్ష్యంతో అతను చేసిన ప్రయోగం ఈ నవల ఇతివృత్తంలో ప్రధానమైన అంశం. “మూడుసెంట్రల్ జైళ్ళు, రెండు సబ్ జైళ్ళు, మునసబు కోర్టుల లాకప్ రూములు చూశాక, శిక్షననుభవించి న కొందరి మాటలు విన్నాక, జైలు సంస్కరణ సంఘం వారి రిపోర్టులు చదివాక, సాంఘిక బాధ్యత సంఘ సభ్యుల అనుభవాలు తెలుసుకున్నాక” – వాస్తవ విషయాలకి కల్పనను జోడించి రామలక్ష్మి ఈ కథా భాగాన్ని నిర్మించింది.
జైలు గురించి వ్రాయాలంటే జైలులో నేరస్థుడిలా నేరస్థులతో కలిసి ఉంటేగానీ జైలు వ్యవస్థ వాళ్ళ పట్ల యెట్లా వ్యవహరిస్తున్నదో తెలియదు అని శంకర్ అనుకొన్నాడు. ఒక ప్రయత్నం విఫలమై రెండవ ప్రయత్నంలో అరెస్టయి రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న రెండు రోజుల అనుభవాలు అతనికి పెద్ద ప్రపంచాన్నే చూపాయి. కోర్టు లాకప్ రూములో జేబులోని రెండు పది రూపాయల నోట్లలో ఒకటి మాయమవటం దగ్గర నుండి, జైలు పాలనా వ్యవస్థలోని అవినీతి, అమానుషత్వం, ఖైదీలను అసహజ లైంగిక వాంఛలు తీర్చుకొనటానికి వాడుకొనటం, తిరగబడ్డ వాళ్ళను కాల్చేసి తీవ్రవాది అని పేరుపెట్టి తప్పించుకు పారిపోతుంటే కాల్చేసినట్లు కథలు అల్లటం, ఖైదీల తిండిదగ్గర నుండి కప్పుకోటానికి ఇచ్చే దుప్పట్లు వంటి వసతి సౌకర్యాలు అన్నీ అరకొరగా, నాణ్యతా రహితంగా ఉండటం, శుచీ శుభ్రత లేని వంట ప్రదేశం, వండే తీరు, పదేళ్ళయినా కేసు విచారణకు రాని ఖైదీలు, ఒక్కొక్క ఖైదీ వెనక వాళ్ళను నేరాలకు ఉసిగొలిపే భిన్న సామాజిక కౌటుంబిక నేపధ్యాలు, జైలు నియమాలు, హక్కులు తెలుసుకొని అడగటం నిషేధమూ, దండనార్హమూ అయిన జైలు నిరంకుశ పాలనా విధానం, యథేచ్ఛగా విస్కీ, భంగు, గంజాయి వంటి మత్తుపదార్ధాలు మాదక ద్రవ్యాలు అధికారవర్గ సహకారంతో సరఫరా అవుతున్న తీరు, మొదలైనవి ఒక్క రోజులో అతనికి అనుభవానికి వచ్చాయి. పోలీసుల కళ్ళబడకుండా దాచుకొన్న రెండు తెల్లకాయితాలలో ఒకదాని మీద ఆ రోజు జైలు జీవితం గురించి రిపోర్ట్ వ్రాసి బయటకు పంపించటం, మర్నాడు అతని దగ్గర రెండవ కాయితం కనిపించలేదని సబ్ జైలర్ విపరీతంగా కొట్టటం, అదేరోజు పత్రికలో అతను పంపిన రిపోర్ట్ ప్రచురించబడటంతో జైలు అధికారులు అతనిని ఆ రోజంతా కొడుతూనే ఉండటం, ఈ దెబ్బలు, నొప్పి సంగతి బయటకు చెప్పరాదని బెదిరించి సోమవారం కోర్టులో హాజరు పరచటం, బెయిలు మీద బయటకు రావటం ఒక ఘట్టం.
నేరస్థులను సంస్కరించవలసిన జైలు వ్యవస్థ ఎంత నేర వ్యవస్థగా ఉన్నదో శంకర్ పత్రికా వ్యాసాలు బయట పెట్టాయి. అయితే దాని ఫలితం ఏమిటన్నది ప్రశ్న. ఎంక్వయి రీలు జరిగినంత మాత్రాన కొంపలేమీ మునిగిపోవు అని జైలు సూపరెండెంట్ శంకర్ వ్రాతల ప్రయోజనం ఏమీ ఉండదన్నట్లు మాట్లాడాడు. ఇలాంటి నివేదికలకు చింతకాయలు రాలవు అన్నది ఆ మాటల ఆంతర్యం అని శంకర్ గుర్తించాడు కనుకనే జైలు రిఫార్మ్స్ కమిటీ వేశారు అని తనతో పనిచేసే భారతి చెప్పినప్పుడు అయితే ఏమవుతుంది? సాక్ష్యాలు ఎవరు చెప్తారు అని నిస్పృహను ప్రకటించాడు. సంస్కరణలు సరిపోవని అర్ధం అయింది కనుకనే బాంబు పెట్టి ఇలాంటి నరకాలను సమూలంగా నాశనం చేసి మళ్ళీ న్యాయానికి కొత్త పునాదులు వేయాలంటాడు శంకర్. ఆ క్రమంలోనే తాను క్షేత్రస్థాయిలో పనిచేసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చినప్పటికీ ఆ విజయం అతనికి అసంతృప్తినే మిగిల్చింది. అయినా నేరవ్యవస్థల లోగుట్టు బయట పెట్టకుండా ఉండలేక పోవటం అతని ప్రవృత్తి.
అందుకనే జైలు దెబ్బలు నయమై ఉద్యోగంలో చేరిన శంకర్ వెంటనే స్త్రీల అక్రమ రవాణా పై పరిశోధనకు దిగాడు. చిలకలూరిపేట అమ్మాయిని మధ్యప్రదేశ్ లో అమ్మిన విషయానికి వార్తగా తమ పత్రిక ఎడిటర్ ప్రాముఖ్యత ఇయ్యక పోవటం గురించి నొచ్చు కొని భారతి చెప్పిన మాట అతనిని ఆ పనికి పురికొల్పింది. అత్యాచారాలు, అక్రమ రవాణాలు వేశ్యా వ్యాపారంలో సాధారణమే అన్నది ఎడిటర్ మాట “అది మరీ మురికి గుంట వ్యవహారం” అని కూడా అతను అంటాడు. ఆ మురికి గుంటలో కూడా ఇష్టంలేని పురుగు గట్టుకు ఎక్కటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది కనుక దానిని సీరియస్ గా తీసుకోవాలి అన్నది శంకర్ అభిప్రాయం. అందుకే అతను స్త్రీల అక్రమరావణా కొనుగోళ్ల విషయం పై క్షేత్రస్థాయి సమాచార సేకరణకు బయలుదేరాడు. చిలకలూరిపేటలో ఒక హోటల్ కేంద్రంగా వ్యాపారం జరుగుతున్నదని గ్రహించి అది నిరూపించటానికి ఒక స్త్రీని అక్కడి నుండి కొనుక్కొని రావటం, దాని పరిణామాలు మరొక ఉపాఖ్యానం. కొన్నాళ్ళు ఆమెను ఇంట్లోనే ఉంచుకొన్నా పోలీసులు ఆమెను ఎత్తుకొచ్చిన కేసు శంకర్ మీద పెట్టటంతో ఆ కేసు విచారణ సందర్భంలో ఆమె మకాం రక్షణ గృహానికి మారింది కానీ కొద్ది రోజులలోనే కల్పన అక్కడ కనబడకుండా పోయింది. ఎలా జరిగి ఉంటుంది అన్న శంకర్ వెతుకులాట నెపంగా స్త్రీల రక్షణ గృహాలు రక్షిత వ్యభిచార గృహాలుగా ఉన్నాయని చెప్తుంది రచయిత్రి. స్త్రీలు వ్యభిచారులు కావటానికి పై మగవాళ్లే కాక తండ్రి, భర్త మొదలైన కుటుంబంలో పురుషులు కూడా కారణం కావటాన్ని, అసలు వ్యభిచారం ఒక పెద్ద వ్యాపారమై స్త్రీలను అందులోకి లాగే వ్యవస్థగా సిద్ధమై ఉండటాన్ని, అందులో నుండి బయటపడటానికి స్త్రీలకు పోలీసు ప్రభుత్వ సంక్షేమ సంస్థల పాలనాధికార వ్యవస్థ మొత్తంగా ప్రతికూలంగా వ్యవహరిస్తుండటాన్ని నిష్కర్షగా చెప్పింది ఈ నవల.
ఈ సమస్యలను సినిమాటిక్ గా పరిష్కరించకుండా ఆయా సమస్యలు ఊడలు దిగిన మర్రి వలే లోతులకు పాతుకొని బాహిరంగా విస్తరించి ఉన్నాయని ఒక బాలాత్రిపుర సుందరిని బయటకు తీసుకురాగలిగినా ఆమెకు ఒక గౌరవకరమైన జీవితాన్ని కల్పించ గల సంస్కారాన్ని మిగుల్చు కొనలేని హీనస్థితిలో సమాజం ఉందని చూపించటం రచయిత్రి వాస్తవిక దృక్పథానికి నిదర్శనం. స్త్రీల అక్రమరవాణా, వ్యభిచారం కాస్తకూడా కదలబారనప్పుడు ఇలాంటి పరిశోధనాత్మక పాత్రికేయత వలన ప్రయోజనం ఏమిటి అన్న నిస్పృహ కలిగే అవకాశం ఉంది. ఎడిటర్ ముఖంగా వాస్తవాలు బయటపెట్టటం వరకే పత్రికల బాధ్యత వాటిని చక్కబెట్ట వలసింది జనశక్తి అని చెప్పించింది రచయిత్రి. ఈ లోగా కల్పన కేసు సమాజంలో ఆ సమస్య మీద ఒక చర్చకు కారణమవుతూఅభిప్రాయ నిర్మాణానికి తోడ్పడుతుంది అన్న సూచన కూడా చేసింది.
ఈ నవల ఇతివృత్తంలో మూడవ ముఖ్యాంశం శంకర్ దేశాటన. ఎడిటర్ శెలవు ఇచ్చి దేశాలు తిరిగిరా అని చెప్తే కాశీ నుండి మొదలుపెట్టి, పూరీ వెళ్లి అక్కడ తన సమూహం నుండి విడిపడి అల్లరి మూక బారినపడిన అల్లి అనే ఒక గిరిజన అమ్మాయిని రక్షించి ఆమెను గూడెం చేర్చటానికి వెంటవెళ్లి, కొన్ని రోజులు అక్కడే ఉండిపోవటం, ఆశ్రమ పాఠశాల టీచర్ తో స్నేహ సంభాషణలు, అల్లి పట్ల ఆకర్షణ చివరకు ఆమెను పెళ్ళాడి తీసుకొని వూరికి తిరిగి రావటం ఇది మూడవ ఘట్టం. ఇదే నవల ముగింపు. ఈ సందర్భం నుండే నక్సలైట్లకు పోలీసులకు మధ్య గిరిజనుల జీవితం నలిగిపోతున్నది అనే ఒక అభిప్రాయం ఏదైతే జనవాడుకలో వున్నదో దానికి సమ్మతిని సమకూర్చే పని చేసింది రామలక్ష్మి.
ఈ ఘట్టంలో అతను వెళ్లిన ఊరు రామభద్రాపురం. పార్వతీపురం, శ్రీకాకుళం ఏజన్సీ ప్రాంతాలలోది. ‘కొండచెరియల పల్లెల నుంచీ, గూడేల నుంచీ మనుషులను తోలుకొచ్చి నివాసం ఏర్పాటు చేశారు పెద్దలు. అనుమానం ధర్మమా అని ఏర్పడిన ఈ ఊళ్ళో కొండవారికి ఏకాంతత హక్కు పోయింది.’ అని ఆ ఊరిని పరిచయం చేసింది రచయిత్రి. కొండచరియల పల్లెల నుంచి మనుషులను తోలుకొచ్చి అలా ఒక వూరు పొందించటానికి అనుమానం కారణం అన్న విషయం గమనించాలి. అనుమానం ఏమిటి? నక్సలైట్లకు సహకరిస్తున్నారు అని ఆదివాసుల గురించి పోలీసుల అనుమానం అది. కొండల్లో దట్టమైన అడవుల్లో నక్సలైట్లు దాగున్నారని వాళ్ళను వెతికే జోరులో పోలీసులు తమగూడాలను కూలగొట్టారని అల్లి తండ్రి లచ్చయ్య చెప్తాడు. నక్సలైట్ల ఆచూకీ చెప్పమని ఆదివాసీల మీదకు గురిపెట్టబడ్డ పోలీసు తుపాకుల కింద రోజూ జీవించవలసి రావటంలో, వందలాది మంది ఆదివాసీలను ఆ అనుమానంతోనే జైళ్ళకు తోలుకుపోవటంలోని విషాదం, వేట వృత్తియైన వాళ్ళ ఆయుధాలు లాక్కొని , వ్యసాయం కోసం పొలాలకు పోయే సమయాలు నిర్దేశించి గిరిజనుల స్వేచ్ఛను హరించిన ప్రభుత్వ పోలీసు వ్యవస్థపై నిరసన లచ్చయ్య మాటలలో వినబడుతుంది.
జర్నలిస్ట్ అయిన శంకర్ కు నక్సలైట్ సమస్య తెలియకుండా ఉండే అవకాశం లేదు. కానీ అతను అప్పుడే ఆ విషయాలు వింటున్నట్లు, తెలుసుకొంటున్నట్లు కనబడ తాడు. ఆశ్రమ పాఠశాల టీచర్ తో అతని సంభాషణ అంతా కొత్త విషయాలను తెలుసు కొంటున్నట్లే ఉంటుంది. వ్యవసాయానికి లోతట్టు భూములకు వెళ్ళే గిరిజనులు నక్సలైట్లతో కలిసి పోకుండా ఆశ్రమ పాఠశాలలో వదిలి వెళ్ళిన పిల్లలను హామీగా భావించే ప్రభుత్వ వ్యవస్థ గురించి వీళ్ళిక్కడ తాకట్టు పెట్టబడ్డట్లేనా అని ఆందోళన పడిన శంకర్ గిరిజనుల కోసం ప్రభుత్వం ఎంతో చేస్తోంది కదా ? అయినా వాళ్లలో ఈ అసంతృప్తి ఎందుకు అని ప్రశ్న వేయటం అసంబద్ధంగా కనిపిస్తుంది. ఆశ్రమ పాఠశాల టీచర్ ఒక మేరకు సహజ స్వేచ్ఛాయుత జీవన విధానం నుండి వేరుచేయబడిన గిరిజనులలో సహనం నశించటాన్ని, తిరుగుబాటు సంసిద్ధతను అర్ధం చేసుకొంటాడు. కానీ ఆ బలహీనతను వాడుకొని రెచ్చగొడుతున్నాని ఆలోచనలను, సాహిత్యాన్ని, పాటల ను పల్లె పల్లెకు తీసుకువెళుతున్న మేధావులను, కళాకారులను, రచయితలను దోషులుగా చూపిస్తాడు. ఒక జర్నలిస్ట్ గా స్వతంత్రమైన చూపు ఆలోచన లేకుండా శంకర్ దానినే మోసుకుపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కలెక్టర్ ను కలవటానికి పార్వతీపురం వెళుతున్న మాస్టారికి పోస్టులో వెయ్యమని శంకర్ వ్రాసిచ్చిన వార్తాకథనం శత్రువుకి శత్రువుకి మధ్య అమాయక గిరిజనులు పడుతున్న బాధల కథనమే కావటం గమనించ వచ్చు.
ఇంతకూ ఈ నవలలో కథకు దేశమైతే – ఉత్తరాంధ్ర – ఉంది కానీ కథ నడిచిన కాలాన్ని గురించిన సూచనలు ఎక్కడా లేవు. నవల రచనకాలమే కథాకాలం కూడా అనుకొంటే స్థూలంగా రెండు మూడేళ్లు వెనకకు పోతే 1980 నుండి 1984 లోపల కావాలి. అల్లిని తీసుకొని వెళుతూ శంకర్ చూసిన నక్సలైట్ బృందాల కవాతుకు, శ్రీకాకుళం పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతంలో అవకాశం లేదు. 1972 తరువాత శ్రీకాకుళ గిరిజనోద్య మం తీవ్రమైన అణచివేతకు గురయింది. నాయకత్వం ఎన్ కౌంటర్ల పేర చంపబడ్డారు. శ్రీకాకుళ గిరిజనోద్యమం వెనకడుగు వేసి ఉత్తర తెలంగాణలో వికసిస్తున్న కాలం. అందు వల్ల 1980 ల నాటికి ఈ నవలలో చెప్పినట్లు దళాలు అక్కడ కవాతు చేసే పరిస్థితులు లేవు. అడవుల్లో కొండల్లో యుద్ధవాతావరణమూ లేదు. విప్లవోద్యమం సెట్ బ్యాక్ తరువాత గిరిజనులను విప్లవాల వైపు పోకుండా అవసరాలన్నీ మేమె తీరుస్తాం అంటూ ప్రభుత్వం ITDA ( ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ ) ప్రాజెక్ట్ తో ముందుకు వచ్చింది 1970లలో. నక్సలైట్ ఉద్యమ గమనం గురించిన స్పష్టమైన అవగాహన రచయితకు కనబడదు. గిరిజన జీవితంలో మైదాన ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడిన బుగతల షావుకార్ల ఆర్ధిక దోపిడీ పీడనల సమస్యలోని తీవ్రతను సౌకర్యవంతంగా విస్మరించి సమస్యను నక్సలైట్లకు, పోలీసులకు మధ్య శత్రుత్వ సంబంధ సాపేక్షతలో చూపటం, విప్లవయోద్యమం , విప్లవరచయితలు , కళాకారులు, మేధావులు గిరిజన సమస్యకు మూలకారణమన్నట్లు నిర్ధారించటం రచయిత్రి దృక్పథ పరిమితిని, పాక్షికతను సూచిస్తాయి. ఈ రకమైన ప్రచారం ఈ నాటికీ కొనసాగుతున్నదే.
*****
(ఇంకా వుంది)
డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.